Congress:ప్రభుత్వం ప్రజాపాలన చేయాలా? లేక బడా బిల్డర్లు, పారిశ్రామిక వేత్తల కోసం పని చేయాలా? రియల్ ఎస్టేట్ సంస్థలు..కార్పొరేట్ కంపెనీల వారికి కొపమొస్తే ప్రభుత్వాన్ని కూలగొడతారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకరరెడ్డి కాంట్రవర్సీ కామెంట్ల వెనుక ఆంతర్యం అదేనా? ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలోని బిల్డర్లు , పారిశ్రామికవేత్తలు విసుగు చెందుతున్నారంట. ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వారు సిద్దంగా ఉన్నారంట. కొత్త ప్రభాకరరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కారు పార్టీ కుట్రలు చేస్తోందా?కారు పార్టీలో జరిగిన అంతర్గత చర్చను ప్రభాకరరెడ్డి ఫ్లోలో బయటకు చెప్పేశారా?
బీఆర్ఎస్ పాలనలో రియల్ దందాలు జరిగాయని ఆరోపణలు
ప్రభుత్వం ప్రజల కోసం పని చేయాలా?. లేక రియల్ ఎస్టేట్ సంస్థలు..కార్పొరేట్ కంపెనీల కోసం పని చేయాలా?. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ సంస్థలకు మేలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. అందులో భాగంగానే పలు చోట్ల పెద్ద పెద్ద రహదారులు వేసి బడా బడా కంపెనీల వెంచర్లకు విలువ చేకూర్చి పెట్టినట్లు కూడా విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో కార్పొరేట్ కంపెనీలకు పెద్ద ఎత్తున లబ్ది చేకూర్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇలా ఎన్నో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా వాటిపై చర్యలు తీసుకోలేదు. ఇంకా ఎంక్వయిరీ దశలోనే ఉన్నాయి.
ప్రకంపనలు రేపుతున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు
అయితే బీఆర్ఎస్‌కు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బిఆర్ఎస్‌ను ఇవి మరింత ఇరకాటంలోకి నెట్టి …ఆత్మ రక్షణలో పడేశాయి అనే చెప్పాలి. ఇదే ప్రభాకరెడ్డి ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తన నియోజకవర్గానికి నిధులు రాలేదన్నారు. నియోజకవర్గం సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూల స్పందన వచ్చిందన్నారు.
పార్టీ పెద్దల మెప్పు పొందడానికి వాయిస్ మార్చారా?
కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై గులాబీపార్టీలో తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పార్టీ పెద్దల మెప్పు పొందడానికే ఇప్పుడు ఆయన వాయిస్ మారిపోయిందని … అందుకే కేసీఆర్ మెప్పు పొందడానికి వివదాస్పద వ్యాఖ్యలు చేశారంటున్నారు. తెలంగాలో కాంగ్రెస్ పాలనపై విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరుతున్నారని..అవసరం అయితే ఎమ్మెల్యేల కొనుగోలుకు తాము డబ్బులు సమకూరుస్తాం అని చెపుతున్నారు అంటూ ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను కలకలం రేపుతున్నాయి.
కేసిఆర్‌కు ఆత్మ అని పేరున్న కొత్త ప్రభాకరరెడ్డి
బీఆర్ఎస్ ప్రజల కోణంలో కాకుండా…కేవలం రియల్టర్లు, పారిశ్రామిక వేత్తల కోణంలో పని చేస్తుంది అని చెప్పినట్లు అయింది. అంతే కాదు, ఏకంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చమని బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు కోరటం అంటే ఇది మాములు విషయం కాదు. దాన్ని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, అందులోనూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆత్మ అని పేరున్న కొత్త ప్రభాకరరెడ్డి బహిరంగంగా వెల్లడించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని భావిస్తున్న బిల్డర్లు ఎవరు? పారిశ్రామిక వేత్తలు ఎక్కడివారు? అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాటల వెనుక ఏం జరిగింది.. జరుగుతోంది?
బీఆర్ఎస్ కుట్రను కేసీఆర్ సన్నిహితుడు బయటపెట్టారా?
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విపక్షాలు ఏమైనా కుట్ర చేస్తున్నాయా? లేక కారు పార్టీలో జరిగిన అంతర్గత చర్చను ఆయన బయటపెట్టారా? అన్నది చర్చల్లో నలుగుతోంది. కొత్త ప్రభాకర్‌రెడ్డి మామూలుగా మీడియాతో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. లో ప్రొఫైల్ మెయిన్‌టైన్ చేస్తుంటారు. తన పని తాను సైలెంట్‌గా చేసుకుంటూ పోతారు. అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు డబ్బులు ఇస్తామని అన్నారంటే అది ఆషామాషీ విషయం కాదంటున్నారు. 2014లో సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టినప్పుడు మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కొత్త ప్రభాకర్‌రెడ్డి వరుసగా రెండు సార్లు మెదక్ ఎంపీగా గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ఆయన ప్రభుత్వంపై వాళ్ల పార్టీలో జరుగుతున్న కుట్రను బయటపెట్టారని అనుకోవాలా? కారు పార్టీ ఆ తరహా ప్లాన్ చేస్తుందని అనుకోవాలా? గతంలో కూడా కేటీఆర్, హరీష్‌రావు వంటి నేతలు ఏడాదిలో ప్రభుత్వం పడిపోతుందని ఆ పార్టీ కార్యకర్తలను ఉత్సాహ పరిచేలా వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో కీలక నేతల తర్వాత ఈ విధంగా మాట్లాడిన మొట్ట మొదటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకరరెడ్డి అంటున్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌లోనే విమర్శలు మొదలయ్యాయి. పార్టీలో పెద్దల మెప్పు పొందడానికి ఆయన ఈ తరహా కామెంట్స్ చేశారని ఓ వర్గం టార్గెట్ చేస్తోంది.
సీరియస్ అయిన పొంగులేటి, మహేష్ గౌడ్
మరి ఇంతటి సీరియస్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎమ్మెల్యేల కొనుగోలుకు అవసరం అయిన డబ్బులు కూడా ఇస్తామని వాళ్ళు చెపుతున్నారు అని ఒక ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించటం అంటే మామూలు విషయం కాదు. ఆ క్రమంలో తెలంగాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌రెడ్డి సహా పలువురు నేతలు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు.
Also Read: మనోళ్లకు దిమ్మతిరిగే న్యూస్.. ఇక అమెరికా సంబంధం కష్టమే..!
ప్రభుత్వ పరంగా ఏమైనా చర్యలు ఉంటాయా?
మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వ పరంగా ఏమైనా చర్యలు ఉంటాయా? లేక ఇప్పటికే వదిలేసిన చాలా విషయాల మాదిరిగానే దీన్ని కూడా వదిలేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. కొత్త ప్రభాకర్ రెడ్డి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆత్మ అని…కెసిఆర్ మాటలే ఆయన చెప్పారు అని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నపుడు రియల్ ఎస్టేట్ కంపెనీ ల కోసం పని చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు భూ భారతితో దోపిడీ చేసిన భూములు పోతాయన్న భయంతోనే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదని బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు అంటూ బిఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు చెపుతూ వస్తున్నారు. ఇప్పుడు అయితే ఏకంగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఎమ్మెల్యేల కొనుగోలుకు అవసరం అయిన డబ్బులు ఇస్తామని చెపుతున్నారని ప్రకటించటం పెద్ద సంచలనంగా మారింది. మరి పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్న గులాబీ నేతల లెక్కలేంటో వారికే తెలియాలి.