Eluru Politics: పశ్చిమగోదావరి జిల్లాలో బలమైన ఓ రాజకీయ నేత ఇప్పుడు నియోజకవర్గం మారెందుకు ప్రయత్నాలు మొదలెట్టారట. 2024లో ఘోర పరాజయం తర్వాత పైకి గంభీరంగా కనబడుతున్నా.. నియోజకవర్గంలో వర్గ పోరుతో ఆ నేత కొత్త నియోజకవర్గానికి మారెందుకు పావులు కదుపుతున్నారట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ నేత నియోజకవర్గం ఎందుకు మారాలి అనుకుంటున్నారు? ఆ ప్రచారంలో వాస్తవం ఎంత? నియోజకవర్గ మార్పు సదరు నేతకు కలిసి వస్తుందా?
కాపు సామాజికవర్గ నేతలతోనే గెలుపు
కారుమూరి నాగేశ్వరరావు పెద్దగా పరిచయం అక్కర్లేని కాపు నేత. ఆయన పొలిటికల్ జర్నీ కాంగ్రెస్ పార్టీతో మొదలై ఇంతింతై వటుడింతై అన్నట్లు గోదావరి జిల్లాలో బలమైన రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్నారు. కారుమూరి తన నోటి దురుసుతో వివాదాలను ఎప్పుడూ కొనితెచ్చుకుంటారు. దాంతో ఆయన చేసిన మంచి అంతా పోయి.. కేవలం వివాదాల గురించే మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. తణుకు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం మద్దతుతోనే గెలుస్తున్నానంటూ వారిని ఎప్పుడు పక్కనే పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఉంటారు కారుమూరి. అలాంటి కారుమూరి నాగేశ్వరరావు మరోసారి తణుకు నియోజకవర్గాన్ని వదిలి కొత్త నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారట. దాంతో తణుకు నియోజకవర్గ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారని సమాచారం.
ఏలూరు నియోజకవర్గంలో పట్టు
జిల్లాల పునర్విభజన తర్వాత తణుకు నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లాలోకి వెళ్లింది. గతంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు కేంద్రంగా ఉన్న ఏలూరు నియోజకవర్గంపై మొదటి నుండి కారుమూరి నాగేశ్వరరావుకు మంచి పట్టు ఉంది. తన సామాజికవర్గ ప్రజలు దెందులూరు, ఏలూరు, నూజివీడు నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం కారుమూరి తన బలంగా చెప్తూ ఉంటారు. 2009,2019 ఎన్నికల్లో తణుకు నుండి పోటీ చేసి గెలుపొందిన కారుమూరి 2014లో మాత్రం ఏలూరు పార్లమెంట్ పరిధి దెందులూరు నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కారుమూరి
కారుమూరి ఎమ్మెల్యే అవ్వక ముందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కారుమూరికి ఏలూరు పరిసర ప్రాంతంలో ఆయన సామాజిక వర్గంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎంతో మంది ఉద్ధండులు పోటీ చేసిన ఏలూరులో ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేసిన నాటి నుండి బలమైన నేత కోసం వైసీపీ అధిష్టానం సైతం ఎదురుచూసింది.. ఇదే అవకాశంగా తీసుకున్న కారుమూరి తనకున్న సామాజిక ఆర్థిక బలాన్ని బట్టి ఏలూరు నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎలా ఉంటుందో అనేదానిపై తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారని జిల్లా వ్యాప్తంగా గుసగుసలు వినపడుతున్నాయి
గతంలోనే నియోజకవర్గం మారడంతో కేడర్ అసంతృప్తి
2009లో కారుమూరి వెంకటనాగేశ్వరరావు.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యారు. తర్వాత మారిన పరిణామాల మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో దెందులూరు పోటీ చేశారు. సొంత నియోజకవర్గం నుండి వేరే నియోజకవర్గానికి వెళ్లిపోవడంతో అప్పటి వరకూ ఆయన వెన్నంటి ఉన్నవర్గంలో అసంతృప్తి నెలకోవడంతో పాటు, కొంత వర్గం పార్టీ కూడా మారిపోవడం జరిగింది.
