AP Liquor Scam Case: వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన లిక్కర్ పాలసీపై విచారణలు కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కాంలో పాత్ర, ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ముందస్తు ప్రయత్నాల్లో పడ్డారు. జగన్ సన్నిహితులైన కసిరెడ్డి వంటి వారు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. ఎంపీ మిధున్‌రెడ్డి, వైసీపీకి రిజైన్ చేసిన విజయసాయరెడ్డి సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇంత కాలం కలిసి పనిచేసిన నేతలే నువ్వు మోసగాడివంటే .. నువ్వు మోసగాడివని.. ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటుండటం ఆ పార్టీ శ్రేణులకు షాక్ ఇస్తోందంట. జగన్‌తో క్లోజ్‌గా మెసిలిన వారే అలా పరస్పర ఆరోపణలకు దిగుతుండటంతో ఆ పార్టీలో అంతా అంతేనా అన్న టాక్ నడుస్తోంది
లిక్కర్ స్కాంలో వైసీపీ కీలక నేతలకు బిగుస్తున్న ఉచ్చు
ఆంధ్రప్రవేశ్‌లో 2019-24 మధ్య కాలంలో మద్యం విక్రయాలు, ఆర్డర్లలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. దానిపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో వైసీపీలో కీలక నేతలకు ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్‌లోని పాత్రధారులు, సూత్రధారులను సిట్ అధికారులు పిలిచి విచారిస్తున్నారు. ఇప్పటికే అధికారులు, వ్యాపారులు, మధ్యవర్తులతోపాటు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు.
రాజ్‌కసిరెడ్డితో తనకు సంబంధం లేదంటున్న మిథున్‌రెడ్డి
ఈ క్రమంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డిని మిథున్ రెడ్డిని సిట్ విజయవాడలో సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ స్కామ్‌లో పరారీలో ఉన్న రాజ్ కసిరెడ్డి గురించి అడిగినప్పుడు, ఆయనతో తనకు ఉన్నది పార్టీ సంబంధమేనని ముందు సిట్ విచారణలో మిథున్‌రెడ్డి చెప్పారంట. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం గురించి ఏడుగంటలపాటు వంద ప్రశ్నలు వేసినా దాటవేత ధోరణిలోనే ఆయన వ్యవహరించారంట.
మద్య నిషేదం అంటూ ప్రయోగాలు చేసిన వైసీపీ ప్రభుత్వం
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరల్ని అమాంతం పెంచేసింది. సంపూర్ణ మద్య నిషేధంలో భాగమంటూ మద్యం విక్రయాలపై రకరకాల ప్రయోగాలు చేశారు. 2019 చివరిలో కొత్త లిక్కర్ పాలసీని వైసీపీ ప్రవేశపెట్టింది. మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వమే మద్యం విక్రయించేలా వైన్ షాపుల్ని ఏర్పాటు చేశారు.
మద్యం ధరల్ని పెంచడంతో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా
ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం భారీగా పెరిగింది. అదే సమయంలో మద్యం బ్రాండ్లపై తీవ్ర విమర‌్శలు వచ్చాయి. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఏపీలో మద్యం ధరల్ని పెంచేశారు. ఆ తర్వాత పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రవాణా అధికం కావడం, నాటుసారా వినియోగం పెరగడంతో విధిలేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలతో సమానం చేశారు.
వాసుదేవరెడ్డి, రాజ్‌కసిరెడ్డి కనుసన్నల్లో నడిచిన తతంగం
ధరల్ని కొంత మేర తగ్గించినా ఏపీలో మద్యం బ్రాండ్ల మతలబు మాత్రం ఐదేళ్ల పాటు సాగింది. జనం కోరుకునే బ్రాండ్లను కాకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మే బ్రాండ్లను మాత్రమే కొనాల్సిన పరిస్థితి కల్పించారు. బ్రాండ్లతో సంబంధం లేకుండా రూ.150 నుంచి ధరల్ని ఖరారు చేసి మద్యాన్ని విక్రయించారు. దీంతో నాణ్యత లేని మద్యాన్ని కూడా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందనే అక్రోశం ప్రజల్లో పెరిగింది. ఊరు పేరు లేని బ్రాండ్లను ఊరూరా విక్రయించడంలో ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది.
షాపులకు ఏ బ్రాండ్లు వెళ్లాలో నిర్ణయించిన కీలక వ్యక్తులు
ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి కనుసన్నల్లో ఈ కొనుగోళ్ల తతంగం నడిచిందంటున్నారు. మద్యం విక్రయాలను కేవలం నగదును మాత్రమే అనుమతించడం ద్వారా ఎప్పటికప్పుడు ముడుపులు నేరుగా ప్రభుత్వ పెద్దలకు చేరి ఉంటాయని కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులను విచారించడంతో లిక్కర్ ఇండెంట్ల గుట్టు మాత్రం వీడింది. ఏ రోజు ఏ దుకాణానికి ఏ బ్రాండ్లు వెళ్లాలో కూడా ప్రభుత్వంలో కీలక వ్యక్తులే నిర్ణయించే వారంట.
