BigTV English

American Marriages: మనోళ్లకు దిమ్మతిరిగే న్యూస్.. ఇక అమెరికా సంబంధం కష్టమే..!

American Marriages: మనోళ్లకు దిమ్మతిరిగే న్యూస్.. ఇక అమెరికా సంబంధం కష్టమే..!

American Marriages: మీ ఇంట్లో పెళ్లికి రెడీగా ఉన్నవారికి అమెరికా సంబంధం చూస్తున్నారా..? ఇకపై అమెరికా సంబంధం అంత ఈజీ ఏమీ కాదు. అవును, అమెరికా డ్రీమ్స్‌కు డొనాల్డ్ ట్రంప్ గండికొడుతున్నారు. అక్రమ వలసదారుల పేరుతో.. అమెరికా సంబంధం చేసుకోవాలనుకునే వారిపై కూడా పగతీర్చుకుంటున్నాడు. ఇటీవల మైగ్రేషన్ రూల్స్ టైట్ చేయడం వల్ల ఇకపై, అమెరికాలో సెటిల్ అయిన వాళ్లను గానీ, అమెరికన్స్‌ను గానీ పెళ్లి చేసుకోవడం కష్టంగా మారుతోందనే టాక్ వినిపిస్తోంది. అమెరికాలో సెటిల్ అవ్వడానికి పెళ్లిని మార్గంగా చేసుకునే వారికి ఇకపై చిక్కులు తప్పేలా లేవు. అసలు, ఎందుకీ పరిస్థితి వచ్చింది..? అమెరికా పెళ్లికి ట్రంప్ అడ్డంకిగా ఎందుకు మారారు..? ట్రంప్ కొత్త రూల్స్ చెబుతుందేంటీ..?


అమెరికా లైఫ్‌కు డిమాండ్ చాలా ఎక్కువ

డాలర్లలో జీతం.. సౌకర్యవంతమైన జీవితం.. అమెరికా సంబంధం అంటే ఎగిరి గంతేసే ఆనందం.. అంతెందుకు, అమెరికా సంబంధం వస్తే తప్ప పెళ్లి చేసుకోమని భీష్మించుకు కూర్చునేవారు ఈ కాలంలో బోలెడంత మంది ఉన్నారు. అమెరికా అంటే అంత ఆశ మరి! డాలర్ల డ్రీమ్ మాత్రమే కాదు.. అక్కడ సంపాదనతో ఇక్కడ ఆస్తుల చిట్టా పెంచుకోవచ్చు కూడా! ఎటు నుండి చూసుకున్నా.. అమెరికా లైఫ్‌కు డిమాండ్ చాలా ఎక్కువ. అయితే, ఇలాంటి వారందరినీ ఇప్పుడు ట్రంప్ టెన్షన్‌లో పెట్టారు. అమెరికా పెళ్లి ఆశలపై నీళ్లు చల్లారు. అమెరికా సిటిజన్‌ను పెళ్లి చేసుకుంటే చాలు జీవితం సెటిల్ అయినట్లే అనుకునేవారికి భారీ షాక్ ఇచ్చారు.


ట్రంప్ పెట్టిన కఠినమైన ఇమ్మిగ్రేషన్ రూల్స్

ఎందుకంటే.. పెళ్లి చేసుకున్న తర్వాత భాగస్వామిని అమెరికా తీసుకెళ్లడం ఇకపై అంత సులభం కాదు. అమెరికా పౌరుడునో.. లేదా గ్రీన్‌కార్డ్‌ ఉన్నవారినో పెళ్లి చేసుకొని, సెటిల్ అయిపోవచ్చని అనుకునే విదేశీయులకు.. పెళ్లి వరకూ ఓకే కానీ.. తర్వాత, భాగస్వామితో కలిసి అమెరికాలో కలకాలం ఉండిపోదాం అనుకుంటేనే కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంది. ట్రంప్ పెట్టిన కఠినమైన ఇమ్మిగ్రేషన్ రూల్స్.. దానికి మించిన స్క్రూటినీలు.. అమెరికన్ డ్రీమ్స్‌కు అడ్డంకగా మారాయి.

