AP Politics: ఓ పొలిటిషయన్ ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండాలంటే జనాల్లో ఉండాలి. అప్పుడే అతడిని జనం మర్చిపోరు. పాత తప్పులు సరి చేసుకోవాలన్నా.. తన ఆలోచన ఈ విధంగా ఉందని చెప్పాలన్న.. మాటల కన్నా చేతలే ముఖ్యం. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. జగన్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్‌గా జనాల్లోకి వచ్చేందుకు ట్రై చేస్తున్నారు. కానీ ప్రతి ప్రయత్నంపై అనేక విమర్శలు.. అంతకంటే ఎక్కువ వివాదాలు. మరి ఇలాంటి జగన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంతకీ ఈ వివాదాలను జగన్ ఏ కోణంలో చూస్తున్నారు?
జగన్ ఏం చేశారు? ఎలా చేశారు?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గేర్ మార్చారు. మంచో, చెడో నిత్యం ప్రజల్లోకి వెళుతున్నారు.. ప్రజల నోళ్లల్లో నానుతున్నారు. వైసీపీ పెద్దలు,కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాదు.. ఇప్పుడు విపక్షాలు, విపక్ష పార్టీల కార్యకర్తలు కూడా ఇప్పుడు జగన్ నామ స్మరణ చేస్తున్నారు. జగన్ ఏం చేశారు? ఎలా చేశారు? మంచి చేశారా? చెడు చేశారా? అనేది పక్కన పెడితే తాను ఏం చేసినా.. చేయాలనుకున్నా.. అదో సెన్సేషన్‌గా మారుతుంది. వివాదస్పదమవుతోంది.. ఓ పెద్ద చర్చకు కారణమవుతోంది.
తాడెపల్లి ప్యాలెస్.. లేదంటే బెంగళూరు ప్యాలెస్ అంటూ విమర్శలు
ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత జగన్ చాలా రోజుల పాటు ప్రజల్లోకి రాలేదు. ఆయన ఇంటికే పరిమితమయ్యారు. నిజానికి అయితే తాడేపల్లి ప్యాలెస్.. లేదంటే బెంగళూరు ప్యాలెస్.. అంతకుమించి ఇంకేం లేదు అన్నట్టుగా జగన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు జగన్ రూట్ మార్చినట్టు కనిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అవి ఎంత వివాదస్పదమవుతున్నా.. పట్టించుకోవడం లేదు. నా దారి రహదారి అన్నట్టుగా దూసుకుపోతున్నారు.
తెనాలిలో భారీగా జనాలు రావడంతో ట్రాఫిక్ జాం, ఇబ్బందులు
రీసెంట్‌గా జగన్ మూడు పర్యటనలు చేశారు. అవి మూడు చాలా వివాదస్పదమవయ్యాయి. ప్రజా సమస్యలపై స్పందించడానికి నాయకుడిగా ప్రజల మధ్యకి వెళ్లడమే లక్ష్యమని ఆయన చెబుతున్నా… ఆయన్ను టార్గెట్ చేస్తూ రాజకీయ విమర్శలు ఎగసిపడుతున్నాయి. రాప్తాడు ప్రాంతంలో హెలికాప్టర్ దిగిన సమయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. తెనాలిలో భారీగా జనాలు రావడంతో ట్రాఫిక్ జాం, ఇబ్బందులు తలెత్తాయి. పొదిలి పర్యటనలో మరింత వేడి పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ పోలీసులపై, మహిళలపై దాడులు జరిగాయనే ఆరోపణలతో కేసులు నమోదు అయ్యాయి. ఇక రెంటపాళ్లలో జరిగిన సంఘటన అయితే మరింతగా హాట్ టాపిక్ అయ్యింది. ఏకంగా జగన్ కారు కిందే పడి ఓ వృద్ధుడు మరణించడంతో ఇప్పుడు ఏకంగా జగన్‌పైనే కేసు నమోదైంది. ఇవి చాలవన్నట్టు.. వైసీపీ ప్రముఖ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. అయితే జైళ్లో లేదంటే అజ్ఞాతంలో.. లేదంటే బెయిల్‌పై.. ప్రస్తుతం వైసీపీ కీలక నేతలంతా వీటిపైనే ఉన్నారంటే నమ్మక తప్పని పరిస్థితి.
