Janatha Garage Special Story : యుద్ధాలకు చెక్కుచెదరని రామప్ప దేవాలయం.. చరిత్ర ఇదే..!

Janatha Garage Special Story : యుద్ధాలకు చెక్కుచెదరని రామప్ప దేవాలయం.. చరిత్ర ఇదే..!

Ramappa Temple
Share this post with your friends

 Ramappa Temple

Janatha Garage Special Story : సంగీతాన్ని వినిపించే శిల్పాలు..నాట్యమాడుతున్నాయాఅనే మధనికలు .. ఇసుక పునాదులు ..నక్షత్రాకార కట్టడాలు.. అద్భుత సాంకేతికత అడుగడుగునా మేలవించిన ఓ కళాకండమది .. పిడుగుపాటలును .. భూ ప్రకంపనాలను తట్టుకొని గత ఘనచారిత గల ఆ కలికితురాయి నేడు యునెస్కో మకుటాన్ని తలకెత్తుకొని తెలుగుగడ్డ చరితను సగర్వంగా లోకానికి చాటిచెప్పింది. మన గౌరవాన్ని ఇనుమడింపచేసింది. అదే కాకతీయులు మనకందించిన వారసత్వ సంపద. మన రామప్పదేవాలయం ..ఆ విశేశాలను తెలుసుకుందాం.. భూకంపాలకు యుద్ధాలకు చెక్కుచెదరని రామప్ప దేవాలయం.

కొండగుట్టలు ఆ పక్కనే నిండుకుండలా తొనికిసలాడుతున్న చెరువుకట్ట .. నీటిసవ్వడుల గలగలలతో ఆ ప్రాంతంలో ఎటుచూసినా కనుచూపుమేరా పచ్చదనం కనువిందు చేస్తుంది. ఆ పచ్చదనం నిండిన పసిడి పల్లె నడుమ ప్రపంచ కీర్తిని మూట గట్టుకున్న చారిత్రక సంపద కొలువుదీరింది.

ములుగు నుంచి వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలోకి చేరుకోగానే రణనద్వనులకు వాహన కాలుష్యాలకు అల్లంత దూరంలో కొలువైన రుద్రేశ్వరాలయం కనిపిస్తుంది. తెలుగు తేజమై వెలుగులీడి 25 జులై 2021న ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న నేపథ్యంలో ఆలయం లోపలికి వెళ్లే ప్రధాన దారిలో ఆ యునెస్కో ఘనకీర్తి చిహ్నాలు రామప్ప దేవాలయ విశిష్టతకు సంబంధించిన లికిత సందేశాలను చాటిచెపుతాయి. తెలియని వారికి సహితం ఆ కాకతీయ కళావైభవ చరితను తెలియచేస్తాయి.

అలా అడుగులు ముందుకు పడుతుండగా స్వాగత తోరణంగా కనిపించే పచ్చని వృక్షాల నడుమదారి . అలా ఆ దారిగుండా కాస్తా ముందుకు నడవగానే రాతి ప్రాకారాల లోపల ఇసుకపునాదులపై నక్షత్రాకారంలో నిర్మించబడ్డ సాంసృతిక ప్రాకృతిక సంపదైన ఓ అత్బుత శిల్పకళా ఖండం. కాకతీయ రుద్రేశ్వరాలయం కనిపిస్తుంది.

ఓరుగళ్లు కేంద్రంగా సాగిన కాకతీయుల పాలనాకాలంలో 12వ శతాబ్దంలో గణపతి దేవుని హయాంలో వారి సామంత రాజు రేచర్లరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. జైతుగి లనే దేవగిరి యాదవరాజు గణపతి దేవుని పెదతండ్రి స్వతంత్ర కాకతీయ రాజ్యస్థాపకుడైన రుద్రదేవుడిని ,తండ్రి మహదేవుడిని చంపి యువరాజైన గణపతి దేవుడిని బంధించి తీసుకొని వెళ్లాడు . రాజ్యం అస్థిరత్వంలో ఉన్నవేల కాకతీయుల సామంత రాజైన రేచర్లరుద్రుడు జైతుగి బందిలో ఉన్న గణపతిదేవుడిని విడిపించుకొచ్చి కాకతీయ సింహసనంపై కూర్చొబెట్టారు. ఆ తర్వాతి కాలంలో గణపతిదేవుడికి బహుమానంగా ఇవ్వడం కోసం 1173లో ఈ ఆలయ నిర్మానాన్ని చేపట్టాడు ప్రదాన శిల్పి రామప్ప. ఆయన నేతృత్వంలో 1173లో పనులు ప్రారంభించి 40 ఏళ్ల తర్వాత అంటే 1213 లో పూర్తి చేశాడు.

