Medaram Jatara 2026: ఆదివాసీ సాంప్రదాయాలకు, ఆత్మగౌరవానికి, పోరాటానికి, అస్తిత్వానికి ప్రతీక మేడారం సమ్మక్క సారలమ్మ జాతర… వనంలో నుంచి జనంలోకి వచ్చి భక్తుల కోర్కేలు తీర్చే ఆ అడవి తల్లుల రాకకు వేళ అయ్యింది.. మూడు రోజుల పాటు భక్తుల పూజలు అందుకునేందుకు సర్వం సిద్ధమైంది. తల్లీ మమ్మల్ని చల్లంగ చూడు అంటూ ఇప్పటికే మేడారం బాట పడుతున్నారు భక్తులు. ఇంతకీ ఈసారి మేడారం ప్రత్యేకతలేంటి? కొత్తగా కనిపించేది ఏంటి?
ఆదివాసీ సాంప్రదాయాలకు, ఆత్మగౌరవానికి, పోరాటానికి, అస్తిత్వానికి ప్రతీక మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. వనంలో నుంచి జనంలోకి వచ్చి భక్తుల కోర్కేలు తీరుస్తారు సమ్మక్క, సారలమ్మలు. మూడు రోజుల పాటు భక్తుల పూజలు అందుకునేందుకు గద్దెలపై కొలువుదీరేందుకు సిద్ధమయ్యారు. 900 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఇలాంటి గిరిజన జాతర దేశంలో మరెక్కడ కనిపించదు.
ఇప్పటికే మేడారం జాతరకు వెళ్లే దారులు కిక్కిరిసిపోయాయి. జంపన్నవాగు జనసంద్రమైంది. జాతర మొదలు కావడానికి ముందే పరిస్థితి ఇలా ఉంటే.. ఒక్కసారి అసలు టైమ్‌లో ఎలా ఉంటుందో ఊహించుకోండి. కామన్ మ్యాన్ నుంచి మొదలుపెడితే దేశంలోని వీవీఐపీలు కూడా మేడారానికి వెళ్లి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. బెల్లం ముద్దలనే.. బంగారు ముద్దలుగా మురిసిపోయే మహిమాన్విత జాతర ఇది. ఆ వనదేవతలను దర్శించుకొని నిలువెత్తు బంగారం సమర్పిస్తే కోరిన కోర్కేలు తీరుతాయని భక్తజనం నమ్మకం.
ఒకప్పుడు మేడారం జాతరంటే.. భక్తుల పూనకాలు, బెల్లం మొక్కుల సమర్పణ, జంపన్న వాగు గుండా ఎడ్ల బండ్ల ప్రయాణాలు, సమ్మక్క-సారలమ్మ గద్దెల దగ్గర దర్శనాలు.. ఇలా ఎంతో కోలాహలంగా సాగేది. స్వాతంత్ర్యానికి ముందు మేడారం జాతరని చిలుకల గుట్టపై ఆదివాసీలు మాత్రమే జరుపుకునేవారు. క్రమంగా భక్తుల సంఖ్య పెరగడం, గిరిజనేతరులు సైతం జాతరకు పోటెత్తడంతో.. అమ్మవార్ల గద్దెలను ఇప్పుడున్న ప్రాంగణానికి మార్చారు.
అడవి తల్లులను దర్శించడం అంటే మనం ప్రకృతిని ఆరాధించినట్టే. ఇక్కడ విగ్రహాలు ఉండవు. కేవలం కుంకుమ భరిణలు, గద్దెలే ఉంటాయి. ప్రకృతిని, చెట్లను దైవంగా భావించే గిరిజన సంప్రదాయం ఇది. ఈ స్వచ్ఛత భక్తులలో మరింత నిష్టను పెంచుతుంది. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంటే సంతానం కలుగుతుందని, రోగాలు నయమవుతాయని, కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గద్దె పైకి చిలుకల గుట్ట నుండి అమ్మవారు వచ్చే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోవడం వారి భక్తికి పరాకాష్ట.
