Big Stories

Joseph Goebbels : మూఢ విధేయులారా.. ఈ విషాద గాథ చదివారా..?

ఎవరైనా పదే పదే ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మబలుకుతూ ఉంటే.. వారిని ‘గోబెల్స్’ అంటుంటారు. రాజకీయ నాయకుల ఆరోపణల్లో ఈ గోబెల్స్ అనే పదం తరచూ వినిపిస్తుంటుంది. ఈ పదం.. ఒకప్పటి జర్మనీ ఛాన్సలర్ అడాల్ఫ్ హిట్లర్.. ప్రచార మంత్రిది. హిట్లర్ ప్రభుత్వంలో జోసెఫ్ గోబెల్స్ అనే ప్రచార మంత్రి ఉండేవాడు.

- Advertisement -

అబద్ధ ప్రచారానికీ, మూర్ఖ విశ్వాసానికీ, హంతక ప్రవృత్తికీ ఈయన గారు పెట్టింది పేరు. ఈయన భార్య పేరు మాగ్డా. వీరికి ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు. ఆరుగురి పేర్లూ H తో మొదలయ్యేవి. హెల్గా, హెడ్విగ్, హెల్ముట్, హిల్డెగార్డ్, హోల్డిన్, హెయిడ్రన్. హిట్లర్ జాతీయవాదాన్ని నరనరానా జీర్ణించుకుని, యూదుల పట్ల పరమ కిరాతకంగా వ్యవహరించే గోబెల్స్.. తన బాస్‌ పట్ల మూఢ భక్తితో ఆయనను మెప్పించేందుకే తన పిల్లల పేర్లనీ ఆయన పేరు కలిసొచ్చేలా పెట్టాడు.

- Advertisement -

జర్మనీలో నాజీలు అత్యంత క్రూరంగా యూదులను ఊచకోత కోస్తున్న వేళ.. దేశంలోని చాలామంది నాజీ నాయకులు.. తమ పిల్లలను విదేశాలు పంపి రక్షించుకున్నారు. కానీ.. గోబెల్స్ మాత్రం తన పిల్లలు ఆదర్శవంతమైన నాజీ వారసులు కావాలని అనుకున్నాడు. నాజీలకు వీలైనంత దగ్గరగా ఉండాలని భావించాడు. ప్రచార మంత్రి కావటంతో తరచూ తన పిల్లలను హిట్లర్ వద్దకు తీసుకెళ్తుండేవాడు.

ఇక.. గోబెల్స్ భార్య.. మాగ్డా రోజూ పిల్లలందరినీ బుట్టబొమ్మల్లా ముస్తాబు చేసేది. రకరకాల హెయిర్ స్టయిల్స్‌తో వారిని అందరూ మెచ్చుకునేలా ముద్దుగా తయారుచేసేది. అయితే.. ఆ పిల్లలందరిలోనూ పెద్దదైన హెల్గా అంటే హిట్లర్‌కు ఎంతో ముద్దు. హెల్గా ఎంతో అందమైన పాపాయి. ఎప్పుడూ ఏడ్చేది కాదు. తండ్రికే ఎక్కువ మాలిమి. తండ్రి హిట్లర్ వద్ద మాట్లాడే సందర్భాల్లో.. హెల్గా తరచుగా హిట్లర్ ఒళ్లో ఆడుకునేది. ఆయన వాకింగ్‌కు బయలుదేరితే.. తనూ ఆయన వేలు పట్టుకుని వాకింగ్ చేసేది. ఇద్దరూ కలిసి హాట్ చాకోలేట్ తాగేవారు.

ఆ చిన్నారి గురించి హిట్లర్ తరచూ పరిహాసాలు కూడా ఆడేవాడు. ‘మనిద్దరం ఒకే వయసు వాళ్లమైతే ఈడూ జోడూ సరిపోయేది’ అంటూ ఏడేనిమిదేళ్ల చిన్నారితో అంటూ ఉండేవాడు. హిట్లర్ పుట్టినరోజున హెల్గా అతనికి పుష్ప గుచ్ఛం ఇస్తున్న ఫోటో ఒకటి అప్పట్లో బాగా వైరల్ అయింది. అయితే.. ప్రపంచం అసహ్యించుకుంటున్న తన బాస్.. హిట్లర్ ఎంతో దయగలవాడని ప్రచారం చేసేందుకు గోబెల్స్.. దానిని ప్రపంచవ్యాప్తంగా వైరల్ చేయించాడు.

కానీ ఒకనాడు.. ఆ హిట్లర్ ప్రేమే ఆ పాప ప్రాణాల మీదికి తెచ్చింది. రెండవ ప్రపంచం యుద్ధం ముగుస్తుండగా, 1945 ఏప్రిల్ 22న గోబెల్స్ తన కుటుంబం మొత్తాన్నీ హిట్లర్ అప్పటి దాకా తలదాచుకుంటున్న ఫోర్ బంకర్‌కు తరలించాడు. అప్పటికే హిట్లర్ మరో బంకర్‌లోకి మారాడు. ఈ రెండు బంకర్లూ కలిసే ఉండేవి గాని, హిట్లర్ బంకర్ భూగర్భంలో మరొక అంతస్తు కింద ఉండేది.

