Telangana Housing: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇళ్ల పోరు పీక్స్‌కి చేరింది. నాడు కేసీఆర్ చెప్పిన లగ్జరీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గొప్పవా? నేడు రేవంత్ సర్కార్ ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లు గొప్పవా?ఎవరి హయాంలో ఏం జరిగింది..? ఎవరు ఎన్ని కట్టించారు..? ఇవే లెక్కల చుట్టూ హైవోల్టేజ్ లో తెలంగాణ రాజకీయ యుద్ధమే నడుస్తోంది.
ఎవరేంటో తేల్చుకుందాం రా అంటూ మంత్రి పొంగులేటి సవాల్ చేస్తున్నారు.
అసలు ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. ఓఆర్ఆర్ ఇన్నర్ పరిధిలోని క్యూర్ ఏరియాలో తొలి విడత కింద లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం స్థలాల పరిశీలన చేశారు మంత్రి పొంగులేటి. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. ఈ ఇండ్లను లబ్ధిదారులపై ఒక్క పైసా భారం లేకుండా, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో నిర్మించి, ఆడబిడ్డల పేరిట ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని చెప్పారు. మే 27న సెక్రటేరియెట్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, ఎమ్మెల్యే రాజేందర్‌తో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. మెగా హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 12 రోజుల వ్యవధిలోనే 39 నుంచి 40 ప్రభుత్వ స్థలాలను అధికారులు గుర్తించారన్నారు.
రెండో విడతలో పట్టణ ప్రాంతాలకు మరో లక్ష ఇండ్లు ఇస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాట. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తొలి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, గిరిజన ప్రాంతాలకు 5 వేల ఇండ్లు కేటాయించారు. ఇప్పుడు రెండో విడత కింద మరో 2 వేల ఇండ్లు అదనంగా మంజూరు చేశారు. దీంతో ఒక్కో నియోజకవర్గానికి 5,500 నుంచి 7 వేల ఇండ్ల వరకు అందించినట్లయింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో హైదరాబాద్‌లో నిర్మించిన ఇండ్ల కంటే.. వచ్చే రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పాలనలో ఎక్కువ ఇళ్లు నిర్మించి చూపిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు.
Also read: ప్రేమ పేరుతో మోసం.. నగ్న వీడియోలతో యువకుడు బ్లాక్‌మెయిల్..!
ఈ సందర్భంగా గత కేసీఆర్ ప్రభుత్వ చర్యలపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు పొంగులేటి సవాల్ విసిరారు. హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ పదేళ్ల టైంలో నిర్మించిన ఇళ్లకంటే రానున్న రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికంగా ఇళ్లు కట్టివ్వకపోతే తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనని.. అదే కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే కేటీఆర్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు రెడీనా అంటూ పొంగులేటి సవాల్ చేశారు. ఇండ్ల పేరిట డ్రామాలు ఆడుతున్న బీఆర్ఎస్ నేతలు అసంబద్ధంగా మాట్లాడుతున్నారని, తాము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన గ్రామాల్లోనే ఓట్లు అడుగుతామని, గత ప్రభుత్వం కట్టిన ప్రాంతాల్లో ఓట్లు అడిగే దమ్ము వారికి ఉందా? సవాల్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరికో ఐదు, పది ఇండ్లు కూడా సరిగ్గా కట్టలేకపోయిందని, అప్పట్లో కట్టిన 46 వేల ఇండ్లలో 20 వేలకు పైగా ఇండ్లను అసంపూర్తిగా వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. కనీసం నిర్మించిన 16 వేల ఇండ్లలో కూడా మౌలిక వసతులు లేక పేదలు నివసించలేని స్థితి ఉందని, కొల్లూరులో ఇండ్లు ఉరుస్తున్నాయన్నారు. ఇప్పుడు ఆ సమస్యలన్నింటినీ తమ ప్రభుత్వం పరిష్కరించి రవాణా, రేషన్ సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. అలాగే అక్కడ నిరుపయోగంగా ఉన్న షాపులను బహిరంగ వేలంలో విక్రయించి, ఆ నిధులను ఆయా భవనాల నిర్వహణ కమిటీల ఖాతాల్లోనే జమ చేస్తామని చెప్పారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఆసిఫ్‌నగర్ మండలం జియాగూడ పోలీస్ క్వార్టర్స్, మంగార్ బస్తీ బాంబే కాలనీ, నాంపల్లి రెడ్ హిల్స్ ఖాళీ స్థలాలు, శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్, మలక్‌పేట్, కాలడేరా ఆర్ అండ్ బీ కాలనీ, గోల్కొండ మండలం ఫలక్‌నుమాలోని డబుల్ బెడ్రూం ఇండ్ల భవనాలు, డిగ్నిటీ కాలనీ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ తో కలిసి పొంగులేటి పరిశీలించారు.
