Indian Railway Food: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన వసతులు కల్పించడంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నది. అందులో భాగంగానే ఇకపై రైళ్లలో అందించి అన్ని రకాల ఆహార పదార్థాలకు సంబంధించి మెనూ, ధరల జాబితా IRCTC వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబోతోంది. అన్ని వివరాలతో కూడిన ప్రింటెడ్ మెనూ కార్డులు వెయిటర్ల దగ్గర అందుబాటులో ఉంచబడతాయని తెలిపింది.
ప్రయాణీకులకు తెలిసేలా..
రైళ్లలో ప్రయాణీకులకు అందించే ఆహార పదార్థాల మెనూ, ధరల జాబితాను ప్రదర్శించడం తప్పనిసరి చేస్తున్నట్లు తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో వెల్లడించారు. “ప్రయాణికుల సమాచారం కోసం అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ మెను, రేట్స్ లిస్ట్ IRCTC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అన్ని వివరాలతో కూడిన ప్రింటెడ్ మెనూ కార్డులు వెయిటర్ల వద్ద అందుబాటులో ఉంచబడతాయి. ప్రయాణీకుల ఆర్డర్ల మేరకు అందించబడుతాయి” అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అటు రైళ్లలో అందించే ఫుడ్ ఐటెమ్స్ రేట్ల జాబితాను ప్యాంట్రీ కార్లలో కూడా ప్రదర్శించనున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారతీయ రైల్వేకు సంబంధించిన క్యాటరింగ్ సేవల మెను, టారిఫ్ గురించి ప్రయాణీకులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. మెను, టారిఫ్ లింక్ తో ప్రయాణీకులకు SMS చేయడం ప్రారంభించబడిందన్నారు.
రైళ్లలో ఆహార నాణ్యత పరిశీలకులు
ఇక రైళ్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యతను మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన ప్రశ్నకు మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం చెప్పారు. రైళ్లలో ప్రయాణీకులకు నాణ్యమైన, రుచికరమైన ఫుడ్ అందించేందుకు ఆధునిక బేస్ కిచెన్‌లను ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఆహార తయారీని పర్యవేక్షించడానికి బేస్ కిచెన్లలో CCTV కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రైల్వే ప్రయాణీకులకు అందించే ఆహారం కోసం ప్రసిద్ధ, బ్రాండెడ్ ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఆహార భద్రత, పరిశుభ్రమైన పద్ధతులను పర్యవేక్షించడానికి బేస్ కిచెన్‌లలో ఆహార భద్రతా పర్యవేక్షకులను నియమించినట్లు ఆయన తెలిపారు. రైళ్లలో ఆన్ బోర్డ్ IRCTC సూపర్‌వైజర్‌లను కూడా నియమించినట్లు వివరించారు. ఫుడ్ ప్యాకెట్లపై QR కోడ్‌లను ముద్రిస్తున్నట్లు వెల్లడించారు. వంటగది పేరు, ప్యాకేజింగ్ తేదీ మొదలైన వివరాలను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
Read Also: ప్లాట్‌ఫామ్ టికెట్ల అమ్మకాలు రద్దు, హోలీ నేపథ్యంలో ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!
బేస్ కిచెన్లలో రోజూ డీప్ క్లీనింగ్
బేస్ కిచెన్లు, ప్యాంట్రీ కార్లలో క్రమం తప్పకుండా డీప్ క్లీనింగ్ చేపడుతున్నట్లు ఆశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రతి క్యాటరింగ్ యూనిట్ లో నియమించబడిన ఆహార భద్రతా అధికారులు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సర్టిఫికేషన్ ప్రకారం ఆహారం పదార్థాలు ఉన్నాయో? లేదో? అని పరిశీలిస్తారు. ఇందుకు సంబంధించిన క్రమం తప్పకుండా ఫుడ్ శాంపిల్స్ తీసుకుంటున్నట్లు చెప్పారు. పాంట్రీ కార్లు, బేస్ కిచెన్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యతను పరిశీలించడానికి థర్డ్ పార్టీ ఆడిట్ జరుగుతుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Read Also: రైలు ప్రయాణంలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కోటా, రైల్వే మంత్రి కీలక ప్రకటన!