Fuel Prices: ప్రస్తుతం నేషన్ వైడ్‌గా ఓ చర్చ జరుగుతోంది. త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయని. గ్యాస్ ధరలు ఏమో కానీ పెట్రోల్, డీజిల్ ధరల మోత మాత్రం మస్ట్ అనే టాక్ ఉంది. నిజానికి ఇప్పటికే ధరలు పెరగాల్సి ఉన్నా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఆ భారాన్ని ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు భరిస్తూ వస్తున్నాయని.. ఒక్కసారి ఎన్నికలు ముగియగానే ధరల పెంపు తప్పదనే ప్రచారమైతే జోరుగా జరుగుతోంది.
నిజానికి అమెరికా, ఇరాన్ వార్ ప్రారంభమైన 50 రోజులు గడుస్తుంది. అప్పుడే దాడులు.. ఆ తర్వాత కాల్పుల విరమణ.. హర్మూజ్ తెరవడం, మూయడం, చర్చలు జరగడం.. ఫెయిలవడం.. ఇలా రకారకాలైన పరిస్థితుల కారణంగా చమురు ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తన్నాయి. గరిష్టంగా.. 120 డాలర్లకు వెళ్లిన ధర.. ఆ తర్వాత 80 డాలర్ల వరకు వచ్చింది. ప్రస్తుతం 90 నుంచి వంద డాలర్ల మధ్య బ్యారెల్ చమురు ధర కొట్టుమిట్టాడుతోంది.
భారత్ 85 శాతం చమురును దిగుమతి చేసుకోవడం ఓ పెద్దశాపమనే చెప్పాలి. చమురు దిగుమతులపై ఇప్పుడు ఈ ఎఫెక్ట్ పడుతుండటంతో ఆయిల్ కంపెనీలు లబోదిబోమంటున్నాయి. ఓపెన్ మార్కెట్‌లో భారీగా ధరలు పెరుగుతుండటంతో ఆ కంపెనీలపై భారం పడుతోంది. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. నిజానికి ఇప్పటికే ప్రజలపై ఈ భారం పడాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. ప్రజలపై భారం మోపకుండా.. కంపెనీలు చెల్లించే ట్యాక్స్‌లను భారీగా తగ్గించి కాస్త ఉపశమనం కలిగించింది. అయినా కానీ ఆయిల్ కంపెనీలపై భారం పడుతూనే ఉంది.
నిజానికి ఈ భారం కాస్త తగ్గించడానికి స్పీడ్, పవర్ పెట్రోల్‌పై 2 రూపాయలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. అయితే నార్మల్ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు జోలికి మాత్రం పోలేదు. పోనీ ప్రస్తుతం పరిస్థితులన్నీ చక్క బడ్డాయి అనడానికి లేదు. అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. హర్మూజ్ ఇంకా మూసే ఉంది. మనం ఇతర దేశాల నుంచి చమురును కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇవన్నీ కూడా ఆయిల్ కంపెనీలు నష్టపోయేలా చేస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యాయి. ఒక్కసారి ఈ ఎన్నికలు ముగియగానే.. ఇక ధరల పెంపు వాయిదా వేయకుండా మోపడమే కనిపిస్తోంది. నిజానికి నాలుగేళ్లుగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. కానీ ఇప్పుడు పెంపు మాత్రం తప్పేలా కనిపించడం లేదు.
ధరల పెంపు తప్పదు అనే చర్చ జరుగుతోంది. కానీ ఎంత మేర పెరుగుతాయి? అనేది ఇప్పుడు ఓ పెద్ద క్వశ్చన్. దీనికి ఎక్స్‌పర్ట్స్ ఓ లెక్క చెబుతున్నారు. బ్యారెల్ చమురు ధర 95 డాలర్లుగా ఉంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు 8 నుంచి 15 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని.. అదే బ్యారెల్ చమురు ధర 85 నుంచి 90 డాలర్ల మధ్య ఉంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు 3 నుంచి 7 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఎల్పీజీ ధర అయితే భారీగానే పెరుగుతుందని అంచనా.
మన దేశంలో చాలా వరకు సరుకు రవాణా రోడ్డు మార్గంగుండానే అవుతుంది. మన ఆర్థిక వ్యవస్థలో ట్రక్కులది కీ రోల్. 70 శాతం రవాణా ఈ ట్రక్కుల ద్వారానే జరుగుతోంది. అందుకే డీజిల్ ధరలు పెరిగితే ఆ ఇంపాక్ట్ అన్ని నిత్యావసర ధరలపై ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితి అంతా నార్మల్‌గా కనిపిస్తున్నా కొన్ని అనధికారిక పరిమితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రక్కులకు డీజిల్ విషయంలో కొన్ని పరిమితులను విధిస్తున్నారు. ఒక్కో ట్రక్‌కు ఇంత డీజిల్ మాత్రమే నింపుతామని బంక్ నిర్వాహకులు చెబుతున్నారని తెలుస్తోంది. సప్లై తక్కువగా ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారంటున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత లేదనేది ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట.
