ధర్మవరం రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు వైసీపీ వర్సెస్ కూటమిగా ఉన్న రగడ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. అనూహ్యంగా కూటమి వర్సెస్ కూటమిగా పరిస్థితులు మారాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక అధికారి నియామకం మూడు పార్టీల ఎన్డీఏ కూటమిలో చిచ్చుకు కారణమైందని తెలుస్తోంది. రీసెంట్ గానే ధర్మవరం పర్యటనకు వచ్చిన మంత్రి సత్య కుమార్ కు ఆ అధికారి విషయంలో నిరసన ఎదురవడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఇష్యూ అంతటికీ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అధికారి పేరు మల్లిఖార్జున. ధర్మవరం మున్సిపాలిటీ కమిషనర్‌గా మల్లికార్జునను నియమించడం ఎన్డీఏ కూటమిలో చిచ్చురగిల్చింది. వైసీపీ హయాంలో తమను వేధించిన అధికారిని తిరిగి కమిషనర్‌గా తీసుకురావడం ఏమిటని టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. గత నాలుగేళ్లు విధులు నిర్వర్తించిన మల్లికార్జున.. ఆ సమయంలో వైసీపీ నాయకులకు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనుకూలంగా ఉండి టీడీపీ నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్లను చేర్చి.. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించి.. వైసీపీకి అనుకూలంగా పని చేశారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
మల్లికార్జునపై గతంలో పలు మార్లు ఫిర్యాదులు సైతం చేశామంటూ టీడీపీ నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. పెండింగ్ బిల్లుల విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అంటున్నారు. అంతే కాకుండా తనని ప్రశ్నించిన నేతల ఇళ్లు, ఆస్తులను సైతం ధ్వంసం చేస్తానని బెదిరించేవారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాంటి వ్యక్తికి మళ్లీ ధర్మవరంలోనే అదే పోస్టింగ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ సైతం మున్సిపల్ కమిషనర్ ను మార్చాలంటూ తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు చెబుతున్నారు.
ఈ ఊహించని పరిణామాలతోనే మంత్రి సత్య కుమార్ కి నిరసన సెగ ఎదురైంది. ధర్మవరం పర్యటనలో ఆయన కాన్వాయ్ ను అడ్డగించారు టీడీపీ నేతలు. మల్లికార్జునని తప్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మంత్రి కారుని దాదాపు గంట పాటు నిలిపివేశారు. మల్లికార్జునని తిరిగి ధర్మవరం లోకి ఎవరు తీసుకొచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలకు సపోర్ట్ గా జనసేన నేతలు సైతం మల్లికార్జున నియామకాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మంత్రి అనుచరులు మాత్రం.. GAD నుంచి పోస్టింగ్ రావడంతో ఆయన తిరిగి మళ్లీ వచ్చారని.. మంత్రికి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు.
Also Read: తిరుమల భక్తులపై జగన్ ప్రభుత్వం కుట్ర?
మల్లికార్జున నియామకాన్ని టీడిపి, జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. బీజేపీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. ఇది తమకు సంబంధం లేని వ్యవహారమని, అంతకు ముందు జరిగిన విషయాలు తెలియవని చెబుతున్నారు. ధర్మవరానికి యువకుడైన అధికారి కావాలని మాత్రమే అడిగామని.. ఫలానా అధికారి కావాలని అడగలేదని స్పష్టం చేశారు. ధర్మవరం మున్సిపాలిటీ ఆదాయాన్ని మల్లికార్జున భారీగా పెంచాడనే మంచి పేరు కూడా ఉండటంతో.. GAD అధికారులు, మంత్రి నారాయణ కలిసి.. మల్లికార్జున పేరు సిఫార్సు చేసి ఉంటారని స్పష్టం చేశారు.
ఇక ఈ వివాదంపై మంత్రి సత్యకుమార్ కూడా స్పందించారు. కమిషనర్ వ్యవహారశైలిపై గతంలో కొన్ని వివాదాలున్నాయని.. ఆ విషయాన్ని కూటమి నేతలు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. మున్సిపల్ కమిషనర్‌ను మార్చాల్సి వస్తే ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. అంతిమంగా తనకు ధర్మవరం అభివృద్దే ముఖ్యమన్నారు మంత్రి సత్యకుమార్.
అధికారి విషయంలో మాత్రమే మంత్రిని అడ్డుకున్నామని.. ఆయనకు ఏ మాత్రం వ్యతిరేకం కాదని టీడిపి శ్రేణులు చెబుతున్నాయి. అలానే పరిటాల శ్రీరామ్ కూడా ఈ వ్యవహారంపై ఓపెన్ అయ్యారు. ధర్మవరంలో కూటమి నేతల మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే సమస్య వచ్చిందన్నారు. సత్య కుమార్‌పై పూర్తి నమ్మకం ఉందన్నారు. మూడు పార్టీలకు చెందిన నేతలంతా కలిసి జిల్లాను అభివృద్ది చేసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రిని ఘొరావ్ చేసిన ఘటన దురదృష్టకరమన్నారు.
సమస్యను పరిష్కరించేందుకే ప్రయత్నిస్తున్నామని మంత్రి సత్యకుమార్, పరిటాల శ్రీరామ్ చెప్పడంతో… ఇక ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందని జిల్లా కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఒక్క అధికారి విషయంలో కూటమిలో నిరసన జ్వాలలు రేగడం చూస్తుంటే… భవిష్యత్‌లో కూటమి నేతల మధ్య సఖ్యత ఎలా ఉంటుందో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.