పెళ్లి నిజమైనదా కాదా అని నిరూపించుకునే కఠిన ప్రక్రియ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీ ప్రకారం.. అమెరికాకు అతుక్కుపోయిన వారిని పెళ్లి చేసుకున్న వాళ్లు.. వెంటనే ఆ దేశానికి వెళ్లి అక్కడ నివాసం ఉండటం మరింత కష్టంగా మారింది. ఈ కొత్త నిబంధనలతో.. వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు.. అసలు, ఈ పెళ్లి నిజమైనదా కాదా అనేది నిరూపించుకోడానాకి సమగ్రంగా, పూర్తి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ ఆధారాలన్నీ సమర్పించినా.. వీసా అప్రూవ్ కావాలంటే.. కఠినమైన ఇంటర్వ్యూని కూడా ఎదుర్కోవాల్సి ఉంది.

పెళ్లి సంబంధాలను సైతం తనిఖీ చేయాలనే నిర్ణయం

అలాగే, ఈ పెళ్లి బంధానికి సంబంధించి స్క్రూటినీ మరింత దారుణంగా ఉందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా, ఇటీవల రోజుల్లో.. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్.. అమెరికాలో పనిచేసే విదేశీ అధికారులు పెళ్లిళ్లకు సంబంధించి మరింత సమాచారం కోరుతున్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు అంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసలను నియంత్రించాలనే ప్రక్రియలో.. ముందుగా, అక్రమ వలసదారుల్ని స్వదేశాలకు పంపిన తర్వాత.. గ్రీన్ కార్డ్ ఉన్నవారిపై తనిఖీలు కూడా పెంచారు. ఈ క్రమంలో ఇప్పుడు, పెళ్లి సంబంధాలను సైతం తనిఖీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి ధ్రువీకరణ పత్రాలు, ఆర్థిక ఆధారాలతో పాటు…

గతంలో అమెరికా పౌరుణ్ని గానీ.. గ్రీన్ కార్డు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, ఆ దేశానికి వెళ్లి పౌరసత్వం పొందడం సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు, అక్రమ వలసలపై కఠిన నిబంధనలు విధించడం వల్ల, ఈ ప్రక్రియ మరింత కఠినంగా మారింది. ఇది ఎందుకంత కష్టం అంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో, వీసాకు దరకాస్తు చేసుకున్న తర్వాత.. తన భాగస్వామితో ఉండటానికి యూఎస్‌‌కి వెళ్లే ముందు డీప్ ఇంటర్వ్యూలను ఎదుర్కోవాల్సి ఉంది. ఇందులో..పెళ్లి సంబంధం నిజమైనదని నిరూపించడానికి.. దరఖాస్తుదారులు చాలా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో.. పెళ్లి ధ్రువీకరణ పత్రాలు, ఆర్థిక ఆధారాలతో పాటు విద్యా, ఉద్యోగం.. వగైరా, వగైరా పత్రాలు చాలా ఉన్నాయి.

సందేహాలు ఉంటే మళ్లీ స్టోక్స్ ఇంటర్వ్యూ తప్పదు

ఇవే కాకుండా.. భాస్వామితో కలిసి ఉండటం కోసం.. గతంలో కంటే ఎక్కువ అనుమతులు పొందడానికి దరఖాస్తు చేయాలి. ఆ జంట.. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్-USCISతో జరిగే వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అయితే, పెళ్లి నిజమైనదేనని నిర్ధారించడానికి ఇది ప్రక్రియలో ఒక ప్రామాణిక భాగం మాత్రమే. ఇక, ఈ ఇంటర్వ్యూ చేసే అధికారికి ప్రామాణికతపై ఏవైనా సందేహాలు ఉంటే.. మళ్లీ ఈ జంట స్టోక్స్ ఇంటర్వ్యూ అని పిలుస్తున్న మరింత కఠినమైన ఇంటర్వ్యూకి కూడా హాజరు కావాలి.