ఎన్నో యుద్ధాలను పిడుగుపాటులను భూకంపాలను తట్టుకొని నిలిచింది ఆలయం.ముఖ్యంగా భూకంపాలలాంటి ప్రకృతి విపత్తులకు ఆలయం చెక్కుచెదరకుండా ఉండేలా పటిష్టమైన ప్రణాళికతో, సాండ్ బాక్స్ టెక్సాలజీ సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయాన్ని నిర్మించారు. సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే ఆలయ నిర్మాణ స్థలంలో మూడు మీటర్ల లోతు పునాది తవ్వి అందులో ఇసుకను నింపుతారు. అది ఎప్పుడు తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ ఇసుకపై రాళ్లు పేర్చుకుంటూ గుడి నిర్మించారు. అందువల్లే అది భూకంపాలను తట్టుకొని ఇప్పటికి కృంగిపోకుండా దృఢంగా ఉందని నిపుణుల అభిప్రాయం. అందుకే 800 ఏళ్లు దాటినా ఇంకా చెక్కుచెదరకుండా నిర్మాణం ఉంది. ఎక్కడా కనిపించని ఇటుకలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఆలయం మొత్తం రాతితోనే ఉంటుంది. కానీ గర్భగుడి గోపురం మాత్రం ఇటుకలతో నిర్మించారు. నేల స్వభావానికి అనుగుణంగా ఆలయంపై బరువు తగ్గించడానికి తేలికపాటి ఇటుకలను వినియోగించారు. ఇవి నీటిలో తేలియాడుతాయి. మనం వినియోగించే వాటి కన్నా చాలా చిన్నగా ఉంటాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా కట్టడాలు చేపట్టలేదు. వీటిని ఎలా తయారు చేశారో ఇప్పటికీ గొప్యమే..ఆలయంలో చాలా చోట్ల మూడు రంగుల రాళ్ళను వినియోగించారు. కొన్ని చోట్ల ఎరుపు తెలుపు మిశ్రమ రంగుల రాళ్లు కూడా కనిపిస్తాయి. ఆలయం లోపల మహా మండపం కొన్ని శిల్పాలను పూర్తిగా నల్లరాళ్లనే వాడగా ఆలయం వెలుపల పూర్తిగా తెలుపురాలను వినియోగించారు.

కాకతీయుల ఆలయ నిర్మాణాలన్నీ నక్షత్ర శైలిలో ఉంటాయి. రామప్ప గుడి సైతం ఆ ఆకారంలోనే ఉంటుంది. గర్భగుడి మహా మండపంతో మూడు వైపులా ప్రవేశానికి వీలుగా ఉంటుంది. రామప్పదేవాలయం శివాలయం. ఇక్కడి శివుడిని రామలింగేశ్వరుడు ,రుద్రేశ్వరుడుగా పిలుస్తుంటారు. ఆలయ వేదిక 6 అడుగుల ఎత్ తుఉండి అధిష్టానంపై 3మీటర్ల వెడల్పున మార్గం నాలుగు అంతస్తుల గాలిగోపురం కలదు. గర్భాలయంలో ఆ రుద్రేశ్వరుడు ప్రశాంత మూర్తిగా దర్శనమిస్తాడు. గర్భాలయాల ముఖ ద్వారం పైన కూడా నల్లరాతి గ్రానేట్ తో అత్యద్భుత శిల్పసంపద కనిపిస్తుంది. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం కుడి వైపున కామేశ్వర ఎడమవైపున కాటేశ్వర ఆలయాలు నిర్మించారు.