అణచివేత, విమర్శలు, కేసులు కామనే అంటున్న జగన్
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనపడటం లేదు. తాము అధికారంలో లేము కాబట్టి అణచివేత, విమర్శలు, కేసులు కామనే అంటూ ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం మంచో, చెడో ప్రతి వారం లేదా పది రోజులకు ఒకసారి పర్యటన చేస్తూ ప్రజల్లో ఉండాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రజల్లో ఉన్న నిరుత్సాహాన్ని జగన్ ప్రత్యక్షంగా చూసి, స్పందించి మద్దతు తెచ్చుకోవాలన్నదే జగన్ లక్ష్యంలా కనిపిస్తోంది. ఇక ప్రభుత్వ పెద్దలు మాత్రం జగన్ పర్యటన ముగియగానే.. కావాలనే ఘర్షణలకు దారితీస్తున్నాయంటూ ఆరోపణలు చేస్తోంది. నిజానికి దీనిని కూడా తన పొలిటికల్ మైలేజ్‌గా మార్చుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే అది ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది కాలమే సమాధానం చెబుతోంతి.
రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో పేరుతో కార్యక్రమం
జగన్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ సమావేశంలో సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతోపాటు, రీజినల్ కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అంతేకాదు రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో.. పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఐదు వారాలపాటు కార్యక్రమాన్ని కొనసాగించాలని.. చంద్రబాబు మోసాలన్నీ క్యూఆర్ కోడ్ రూపంలో ఇంటింటికీ చేర్చాలని నిర్ణయించారు.
ప్రతి కుటుంబానికి ఎంత నష్టం జరిగింది?
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జగన్ బలంగా నమ్ముతున్నారు… ప్రజలకు మంచి చేయకపోగా ఇంకా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందంటున్నారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలను ఆదేశించారు జగన్. దీని కోసం ఓ కొత్త తరహా కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేశారు. హామీలు అమలు చేయకపోవడం వల్ల ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి ఎంత నష్టం జరిగింది? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి.. ఇంకా ఎంత నష్టం జరుగుతోంది? అనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు కలిగేవో జనానికి వివరించాలంటున్నారు. దీని కోసం ఓ క్యూఆర్ కోడ్ విధానాన్ని కూడా డిసైన్ చేశారు. దానిని స్కాన్ చేస్తే చాలు.. ఏ గ్రామానికి ఎంత నష్టం జరిగింది అనే వివరాలు తెలిసేలా ప్లాన్ చేస్తున్నారు.
Also Read: ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎవరంటే?
వారానికి నాలుగు రోజులు నియోజకవర్గాల్లోనే నేతలు
అంతేకాదు నియోజకవర్గ ఇన్ఛార్జులు వారానికి నాలుగు రోజులు నియోజకవర్గాల్లోనే ఉండాలని పార్టీ నేతలను ఆదేశిస్తున్నారు జగన్. ప్రజలకు అందుబాటులో ఉంటేనే వారికి మనపై నమ్మకం పెరుగుతుందని.. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకమంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి.. వారి సమస్యలపై పోరాడాలి… అప్పుడే మనం సత్తా చూపగలమంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తానికి తాను జనాల్లోనే ఉంటాను.. మీరు కూడా జనాల్లోనే ఉండాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారు జగన్. ఇదంతా చూస్తుంటే జగన్ ఇప్పటి నుంచే ప్రభుత్వంపై పోరాటానికి ప్రణాళికలు రచిస్తున్నారని క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. మరి ఈ ప్రణాళికలను, పోరాటాలను ప్రజలు ఎంత మాత్రం నమ్ముతారు? ఎంతలా ఆదరిస్తారు? అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం.
Story By Vamshi Krishna, Bigtv