మరింత వివరణాత్మకంగా సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ

స్టోక్స్ ఇంటర్వ్యూ అంటే ఏంటి..? స్టోక్స్ ఇంటర్వ్యూ అనేది USCIS అధికారులు, ఈ వివాహం మోసపూరితంగా ఉండవచ్చని అనుమానించినప్పుడు.. మరింత వివరణాత్మకంగా నిర్వహించే సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ. అయితే, ఈ తరహా ఇంటర్వ్యూ వివాహంపై ఆధారపడి, గ్రీన్ కార్డ్ పొందాలనుకుంటున్న అన్ని కేసుల్లోనూ ఉండకపోవచ్చు. ఈ ఇంటర్వ్యూ అనేది.. మొదటి ఇంటర్వ్యూలో.. ఏవైనా అనుమానం కలిగితే.. ఏదైనా అభ్యంతరాలు వెలువడితే.. లేదా పెళ్లికి నిజమైందని నిరూపించడంలో తగినంత ఆధారాలు లేనప్పుడు మాత్రమే జరుగుతుంది.

మీరు మంచం మీద ఎటువైపు పడుకుంటారు? లాంటి ప్రశ్నలు

ఈ ఇంటర్వూ పేరును 1975లో సంచలనం అయిన- స్టోక్స్ వర్సెస్ INS- కోర్టు కేసు నుండి స్వీకరించారు. ఈ కేసు.. ఇలాంటి ఇంటర్వ్యూల సమయంలో దరఖాస్తుదారులకు నిర్దిష్ట హక్కులను కూడా ఏర్పాటు చేసింది. ఇక, ఇందులో ప్రశ్నలు ఎలా ఉంటాయంటే.. మరింత డీప్‌గా.. వ్యక్తిగత విషయాలను కూడా నిర్మొహమాటంగా అడుగుతారు. ఉదాహరణకు.. మీ భాగస్వామితో కలిసి పడుకున్నప్పుడు మంచం మీద మీరు ఎటువైపు పడుకుంటారు? కుడి వైపా.. లేదంటే, ఎడమవైపు పడుకుంటారా..? ఇలాంటి ఇబ్బంది కలిగించే ప్రశ్నలు చాలా ఉంటాయని అంటున్నారు.

రోజువారీ దినచర్యలు, గృహాన్ని నిర్వహించే ఏర్పాట్లు

ఈ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు ఉంటోయో ఒకసారి చూద్దాం… పెళ్లి జంట ఎలా కలుసుకున్నారు? అనే బేసిక్ ప్రశ్న నుండీ.. వాళ్ల డేటింగ్ హిస్టరీ.. రోజువారీ దినచర్యలు.. గృహాన్ని నిర్వహించే ఏర్పాట్లు, ఆర్థిక వివరాలు, ఉమ్మడి ఖాతాలు, బిల్లులు వంటి అంశాలు కూడా ఉంటాయి. అలాగే, మీ బాత్రూంలో ఎన్ని కిటికీలు ఉన్నాయి? మీ జీవిత భాగస్వామికి ఏదైనా ఆహార అలెర్జీలు ఉన్నాయా?
ముందు తలుపుకు ఎన్ని తాళాలు ఉన్నాయి? ఇంట్లో ఫలానా ఫలానా ఫర్నిచర్‌ను ఎక్కడెక్కడ ప్లేస్‌ చేస్తారు అనే విషయాల నుండీ.. పొరుగువారితో ఎలా ఉంటారు.

