ఫార్ములా ఇ రేసింగ్ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. డబ్బులు రిలీజ్ చేశాం. అక్కడికి వెళ్లాయి. మధ్యలో అవినీతి ఎక్కడుంది అని మాజీ మంత్రి కేటీఆర్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే ఇందులో అవినీతి కోణాలు బయటపెట్టేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. దాల్ మే కుచ్ కాలాహై అంటోంది. ఎక్కడో ఏదో మతలబు జరిగిందన్న అనుమానాలైతే బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఐఏఎస్ దానకిషోర్ స్టేట్ మెంట్ ను ఏసీబీ రికార్డు చేసింది. మరోవైపు హైకోర్టు ఉత్తర్వులు ఏసీబీకి చేరుకున్నాయి. దీంతో ఎంక్వైరీలో స్పీడ్ పెంచింది దర్యాప్తు సంస్థ.
లేటెస్ట్ విషయం ఏంటంటే.. దాన కిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ నమోదు చేసింది. ఇదే చాలా కీ రోల్ పోషించబోతోందంటున్నారు. దీని ఆధారంగా ఏసీబీ విచారణ చేయబోతున్నట్లు తెలిసింది. ఆర్థికశాఖ అనుమతి పొందకుండా, కేబినెట్ నిర్ణయాలు తీసుకోకుండా ఎలా డబ్బులను రిలీజ్ చేశారని దానకిషోర్‌ను ఏసీబీ క్వశ్చన్ చేయగా.. కొంత రాజకీయ ఒత్తిళ్లతో పాటు, స్వయంగా కేటీఆర్ ఆదేశాల మేరకు, తన పరిధిలో ఉన్న హెచ్ఎండీఏ ద్వారా FEOకు మనీ ట్రాన్స్ ఫర్ చేశామన్నారు. అలాగే ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చే సమయంలో దానకిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కోర్టు ముందు ఉంచాలని ఏసీబీ భావిస్తోంది. ఇప్పటికే ఆయన నుంచి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది ఏసీబీ. మరోవైపు ఈ ఫార్ములా ఇ రేసింగ్ నిధుల ట్రాన్స్ ఫర్ విషయంలో ఏం జరిగిందో ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు దానకిషోర్. ఇందులో 45 కోట్లు ఫారిన్ కరెన్సీ రూపంలో ఉంటే.. 10 కోట్ల నగదు బ్లాక్ మనీ చెల్లింపులు చేసినట్లుగా తెరపైకి వస్తోంది. ఇందులో నిజానిజాలు ఏంటన్నది ఏసీబీ వెలికి తీయబోతోంది. ఈ బ్లాక్ మనీ మ్యాటర్ దర్యాప్తులో కీలకంగా మారబోతోందంటున్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ ఎవరన్నది సాక్ష్యాలతో సహా అందరి ముందు ఉంచేందుకు ఏసీబీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
దాన కిషోర్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన ఏసీబీ.. త్వరలో కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇస్తారంటున్నారు. దీంతో ఫార్ములా ఇ రేస్ కేసులో వాట్ నెక్ట్స్ అన్నది సంచలనంగా మారింది. ఈ కేసు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఎందుకంటే ఓవైపు కేటీఆర్ ను డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. అదే సమయంలో ఈ కేసు విచారణ డిసెంబర్ 27న మరోసారి హైకోర్టులో జరగబోతోంది. తనపై కేసు కొట్టేయాలని కేటీఆర్ వేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చలేదు. విచారణ జరగాలన్నది. దీంతో తదుపరి విచారణ సమయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి… హైకోర్టు డైరెక్షన్ ఎలా ఉండబోతోంది.. ఏసీబీ యాక్షన్ ప్లాన్ ఏంటన్నది చాలా ఉత్కంఠ రేపుతున్న విషయాలు.
ఫార్ములా ఇ రేసింగ్ కేసులో తగ్గేదేలే.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాజీ మంత్రి కేటీఆర్ పదే పదే అంటున్నారు. అయితే ఇందులో తప్పులు జరిగినట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. ఆ దిశగానే కథ నడవబోతోంది. ఎక్కడా హడావుడి లేకుండా న్యాయ నిపుణులతో చర్చించాక, సలహాలు తీసుకుని అంతా ఓ సీక్వెన్స్ ప్రకారం ఫార్ములా ఇ రేసింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో దూద్ కా దూద్, పానీకా పానీ మ్యాటర్ బయటకు తేవాలనుకుంటోంది ప్రభుత్వం. అయితే కరప్షనే లేని మ్యాటర్ లో ఏసీబీ కేసు ఏంటన్నది కేటీఆర్ వెర్షన్. కానీ అండర్ గ్రౌండ్ మ్యాటర్ వేరుగా ఉందన్నది ఏసీబీ వర్గాల వెర్షన్.
ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరి వాదన వారు వినిపించుకోవడం కామనే. కానీ అసలు మ్యాటర్ ఏంటన్నదే పూర్తిస్థాయి దర్యాప్తులో తేలుతాయి. ఇప్పుడు ఫార్ములా ఇ రేసింగ్ కేసులోనూ అదే జరగబోతోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇ ఫార్ములా కేసులో ఫిర్యాదుదారు దాన కిషోర్ స్టేట్‌మెంట్ చుట్టూ ఇప్పుడు మొత్తం మ్యాటర్ తిరుగుతోంది. నిజానికి కేటీఆర్ అంటున్నట్లుగా ఇది అసలు కేసే కాదు అని అంటే ఏసీబీ FIR ఎందుకు నమోదు చేస్తోందన్న ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి ఈ వ్యవహారంలో ఆయా డిపార్ట్ మెంట్స్ ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి.. మనీ ట్రాన్స్ ఫర్ విషయంలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చి ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా ప్రైవేటు కంపెనీ సీఈవో పేరును ఏసీబీ చేర్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం బయటకు రాగానే మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసును క్వాష్ చేయాలంటూ అప్పటికప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో విచారణ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్‌కు స్వల్ప ఊరట లభించింది. డిసెంబర్ 30 వరకు అరెస్ట్ నుంచి రిలీఫ్ దక్కింది. అయితే ఇక్కడ ఓ ప్రశ్న మేజర్ గా వినిపిస్తోంది. ఫార్ములా ఇ రేసింగ్ మనీ ట్రాన్స్ ఫర్ విషయంలో కరప్షన్ లేదు, కాకరకాయలేదు అని చెబుతున్న కేటీఆర్.. విచారణను స్వాగతించకుండా.. వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. అంతా సాఫ్ గా ఉంటే విచారణ అంటే ఎందుకు భయం అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక్కడే లాజిక్స్ అన్నీ అప్లై అవుతాయంటున్నారు.
ఫార్ములా ఇ రేస్ కేసులో కరప్షన్ లేదు, కాకరకాయ లేదు అని పదే పదే చెబుతున్న మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు పక్కాగా బిగుసుకుంటోంది. ఈ విషయంలో హడావుడికి పోకుండా గవర్నర్ అనుమతి తీసుకోవడం, అంతా చట్ట ప్రకారమే కేసును ముందుకు తీసుకెళ్తోంది ప్రభుత్వం. కరప్షన్ ఏంటో, కాకరకాయ ఏంటో తేల్చే పనిలో ఉన్నారు. మరోవైపు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈ కేసు నుంచి బయటపడేందుకు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఫార్ములా ఇ రేస్ కేసులో ముమ్మాటికీ తప్పు జరిగిందంటోంది ప్రభుత్వం. ఇందులో ఒప్పందాలు ఎలా చేతులు మారి.. చివరకు రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు మొత్తం భరించే పరిస్థితికి ఎలా తీసుకొచ్చారు.. ప్రభుత్వ ఖజానాకు ఎలా నష్టం కలిగించే వ్యవహారం జరిగిందన్నది ఇప్పుడు అసలు మ్యాటర్. అలాంటిదేమీ లేదు, హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఫార్ములా ఇ రేస్ తీసుకొచ్చామని, స్పాన్సర్ ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం నుంచే డబ్బులు కట్టించామన్నది కేటీఆర్ వెర్షన్. స్పాన్సర్ లేకపోతే ఎవరైనా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులను ఇలా ఎవరైనా తరలిస్తారా, అదీ ఎలక్షన్ కోడ్ ఉండగా, ఆర్థిక శాఖ, క్యాబినెట్ అనుమతి లేకుండా.. ఇవి మరో వెర్షన్. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇంటర్నల్ లింక్స్ ఏంటి? తెరవెనుక కథ ఎలా నడిచింది? ఇదే ఇప్పుడు హైలెట్.
ఏసీబీ ఫుల్ టైమ్ యాక్షన్ లోకి దిగిన తర్వాత ఎవరూ నమ్మలేని నిజాలు బయటికొస్తాయన్న ప్రచారం జరుగుతోంది. చెప్పాలంటే ఈనెల 30 తర్వాత హైకోర్టులో విచారణ అనంతరం సీన్ లో స్పీడ్ పెరుగుతుందంటున్నారు. నిజానికి చాలా పకడ్బందీగా ఈ ఫార్ములా ఇ రేస్ కేసును ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా చేర్చిన ఏసీబీ.. అంతకు ముందే గవర్నర్ అనుమతి తీసుకుంది. కేటీఆర్ కంటే ముందే.. ఐఏఎస్ అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తుండడంతో ఆయన డిఫెన్స్ లో పడ్డారంటున్నారు. అప్రూవర్‌గా మారుతారన్న ప్రచారం కూడా కొత్తగా తెరపైకి వచ్చింది. ఈ కేసులో మొదటగా కేటీఆర్ నోటి మాటపై నిధులు ట్రాన్స్ ఫర్ చేసిన అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటగా ఆయనను విచారించి అక్కడి నుంచి వచ్చే వాంగ్మూలం ప్రకారం కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసేలా ఏసీబీ యాక్షన్ ప్లాన్ నడుస్తోంది.
