Indigo Flight: ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానాన్ని టేకాఫ్ అయిన కాసేపటికే.. పక్షి ఢీకొట్టడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పాట్నా ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో 169 మంది ప్రయాణికులు ఉండగా.. అంతా క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు.
వివరాల్లోకి వెళ్తే.. పాట్నా నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో విమానం (ఫ్లైట్ నంబర్ 6E-2433) టేకాఫ్ అయిన కొద్ది సమయానికే.. ఒక పెద్ద పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో సంప్రదించి, అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. అత్యవసర పరిస్థితుల్లోనూ పైలట్ విమానాన్ని తిరిగి పాట్నా ఎయిర్‌పోర్ట్‌కు తీసుకొచ్చారు.ఫ్లైట్‌లో మొత్తం 169 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో ఎవరూ గాయపడలేదు. అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
పక్షి ఢీకొన్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను.. ఇండిగో సంస్థ ప్రకటించింది. విమానం ఢిల్లీకి వెళ్తుండగా, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బర్డ్‌హిట్ సంభవించింది. భద్రతను దృష్టిలో ఉంచుకుని, పైలట్లు అత్యవసర ల్యాండింగ్‌ను చేపట్టారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. అవసరమైన సాంకేతిక తనిఖీలు పూర్తి అయిన తర్వాతే.. విమానాన్ని మళ్లీ సేవలోకి తీసుకురావాలని నిర్ణయించాం అని ఇండిగో ప్రకటనలో పేర్కొంది.
ఈ ఘటన తర్వాత ప్రయాణికుల కోసం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఇండిగో సంస్థ ఏర్పాటు చేసింది. ఢిల్లీ వెళ్లే ఇతర ఫ్లైట్లలో వారిని బదిలీ చేయడం, పునఃబుకింగ్ వంటి సౌకర్యాలను అందించింది.
Also Read: విమానం ఇంజిన్ ముందు నిలబడ్డాడు.. రెప్పపాటులో ముక్కలయ్యాడు, ఎయిర్‌పోర్ట్‌లో హర్రర్
ఇటువంటి ఘటనలు తరచూ పాక్షికంగా కనిపిస్తున్నప్పటికీ, ప్రయాణ భద్రతలో ఎలాంటి రాజీ పడకూడదని.. విమానయాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాట్నా ఎయిర్‌పోర్ట్ సమీపంలో పక్షులు ఎక్కువగా తిరిగే ప్రాంతాలు ఉండటంతో.. ఈ సమస్య మరింత తీవ్రమవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు ఎదురుకాకుండా.. ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డిజిసీఏ (DGCA) అధికారులు ప్రకటించారు.