ఎక్కడైనా ఆలయం అంటే దేవుడి విగ్రహాలే ప్రధానంగా ఉంటాయి. కానీ ఈ గుడిలో అనువణువు ప్రత్యేకత సంతరించుకొని కనిపిస్తుంది. గణపతి దేవుడి గజసాహిని అయిన జాయప సేనాని యెక్క గ్రంధమైన నృత్యరత్నావళిలో పేర్కొన్నట్లు పేరిని శివతాండవం,భరతనాట్యం ఇతర భంగిమలు ఆలయ గోడలపై చెక్కారు. ఈ ఆలయంలోనాగిని భంగిమలు, కాకతీయుల గజకేసరి బిరుదులను సూచించే 28 ఏనుగు, సింహం కలిసి ఉన్న శిల్పాలు కూడా ఉన్నాయి. గర్భగుడి ముఖద్వారానికి అటు 30 ఇటు 30 చొప్పున కాకతీయుల యుద్ధకళ అయిన పేరిని శివతాండవానికి చెందిన నృత్య రూపకాలు కనిపిస్తాయి. అంతేకాదు అప్పటివిదేవి వాణిజ్యం గురించి తెలిపే విదేశీయుల శిల్పాలు కోయ స్త్రీ శిల్పం ,హైహీల్స్ వేసుకున్న నర్తకీమని శిల్పాలు రాయగజకేసరి,కోయ స్త్రీ శిల్పాలు ఆ కిందివరుసలో ఏనుగుల వరుసలు, పుష్పాల వరుసలు ,ఇతరత్రా శిల్ప సంపద అద్భతంగా ఉంటుంది.

స్వరాలు పలికే శిల్పాలు జీవకల ఉట్టిపడే సౌందర్యంతో నాట్యమాడుతున్నాయా అన్నట్లుగా కనిపించే మదనికలతోపాటు అత్యంత సూక్ష్మమైన శిల్పకళ కనువిందుచేస్తుంది. ఆలయం లోపల బయట కూడా ఎక్కడ చూసినా విభిన్న శిల్పసంపద కనిపిస్తుంది. గోపిక వస్త్రాపహరణం సమయంలో పొన్నచెట్టుపై కూర్చుని శ్రీకృష్ణుడు వేణునాదం వినిపించే ఘట్టాన్ని ప్రతిబింబించే శిల్పాలు, వేలితో మీటితే సప్త స్వరాలు పలుకుతాయి. అలాగే ఓ శిల్పంలో ముగ్గురు మనుషులకు నాలుగు కాళ్లు మాత్రమే ఉంటాయి. కానీ వేరువేరుగా కాళ్లు ఉన్నట్లు కనిపిస్తాయి. ఇలాంటి ప్రత్యేకత సంతరించుకున్న శిల్పాలెన్నో ఇక్కడ కనిపిస్తాయి.

గర్భాలయం ముందు నాట్యమండపం ఉంటుంది. నాట్యమండపం పైభాగంలో నటరాజస్వామి వారు ఉంటారు. వారిని కీర్తించి నర్తకీమనులు ఈ నాట్యమండపంలో స్వామి మూర్తి ఎదుట నృత్య నీరాజనాలు అందించేవారు.నాట్యమండపంపై భాగం అత్యంత అద్భుతం అష్టదిక్కులకు చిహ్నంగా శిల్పకళని మలిచారు. అంతేకాక గజాసుర సంభారవ దక్షసంహారం తారకాసుర సంభరం శివకళ్యానం త్రిపురాసుర సంహరం లాంటి ఇతిహసాలను శిల్పాల రూపంలో మలిచారు. నాట్యమండసానికి చుట్టూ నాలుగు నల్లరాతి స్తంభాలుంటాయి. ఈ నల్లరాతి స్తంభాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అబ్బుపరిచే శిల్ప సంపదకు కేరాఫ్ గా ఆ స్తంబాల మీద శిల్పాలను మలిచారు. అన్ని స్తంభాలమీద రకరకాల శిల్పాలను చెక్కినా ఒక స్తంభం కొంత ఖాలీగా ఉంచి దూరం నుండి చూస్తే కాస్తా సొట్టగా కనిపించేలా మలిచారు. దీనికి కారణం ఒక్కసారిగా నాలుగు స్తంభాలను చూసి ఎంతబాగున్నాయి అని దిష్టి పెట్టకుండా ఒక స్తంభానికి మాత్రం వెలితి ఉంచేలా ఏర్పాటు చేశారు. అంతేకాక ఈ స్తంభాలపై అత్యంత సూక్ష్మమైన రీతిలో చెక్కిన శిల్పకళ చూస్తే ఎవరైనా ఆశ్చర్యచకితులు కాలాల్సిందే. సన్నటి దారాలును సహితం శిల్పాల మద్యలో నుంచి తీసే మాదిరిగా నిర్మించారంటే వారికి శిల్ప కళ పట్ల ఎంతటి శ్రద్ధాశక్తులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

చాలాదేవాలయాలలో గర్భాలయం చాలా చీకటిగా ఉంటుంది. కానీ ఇక్కడ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాక గర్భాలయంలోని ఆ స్వామి స్పష్టంగా భక్తులకు దర్శనమిస్తారు. కారణం ఇక్కడ ఆలయ మండపం సగం మాత్రమే కట్టడం అక్కడి నుండి సూర్యకిరణాలు 4 నల్లటి స్తంభాలపై పడి కాంతి పరావర్తనం చెంది గర్భగుడిలోని శివుడిపై పడుతోంది. దీంతో గర్భాలయంలో లైట్లు లేకున్నా శివలింగం స్పష్టంగా కనిపిస్తుంది.

సాదారణంగా ఎక్కడ చూసినా శివాలయాలలో నంది తల శివుడిని చూస్తూ కొమ్ములతో ఉంటుంది. ఆ కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూస్తారు. కానీ కాకతీయులు నిర్మించిన 365 శివాలయాలలో నందులు ఫూర్తి భిన్నంగా ఉంటాయి. కాకతీయుల నంది విగ్రహాల తల కాస్తా కుడి వైపుకు వాలి ఉండి ఓచెవితో వింటున్నట్లుగా ఒక కాలు కాస్తా ముందుకు ఉండి కనిపిస్తాయి. శివుని ఆనతి రాగానే రంకెవేసేందుకు సిద్ధం అన్నట్లుగా అలర్ట్ పొజిషన్ లో ఉంటుంది.

రాయగజకేసరి బిరుదులు ధరించిన కాకతీయుల గజభలానికి గుర్తుగా ఆలయంలో ఎక్కడ చూసినా ఏనుగు విగ్రహాలు కనిపిస్తుంటాయి. ఆలయంలో వెళ్లే మార్గాలను వచ్చే మార్గాలను సూచిస్తూ ఉండే ఏనుగు విగ్రహాలు కనిపిస్తాయి. ఈ ఏపుగుల శిల్పాలు నాటికాలంలో గజభలాని చిహ్నంగా కనిపిస్తాయి. అంతేకాక గణపతిదేవుడి బావమరిది అయిన జాయప సేనాని కూడా గజసాహినికావడం వల్ల వారి నిర్మాణంలో ఏనుగులు బాగానే కనిపిస్తాయి.

కాకతీయుల నిర్మాణ శైలి అంటే ఆవాసాలు గుడికొలను అనే సూత్రంపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడ కూడా అదే మాదిరిగా రుద్రేశ్వర ఆలయం ఆ పక్కన పాలంపేట అనే గ్రామం. వాటి సమీపంలోనే విశాలమైన రామప్ప చెరువు ఉంటుంది. రామప్ప సరస్సు నిత్యం జలకలతో ఉంటుంది. రెండు గుట్టల మధ్యన తూములు కట్టి కట్టను ఏర్పాటు చేసి ఈ సరస్సును నిర్మించారు. 2.912 టీఎంసీల నిలువ సామర్థ్యంతో 35 అడుగుల నీటిమట్టం ఉంటుంది. చెరువు కట్ట 610 మీటర్ల పొడవు ఉంటుంది. రెండు తూములతో సుమారు పదివేల ఎకరాల్లో రైతులకు ఏటా రెండు పంటలు పండించుకుంటున్నారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఇదే ప్రధాన చెరువు.

సూర్య చంద్రులు ,బసవన్న, ఘననాధుల సాక్షిగా రేచర్ల రుద్రుడు వేసిన శాసనం శతాబ్దాల చరిత్రను తనలో దాచుకొని గంభీరంగా కనిపిస్తుంది. శాసనానికి కూడా గుడి తరహా మండపాన్ని కట్టి రక్షణ ఏర్పాట్లు చేశారు. 204 సంస్కృత పంక్తులతో రాయిపై చెక్కించిన ఈ శాసనంలో రేచర్ల రుద్రుడు తన వంశం వివరాలను కాకతీయ రాజులకు వారు అందించిన సేవలను ఓరుగల్లు పట్టణ వైభవం గురించి శాసనంలో వర్ణించారు. రామప్ప ఆలయ దేవతలైన రుద్రేశ్వర కాటేశ్వర కామేశ్వర స్వాముల గురించి పేర్కొన్నాడు. శ్రీముఖ నామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం అష్టమి తిధి, పుష్యమి నక్షత్రం ఆదివారం ఆలయ నిర్మాత రేచర్ల రుద్రుడు తన రాజ్యంలో కొన్ని గ్రామాలను శాశ్వత ధర్మముగా దానం ఇచ్చినట్లు శాసనంలో ఉన్నది. ఆ తేదీ ఆంగ్ల సంవత్సర ప్రకారం 1213 మార్చి 31గా నిర్ధారించారు. రేచర్ల రుద్రుడు శాసనంలో మేము ఎవరికైనా శత్రువుల కావచ్చు కానీ ఈ ఆలయం కాదు కావున దీన్ని ధ్వంసం చేయకూడదు. బాధ్యతలో ఉన్నవాళ్లు ఆలయాలను కాపాడకపోతే పది వేల జన్మల పటు పీడలో పురుగులుగా పుడతారు అని రాయించాడు.