పెట్రో ధరల పెంపు ప్రచారంపై ఇప్పటికే ట్రక్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ ధర లీటరుకు నిజంగానే 15 రూపాయల వరకు పెరిగితే రవాణా ఛార్జీలు భారీగా పెరుగుతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగితే 30 శాతం ట్రక్కులు నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చు కూడా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికి కారణం పెట్రోల్ కంటే ముందుగా డీజిల్ ధరలు పెరుగుతాయనే ప్రచారం. 2013 నుంచి చూస్తే పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. 2013లో లీటర్ పెట్రోల్ ధర 72 రూపాయలు ఉండగా.. 2015, 16 మధ్య 60 నుంచి 66 రూపాయలకుతగ్గింది.. కానీ ఆ తర్వాత లా అలా పెరుగుతూ వచ్చింది. 2017, 18 మధ్య 65 నుంచి 70 రూపాయల మధ్య.. 2020 వచ్చే సరికి 80 నుంచి 95 రూపాయలకు చేరింది. ఇక 2022-2024 మధ్య 97 రూపాయల వరకు వచ్చింది. ఇక ఇప్పుడు ఎంత ఉందో మనందరికి తెలిసిందే.
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు 50 రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ ఇంపాక్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ఇంధన ధరలు పెరిగాయి. ఇండియాతో పాటు.. అతి తక్కువ దేశాల్లో మాత్రమే ఇంధన ధరలు పెరగలేదు. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఇంధన ధరలు పెరిగాయి. కొన్ని దేశాల్లో అయితే ఏకంగా 40 శాతం ధరలు పెరిగాయి. అయితే 20 దేశాల్లో మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే అవన్నీ చిన్న దేశాలు. కానీ మేజర్ ఎకానమీ అయిన భారత్‌లో మాత్రం ధరలు పెరగకపోవడం ఒక మిరాకిల్.
ఈ యుద్ధాన్ని ప్రారంభించిన అమెరికాలో అయితే పెట్రోల్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు ప్రారంభించింది అమెరికా. ఆ తర్వాత ఏకంగా 40 శాతం ధరలను పెంచింది అమెరికా. ఫిబ్రవరిలో గ్యాలెన్ పెట్రోల్… 2.94 డాలర్లు ఉండగా. ప్రస్తుతం అది 4.11 డాలర్లుగా ఉంది.
ఇక మన దాయాది దేశం పాకిస్థాన్‌లో అయితే పెట్రోల్ ధరలు ఏకంగా 42.7 శాతం పెరిగాయి. చమురు సరఫరా నిలిచిపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. పాక్ పెట్రోలియం మినిస్టర్ అలీ పర్వేజ్ మాలిక్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అందుకే ధరలు పెంచక తప్పడం లేదంటున్నారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులే అయ్యింది. ఇంతలోనే భారీగా ధరలను పెంచితే ఎలా అని చాలా వారాల పాటు కంట్రోల్ చేశారు. కానీ ఏప్రిల్ 18న మాత్రం ఇక తాము భరించలేమని సంచలన నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌ను 19 టాకాల నుంచి ఏకంగా 135 టాకాలకు పెంచేసింది. ఇక డీజిల్‌ను 15 టాకాల నుంచి 115 టాకాలకు పెంచేసింది. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే.. భారత్ నుంచి కూడా బంగ్లాదేశ్ డీజిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. అయినా కొరత మాత్రం తీరడం లేదు. బంకుల వద్ద ఆరు నుంచి ఏడు గంటల పాటు లైన్‌లో నిల్చుంటే కానీ పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది.
డ్రాగన్ కంట్రీ చైనా కూడా పెట్రోల్ ధరలను పెంచింది. చైనా కూడా చమురును భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఇరాన్ నుంచే ఎక్కువగా దిగుమతి జరుగుతోంది. చైనాలో ఇప్పటి వరకు 20 శాతం పెట్రోల్ ధరలు పెరిగాయి. అయితే ధరలు భారీగా పెరగకుండా ఉండేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొన్ని ఇండస్ట్రీలను తాత్కాలికంగా మూసేసింది చైనా. మరో విచిత్రమైన విషయం ఏంటంటే.. చమురును ఉత్పత్తి చేసే ఖతార్, రష్యా లాంటి దేశాల్లో కూడా చమురు ధరలు పెరిగాయి. అయితే ఇది చాలా స్వల్పమే అయినా పెరిగాయి.
