AP Politics: గతంలో పార్టీకి సంబంధించి, జగన్‌కి సంబంధించి ఏ ఫీలింగ్స్ ఉన్నా లోపలే దాచుకున్న వైసీపీ నేతలు ఇటీవల బయట పెట్టేస్తున్నారు. ఏదైనా ఉంటే బయటకు చెబితేనే కదా తెలిసేది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఓ అడుగు ముందు కేసిన సీనియర్ మోస్ట్ పార్టీ లీడర్ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఏకంగా గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే బాగుండేదని మాట్లాడటం పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది. ఆ నేత కేవలం ఆయన ఇన్నర్ ఫీలింగ్సే చెప్పారా? లేకపోతే జగన్ మనసులోని మాటపై హింట్ ఇచ్చారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.. అసలు వైసీపీ సీనియర్లు ఒకరొక్కరుగా వాయిస్ వినిపిస్తుండటం వెనుక వ్యూహం ఉందా?
వైసీపీలో కేసులు, జైళ్లు, బెయిళ్ల హడావుడి
సరిగ్గా ఏడాదికి ముందు 151 సీట్లతో ఏపీలో తిరుగు లేని ఆధిపత్యం చెలాయించిన వైసీపీకి సీన్ రివర్స్ అయ్యింది. గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పడిపోయింది. వైసీపీ కీలక నేతలపై వరుసగా ఊపిరి సలపని విధంగా కేసులు, జైళ్లు, బెయిళ్లు ప్రస్తుతం ఆ హాడావుడే కనిపిస్తోంది పార్టీలో, జగన్ సీఎంగా ఉన్న సమయంలో అన్నీ తామై నడిపిన అధికారులు, లీడర్లు ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్నారు. అసలాయన టార్గెట్‌గా పావులు కదులుతున్నాయన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ నేపధ్యంలో వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారాయి. గత ఎన్నికల్లో తాము బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవటమే పెద్ద తప్పంటున్నారు నల్లపురెడ్డి.
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలని సూచన
బీజేపీతో పొత్తుపై నల్లపురెడ్డి యాధృచ్చికంగా మాట్లాడారా.. తన మనసులో మాటను చెప్పారా?.. లేక బీజేపీకి ఏధైనా హింట్ ఇవ్వాలనుకున్నారా? అన్న అంశాలు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అవకాశం లభిస్తే బీజేపీతో కలిసి వెళ్లాలని తాను కోరుకుంటున్నానని.. ఇదే విషయాన్ని తమ పార్టీ అధినేత జగన్ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పటం మరింత ఆసక్తికరంగా మారింది..
ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వైసీపీ
నల్లపురెడ్డిలాంటి కీలక నేత సమయం.. సందర్బం లేకుండా పొత్తు ప్రస్తావన తీసుకురావటం.. గత ఐదేళ్లలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు పార్లమెంట్ ఉభయసభల్లో వైసీపీ బేషరతుగా మద్దతు ఇచ్చిన విషయాలను సడెన్ గా గుర్తు చేయటం వెనుక ఏవైనా లెక్కలున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై మోడీ, అమిత్ షాలకు నమ్మకం లేదని చెప్పటం, గతంలో మోడీపై చంద్రబాబు ఘాటు పదజాలంతో చేసిన విమర్శలు గుర్తు చేయటం, అమిత్ షాపై ఏకంగా రాళ్లు, చెప్పులు వేయించారని నల్లపురెడ్డి ఆరోపణలు సంధించటం.. ప్రస్తుతం వైసీపీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్లో గట్టి చర్చకు దారితీస్తోంది.
Also Read: తిరుమలలో డ్రైవర్ నమాజ్.. విచారణలో తేలింది ఇదే!!
కర్ణుడి చావుకి వంద కారణాలంటున్న బొత్స
ఇటీవలే వైసీపీ ఓటమిపై విశ్లేషించిన ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గత ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిపై మాట్లాడారు. కర్ణుడి చావుకు వంద కారణాలు ఉన్నట్టుగా… వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు బొత్స. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా జగన్ చూశారని, చంద్రబాబు తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శలు చేశారు. ఆ క్రమంలోనే కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చల్లో భాగమవుతున్నాయి. జగన్ అతి మంచితనం వల్లనే పార్టీ ఓటమి పాలు అయిందని రాచమల్లు వ్యాఖ్యానించారు.
జనంలో కొత్త సెంటిమెంట్ రగల్చడానికి వ్యూహమా?
ఇప్పటి వరకూ తమకు ఏ ఫీలింగ్స్ ఉన్నా.. జగనే వైసీపీకి అల్టిమేట్ అనే విధంగా సైలెంట్‌గా ఉంటూ వచ్చారు ఆ పార్టీ నేతలు. ఇప్పడిప్పుడే తమ ఫీలింగ్స్ బయట పెడుతున్నారు. ఏది ఏమైనా తమ పార్టీ అధినేత నిర్ణయమే శిరోధార్యం అన్నట్లు వారు మాట్లాడటం కూటమిపై వైసీపీ స్ట్రాటజీలు మారుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు. జగన్ మంచితనం, కొత్త పొత్తుల గురించి వారు మాట్లాడుతుండటం జనంలో కొత్త సెంటిమెంట్ రగల్చడానికి ఆ పార్టీ పెద్దలు పన్నుతున్న వ్యూహమే అంటున్నారు. మరి సీనియర్ నేతల కామెంట్స్‌పై జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో? అసలు వైసీపీ లెక్కలేంటో చూడాలి.