సొంత నియోజకవర్గంలోనూ కారుమూరికి వర్గపోరు
అంతకుముందు తణుకు నియోజకవర్గం వదిలి వెళ్లేది లేదన్నారు కారుమూరి. అవసరమైతే బాండ్ పేపర్ పై సంతకం పెట్టి కార్యకర్తలకు ఇవ్వండి నియోజకవర్గ మార్పు ఉండదని బల్లగుద్ది మరి చెప్పారు కారుమూరి నాగేశ్వరరావు. అంత గట్టిగా చెప్పి నియోజకవర్గం మారి పోవడంతో అప్పటివరకు తణుకు నియోజకవర్గంలో కారుమూరిని ఎమ్మెల్యేగా గెలిపిద్దామని తిరిగిన కేడర్ అంతా ఒకసారిగా ముక్కలు అయిపోయింది. 2014 దెందులూరులో ఓటమి తర్వాత తణుకు నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న కారుమూరికి సొంత పార్టీ వర్గ పోరు కూడా అప్పుడే మొదలైంది. 2014లో తణుకు వైసీపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చీర్ల రాదయ్య వర్గానికి కూడా కారుమూరి దూరం అవుతూ వచ్చారు. కార్యకర్తలను విస్మరించడం, ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవడంతో కారుమూరి వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నారట పార్టీ నాయకులు. దానికి తోడు కారుమూరి నోటి దురుసుతనం కూడా ఆయనపై వ్యతిరేకత పెంచేలా చేసిందట.
2014లో వైసీపీ అభ్యర్థి రాధయ్యకు 72 వేల ఓట్లు
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ విడిగా పోటీ చేయడం, రాష్ట్రంలో జగన్ గాలి బలంగా వీయడంతో తణుకులో కారుమూరి గెలిచి బయట పడ్డారట. అది కూడా దాదాపు రెండువేల స్వల్ఫ మెజారిటీతో. బయట పడిన పరిస్థితి. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన సందర్బంలో వైసీపీ నుండి పోటీ చేసిన చీర్ల రాధయ్యకు 72వేల పై చిలుకు వరకూ ఓట్లు వచ్చాయి. 2019లో కూడా కారుమూరికి 72 వేల వరకూ ఓట్లు వచ్చి 2000 స్వల్ఫ మెజారిటీతో గెలిచిన పరిస్థితి. అయితే 2024లో కారుమూరికి రోజు, రోజుకి సొంత పార్టీలో వర్గపోరు పెరిగిపోవడంతో 55వేల ఓట్లకు పడిపోవడం జరిగింది. అంటే 2014,2019 కి పోల్చుకుంటే 2024లో వైసీపీ 70వేల ఓట్ల వరకూ తగ్గాయి. దానికి కారణం కారుమూరిపై తణుకు నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతే ప్రధాన కారణంగా పార్టీ నాయకులు చెబుతున్నారు..
Also Read: వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షడు ఎవరు?
ఓవరాల్ గా కారుమూరి పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉంటూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మీడియాలో హైలెట్ అవ్వడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. వైసీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలదొక్కుకోవాలంటే ఆర్థికంగా బలంగా ఉన్న కారుమూరి అవసరం పార్టీకి తప్పనిసరి అంటున్నారు విశ్లేషకులు. తణుకు నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే అయినా రాబోయే ఎన్నికల్లో పరిస్థితుల్లో మార్పు ఉంటుందంటున్నారు. ఒకవేళ ఎన్నికల్లోపు పరిస్థితుల్లో మార్పు రాకపోతే అటు ఏలూరు నియోజకవర్గంలో బలమైన నేత పోటీకి దొరక్కపోతే కారుమూరి పోటీ చేస్తారు అనడంలో సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Story By Venkatesh, Bigtv