మంత్రి పొంగులేటి సవాల్ పై మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తాము గృహనిర్మాణ యజ్ఞం చేసిన నిర్మాతలం అయితే.. కాంగ్రెస్ నేతలు గృహ మేధ యాగం చేస్తున్న విధ్వంసకులు అంటూ కేటీఆర్ విమర్శలు చేశారు. ఆత్మగౌరవ గృహాలు కట్టిన ఆత్మగౌరవ పార్టీ తమదే అన్న కేటీఆర్.. సవాళ్లు చేయడం, పారిపోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటని వ్యాఖ్యానించారు. తాము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని.. పేదల సొంతింటి కలను సాకారం చేశామని తెలిపారు. తమ హయాంలో డబ్బా ఇళ్లు కాదు.. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించామన్నారు కేటీఆర్. 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామని సవాల్ చేసిన మంత్రికి మాట నిలబెట్టుకొనే దమ్ముందా అంటూ క్వశ్చన్ చేశారు. శపథం చేయడం కాదని.. చేతనైతే చేసి చూపించాలని సవాల్ చేశారు. పౌరుషం ఉంటే 20 లక్షల గృహ ప్రవేశాలు చేయించాకే.. గుమ్మం తొక్కి ఓట్లు అడుగుతామన్న సవాల్ కు మంత్రి పొంగులేటి కట్టుబడి ఉండాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ మహానగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించిన ఘనత తమదని కేటీఆర్ అన్నారు. రూ.70 వేలతో అగ్గిపెట్టెలాంటి ఇళ్లు కట్టలేదన్న కేటీఆర్ తమ హయాంలో నిర్మించిన ఒక్కో ఇళ్లు ఏడు ఇందిరమ్మ ఇళ్లతో సమానమన్నారు. గత రెండు సంవత్సరాల్లో నగరంలో కట్టిన ఇళ్లు ఎన్ని.. కూల్చిన ఇళ్లు ఎన్ని.. అని ప్రశ్నించిన కేటీఆర్ ఆ వివరాలతో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. ఓవరాల్ గా చూస్తే పొంగులేటి సవాల్ కు కేటీఆర్ డైరెక్ట్ రెస్పాండ్ కాకుండా.. చాలెంజ్ కాదు.. చేతనైతే ఇండ్లు కట్టి చూపించు అంటూ సెటైర్లు వేసి సరిపెట్టారంటున్నారు.
Also Read: రైతు డిస్కం ఏర్పాటుపై ఉత్కంఠ.. సీఎం రేవంత్ వ్యూహం నెగ్గేనా..!
కేటీఆర్ ట్వీట్ పై మంత్రి పొంగులేటి మరోసారి ట్వీట్ ద్వారా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇళ్లు కడితేనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పానని, కాంగ్రెస్ ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారా అన్న సవాల్ ను కేటీఆర్ కు స్వీకరించే ధైర్యం ఉందా.. లేదా? అని పొంగులేటి క్వశ్చన్ చేశారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల విషయమై మాట్లాడే ధైర్యం లేకపోగా.. హైదరాబాద్‌లోని ఇండ్ల అంశంపై సవాల్ చేస్తే స్వీకరించకుండా ఏదేదో మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో బీజేపీ నేతల ముందు మోకరిల్లారని, కేసుల మాఫీ కోసం కాషాయ నేతల కాళ్లు పట్టుకున్నారని కౌంటర్ ఇచ్చారు. ధరణి దందాలు, బినామీ బాగోతాలు, రియల్ ఎస్టేట్ అక్రమాలు చేశారని, 2014కు ముందు మీ ఆర్థిక పరిస్థితి… పదేళ్లలో ఎంత దోచుకున్నారో అందరికీ తెలుసన్నారు. గ్రామాల్లో గత పదేళ్లలో కట్టిన ఇళ్ల కన్నా మూడు రెట్ల ఎక్కువ ఇండ్లు కాంగ్రెస్ రెండేళ్లలో కట్టిందంటూ కౌంటర్ ట్వీట్ చేశారు.
లెక్కల ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు తొమ్మిదేళ్లలో 2.92 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసి, 1.54 లక్షలు పూర్తి చేసింది. సుమారు 96 వేల ఇళ్లు అసంపూర్తిగా ఉండిపోయాయి. కొన్ని మొదలు కాలేవు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసి, దాదాపు 1.12 లక్షలు పూర్తి దశలో ఉన్నాయని చెబుతోంది. జూన్ 1 నుంచి మరో 2.5 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టనుంది. అటు హైదరాబాద్ లో బీఆర్ఎస్ హయాంలో లక్ష ఇండ్లు మంజూరు చేస్తే, 69 వేల ఇండ్లు పూర్తయ్యాయి. అటు కాంగ్రెస్ హయాంలో క్యూర్ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఇదీ ప్రస్తుత మ్యాటర్. ఇక డబుల్ బెడ్రూం ఇండ్లు, తాజా ఇందిరమ్మ ఇండ్ల మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయ్. ఆ తేడా కూడా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ నమూనాలో ప్రభుత్వమే కాంట్రాక్టర్ల ద్వారా ఇళ్లు కట్టగా, ఇందిరమ్మ పథకంలో లబ్ధిదారు ఖాతాలోకి నేరుగా ఐదు లక్షల రూపాయలు జమ చేసి, సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఇస్తున్నారు. అయితే ఈ మొత్తం నిర్మాణ ఖర్చుకు సరిపోవడం లేదన్న విమర్శ కూడా ఉంది.
