KCR Politics: రైట్ ఇదీ మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ ట్రాక్ ఎక్కే ప్రయత్నం చేశారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభతో కమ్ బ్యాక్ చేసేలా కథ నడిపారు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.. ఏడాది తర్వాత బయటికొచ్చారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా సభ అయితే నిర్వహించారు. అది లేకపోతే బయటకు వచ్చే వారేనా అన్న ప్రశ్నలు వినిపించాయ్. కార్యకర్తల్లో చాలా రోజులకు జోష్ అయితే నింప గలిగారు కేసీఆర్. మరి ఇదంతా వన్ టైమ్ జోష్ గా మిగిలిపోతుందా? రోజూ జనంలో ఉంటే ఆ జోష్ రాదు అనుకుంటున్నారా? అందుకే అప్పుడప్పుడే జనంలో మెరుస్తున్నారా అన్న డౌట్లున్నాయ్.. రైట్ ఇవన్నిటినీ ఒక్కోటిగా డీకోడ్ చేద్దాం.
ఒకే రోజు సీఎం, మాజీ సీఎం సభలతో మ్యాటర్ హీటెక్కిపోయింది. రెండు పోటాపోటీ పొలిటికల్ సభలతో తెలంగాణ రాజకీయం ఎండలకంటే మండిపోయింది. జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో KCR ఎమోషనల్, ఫైర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ పాల్గొన్న పబ్లిక్ మీటింగ్ ఇది. టి.జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఈ సభ పెట్టారు. గులాబీ క్యాడర్‌లో ఉత్సాహం కనిపించింది. క్యాడర్ తరలి వచ్చారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అయితే ఇది ఒక్క సభ మాత్రమే. ఏడాది సైలెన్స్ తర్వాత చేసిన స్పీచ్ తో మొత్తం మారిపోతుందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయ్.
2023 అసెంబ్లీ ఓటమి.. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో జీరో సీట్లు. దీంతో బీఆర్ఎస్ క్యాడర్‌లో నైరాశ్యం పెరిగింది. ఇప్పుడు కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉన్నారు. అధికార పార్టీకి దగ్గర అయ్యారు. వీటికి తోడు KCR ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఎక్కువగా ఉండటం, అసెంబ్లీకి రాకపోవడంతో నాయకుడు ఎక్కడ అన్న ప్రశ్నలు పెరిగాయ్. కొందరైతే కేసీఆర్ ఎక్కడ అని గజ్వేల్ లో నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. చాలా సవాళ్లు, ప్రశ్నల మధ్య కేసీఆర్ అయితే బయటకు వచ్చారు. చెప్పాల్సింది చెప్పారు. క్యాడర్ కోరుకున్న నాలుగు డైలాగ్ లు కొట్టారు. కాంగ్రెస్ ను కార్నర్ చేశారు. ఉత్సాహం నింపి వెళ్లారు. మరి ఇది సరిపోతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయ్. ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉంది. బట్ రాత్రికి రాత్రి వచ్చి మ్యాజిక్ చేసే పరిస్థితి కూడా లేదు కదా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ మొదలైతేనే ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవచ్చు అన్న వాదన వినిపిస్తున్న వారూ ఉన్నారు. అటు రేవంత్ ప్రభుత్వం కూడా తమదైన వ్యూహాల్లో ఉంది. దేనికైనా కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అంటోంది.
జగిత్యాల సభ బీఆర్ఎస్ కు ఒక బూస్ట్ అయితే ఇచ్చింది. కానీ రెగ్యులర్ క్యాంపెయిన్, బూత్ లెవల్ యాక్టివిటీ లేకపోతే క్యాడర్ మళ్లీ నిరాశకు లోనవుతుందన్న టాక్ కూడా ఉంది. ప్రత్యర్థి చేసే తప్పులే తమకు అధికారం కట్టబెడుతాయి అన్న ధోరణి బీఆర్ఎస్ నాయకత్వంలో ముఖ్యంగా కేసీఆర్ లో కనిపిస్తోంది. అయితే అది అంత వర్కవుట్ కాదన్న విశ్లేషణ ఉంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చాక ఎవరి మాస్టర్ ప్లాన్లు వారికి ఉంటాయి. బీఆర్ఎస్ రెండో టర్మ్ అధికారంలోకి రావడానికి కారణం.. అప్పటికప్పుడు రైతుబంధు ప్రకటించారు. ఇది గేమ్ ఛేంజర్ అయింది. రేవంత్ ప్రభుత్వం కూడా ఏ ఇష్యూ అయినా ధీటుగా ఎదుర్కొనేందుకు రెడీగా ఉంది. KCR యాక్టివ్ అయితే రాజకీయాలు కేసీఆర్ వర్సెస్ రేవంత్ గా మారిపోతాయి. అటు రేవంత్ ప్రభుత్వం కూడా యాక్టివ్ గా ఉంది. సోమవారం జరిగిన ఈ రెండు సభలు చూస్తే పొలిటికల్ హీట్ ఎంత వేడెక్కిందో అర్థం చేసుకోవచ్చు.
పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మాత్రం పెద్దగా నోరు మెదపడం లేదు. కేసీఆర్ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై చర్చిద్దామని కాంగ్రెస్ నేతలు చాలెంజ్ చేస్తున్నా స్పందించడం లేదు. కాంగ్రెస్ పాలనలో ఎవరికీ ఏమీ దక్కలేదని మాట్లాడిన కేసీఆర్.. తన హయాంలో జరిగిన వాటిపై చర్చకు ఎందుకు ముందుకు రావడం లేదన్న ప్రశ్నలను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. మరి వీటికి జవాబు ఉందా?
సభలో తాను అనుకున్నది కేసీఆర్ చెప్పేశారు. బట్ చాలా ప్రశ్నలకు జవాబులు అలాగే మిగిలిపోయాయ్. అసెంబ్లీకి రాకపోవడం.. ఫాంహౌజ్ కే పరిమితం..క్యాడర్ యాక్టివిటీ తగ్గడం.. హరీష్ రావు, కేటీఆర్ వర్గాలు.. కుంపట్లు..ఓవైపు కవిత పంచులు.. తనకు ఎవరైనా ఒకటే అన్నట్లు డైలాగ్ లు.. బీజేపీని టార్గెట్ చేయకపోవడం.. కాళేశ్వరం సహా ఇతర విచారణలపై భయమెందుకన్న ప్రశ్నలు..బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన తప్పులు.. ఇవన్నీ ప్రశ్నలు ప్రత్యర్థుల నుంచి వచ్చి పడ్డాయ్. ముందు నుంచే కాంగ్రెస్ నేతలు అడుగుతున్న ప్రశ్నలివే.
కల్వకుంట్ల కవిత జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై బిఆర్‌ఎస్ అధినేత, ఆమె తండ్రి కేసీఆర్ పైనే సెటైర్లు వేశారు. జగిత్యాల సభలో బిఆర్ఎస్ 75 సంవత్సరాల కురువృద్దుడ్ని చేర్చుకుని ఒక నవయువకుడిగా చెబితే, తెలంగాణలో యువత బతికి ఉందా లేదా? తెలంగాణలో యువత భవిష్యత్ ఏంటి అని సూటిగానే క్వశ్చన్ చేశారు. గతంలోనూ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్లస్ మైనస్ లతో పెద్ద లేఖ రాశారు. అది కాస్తా లీకై పెద్ద సంచలనంగా మారింది. మహిళా బిల్లు, డీలిమిటేషన్ పై ఎందుకు మాట్లాడలేదని అటాక్ చేశారామె. బీఆర్ఎస్ లో ఆడబిడ్డలకు విలువ ఇవ్వరని ఫైర్ అయ్యారు. వెయ్యేళ్లైనా బీఆర్ఎస్ మారదు అని డైరెక్ట్ గానే తండ్రికి, సోదరుడికి కౌంటర్ ఇచ్చారు కవిత.
తెలంగాణ రాజకీయాలు డైనమిక్ గా ఉంటాయి. రోజూ ఏదో ఇష్యూ ఉండనే ఉంటుంది. అంతా కేటీఆర్, హరీష్ రావు చూసుకుంటున్నారు అన్న ధోరణి కేసీఆర్ లో కనిపిస్తోంది. ఇద్దరు ఉన్నా కేసీఆర్ ఇమేజ్ లేకపోతే బీఆర్ఎస్ చేసే పోరాటాలకు గుర్తింపు అంతగా రాదు అన్న టాక్ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. పైగా ప్రజా ఆశీర్వాద సభకు హరీష్ రావు రాకపోవడం పొలిటికల్ గా చాలా అనుమానాలకు తెరలేపింది. సరిగ్గా సభ ఉన్న రోజే వెళ్లాలా అన్న డౌట్లు చాలా మందికి వచ్చాయి. కాంగ్రెస్ నేతలైతే ఇదే విషయంపై బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు కూడా.
బీఆర్ఎస్ కు ఇంకో సమస్య కవిత నుంచే ఉంది. సొంత కూతురే పార్టీ మారి మరో పార్టీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిపై గులాబీ పార్టీ నుంచి ఎవరూ మాట్లాడడం లేదు. గతేడాది కవిత KCRకు 6 పేజీల లెటర్ రాశారు. KCR దేవుడు, కానీ చుట్టూ దెయ్యాలు ఉన్నారు అని చెప్పడం ద్వారా హరీష్ రావు, సంతోష్ రావు లాంటి వాళ్లను టార్గెట్ చేశారు. కుటుంబంలో ఎలాంటి విబేధాలు ఉన్నాయో బయటకు ఈ ఘటనలతో తెలిసింది. అయితే ఈ ఎపిసోడ్ పై కేసీఆర్ ఇంకా పబ్లిక్‌గా రియాక్ట్ అవలేదు. ఇది బీఆర్ఎస్ కు ఎంతో కొంత డ్యామేజ్ చేసే అవకాశం కనిపిస్తోందంటున్నారు. ఇలాంటి వాటితో సంబంధం లేకుండా.. కేసీఆర్ తన స్టైల్ లోనే ప్రస్తుతం ప్రభుత్వం ఎలా వైఫల్యం చెందిందో వాటినే కార్నర్ చేశారు.
