కేంద్రాన్ని వెంటాడుతున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు. ఇండీ కూటమి ఓవైపు. జెన్‌జీ కాక్రోచులు మరోవైపు. ఎస్‌ఐఆర్ పూర్తి లోపభూయిష్టమేనని నిగ్గుతేలిన నేపథ్యంలో ఇండీ కూటమి మూడు రోజుల పాటు ఢిల్లీ పీఠాన్ని దద్దరిల్లేలా ఉద్యమాలు చేసింది. మెరుపు ధర్నాలతో చుక్కలు చూపించింది. మోడీ టీమ్‌కు ముచ్చెమటలు పట్టించింది.
మధ్యలో ఒక రోజు జెన్‌జీలకు అవకాశం ఇచ్చింది ఇండీ కూటమి. జెన్‌జీల పిలుపుకు, కాక్రోచులు చేసిన మానని గాయం సలుపుతుండగా.. ఈసారి కేంద్రం భారీ భద్రత చర్యలు చేపట్టింది. ఢిల్లీని దిగ్బంధనం చేసింది. చీమలు దూరని చిట్టడివిలా.. కాక్రోచులు దూరని ఢిల్లీగా మార్చిపాడేసింది మోడీ సర్కార్.
ఇది దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది. జో డర్ గయా.. వో మర్ గయా! అనే నినాదాలు జోరందుకున్నాయి. మోడీ పీఠం భయపడే ఇదంతా చేసిందని, ఇక భయమనేది భవిష్యత్‌లో దాని పరాజయానికి ప్రతీరూపమని విశ్లేషణలు సాాగాయి. కాక్రోచుల పార్టీ పెద్దలను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం వల్ల, ఢిల్లీ దారులన్నీ బంధించి… ఖాకీలు తమ ఆధీనంలోకి తీసుకోవడం వల్ల జంతర్ మంతర్ 2.0 తొలి పిలుపును భగ్నం చేయగలిగింది కేంద్రం.
కానీ ఇది ఒక్కరోజుతో అయిపోయే పోరాటం కాదని ప్రకటించింది సీజేపీ. ఇవాళ కూడా జంతర్ మంతర్‌కు రావాలని పిలుపునిచ్చింది. మరి ఎన్ని రోజులు ఈ ఢిల్లీ రాస్తాలు దిగ్బంధనం చేస్తారో తెలియదు కానీ.. ఎప్పుడైనా మెరుపు ధర్నా చేసేందుకు జెన్‌జీలు సిద్దంగా ఉన్నారు. కాక్రోచులు సమయం కోసం కాచుకు కూర్చున్నారు. రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ను కలుస్తామని ప్రకటించారు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.
ఢిల్లీలో అనధికారికంగా ఎమెర్జెన్సీ పరిస్థితులను కేంద్రం క్రియేట్ చేసిందనే విషయాన్ని వివరించనున్నారు. సీజేఐ ముందు ఎలాంటి డిమాండ్లు ఉంచబోమని చెబుతూనే.. ఉన్న పరిస్థితులు వివరిస్తే చాలు దేశం మొత్తం ఎలాంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కుంటుందో.. సమాజం ఏం కోరుకుంటుందో పరోక్షంగా తమ భేటీ ద్వారా వెల్లడించనున్నామనే విషయాన్ని వెల్లడించారు ఖర్గే. ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తున్నామని, ఆపేదే లేదని ఏఐసీసీ ప్రకటించి ఉన్నది.
ఓ వైపు ఇండీ కూటమి మోడీని వదలబోమంటున్నది. మరోవైపు జెన్ జీ జ్ఞానేశ్వర్ కుమార్ సీటు కిందకు నీళ్లు తెచ్చి తీరుతామని శపథం చేస్తున్నది. నేను వీడని నీడను నేనే..! అని ఈ రెండు శక్తులు కేంద్రాన్ని వెంటాడుతున్నాయి. మోడీ, అమిత్ షా ద్వయం కాక్రోచులను కకావికలం చేశామని, జెన్ జీని నియంత్రించామని, జంతర్‌మంతర్‌కు తాళం వేశామని తమకు తాము భుజాలు చరుచుకున్నా.. ఇదెంత కాలం పాటు కొనసాగిస్తారు? భయం గుప్పిట్లోనే ఎన్ని రోజులు కాలం వెళ్ల దీస్తారు..? అనేదే ఇప్పుడు ఎన్డీయే భవిష్యత్‌ను నిర్దేశించే పరిణామాలుగా మారాయంటున్నారు విశ్లేషకులు.