తాజాగా ఇందిరమ్మ ఇండ్లు వర్సెస్ డబుల్ బెడ్రూం ఇండ్ల వ్యవహారం తెరపైకి రావడంతో గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది అన్న విషయాలపై చర్చ జరుగుతోంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గతంలో కెసిఆర్ దత్తత తీసుకున్నారు. 2015 ఆగస్ట్ లో సీఎం హోదాలో చిన్న ముల్కనూర్ లో పర్యటించి గ్రామాన్ని దత్తత తీసుకుని పాత ఇండ్లు కూల్చివేసి కొత్త ఇండ్లు కట్టిస్తామని మాట ఇచ్చారు. మొత్తం 499 ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. దీంతో 456 మంది నాడు ఇండ్లు కూలగొట్టుకున్నారు. అందులో కేవలం 247 ఇండ్లు మాత్రమే కట్టించారంటున్నారు. గ్రామంలోని ఎస్సీ ,ఎస్టీలు ఎక్కువగా ఇల్లు కూలగొట్టుకోగా వారికి ఇండ్లు మంజూరు కాలేదంటున్నారు. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గ్రామాన్ని సందర్శించి ఇండ్లు పూర్తికాని వారికి సహాయం చేస్తానని హామీ ఇచ్చి కేవలం కొంతమందికి మాత్రమే ఐరన్, సిమెంట్ బస్తాలు ఇప్పించి చేతులు దులుపుకున్నారని, మాజీఎమ్మెల్యే కూడా పూర్తి హామీని నెరవేర్చలేకపోయాడన్నారు. ఇంకా ఈ గ్రామంలో కొందరి ఇండ్లు పునాది లెవల్ లోనే ఉన్నాయంటున్నారు.
Also read: విద్యార్ధులకు అలర్ట్.. గురుకులాల టైం టేబుల్‌లో మార్పులు
కేసీఆర్ హయాంలో మరో ఎగ్జాంపుల్ కూడా బయటకు వస్తోంది. కెసిఆర్ సీఎం గా ఉన్నపుడు వాసాల మర్రిని దత్తత తీసుకున్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తా అని రోడ్ వెడల్పు చేపట్టిన తర్వాత ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా మంజూరు చేయలేదని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక mla విప్ బీర్ల అయిలయ్య ప్రత్యేక శ్రద్ధ చూపి వాసాలమర్రిలో ప్రత్యేకంగా 145 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సాంక్షన్ చేయించి హౌసింగ్ మంత్రి పొంగులేటి చేతుల మీదుగా పట్టాలు ఇప్పించారు. ఇప్పటి వరకు 100 మంది గృహ ప్రవేశాలు చేశారని, మిగతా ఇళ్లలో 80% పనులు పూర్తయ్యాయంటున్నారు. సో ఇండ్ల విషయంలో తమ చిత్తశుద్ధి ఇది అని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటోంది.
కొన్ని చోట్ల నిధులు అందకపోవడంతో డబుల్ బెడ్రూం ఇండ్ల కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఇంకొన్ని చోట్ల నాసిరకం పనులతో మమ అనిపించారు కాంట్రాక్టర్లు. 2020లో అయితే హైదరాబాద్ పరిధిలో డబుల్ ఇండ్ల విషయంలో అసెంబ్లీలో భట్టి, తలసాని సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్నారు. అసలు GHMCలో లక్ష డబుల్ బెడ్రూంలు ఎక్కడ ఉన్నాయో చూపించాలని భట్టి నాటి ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. దీంతో అప్పటి మంత్రి తలసాని.. ఏకంగా భట్టి ఇంటికి వెళ్లి ఇద్దరూ కలిసి డబుల్ ఇండ్లు చూసి వచ్చారు. 150 డివిజన్ల పరిధిలో చూపమంటే… సిటీ దాటి చూపించడం ఏంటని అప్పట్లోనే భట్టి విక్రమార్క విమర్శించారు. సిటీలో ఇండ్లు కోరుకున్న వారికి సిటీ దాటి కట్టడం అంటే వారి జీవనోపాధికి మళ్లీ సమస్యలు ఎదురయ్యాయ్. సో ఈ మ్యాటర్ అటు తిరిగి ఇటు తిరిగి బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందన్న విషయాల దాకా వెళ్తోంది.
Also read: బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్దం.. తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!