రూ.3వేల కోట్ల అక్రమాలు జరిగాయంటున్న కూటమి నేతలు
మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో రూ.3వేల కోట్ల అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ముడుపులన్నీ చివరిగా ఓ చోటకు చేరినట్టు సాక్ష్యాధారాలు లభించాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, ఎంపీ మిథున్ రెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో సీఐడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా లిక్కర్ సిండికేట్ల అంశాన్ని ప్రస్తావించారు. ఈ కేసుల్లో సాయిరెడ్డి అప్రూవర్‌గా మారుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. సాయిరెడ్డి గుట్టు విప్పితే వైసీపీ పెద్దలు చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది.
రాజ్ కసిరెడ్డిని అతి పెద్ద మోసగాడు అంటున్న విజయసాయిరెడ్డి
ఆ క్రమంలో జగన్ పాలనలో అక్రమాలపై ఇన్నాళ్లు ఒక ఎత్తు, ఇప్పుడు మరో ఎత్తు అన్నట్లు వైసీపీ మాజీ, ప్రస్తుత నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ సందర్భంగా లిక్కర్ స్కాంలో కీలక పాత్రధారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని అతి పెద్ద మోసగాడుగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. తనవారికి చెందిన అరబిందో సంస్థ నుంచి వైసీపీ నేతలకు వంద కోట్ల రుణం ఇవ్వడం దగ్గరనుంచి.. రాజ్ కసిరెడ్డి మోసం వరకు అన్ని విషయాలను ఓపెన్‌గా చెప్పుకొచ్చారాయన. కొత్త పేర్లను సైతం బయటపెట్టారు.
సాయిరెడ్డి చరిత్ర బయట పెడతానంటున్న కసిరెడ్డి
విజయసాయిరెడ్డి ఆరోపణలకు అజ్ఞాతం నుంచే స్పందించారు రాజ్ కసిరెడ్డి. వైసీపీ మాజీ ఎంపీపై అత్యంత ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోగానే ..విజయసాయి రెడ్డి చరిత్ర అందరి ముందు బయట పెడతానని హెచ్చరించారాయన.
Also Read: మాజీ మంత్రులకు శిల్ప స్ట్రోక్..? పెనుగొండలో వైసీపీకి దిక్కెవరు?
మరోవైపు ఇప్పటికే జగన్ కోటరీపై విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి.. తాజగా వైసీపీలోని పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి రావడంలో తన పాత్ర ఎందో ఉందన్న ఆయన.. 2019 ఎన్నికల ముందు తాను, ప్రశాంత్‌కిషోర్ కలిసి స్ట్రాటజీలు రచించి జగన్‌కు మార్గదర్శకం చేసి పార్టీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించామని వెల్లడించారు. అయితే అధికారంలోకి వచ్చాక జగన్ కోటరీ కారణంగానే తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ క్రమంగా దూరం అవ్వాల్సి వచ్చిందన్నారు.
జగన్ కోటరీని మరోసారి టార్గెట్ చేసిన సాయిరెడ్డి
జగన్ కోటరీపై మరోసారి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించడంతో ఆయనకు వైసీపీ ఎంపీ వైవీ సుప్పారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు . అధికారంలో ఉన్నప్పుడు కోటరీ నడిపింది ఎవ్వరు? కోటరీ ఉందా లేదా సాయి రెడ్డికి తెలీదా అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అందరితో చర్చించి జగన్ నిర్ణయాలు తీసుకున్నారని.. ఐదేళ్లలో చక్రం తిప్పిన వాళ్లలో సాయి రెడ్డి ఉన్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటని ధ్వజమెత్తారు.
నేతల మాటల తూటాలతో వైసీపీ శేణుల్లో గందరగోళం
ఇప్పుడు పార్టీకి దూరమైనప్పటికీ.. విజయసాయిరెడ్డి ముందు నుంచి జగన్‌కు అత్యంత సన్నిహితుడే. అక్రమాస్తులు కేసులో సాయిరెడ్డి కూడా జగన్‌తో కలిసి 16 నెలలు రిమాండ్ ఖైదీగా ఉండి వచ్చారు. ఇటు చూస్తే రాజా కసిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు మాజీ ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తులు. ఈ నేపధ్యంలో వారి మధ్య పేలుతున్న మాటల తూటాలు వైసీపీ శ్రేణులను తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయంట. ఏ కేసులో ఎవరు ఎప్పుడు జైలు కెళ్తారో తెలియని పరిస్థితుల్లో ఈ సీనియర్ల రచ్చేంటని తలలు పట్టుకుంటున్నారంట. ఈ తతంగం అంతా చూస్తూ కూటమి నేతలు… అందరూ అందరే.. అని సెటైర్లు విసురుతున్నారు