అన్ని జంటలు స్టోక్స్ ఇంటర్వ్యూను ఎదుర్కోకపోవచ్చు

జీవన పరిస్థితి వివరాలు… పుట్టినరోజులు, పర్యటనలు..ఇద్దరూ కలిసి గడిపిన సెలవులు వంటి వ్యవహారాల వరకూ.. అంతేగాక.. మీరు ఇంట్లో ఏ టూత్‌పేస్ట్ బ్రాండ్‌ ఉపయోగిస్తారు? సాధారణంగా ఉదయం ఎవరు మొదట మేల్కొంటారు? మీరు చివరిగా కలిసి డిన్నర్‌కు ఎక్కడికి వెళ్లారు? ఇలా ఆ జంటకు సంబంధించిన లోతైన వివరాలను సేకరిస్తారు. పెళ్లి ప్రామాణికతను పరీక్షించడానికి మరిన్ని ప్రశ్నలు కూడా అడుగుతారని తెలుస్తోంది. అయితే, అన్ని జంటలు ఈ స్టోక్స్ ఇంటర్వ్యూను ఎదుర్కోకపోవచ్చు. USCIS అధికారులు మొదటి ఇంటర్వ్యూ సమయంలో ఏవైనా సమస్యలను గుర్తిస్తేనే ఈ లెవల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది.

భార్యా భర్తలిద్దర్నీ విడివిడిగా ఇంటర్వ్యూ

మొత్తంగా, ఈ స్టోక్స్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే.. అదేదో నిందితుల్ని ప్రశ్నించినట్లు.. భార్యా భర్తలిద్దర్నీ విడివిడిగా ఇంటర్వ్యూ చేయడం… కలిపి ఇంటర్వ్యూ చేయడం.. వారి ముఖ కవళికల్ని పరిశీలించడం… మైండ్ రీడింగ్ చేయడం.. ఇలా చాలా క్రిటికల్‌గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో, వ్యక్తిగత విషయాలను కూడా గుచ్చి గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టడం ముఖ్యమైన పార్ట్‌. ఇలాంటి చోట, నిర్దిష్ట ప్రశ్నలకు వివరణాత్మక సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక, మన కేసును మనం సమర్థించడానికి సాధ్యమైనన్ని అదనపు డాక్యుమెంట్లను సమర్పించాలి.

అమానాస్పద వ్యత్యాసాలు ఉంటే గ్రీన్ కార్డ్ తిరస్కరణ

అయితే, ఇంతటితో ప్రక్రియ పూర్తి కాదు. ఈ విభిన్న ఇంటర్వ్యూల తర్వాత.. ఇంటర్వ్యూ బోర్డులోని సదరు అధికారులు అంతా కలిసి వారి వారి అబ్జర్వేషన్లను, జంట ప్రతిస్పందనలను పోల్చి చూస్తారు. ఇక, సమాధానాల మధ్య ఏవైనా అనుమానాస్పద వ్యత్యాసాలు ఉంటే.. నిర్మొహమాటంగా గ్రీన్ కార్డ్ దరఖాస్తును తిరస్కరిస్తారంట. లేదంటే, మరోసారి దర్యాప్తు కోసం డేట్ ఇస్తారు. ఇక, ఇప్పటికే విసిగిపోయిన దరకాస్తుదారు దాని కోసం నెలలు, ఒక్కోసారి సంవత్సారాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు నిపుణులు.

ఇంటర్వ్యూని ఎలా ఎదుర్కుంటే గ్రీన్ కార్డ్ దక్కించుకోవచ్చు..?

ఇన్ని కష్టాల మధ్య అమెరికన్ డ్రీమ్స్ అవసరమా అని చాలా మంది అనుకోవచ్చు. మరీ అంత నిరాశ చెందనవసరం లేదు. ఎందుకంటే, సవాలక్ష ప్రశ్నలకు శతకోటి సమాధానాలు ఉంటాయి. ఇంతకీ, ట్రంప్ వేసిన ఈ వ్యూహం నుండి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? దీని గురించి నిపుణులు ఇస్తున్న సూచనలేంటీ..? అసలు, పెళ్లి ద్వారా గ్రీన్ కార్డ్ పొందడానికి ఎలాంటి అర్హతలు అవసరం.. ఏమేం డాక్యుమెంట్లు కావాలి..? ఇంటర్వ్యూని ఎలా ఎదుర్కుంటే గ్రీన్ కార్డ్ దక్కించుకోవచ్చు..?

