దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం: చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది హైడ్రా. చెరువులు, నాలాల పరిధిలో విచ్చలవిడిగా వ్యాపారాలు సాగిస్తున్న వారికి చుక్కలు చూపిస్తోంది. అలాగే.. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. అయితే, ఆల్రెడీ నివాసం ఉంటున్న వారి పరిస్థితి ఏంటి? ఎప్పుడెప్పుడు జేసీబీతో హైడ్రా దిగుతుందో అని వారంతా తెగ కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక పాలసీతో యాక్షన్ ప్లాన్‌కు సిద్ధమౌతున్నట్టు సమాచారం. ఓవైపు సామాన్యులను కాపాడుకుంటూనే, ఇంకోవైపు బడా బాబులకు షాకిచ్చేందుకు ప్రిపరేషన్‌లో ఉంది.
అభివృద్ధి అంటూ చెరువులను చెరబట్టారు
జీహెచ్ఎంసీ పరిధిలో అత్యంత ఖరీదైన ఏరియాల్లోని చెరువులను దత్తత పేరుతో కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాకింగ్ ట్రాక్స్, గ్రీనరీ, ఇంకా ఇతర సదుపాయాలను కల్పించాలనేది దీని లక్ష్యం. కానీ, చాలా సంస్థలు ఓవైపు చెరువుల పరిరక్షణ అంటూనే.. ఇంకోవైపు తమ ప్రాజెక్టులను ప్రమోట్ చేస్తున్నాయి. కబ్జాలకు పాల్పడ్డాయి. సైక్లింగ్, వాకింగ్, బోటింగ్ అంటూ, చెరువును మన సంస్థే అభివృద్ధి చేస్తోందని చెప్పుకుని నిర్మాణాలు చేపట్టి కస్టమర్లకు ఇళ్లను అంటగట్టారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఇప్పుడు ఇళ్లు కొనుక్కున్న వాళ్లు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది. ప్రస్తుతానికి హైడ్రా కొత్తగా కడుతున్న నిర్మాణాలను, వ్యాపారాలు సాగిస్తున్న వాటిని మాత్రమే కూల్చివేస్తోంది.
వంత పాడిన అధికారులు
డెవెలప్‌మెంట్ పేరుతో కార్పొరేట్ కంపెనీలు చెరువులను చెరబడుతుంటే, అధికారులు వారికి రాచమార్గాన్ని వేశారు. కబ్జాలకు హెచ్ఎండీఏ, ఇరిగేషన్ శాఖ అధికారులు ఫుల్లుగా సపోర్ట్ చేశారు. దాని ఫలితంగా విచ్చలవిడిగా నిర్మాణాలు జరిగాయి. ఆఖరికి నాలాల డైవర్షన్ మార్చి మరీ బిల్డింగులు కట్టారు. విచిత్రం ఏంటంటే.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అని తెలిసినా కూడా అధికారులు పర్మిషన్లు ఇచ్చేశారు. ఇలా ఒకటి కాదు రెండు లెక్కలేనన్ని జరిగాయి. వాటి ఫలితమే నగరంలోని గొలుకట్టు చెరువుల లింక్ తెగిపోయింది. కొన్ని ఏరియాల్లో దీని ఫలితాన్ని బాధితులు అనుభవిస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఇళ్లు నీట మునుగుతుంటే కన్నీరు పెట్టుకుంటున్నారు. నాలాల దారి మళ్లింపు, మాయమే ఇందుకు కారణం. అందుకే.. అధికారులపై ఫోకస్ పెట్టింది హైడ్రా. వారిపై కఠిన చర్యలకు పూనుకుంది.
మూసీపై స్పెషల్ ఫోకస్
కోకాపేట, మంచిరేవుల ప్రాంతాల్లో మూసీకి ఆనుకుని అనేక నిర్మాణాలు జరిగాయి. దారి పొడవునా మూసీ ఆక్రమణకు గురి అయ్యింది. ఈ నేపథ్యంలో హైడ్రా మూసీపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అసలు, గతంలో మూసీ ఎంత ఉండేదనే అంశం చుట్టూ వివరాలు సేకరిస్తోంది. ఇంకోవైపు ప్రభుత్వం కూడా మూసీ ప్రక్షాళనకు పూనుకోవడంతో దీనిపై రానున్న రోజుల్లో సంచలన నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిధిలో కమర్షియల్ భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం అవుతోంది. దీనికోసం హైడ్రా సిబ్బందిని రిక్రూట్ చేసుకునే పనిలో ఉంది.
ప్రభుత్వం ఏం చేయబోతోంది?
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టి బాగానే లబ్ధిపొందారు వ్యాపారులు. ఆయా నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. అయితే.. ఆల్రెడీ నివాసం ఉంటున్న వారి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతుండగా, ప్రభుత్వం దీనికోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. లక్షలు పోసి ఇల్లు కొని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉంటున్న వారికి అధిక మొత్తంలో పన్ను విధించే ప్లాన్‌లో ప్రభుత్వం ఉందని సమాచారం. అంటే రిజిస్ట్రేషన్ అయిన వాటికి ఎక్కువ పెనాల్డీ వేయాలని అనుకుంటోందని తెలుస్తోంది. అంతేకాదు.. ఆ ఇళ్లను ఇతరులకు అమ్మడానికి వీలు లేకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.