పార్టీ పెట్టిన పదేళ్లకు పవర్.., 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్, ఏపీలో నెంబర్ 2 పొజిషన్.., జనసేనకు ప్రజామద్దతు వెల్లువైంది. గతేడాది ఆ పార్టీ చరిత్రలో ఒక మైల్ స్టోన్. ప్రెజెంట్ అధికార కూటమిలో కీలక పార్టీ. జనసేన అధినేతే ఏపీ డిప్యూటీ సీఎం. సో ఒక లక్ష్యం పూర్తయింది. మరి జనసేనాని తర్వాతి లక్ష్యం ఏంటి? పార్టీ పెట్టినప్పుడు అజెండా ఏంటి? ఇప్పుడు మారిన అజెండా ఏంటి? సనాతనం, హిందూధర్మం చుట్టూనే భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోందా?
దేశం, ధర్మం, సనాతనం, అందరూ ఒక్కటే ఇదే తత్వం..
రాజకీయాల్లో అధికారమే అంతిమ లక్ష్యం కారాదు అని యూనిక్ స్టేట్ మెంట్ ఇచ్చిన పవర్ ఫుల్ లీడర్ పవన్ కల్యాణ్. నిజానికి ఎవరు పార్టీ పెట్టినా అందరూ ఫైనల్ గా ఎదురు చూసేది అధికారం కోసమే. చేతిలో పవర్ ఉంటేనే పొజిషన్ పెరుగుతుంది. ప్రోటోకాల్ ఉంటుంది. కానీ దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న వారే తన వెంటనడవాలని ఎప్పుడో పిలుపునిచ్చారు. కులాల లెక్కలు వద్దంటారు. అందరూ ఒకటే అని, ఒక్కటిగా ఉందామంటారు. ఇతర మతాలను గౌరవిద్దాం, మన మతాన్ని ప్రేమిద్దామంటారు. మైండ్ లో మంచి మంచి లక్ష్యాలున్నాయి. ఆలోచనలు ఉన్నాయి. మరి ఇప్పటి రాజకీయాల్లో వీటితో భవిష్యత్ ఉందా?
జనసేనను ఒక లెవెల్ నుంచి మరో లెవెల్ కు తీసుకెళ్లారు పవన్ కల్యాణ్. పార్టీ పెట్టిన పదేళ్లకు అధికార పగ్గాలు చేజిక్కించుకున్నారు. 21 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలిపితే.. 21 చోట్లా గెలిచారు. హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్. రాజకీయాల్లో ఇది చాలా అరుదుగా కనిపించే సన్నివేశం. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ రూటు ఎక్కడి నుంచి ఎలా మొదలై, ఎలా టర్నవుట్ తీసుకుందో చూద్దాం.
మార్చి 14, 2014.. జనసేన ఆవిర్భవించిన రోజు ఇది
ఇప్పుడు 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయకేతన సభ పేరుతో నిర్వహించుకుంటోంది ఆ పార్టీ. దశాబ్దకాలంలో ఎన్నో ఆటుపోట్లు. రాజకీయ క్షేత్రంలో కొత్త మార్క్ చూపించాలన్న తాపత్రయం చుట్టూ కథ మార్చేశారు జనసేనాని. అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విధంగా విజయం సాధించిన జనసేన.. పిఠాపురం సమీపంలోని చిత్రాడ దగ్గరే విజయకేతనం సభ నిర్వహించబోతోంది. చాలా ఆటుపోట్ల తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్ర రాజకీయ దశ, దిశను ప్రభావితం చేసే అవకాశం ఇచ్చిన పిఠాపురంలోనే సభను నిర్వహిస్తున్నారు.
జనసేనకు ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లా రాజకీయంగా సెంటి మెంట్‌గా మారడంతో అక్కడే విజయకేతన సభ నిర్వహిస్తున్నారు. సభకు మూడు ప్రవేశ ద్వారా లు ఏర్పాటుచేయగా, వాటికి పిఠాపురం రాజా శ్రీరాజా సూర్యారావు బహుదూర్, విద్యాదాత మల్లాడి సత్యలింగం నాయకర్, అపర అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ పేర్లు పెట్టడం ద్వారా ఉమ్మడి జిల్లాకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా చూసుకున్నారు. తొలిసారి అధికారంలోకి రావడంతో సాకారమైన కలను అచ్చొచ్చిన గోదావరి జిల్లా నుంచే పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడే సభ ప్రాంగణాన్ని ఎంపిక చేశారు.