భాగస్వామికి హెచ్‌-1బీ ఉంటే గ్రీన్‌కార్డుకు దరకాస్తు ఛాన్స్

అమెరికా పౌరులను పెళ్లి చేసుకునేవారు ముందుగా స్థానిక కాన్సులేట్‌ ఆఫీసర్స్​ ఇంటర్వ్యూను ఫేస్ చేయాలి. ఇది కూడా కఠినంగా ఉండనుందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ భాగస్వామికి ఇప్పటికే హెచ్‌-1బీ వర్క్‌ వీసా ఉంటే గ్రీన్‌కార్డుకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయితే, అప్పుడు కూడా అమెరికన్ సిటిజన్‌షిప్‌-ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ ఆఫీసర్లు ఇంటర్వూను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది మొదటి దాని కంటే కఠినంగానే ఉంటుంది. ఇక, ఈ ప్రక్రియతో పాటు ఫామ్‌ ఐ-130 అనుమతిని పొందడానికి 14 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. తర్వాత, 3.5 నెలల్లో ఇంటర్వ్యూలు జరగొచ్చు. ఈ మొత్తం ప్రక్రియ కూడా 17 నుండి 20 నెలల కాలం పట్టొచ్చు.

ఇప్పటి దరకాస్తుల పరిశీలనకు మరో మూడు నాలుగేళ్లు

అంటే, గ్రీన్‌కార్డ్‌ దారులకు కూడా తమ భాగస్వామిని ఇంటికి తీసుకురాడానికి చాలా సమయం పడుతుంది. ఇక, ఇప్పటికే, ఎఫ్‌-2-ఏ కేటగిరీకు సంబంధించిన దరకాస్తులు ఇప్పటికే భారీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం, 2022 జనవరి 1న అప్లై చేసుకున్న వారి దరఖాస్తులను ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అంటే, ఇప్పుడు దరకాస్తు చేసుకున్న అప్లికేషన్లు పరిశీలించడానికి మరో మూడు నాలుగేళ్లు పడుతుందనే అభిప్రాయం ఉంది. కాబట్టి, దరఖాస్తుదారులు తగినంత వేగంగా పేపర్‌ వర్క్‌ను పూర్తి చేయాలని, కఠిన ప్రశ్నలతో ఇంటర్వ్యూకు సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

K-1 కాబోయే భర్త(e) వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

నిజానికి, జంట ఇద్దరూ అమెరికా బయట ఉంటే.. K-1 కాబోయే భర్త(e) వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని వల్ల జీవిత భాగస్వామిని కూడా అమెరికాకు తెచ్చుకోడానికి, పెళ్లి చేసుకోడానికి, శాశ్వత నివాసిగా మారడానికి అనుమతి ఉంటుంది. ఇక్కడ టూరిస్ట్ వీసా వంటి తాత్కాలిక వీసాపై కూడా వివాహం చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, ఇది ఆటోమేటిక్‌‌గా ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలను ఇవ్వదు. తాత్కాలిక వీసాలో ఉన్నప్పుడు వివాహం చేసుకుని.. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. 90-రోజుల నియమం అనేది ఉంటుంది.

గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే 90-రోజుల నియమం

ఇది అమెరికన్ పౌరుడు, గ్రీన్‌కార్డ్ హోల్డర్ స్థితి సర్దుబాటుకు తీసుకునే సమయం. ఇక, పెళ్లి తర్వాత.. పౌరసత్వం లేని జీవిత భాగస్వామి.. వివాహ ఆధారిత గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోచ్చు. ఇది వాళ్లిద్దరూ అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి, పని చేయడానికి అనుమతి ఇస్తుంది. అయితే, గ్రీన్ కార్డ్ పొందిన తర్వాత, పౌరసత్వం లేని జీవిత భాగస్వామి నేచురల్ ప్రక్రియ ద్వారా అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కావచ్చు. దీనికి నివాసం, భాషా ప్రావీణ్యం వంటి కొన్ని బేసిక్ విషయాల్లో స్పష్టంగా ఉంటే సరిపోతుంది.