ఆ మర్నాడు రష్యన్ సేనలు రాజధాని బెర్లిన్‌లో కాలుమోపాయి. తమ భవిష్యత్తు ఏమిటో గోబెల్స్‌కు స్పష్టంగా అర్థమైంది. కానీ.. తనతో బాటు భార్యాపిల్లలెవరూ సోవియెట్ సైనికుల చేతిలో పడగూడదనుకున్నాడు. సరిగ్గా వారానికి.. ఏప్రిల్ 30న హిట్లర్ బంకర్‌లో తుపాకీతో కణతమీద కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెర్లిన్ ప్రధానవీధుల్లో సోవియట్ జెండాలు ఎగరటం మొదలయ్యాయి.

తమ కుటుంబం శత్రువుల చేతికి చిక్కితే ఏమవుతుందో బాగా తెలిసిన గోబెల్స్ దంపతులు అప్పటికి నెల రోజుల ముందునుంచే తమ పిల్లలను ఎలా చంపాలనే దాని గురించి చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో తండ్రి గోబెల్స్ కంటే.. ఒక తల్లిగా మాగ్డా మరింత కలవరపడింది. ‘మీ పిల్లలను రెండోకంటికి తెలియకుండా దేశం దాటిస్తా’ అంటూ వచ్చిన ఆయుధ, యుద్ధ ఉత్పత్తుల మంత్రి ఆల్బర్ట్ స్పీర్ ప్రతిపాదననూ మాగ్డా నిరాకరించింది. ‘మీ పిల్లలను విదేశాలకు పంపుతా’ అన్న బాగా తెలిసిన మహిళా పైలెట్ హన్నా రీశ్చ్ మాటనూ ఆమె పట్టించుకోలేదు.

‘నా పిల్లలు చచ్చిపోయినా ఫర్వాలేదు, కాని అవమానాలతో, వెటకారాలతో బతకడం నాకిష్టం లేదు. అయినా.. ఈ పరిస్థితిలో వారు బతికే అవకాశమే లేదు’ అని హిట్లర్ కార్యదర్శి ట్రాడ్ల్ యుంగె‌కి స్పష్టం చేసింది. ఒకవేళ.. పిల్లలను చంపేవేళ.. తల్లిగా తాను వెనకాడినా.. ఎవరూ మధ్యలో వచ్చి తన మనసు మార్చే ప్రయత్నం చేయవద్దని సన్నిహితులకు ఆమె స్పష్టంచేసింది.

హిట్లర్ మరణవార్త తెలుసుకున్న మాగ్డా.. మర్నాడు అనగా.. మే 1 సాయంత్రం తన పిల్లలందరినీ బంకర్ లోపలికి తీసుకువెళ్లింది. ఆ మెట్లు దిగి బంకర్‌లోకి రావద్దని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. ఆ సాయంత్రం పిల్లలకు ముందే రెడీ చేయించిన పొడవాటి తెల్లని నైట్ గౌన్లు తొడిగింది. వాళ్ల జుట్టు దువ్వి, రిబ్బన్లు కట్టింది. తర్వాత అంటురోగాలు రాకుండా కాపాడే.. వాక్సిన్లు అంటూ నాజీ దంతవైద్యుడైన హెల్ముట్ కుంజ్ చేత వారందరికీ మార్ఫిన్ ఇంజక్షన్లు ఇప్పించింది.

అయితే.. పిల్లలందరినీ తానొక్కతే చంపటం సాధ్యం కాదనే అనుమానంతో హిట్లర్ వ్యక్తిగత వైద్యుడు లుడ్విగ్ స్టాంప్ ఫెగ్గర్‌నూ సాయంగా రమ్మని కోరగా ఆయనా వచ్చాడు. ఆయన ఆ పిల్లలకు తాగడానికి ఒక తియ్యని పానీయం ఇవ్వగా.. మాగ్డా ఒడుపుగా తన పిల్లల నోట్లో సైనైడ్ గుళికలను తోసేసింది.

అయితే.. అందరికంటే పెద్దదైన 12 ఏళ్ల హెల్గా తన చుట్టూ పరిస్థితులను అర్థం చేసుకుని, ప్రతిఘటించింది. దీంతో ఆమెను తీవ్రంగా కొట్టి సైనైడ్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో నిమిషాల్లోనే ముద్దులొలికే హెల్గా చివరి శ్వాస విడిచింది. 2 గంటల తర్వాత ఆ గది నుంచి బైటికి వచ్చిన మాగ్డా ‘అంతా అయిపోయింది’ అంటూ బయటికి వచ్చింది. మరో రెండు గంటలకు అనగా రాత్రి 9 ప్రాంతంలో భర్త జోసెఫ్ గోబెల్స్‌తో కలిసి అక్కడి తోటలోకి నడిచారు. ఒకరి నోట్లో ఒకరు సైనైడ్ గుళికలు పెట్టుకుని ఒరిగిపోయారు.

కొన్ని నిమిషాల్లోనే గోబెల్స్ ముందే ఆదేశించిన విధంగా.. ఒక సైనికుడు గోబెల్స్ మృతదేహాన్ని తూట్లు పడేలా తుపాకీతో కాల్చి.. అక్కడే ఆ దంపతుల మృతదేహాల మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.

సరిగ్గా.. మర్నాడే సోవియట్ సేనలు వారి బంకర్ వద్దకు వచ్చి చూడగా, గోబెల్స్ దంపతుల శవాలు గుర్తుపట్టలేని స్థితిలో కనిపించాయి. తర్వాత ఆ సేనలు.. వారి బంకర్‌లోకి వెళ్లి చూడగా, ఒకే మంచం మీద నిద్రపోతున్నట్టుగా ఆరుగురు పిల్లల మృతదేహాలు ఉండడం చూసి వారంతా నిర్ఘాంతపోయారు. గతంలో హిట్లర్‌తో పత్రికల తొలిపేజీల్లో కనిపించిన హెల్గాను చూసి వారి ప్రాణం మరింత చివుక్కుమంది. ఆ పిల్లల్లో అందరికన్నా పెద్ద హెల్గా వయసు 12. అందరికన్నా చిన్న హెయిడ్రన్ వయసు నాలుగేళ్లు.

ఈ మొత్తం విషాద గాథలో తప్పించుకున్న ఏకైక వ్యక్తి.. మాగ్డా మొదటి వివాహపు కొడుకు హెరాల్డ్ క్వాన్డ్ట్. అప్పటికే అతను దక్షిణాఫ్రికాలో యుద్ధఖైదీగా ఉన్నాడు. ఆత్మహత్యకు ముందే మాగ్డా అతడికి ఓ ఉత్తరం రాస్తూ.. ‘ ప్రియమైన హెరాల్డ్.. మా గొప్ప ఆశయం ధ్వంసమైపోయింది. దాంతోబాటు మా జీవితమూ నాశనమైంది. పిల్లలను కూడా నాతో తీసుకువెళ్తున్నాను. బతికినా వారి జీవితం నిష్ప్రయోజకమైనది.. ఇక మాకు మిగిలినది ఒకటే లక్ష్యం.. మరణంలో కూడా హిట్లర్ పట్ల విధేయత చూపటం. నీకు నువ్వు జీవించు. ప్రజల పట్ల విధేయంగా ఉండు. నీ దేశం పట్ల విధేయంగా ఉండు… మమ్మల్ని తలచుకుని గర్వించు. మమ్మల్ని నీ తీయని జ్ఞాపకంగా మిగుల్చుకో…’ అని మాగ్డా రాసింది. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత అతడు జైలు నుంచి విడుదలై.. తన తండ్రి వ్యాపార వారసత్వాన్ని దక్కించుకున్నాడు. అతని కుటుంబానికి ఇప్పటికీ జర్మనీలోని విలాసవంతమైన బిఎండబ్ల్యు కార్ల పరిశ్రమలో వాటా ఉంది.

‘హెల్గా తన మరణాన్ని ఊహించింది. యుద్ధంలో హిట్లర్ గెలిచాడని చెబుతున్న తల్లిదండ్రుల మాటను ఆ పాప నమ్మలేదు. హత్యకు ముందు తల్లి చేస్తున్న ఏర్పాట్లను ఆమె పదేపదే ప్రశ్నించింది. అంతేకాదు.. హత్య జరిగిన సాయంత్రం.. తల్లి మాగ్డా పిల్లల జుట్టు దువ్వుతున్నప్పుడు హెల్గా నిశ్శబ్దంగా ఏడ్చింది’ అని యుద్ధానంతరం అరెస్టైన హిట్లర్ కార్యదర్శి హిట్లర్ కార్యదర్శి ట్రాడ్ల్ యుంగె వివరించారు.

గోబెల్స్ దంపతులు నాజీ భావజాలాన్ని ఎంతగా నమ్మారంటే.. చివరకు వారు దానితో తమ పిల్లల భవిష్యత్తును ముడిపెట్టారు. మరొకరి పాలనలో బతకటం కంటే చావటమే మేలనుకున్నారు. నాయకుల విశ్వాసాలను గుడ్డిగా అనుసరించి, విమర్శకు తావులేని జీవితం గడిపిన ఈ దంపతులు.. తమ మూర్ఖపు విశ్వాసం కోసం బుట్టబొమ్మల్లాంటి పసివాళ్లయిన కన్నబిడ్డలనే పెట్టటాన్ని గౌరవంగా భావించారు. చరిత్రలో ఇలాంటి విధేయులు మొదటివాళ్లూ కారు, చివరివాళ్లూ కారు.

కానీ.. గోబెల్స్‌నూ మించిన దుర్మార్గపు, నయవంచక నేతల పాలనలో, ఇంకా వారిని నమ్మి భజన చేసే గుడ్డి అనుచరులంతా తెలుసుకోవలసిన చారిత్రక సంఘటన ఇది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News