ఇండియాలో మాత్రం ఈ పెంపు కనిపించడం లేదు. ధరలు పెంచకపోవడంతో లీటర్ పెట్రోల్‌పై 18 రూపాయలు.. లీటర్ డీజిల్‌పై 35 రూపాయల నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి ఆయిల్ కంపెనీలు. 2022 మేలో భారత్‌లో చివరిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది కేంద్రం. ఈ మధ్య కాలంలో కేంద్రం చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపకుండా ఉండేందుకు కొన్ని చర్యలను తీసుకుంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను మిక్స్ చేయాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. అయినా ఈ చర్యలు తమకు ఉపశమనం కల్పించడం లేదనేది ఆయిల్ కంపెనీలు చెబుతున్న మాట.
ఇప్పటికే పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు.. లగ్జరీ కార్లు, హై-ఎండ్ బైక్‌లు వాడే వారిపై ప్రభావం చూపుతాయి. కానీ ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరగడమే ఇప్పుడు కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. బల్క్ డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీకు 20కి పైగా పెంచాయి. దాంతో పరిశ్రమలు, రైల్వేలు, భారీ మాల్స్ నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల.. వస్తువుల తయారీ వ్యయం పెరిగి, అంతిమంగా వినియోగదారుడిపైనే ఆ భారం పడుతుంది.
ప్రస్తుతం యుద్ధం గనక ముదిరితే.. చమురు సరఫరా మరింత దెబ్బతినే అవకాశం ఉంది. పెట్రోల్ భారం మాత్రమే కాదు.. గ్యాస్ బండ కూడా.. మధ్య తరగతి వారికి గుదిబండగా మారే అవకాశం కనిపిస్తోంది. భారత్‌లో వాడుతున్న వంట గ్యాస్‌లో దాదాపు 60 శాతం మధ్యప్రాచ్యం నుంచే వస్తుంది. యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధి మూతపడటంతో.. నౌకల రాక ఆలస్యమవుతోంది. కొరత వస్తుందేమోనన్న భయంతో.. అంతా ఒకేసారి సిలిండర్లు బుక్ చేయడం వల్ల పంపిణీ వ్యవస్థపైనా ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే గ్యాస్ బుకింగ్ గడువుని కూడా బాగా పెంచారు.
ఈ ఆందోళనకర పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే.. యుద్ధం ఆగడం గానీ, హర్మూజ్ జలసంధి తెరచుకోవడం గానీ చాలా ముఖ్యం. యుద్ధం కొనసాగినా, ఆయిల్ ఉత్పత్తి, సప్లైకి ఎలాంటి ఆటంకం లేకపోతే.. ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయ్. భారత్ కూడా గల్ఫ్ దేశాల ఆయిల్‌పైనే ఆధారపడటం తగ్గించి.. రష్యా లాంటి దేశాల నుంచి గ్యాస్, చమురు దిగుమతిని పెంచింది. దేశంలోనూ ఎల్‌పీజీ గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం.. మన దగ్గురున్న వ్యూహాత్మక చమురు నిల్వలు.. కొంతకాలం వరకు ఆదుకోగలవు. కానీ రాబోయే రోజుల్లో యుద్ధం తీవ్రమైతే.. పరిస్థితులు మరింత దిగజారతాయి. అప్పుడేంటి పరిస్థితి? అనేదే మేజర్ క్వశ్చన్. వాస్తవానికి.. దేశమంతా ఇప్పుడొక క్లిష్టమైన దశలో ఉంది. ధరల పెరుగుదల అనేది.. కేవలం అంకెలకు సంబంధించింది కాదు. సామాన్యుడి ఆకలికి, పొదుపునకు సంబంధించింది. ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేకపోయినా, రాబోయే పరిస్థితులకు తగ్గట్లుగా సిద్ధంగా ఉండటం మంచిదనే సూచనలు వినిపిస్తున్నాయ్.
ఏదేమైనా ప్రస్తుత పరిణామాలు, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను చూస్తే ఇప్పుడైతే ఆయిల్ కంపెనీలు నష్టాల నుంచి బయటపడాలంటే పెంపు తప్పని పరిస్థితి. అయితే ఇప్పుడే పెంచితే ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందనేది కేంద్రం ఆలోచన. అందుకే ఎన్నికలు ముగిసిన తర్వాత కానీ.. ఫలితాలు వెలువడిన తర్వాత కానీ ధరల పెరుగుదల దప్పదు. సో.. మేలో మన మోత మోగడం అనేది దాదాపుగా ఫిక్స్.
Also Read: రేవంత్ సీఎం అయ్యారంటే అది కేసీఆర్ పుణ్యమే.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Story by: Anup, Big Tv