వివిధ రాష్ట్రాల్లో విభిన్న నిబంధనలు

అయితే, అమెరికాలో వివాహ చెల్లుబాటుకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో విభిన్న నిబంధనలు ఉన్నాయి. అమెరికా ఫెడర్ చట్టాలు వలసలను నియంత్రిస్తుండగా.. ప్రతి రాష్ట్రానికి వివాహానికి సంబంధించి కనీస వయస్సు, అర్హతలకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు సొంత చట్టాలు ఉన్నాయి. అలాగే, వివాహ చెల్లుబాటు విషయంలోనూ.. యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారులు.. సాధారణంగా ఈ వివాహం జరిగిన ప్రదేశం చట్టం ప్రకారం చట్టబద్ధమైనదైతే దానిని చెల్లుబాటు అయ్యేదిగా పరిగణిస్తారు.

నివాస రుజువు, విడాకుల డిక్రీలు, జనన ధృవీకరణ

అయితే, ఇమ్మిగ్రేషన్ చట్టాలను తప్పించుకునే ఉద్దేశ్యంతో జరిగే వివాహాలను మాత్రం USCIS గుర్తించదు. ఇక, దీని ప్రకారం.. సాధారణంగా వాలీడ్ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ఫోటో గుర్తింపు కార్డులు అవసరం. అలాగే, అమెరికాలో ఈ జంట నివశించే రాష్ట్రం వివాహం చేసుకోవడానికి అర్హులని నిర్ధారిస్తూ.. ఓ అఫిడవిట్‌ను కూడా అందించాల్సి ఉంటుంది. ఇక్కడ, రాష్ట్రాన్ని బట్టి… నివాస రుజువు, విడాకుల డిక్రీలు, జనన ధృవీకరణ పత్రాలను అందించాల్సి రావచ్చు.

వివాహం జరిగి రెండేళ్ల కంటే తక్కువ అయితే..

ఈ సందర్భంలో… షరతులతో కూడిన గ్రీన్ కార్డ్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. వివాహం జరిగి రెండు సంవత్సరాల కంటే తక్కువ అయితే.. పౌరసత్వం లేకుండా.. జీవిత భాగస్వామికి షరతులతో కూడిన గ్రీన్ కార్డ్‌ వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో షరతులను తొలగించాలంటే.. అమెరికా పౌరుడు తన జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక, సదరు వివాహం, మోసం అని తెలిస్తే అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. వివాహం కేవలం వలస ప్రయోజనాల కోసమే జరిగిందని అనుమానిస్తే.. కేసులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది.

స్క్రూటినీ పెరిగే కొద్దీ గ్రీన్ కార్డ్‌ పొందడంలో సంక్లిష్టత

ఇక, అమెరికా పౌరుడు.. తన జీవిత భాగస్వామి వీసా ఇంటర్వ్యూకు హాజరు కాలేకపోతే.. వారి సంబంధం నిజాయితీగా ఉందని నిరూపించాల్సిన భారం పూర్తిగా దరఖాస్తుదారుడిపైనే ఉంటుంది. అందుకే, స్క్రూటినీ పెరిగే కొద్దీ.. గ్రీన్ కార్డ్‌కు పెరుగుతున్న సంక్లిష్టతను ఎదుర్కోడానికి జంట పూర్తిగా సిద్ధంగా ఉండాలని న్యాయ నిపుణులు కోరుతున్నారు. భావోద్వేగపరంగా మాత్రమే కాకుండా.. చట్టపరంగా, డాక్యుమెంట్ల పరంగా కూడా వివాహ సంబంధానికి, వక్తికి సంబంధించిన సమాచారం అంతా క్లియర్‌గా ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

“ఫ్రాడ్ మ్యారేజ్” గుర్తించడానికి లోతైన ఇంటర్వ్యూలు

పెళ్లితో అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలని అనుకుంటే.. కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా, వివాహం నిజమైనదని నిరూపించాలి. ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు నిర్ణయించిన పెళ్లి అయినా దానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉండాలి. కేవలం గ్రీన్ కార్డు కోసం కాదనేది అమెరికన్ అధికారులు నమ్మాలి. ఎందుకంటే.. “ఫ్రాడ్ మ్యారేజ్” గుర్తించడానికి చాలా లోతైన ఇంటర్వ్యూలు ఉంటాయి. అందుకే, వివాహ సంబంధం ప్రామాణికతను నిరూపించడానికి ఫోటోలు, జాయింట్ బ్యాంక్ అకౌంట్‌లు, లీజ్ ఒప్పందాలు, బిల్లులు, సామాజిక కార్యక్రమాల ఆధారాలు సేకరించాలి.

