Bike Stunts: హైదరాబాద్‌లోని అత్తాపూర్, పిల్లర్ నంబర్ 257. ఆ రోజు ఒక్కసారిగా రయ్ రయ్ మంటూ మూడు బైకులు దూసుకొచ్చాయి. వాటికి నంబర్ ప్లేట్లు లేవు. స్పీడ్‌కు లిమిట్ కూడా లేదు. పెద్ద హారన్లు.. దీనికి తోడు కేరింతలు కొడుతూ బైకును అడ్డదిడ్డంగా నడుపుతున్నారు. పక్కనే ఉన్న వాహనదారుల గుండెలు గుభేల్‌మన్నాయి. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చిన్న తేడా వచ్చినా ఎవరి ప్రాణం పోయేదో ఎవరికి తెలుసు? ఐనా వీళ్లకు ఇన్‌స్టా లైకులే సోకులు.
ఇక్కడే వస్తుంది అసలు ట్విస్ట్. స్టంట్లు తీసి ఊరుకున్నారా? లేదు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వదిలారు. లైక్స్ వస్తాయనుకున్నారు. కానీ వచ్చింది పోలీసుల నుంచి ఫోన్ కాల్. పెట్రోలింగ్‌లో ఉన్న అత్తాపూర్ పోలీసులకు ఆ వీడియో కంట పడగానే.. సీసీటీవీ ఫుటేజ్ తిరగేశారు. సోషల్ మీడియా ట్రాక్ చేసి.. ఒక్కొక్కరి జాతకం బయటకు లాగారు. ఆ రచ్చ చేసిన రాస్కెల్స్ మహమ్మద్ మోహినుద్దీన్ అలియాస్ మోహిన్ మహమ్మద్ రిజ్వాన్ తొహిద్ అని గుర్తించారు. ముగ్గురిపై కేసు ఫైల్ అయింది. కటకటాలు కన్ఫర్మ్ అయ్యాయి. బైక్‌పట్టుకొని హీరోలమనుకున్నారు. కానీ లాకప్‌లో జీరోలయ్యారు.
ఇది కేవలం ఆ ముగ్గురి కథ కాదు. ప్రతి ఒక్కరికి వార్నింగ్. లైసెన్స్ లేని పిల్లల చేతికి బండి ఇస్తున్నారా? మీరు కూడా జైలుకి వెళ్తారు జాగ్రత్త. కుర్రాళ్లు బైక్ పట్టుకొని రేసింగ్, స్టంట్లు అంటూ ఓవర్ యాక్షన్ చేస్తే.. పోలీసులు యాక్షన్ తట్టుకోలేరు. రోడ్డు మీ ప్లేగ్రౌండ్ కాదు. రీల్‌కు వచ్చే లైకుల కోసం లైఫ్‌ని రిస్క్‌లో పెట్టొద్దు.
Also Read: AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?