ఫార్ములా–ఇ రేసింగ్‌కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధుల విడుదల, అవినీతి కోణాలపై నమోదు చేసిన కేసులో తర్వాత ఏం జరుగుతుందన్నది అధికారిక వర్గాల్లో అటెన్షన్ కు కారణమవుతోంది. ఈ కేసులో అరవింద్ కుమార్ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. క్యాబినెట్ అనుమతి లేకున్నా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిధులు ట్రాన్స్ ఫర్ చేయొద్దు. కానీ చేశారు. అంతేకాదు.. విదేశీ కంపెనీలకు మనీ ట్రాన్స్ ఫర్ చేయాలంటే రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి, ఫారెక్స్ చెల్లింపులకు ఆర్‌బీఐ అప్రూవర్ కూడా అవసరం. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ హోదాలో అరవింద్ కుమార్ మొదటగా మనీ ట్రాన్స్ ఫర్ చేసి.. ఆ తర్వాత డీల్స్ చేసుకున్నట్లు ఏసీబీ ఐడెంటిఫై చేసింది. దీంతో ఏసీబీ మొదటగా అరవింద్ కుమార్ నే విచారించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ ఫార్ములా డీల్స్ లో అరవింద్ కుమార్ పాత్రపై బలమైన ఆధారాలను ఏసీబీ సేకరించి, ఇప్పటికే సీఎంకు ఓ రిపోర్ట్ కూడా అందించిందని అంటున్నారు. ఆ తర్వాతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయనకు నోటీసు జారీ చేసి, వివరణ తీసుకున్నారు. ఆ క్రమంలో అప్పటి మంత్రి కేటీఆర్ చెబితేనే 55 కోట్లను బదిలీ చేశానని వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది.
నిజానికి ఈ ఏడాది జనవరిలోనే అరవింద్ కుమార్ కు సర్కార్ మెమో జారీ చేసింది. ఫార్ములా ఇ రేసింగ్ ఒప్పందం, నిధుల విడుదల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ప్రభుత్వం మెమో జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అప్పట్లోనే ఆదేశించింది. అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఉన్నప్పుడే ఈ ఒప్పందాలు కుదిరాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఎలాంటి అనుమతి లేకుండా నిధులు ట్రాన్స్ ఫర్ చేశారని మెమోలో పేర్కొన్నారు. అసలు ఆ నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు ట్రాన్స్ ఫర్ చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. నాడు ఇచ్చిన ఆన్సర్, తాజాగా సీఎస్ ఇచ్చిన నోటీసుకు చెప్పిన జవాబుల ఆధారంగా మొత్తం మ్యాటర్ అరవింద్ కుమార్ చుట్టూ ఫిక్స్ అయ్యేలా దారి తీస్తున్నాయి.
ఏసీబీ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అరవింద్ కుమార్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఆయన అప్రూవర్‌గా మారడం ఒక్కటే మార్గంగా ఉన్నట్లు చెబుతున్నారు. నిజానికి మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పనిచేసిన అరవింద్ కుమార్ ఔటర్ రింగ్ రోడ్ లీజు వ్యవహారంలో అప్పటి పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇందులో అవకతవకలు జరిగాయని ఆరోపించడంతో రేవంత్ కు నోటీసులు ఇచ్చారు. సో ఇప్పుడు ఓఆర్ఆర్ లీజుపైనా సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం కీలకంగా మారింది. ఈ వ్యవహారం కూడా ఐఏఎస్ అరవింద్ కుమార్ కే చుట్టుకుంటుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఓఆర్ఆర్ టెండర్ ఇష్టం లేకపోతే క్యాన్సిల్ చేయాలని అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ అంటున్నారు తప్ప విచారణ జరిగితే మనస్ఫూర్తిగా రెడీ అనడం లేదు. ఇదో ట్విస్టు.
Also Read: ఇకపై అవినీతికి నో ఛాన్స్.. ఏఐతో అన్ని కనిపెడతాం జాగ్రత్త అంటున్న రాష్ట్ర సర్కార్
సో ఓవరాల్ గా చూస్తే మాజీ మంత్రి కేటీఆర్ కు దారులు అన్నీ మూసుకుపోతున్నాయి. అటు ఏసీబీ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1),(ఏ) రెడ్ విత్ 13(2) సెక్షన్ 409, 120 బి ప్రకారం కేసులు నమోదు చేసింది. ఫార్ములా ఇ రేస్ పై ఏసీబీ కేసు నమోదు చేయగానే.. ఆ డిటైల్స్ ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. పీఎంఎల్‌ఏ, మనీలాండరింగ్ కింద కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఏసీబీ కేసు ఆధారంగానే ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ.