Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై.. మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. స్వరాష్ట్ర ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన కల్వకుంట్ల కవిత.. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇంకొన్ని గంటల్లోనే.. ప్రకటించబోతున్నారు. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చేసి.. సొంతంగా సర్వోదయ తెలంగాణ అనే స్లోగన్‌తో సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి రెండు రోజుల ముందే.. కవిత తన కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఆమె అడుగులు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయనేది.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉద్యమగళం నుంచి స్వతంత్ర రాజకీయ శక్తిగా.. కవిత ఎలాంటి సంచలనాలకు కేంద్రబిందువుగా మారబోతున్నారనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో.. తెలంగాణ జాగృతి ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి, రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యారు కవిత. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తం చేసి, ఈ నేల సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన ఘనత ఆమెకే దక్కింది. అయితే, మారిన రాజకీయ సమీకరణాల్లో, బీఆర్ఎస్ ఓటమి తర్వాత పార్టీలో ఆమె ప్రాధాన్యత తగ్గిందని.. కవిత బయటకొచ్చేశారు. ఈ క్రమంలోనే.. కేవలం ఓ వర్గానికో, ఓ కుటుంబానికో పరిమితం కాకుండా, తెలంగాణని యువత, మహిళలు, అణగారిన వర్గాల గళంగా.. తన పార్టీని తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఉన్నారు కవిత. సామాజిక తెలంగాణ ఎజెండాతోనే.. రాజకీయ శక్తిగా రాబోతున్నట్లు చెబుతున్నారు.
Also Read: ఆర్టీసీ సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్, వరంగల్ జిల్లాలో ఘటన
తెలంగాణ ప్రజల దృష్టిలో కేసీఆర్ అంటే ఒక తిరుగులేని రాజకీయ శక్తి. కానీ, ఇప్పుడు సొంత కూతురు కవితే, కేసీఆర్ నాయకత్వాన్ని ధిక్కరించి, ఆయన బాటను వీడి, తనకు తానుగా ఓ నూతన రాజకీయ మార్గాన్ని సిద్ధం చేసుకొని వెళ్లడం సాహసమనే అంటున్నారు. గతంలో కేసీఆర్ వదిలేసిన పేరుని మళ్లీ కవిత స్వీకరిస్తారనే ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్నాయ్. తెలంగాణ సెంటిమెంట్‌ని తిరిగి రగిలించడం ద్వారా టీఆర్ఎస్ పాత ఓటు బ్యాంకును, ఆ పార్టీలోని నాయకత్వాన్ని ఆకర్షించడమే కవిత వ్యూహంగా కనిపిస్తోంది. పురుషాధిక్య రాజకీయాల్లో తనని తాను ఓ తిరుగులేని మహిళా నాయకురాలిగా నిరూపించుకోవాలని ఆమె తహతహలాడుతున్నారు. తెలంగాణ ఆడబిడ్డల ప్రజల అండ కావాలని తపన పడుతున్నారు.
రాజకీయ పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. కానీ, దానిని నడిపేందుకు దమ్ము కావాలి. కొత్త పార్టీ పెట్టడం ఒక ఎత్తయితే, దానిని నిలబెట్టడం మరో ఎత్తు. బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్, కేటీఆర్ వైపు ఉంటారా? లేక కవిత వెంట అడుగులు వేస్తారా? అన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఇప్పటివరకు తెలంగాణ జాగృతి కార్యకర్తలే ఎక్కువగా కవిత వెంట కనిపిస్తున్నారు. కొందరు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రమే కవిత వైపు మళ్లారు. మెజారిటీ బీఆర్ఎస్ క్యాడర్.. గులాబీ జెండానే పట్టుకొని ఉంది. దాంతో.. పింక్ పార్టీ శ్రేణులని తన పార్టీలోకి ఆకర్షించడంలో కవిత ఎంతమేర సక్సెస్ అవుతారనేది కూడా ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. కేసీఆర్ కూతురిగా ఉంటూనే, ఆయన విధానాలను విమర్శించడం, వేరుగా వెళ్లడంపై ప్రజలు ఎలా స్పందిస్తారనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. అటు అధికార కాంగ్రెస్, ఇటు కేంద్రంలోని బీజేపీ.. ఇప్పటికే ఈమెను బీఆర్ఎస్ బీ-టీమ్‌గా ముద్ర వేశాయ్. వీటన్నింటిని అధిగమించడం కూడా కవితకు సవాలే!