రామప్పదేవాలయాన్ని ధక్కన్ దేవాలయాలకే మకుటం అని యజ్దాని అనే చరిత్రకారుడు పేర్కొన్నారంటే ఇక్కడి శిల్పకళ ఎంత అద్బుతంగా ఉందో చెప్పనక్కరలేదు. అంతటి శిల్పకళని తనతో నింపుకున్న ఈ దేవాలయం జూలై 25 , 2021 యునెస్కో గుర్తింపుతో ప్రపంచ వారసత్వ జాబితాలో 39వ స్థానం సంపాదించుకొని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి యునెస్కో జాబితాకెక్కిన తొలికట్టడంగా నిలిచింది. దీంతో రామప్ప గురించి తెలుసుకోవాలని అక్కడి శిల్పసంపదని కనులారా చూడాలని ఎంతోమంది సందర్శకులు నిత్యం ఇక్కడికి వస్తున్నారు.

రామప్ప గురించి సందర్శకులు విన్నది చదివింది ఇక్కడ చూశాక చాలామంది ఆ నాటికాలపు సాంకేతికత ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. మన దేశంలో ఉన్న చారిత్రక సంపద మనకు ఎంతో గర్వకారనమని నేటి తరాలు చూసి తెలుసుకోవాల్సిన కళాకండమిదని ఎంత శ్రమ ఎంత సాంకేతికత మెషినరి లేనికాలంలో ఉపయోగించారో ఆలోచిస్తేనే ఆశ్వర్యం వేస్తుందంటున్నారు. భావితరాలకు ఇదో విజ్ఞాన భాండాగారం లాంటిదని మన దేశంలో ఇటువంటి నిర్మాణాలు ఉండడం మన అగృష్టమంటున్నారు.

మిగతా కట్టడాలకు భిన్నమైనదిగా ఆనాటి కాలంలోనే అద్భుతమైన టెక్నాలజీల మేలవింపుతో నిర్మించిన రుద్రేశ్వరాలయం. తెలుగువారికి గర్వకారణమైన వారసత్వకట్టడం గా నేడు ప్రపంచం దృష్టికెక్కింది. పనితనం ఉంటే పనిచేసిన వాడికే పేరు దక్కుతుంది అన్నట్లుగా దేశంలో మరెక్కడ లేనట్లుగా ఓ శిల్పి పేరుతో ప్రసిద్ధికెక్కిన రామప్ప దేవాలయం మన చారిత్రక అస్తిత్వప్రతీకగా భావితరాలు అబ్బురపడి చూసే నిర్మాణంగా నిలిచిపోతోంది.

.

.

.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Mood Of Telangana-2: గెలిచేది వీళ్ళే.! | Present Telangana Election Analysis 2023 Report | BIG TV

Bigtv Digital

Rahul Gandhi : రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. అమెరికా రియాక్షన్ ఇదే..!

Bigtv Digital

RRR: ‘ఆర్ఆర్ఆర్’ క్యాంపెయిన్‌కు రూ. 80 కోట్లు ఖర్చు.. ఇదీ క్లారిటీ..

Bigtv Digital

Congress Protest: వరద.. కాంగ్రెస్ గొడవ.. టెన్షన్ టెన్షన్..

Bigtv Digital

Parliament news today: పార్లమెంట్ స్పెషల్ సెషన్.. రద్దు కోసమేనా? ముందస్తు ఖాయమా?

Bigtv Digital

Ponguleti : ఖమ్మంలో బీఆర్ఎస్ అరాచకాలు .. పొంగులేటి సభలపై కుట్రలు..

Bigtv Digital

Leave a Comment