ఎన్నో అగ్నిపరీక్షలను దాటుకుని..
పోరాటమే ఊపిరిగా మొదలైన పుట్టిన జనసేన కాల పరీక్షకు తట్టుకుని నిలబడింది. నిధులు, విధులు, క్యాడర్, లీడర్ షిప్ ఇలా రకరకాల సమస్యలు ఎదురైనా ఓవర్ కమ్ సాధించింది. ఇక వైసీపీ అధికారంలో ఉన్న టైంలో జనసేన మరింత రాటుదేలింది. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ పోరుబాట సాగించింది. 2019 డిసెంబర్ లో కాకినాడ కేంద్రంగా రైతు సౌభాగ్య దీక్షతో నాటి ప్రభుత్వాన్ని కదిలించారు పవన్ కల్యాణ్. గుంతల రోడ్లతో జనం పడుతున్న నరకయాతన చూసి 2021 అక్టోబరులో రాజమహేంద్రవరంలో పవన్ పర్యటించారు. స్వయంగా రోడ్లపై గుంతలు పూడ్చారు. 2022లో కౌలురైతు భరోసా యాత్ర పేరుతో మండపేటలో అన్నదాతల కుటుంబాలకు సొంతంగా చెక్‌లు పంపిణీ చేశారు. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే.
చేతిలో రూపాయి లేనప్పుడు కూడా..
పార్టీ నడపడానికి నిధుల కొరత రావొద్దన్న ఉద్దేశంతో మధ్యమధ్యలో కొన్ని సినిమాలు చేశారు. చేతిలో రూపాయి లేనప్పుడు వకీల్ సాబ్ సినిమా ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ జనసేన పార్టీకి ఇంధనంలా పని చేసిందని స్వయంగా చెప్పుకున్నారు పవన్. జనసేనకు అధికారం ముఖ్యం కాదని జనం సమస్యలు పరిష్కారమే కీలకమని జనసేనాని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మరిప్పుడు అధికారం చేతిలో ఉంది. ప్రజాసమస్యల పరిష్కారంలో కూటమిలో కీలక పార్టీగా, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రిపరేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం పార్టీ లైన్ అంతా హిందుత్వ అజెండాలోకి తీసుకెళ్లారు. సనాతన ధర్మమే కీలకం అంటున్నారు. గౌరవిద్దామని చెబుతున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు అవసరమైతే ఎంత వరకైనా పోరాటమంటున్నారు. జనం సమస్యల నుంచి సనాతన ధర్మ పరిరక్షణదాకా జనసేన ప్రస్తానంలో చాలా మార్పులే వచ్చాయి. మరి ఆవిర్భావ దినోత్సవం తర్వాత స్పెషల్ అజెండా ఉండబోతోందా?
క్యాడర్.. లీడర్స్ లేకున్నా…
క్యాడర్ ఉన్నా లేకపోయినా.. లీడర్స్ ఉన్నా లేకపోయినా జనసేనను అన్నీ తానై నడిపించారు పవన్ కల్యాణ్. 2014 ఎన్నికల ముందే జనసేన ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్.. చంద్రబాబు సీఎం కావడంలో కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో బరిలో దిగారు. దీంతో త్రిముఖపోరులో వైసీపీ లాభపడింది. ఈ పరిస్థితి గమనించిన పవన్.. 2024లో మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలో దింపడంలో కీ రోల్ పోషించారు. అటు టీడీపీ, ఇటు బీజేపీతో మాట్లాడి అందరినీ ఒప్పించి ఒక్కటిగా బరిలోకి దిగి హిట్ కొట్టించారు.
2008 నుంచే మొదలైన రాజకీయ ప్రస్థానం
జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం 2014 మార్చి 14న ప్రారంభమైంది. కానీ అంతకు ఐదేళ్ల ముందే పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2008 ఆగస్ట్ 26న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తే.. అందులో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేశారు పవన్. అయితే ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అవడం, ఆ తర్వాతి పరిణామాలతో సైలెంట్ అయ్యారు. వస్తే బలంగానే రావాలనుకున్నారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమయ్యాక 2014, మార్చి 14న జనసేనను స్థాపించారు. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఓపికగా పని చేశారు. సినిమాల్లో పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేనానిగా తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్నారు.
వ్యక్తిగత విమర్శలను తట్టుకుంటూ..
రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలుంటాయ్. వాటినీ తట్టుకున్నారు. పవన్ ఎదుర్కొన్నవి రాజకీయ విమర్శలే కాదు.. వ్యక్తిగత కుటుంబ విమర్శలనూ పంటి బిగువన ఓర్చుకున్నారు. పవన్ కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా తన హద్దు దాటకుండా ప్రవర్తించారు. ప్యాకేజీ స్టార్ అన్నారు. ప్రీ పెయిడ్ పార్టీ అని విమర్శలు ఎదుర్కొన్నారు. అవన్నిటినీ మొన్నటి ఎన్నికల్లో ఘన విజయంతో పటాపంచలు చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితుల తరపున పోరాటం, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల తరపున గళం విప్పడం, ఒక దశలో హోదా కోసం కొట్లాడడం ఇవన్నీ జరిగాయి. తుదిశ్వాస విడిచే వరకు పార్టీని నడపుతానంటూ శపథం పట్టారు.
1తో మొదలు.. ఇప్పుడు 100 శాతం స్ట్రైక్ రేట్
2014లో పార్టీని పెట్టినప్పటికీ 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి, కేవలం ఒక సీటును మాత్రమే గెల్చుకున్న జనసేన పార్టీ 2024లో పోటీచేసిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ఉండదని, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారంటూ ఎంతోమంది ఎన్నో విమర్శలు చేస్తే వాటిని సవాల్ గా తీసుకున్నారు. చివరికి వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా వెనక్కు తగ్గలేదు. వారాహి యాత్రతో ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనంటూ బీజేపీ, టీడీపీని కలిపారు. సక్సెస్ సాధించారు.
పొలిటికల్ పవర్ సెంటర్‌గా జనసేన..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన ఓ రాజకీయ పార్టీ మాత్రమే. ఫలితాలు వచ్చాక మాత్రం పొలిటికల్ పవర్ సెంటర్ గా మారిపోయింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడుతూనే.. అందుబాటులో ఉన్న వనరులతో ఏం చేయొచ్చో వాటన్నిటినీ పట్టాలెక్కిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తూ ప్రజాధనం వృధా అరికడుతూ ఒక్కో పని చేస్తూ వెళ్తున్నారు. పవర్ చేపట్టిన పవన్ జనానికి ఇచ్చిన హామీలపై వర్కవుట్ చేస్తున్నారు. మనసులో ఏది ఉంటే అదే బయటకు మాట్లాడే తత్వం పవన్ కల్యాణ్ ది. సాధారణంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా మత విశ్వాసాల విషయంలో కాస్త ఆచితూచిగా ఉంటాయి. తమది సెక్యులర్ పార్టీ అని అన్ని మతాలను సమానంగా చూస్తామంటుంటారు.
Also Read: నాగబాబు మనసులో మాట.. చంద్రబాబు, పవన్‌కు కృతజ్ఞతలు
అయితే పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, తమ పార్టీ సనాతన ధర్మ పరిరక్షణకు కృషిచేస్తుందని బహిరంగంగా ప్రకటించడంతో పాటు తిరుపతిలో ఓ సభ ఏర్పాటుచేసి డిక్లరేషన్ కూడా ప్రకటించారు. దీంతో ఏపీలో సనాతన ధర్మ పరిరక్షణ బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్ గుర్తింపు పొందారు. ఇతర మతాలను గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవల్సిన అవసరం ఉందంటూ ధైర్యంగా చెప్పారు. దీంతో జనసేన పార్టీ ప్రస్థానంలో మరో స్టాండ్ తీసుకున్నట్లయింది. దీంతో పాటే ఇచ్చిన హామీలు నెరవేర్చడం, జనం ఆశీర్వాదాన్ని కంటిన్యూ చేసుకోవడం జనసేనకు, పవన్ కు కీలకంగా మారాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. అయితే విజయాన్నే కేరాఫ్ గా చేసుకోవాలంటే ఇంకా చాలా శ్రమించాలి. ఆ దారి తనకు తెలుసు అని జనసేనాని అంటున్నారు. అంతిమంగా తీర్పు ఇచ్చేది మాత్రం జనమే.
జనసేనాని అసలు వర్క్ పాలనా పగ్గాలు చేపట్టిన ఈ సమయంలోనే మొదలైంది. ఇన్నాళ్లూ ప్రతిపక్షంగా ప్రశ్నించారు. ఇప్పుడు అధికార పక్షంగా ప్రజా సమస్యలను తీర్చే పెద్ద బాధ్యత ఉంది. ఈ స్ట్రైక్ రేట్ ను నిలుపుకోవాలంటే చేయాల్సిందెంతో ఉంది.