డాక్యుమెంట్లు అన్నీ ఇంగ్లీష్‌లో.. లేదంటే సర్టిఫైడ్ ట్రాన్స్‌లేషన్‌

ఇక, అవసరమైన అన్ని ఫారమ్‌లు.. అంటే, ఐ-130, ఐ-485 మొదలైనవన్నీ ఖచ్చితంగా పూర్తి చేయాలి. అలాగే, వివాహ ధృవీకరణ పత్రం, జనన ధృవపత్రాలు, పాస్‌పోర్ట్ కాపీలు, గత వివాహాలకు సంబంధించిన డివోర్స్ పత్రాలు ఉంటే అవీ సిద్ధంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా, ఈ డాక్యుమెంట్లు అన్నీ ఇంగ్లీష్‌లో లేదంటే సర్టిఫైడ్ ట్రాన్స్‌లేషన్‌ అయి ఉండాలి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత… కీలకమైన, ఇంటర్వ్యూ కోసం సిద్ధం కావాలి. ఈ ఇంటర్వ్యూలో జంట ఇద్దరూ ఒకే రకంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. వివాహం నుండి ఎలా కలుసుకున్నారు, రోజువారీ జీవనం, ఆర్థిక ఏర్పాట్లు వంటి జీవన వివరాలపై సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వాలి.

Also Read: అమెరికాలో భారతీయుల సంఖ్య తగ్గించడమే టార్గెట్.. ఆ వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం..

నకిలీ డాక్యుమెంట్లు, తప్పుడు సమాచారంతో శాశ్వత నిషేధం

అయితే, చట్టపరమైన సలహాలు కూడా తీసుకోవడం ముఖ్యం అంటున్నారు ఇమ్మిగ్రేషన్ నిపుణులు. దీని కోసం ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులను సంప్రదించమని సూచిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, తప్పుడు సమాచారం ఇస్తే.. అది శాశ్వత నిషేధానికి దారితీస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక, ముందుగా చెప్పుకున్నట్లు.. పెళ్లి జరిగి రెండేళ్ల కంటే తక్కువ సమయమే అయితే.. మొదటిగా “కండీషనల్ గ్రీన్ కార్డు” మంజూరు చేసే అవకాశం ఉంది. దీనిని రెండేళ్ల తర్వాత పర్మినెంట్ రెసిడెంట్‌గా మార్చడానికి మళ్లీ ఐ-751 దరఖాస్తు చేయాలి. ఈ సమయంలో వివాహం కొనసాగుతుందనీ.. లేదంటే, ఒకవేళ విడాకులు తీసుకున్నప్పటికీ అది నిజమైన వివాహం అని నిరూపించాలి.

లంచాలు ఇవ్వడం, రహస్య ఒప్పందాలు

ఇక, గ్రీన్ కార్డు కోసం లంచాలు ఇవ్వడం, రహస్య ఒప్పందాలు చేసుకోవడం కూడా డేంజరే. అవి గుర్తిస్తే.. ఇమ్మిగ్రేషన్ నిషేధంతో పాటు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు, అర్థం అయ్యిందిగా.. ఇలాంటి ఇమ్మిగ్రేషన్ విధానాలతో అమెరికా సంబంధాలను పొందడం ఒకరకంగా పెద్ద యుద్ధం చేయడంగానే భావించాలి. అయితే, అందులో విజయం వరిస్తుందా లేదా అనేది సస్పెన్స్ సినిమా లాంటిందే మరి!

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×