ఇంకోవైపు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ పేరు మార్చడం తప్పు అని బీఆర్ఎస్ నేతలు రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు. తిరిగి TRSకి మారుదాం అన్న డిమాండ్లు క్యాడర్ నుంచి ఉన్నాయి. వీటిపైనా కేసీఆర్ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. తాజాగా జగిత్యాల సభలో ఈ విషయంపై మాట్లాడుతారని చాలా మంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. మళ్లీ టీఆర్ఎస్ గా పేరు మార్పు పెద్ద సమస్య. జాతీయ రాజకీయాలపై ఇష్టంతో కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక్కడే అధికారం కోల్పోవడంతో డైలమాలో పడ్డారు. మరి రాబోయే రోజుల్లో పార్టీ పేరు మారుస్తారా లేదా అన్న డౌట్ క్యాడర్ లో అలాగే ఉండిపోయింది.
కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి శాపంలా మారాయని, ప్రస్తుత సమస్యలన్నింటికీ మూలాలు ఆయన దగ్గరే ఉన్నాయన్నది కాంగ్రెస్ నేతలు చేస్తున్న వాదన. తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని, కేసీఆర్ చర్చకు వస్తే చూపుతామని సవాల్ విసురుతున్నా.. సభకు కూడా రావడం లేదన్న విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. ప్రాజెక్టులు పండవెట్టారని విమర్శిస్తున్న కేసీఆర్.. బనకచర్ల ప్రాజెక్టుపై కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు మాత్రం రావడం లేదు ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు. వీటిపై గులాబీ బాస్ ఏవీ టచ్ చేయడం లేదు. కాళేశ్వరం కూలినా మాట్లాడకపోవడంపై సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగిందో.. లెక్కలు తేల్చే పని చేశారు కేసీఆర్, రేవంత్. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనకు, కేసీఆర్ పదేళ్ల పాలనకు మధ్య పొలిటికల్ గేమ్ గట్టిగానే నడిచింది. చర్చ ఎక్కడ పెట్టినా రెడీ అంటూ కాంగ్రెస్ ఘాటు రిప్లైలు ఇచ్చింది. ఇక తాడో పేడో అంటూ గట్టిగానే మాట్లాడారు రేవంత్.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో గతేడాది ఏప్రిల్ 27న నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ఓ మాటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నర టైమిచ్చిన. ఇగ ఊకోను. జనం కోసం బైలెళ్త. ఎవనిలెక్కేందో తీస్త అంటూ ఆవేశంగా మాట్లాడారు. సీన్ కట్ చేస్తే ఏడాది తర్వాత జగిత్యాల సభలో కనిపించారు. ఈ మధ్యలో అంతా ఫాంహౌజ్ కే పరిమితం అయ్యారు. కేసీఆర్ పై పొలిటికల్ గా తాడో పేడో అని సీఎం రేవంత్ డిసైడైనట్లు కనిపిస్తున్నారు. రేవంత్ స్ట్రాటజీని ఎదుర్కోవడం ఈజీ అని గులాబీ దళం అనుకుంటోంది. అయితే తమ వ్యూహాలు తమకు ఉన్నాయని కాంగ్రెస్ అంటోంది. 2034 దాకా కాంగ్రెస్సే ఉంటుంది అనడానికి రీజన్ కూడా ఉందంటున్నారు. BRSను ఓడించే మాస్టర్ ప్లాన్ రేవంత్ దగ్గర ఉండడంతోనే ఆ కాన్ఫిడెన్స్ తోనే మాట్లాడుతున్నారంటున్నారు.
ఆరు లక్షల కోట్ల అప్పు సంగతేంటని మంత్రి కోమటిరెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. కాళేశ్వరం రిపేర్ చేసినా నిలబడుతుందన్న గ్యారెంటీ లేకుండా పోయిందన్నారు. అసలు నల్గొండకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. సన్నబియ్యం ఆలోచనే లేదని, పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు.
పదేళ్ల పాలనలో కోట్లు సంపాదించుకున్నారని, తెలంగాణ ప్రజలను అప్పుల్లో ముంచేశారని కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఒక్క కుటుంబమే బాగు పడిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా చేశారు మండి పడుతున్నారు. తెలంగాణకు కేసీఆర్ మోసం చేశారు కాబట్టే ఫాంహౌజ్ కు జనం పరిమితం చేశారన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. విపక్ష నేతగా KCR సాలరీ తీసుకుంటున్నారు కానీ అసెంబ్లీకి హాజరు కావడం లేదన్న వాదనను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. టెక్నికల్ గా అటెండెన్స్ వేసుకుని వెళ్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. కేసీఆర్ ఇక యాక్టివ్ అయ్యే పరిస్థితి లేదంటున్నారు. మరి ఈ రాజకీయం ముందు ముందు ఇంకా ఏ రేంజ్ లో కౌంటర్, ఎన్ కౌంటర్ల దాకా వెళ్తుందో చూడాలి.
Also Read: రేవంత్ సీఎం అయ్యారంటే అది కేసీఆర్ పుణ్యమే.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Story by: Anup, Big Tv