Also Read: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని పరిగెత్తించి కొట్టారు.. ఎక్కడో కాదు..!
నిజానికి, తెలంగాణ రాజకీయాలు ఇప్పుడొక కీలకమైన మలుపులో ఉన్నాయ్. బీఆర్ఎస్ నుంచి కవిత బహిష్కరణకు గురవడం, ఆపై లిక్కర్ కేసులో క్లీన్ చిట్ రావడంతో.. ఆమె రాజకీయ భవిష్యత్ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే, ఇప్పటికే ఉన్న ఏదో ఒక పార్టీలో చేరడం కన్నా, సొంతంగా ఓ పార్టీ పెట్టడమనేది సాహసోపేతమైన అడుగు. అందుకే, కవిత ఫ్యూచర్ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ డిబేట్‌కు దారితీసింది. అయితే, తెలంగాణ జాగృతి, బతుకమ్మ ద్వారా.. ఇప్పటికే ఆమెకు గ్రామీణ స్థాయిలోనూ, ముఖ్యంగా మహిళల్లోనూ మంచి గుర్తింపు ఉంది. బీఆర్ఎస్ వైఫల్యాలకు తన బాధ్యత లేదని, తానే స్వతంత్ర శక్తిగా ఎదగాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. ఆడబిడ్డ సెంటిమెంట్ వర్కవుట్ అయితే, కొంతమేర ప్రజాదరణ దక్కే అవకాశాలు కూడా ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. కానీ, తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లాంటి బలమైన రాజకీయ శక్తులున్నాయ్. కేసీఆర్ ఇమేజ్ లేకుండా కేవలం వ్యక్తిగత ఇమేజ్‌తో.. కవిత రాజకీయంగా ఎదగడం కష్టమనే అభిప్రాయాలు కూడా ఉన్నాయ్.
మరో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే.. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ రావడమే.. అతిపెద్ద పొలిటికల్ విక్టరీ! ఇన్నాళ్లూ ఆమెపై ఉన్న లిక్కర్ స్కామ్ ముద్ర చెరిగిపోవడంతో, ఆమె నైతికంగా పైచేయి సాధించారు. తాను నిర్దోషినని, రాజకీయ కక్షతోనే తనని ఇరికించారని చెబుతూ.. బలంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం దొరికింది. ఈ క్లీన్ చిట్ ద్వారా తన ప్రత్యర్థులపై ఎదురుదాడి చేసే ఛాన్స్ కూడా వచ్చింది. ఇది ఆమె పట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించి, కొంతవరకు ఆమెని బాధితురాలిగా చూపేలా చేసింది. తెలంగాణ సమాజం భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తుంది. కవిత చెబుతున్న ఎజెండా గనక ప్రజల్లోకి బలంగా వెళితే, ఆమె ఓ కొత్త పొలిటికల్ ఆల్టర్నేట్‌గా ఎదిగే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆమెకు పట్టు ఉండటం కొంతవరకు కలిసొస్తుందనే చర్చ ఉంది. ఏదేమైనా.. లిక్కర్ కేసులో క్లీన్ చిట్ రావడం.. ఆమె పర్సనల్ ఇమేజ్ పెంచింది. కానీ, పొలిటికల్ పార్టీగా సక్సెస్ అవ్వాలంటే.. కేవలం సానుభూతి ఒక్కటే సరిపోదు. బలమైన రాజకీయ నిర్మాణం, స్పష్టమైన ఎజెండా ఉండాలి. కవిత వేస్తున్న ఈ కొత్త అడుగు.. తెలంగాణ రాజకీయాల్లో ఓ థర్డ్ ఫోర్స్‌గా మారుతుందా? బీఆర్ఎస్ ఓటు బ్యాంకుని చీల్చడానికే పరిమితమవుతుందా? అన్నది.. పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించే ఎజెండాను బట్టి డిసైడ్ అవుతుంది.
Also Read: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న కౌన్సిలర్.. పోలీసుల మౌనం వెనుక మర్మమేంటో..?