మేడారం జాతర అనేది ఒక చారిత్రక వారసత్వం. తల్లీ.. నిన్నే నమ్ముకున్నాం అంటూ కోట్లాది గొంతుకలు ఒకేసారి పలికే ఆ నినాదం మేడారం అడవుల్లో ప్రతిధ్వనిస్తుంది. లుగు రోజుల పాటు సాగే ఈ వన జాతరకు.. తెలంగాణ ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 251 కోట్లు కేటాయించి.. మేడారం రూపురేఖలను పూర్తిగా మార్చేసింది కూడా. ఇప్పుడు మీరు చూసే మేడారం.. ముందు ఇలా ఉండేది కాదు. గతేడాది నవంబర్‌కు ముందు మేడారం.. ఇప్పుడు కనిపిస్తున్న మేడారం పూర్తిగా వేరు. అమ్మవారి గద్దెల చుట్టూ ఇనుప కంచెలు, చెట్లు, పదుల సంఖ్యలో దుకాణాలు, ఇరుకైన రోడ్లు, వీధులతో.. మేడారం భక్తులకు అనువుగా ఉండేది కాదు. భారీ స్థాయిలో వాహనాల వచ్చినా, ఒకేసారి పెద్ద మొత్తంలో భక్తులు వచ్చినా.. ఇబ్బందులు తప్పేవి కావు. జాతరకు వచ్చిపోయే భక్తులకు సరైన ఏర్పాట్లు, వసతి, ఇతర సౌకర్యాలు పెద్దగా ఉండేవి కావు. అడవి మధ్యలో అన్నీ అరకొరగానే దొరికేవి.
కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మాణాలు, చిహ్నాలు.. మేడారం చరిత్రని నేటి తరాలకు అర్థమయ్యేలా చూపించే ఎన్నో నిర్మాణాలు ఇప్పుడు కనిపిస్తాయి. గిరిజన, ఆదివాసీ ఆచార, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ.. ప్రతి నిర్మాణంలో వారి సంస్కృతి కొట్టొచ్చినట్లు కనిపించేలా.. సమ్మక్క-సారలమ్మ పూజారుల సంఘం ఆమోదంతోనే ఈ నిర్మాణాలను పూర్తి చేశారు. దాదాపు 3 నెలల పాటు పూజారులు, గిరిజన నేతలు, సమ్మక్క-సారలమ్మల చరిత్ర తెలిసిన వారితో సంప్రదింపులు జరిపి.. గద్దెలను పునర్నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. అందుకే గతంలో మేడారం సందర్శించిన వారికి.. ఈసారి సందర్శించినప్పుడు ఈ ప్రాంతం కొత్త రూపంలో కనిపిస్తూ ఉంటుంది.
పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల పునర్నిర్మాణం, వాటి చుట్టూ 8 ద్వారాలు, సమ్మక్క-సారక్క గొట్టు గోత్రాలు, చరిత్ర ఉట్టిపడేలా చిహ్నాలు, బొమ్మలు స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని 251 కోట్ల నిధులు కేటాయించి.. మేడారం రూపురేఖల్ని పూర్తిగా మార్చేశారు. ఈ వీర వనితల గద్దెల వద్ద బండారి, మర్రి, వెదురు, వేప, ఇప్ప లాంటి 12 రకాల వృక్షాలు కనిపిస్తాయి. మరో 140 రకాల ఆయుర్వేద మొక్కలను నాటనున్నారు. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు, కోయలు ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే.. పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, పశుపక్ష్యాదులతో పాటు కోయల జీవనశైలికి, ఆచార సంప్రదాయాలకు, గొట్టుగోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డ, నిలువు గీతలు ఇప్పుడు స్తంభాలపై కనిపిస్తాయి.
ఓవరాల్‌గా చూస్తే ఈసారి ఆ ఆదివాసీ వీర వనితల దర్శనంతో పాటు.. భక్తులకు సరికొత్త అనుభూతి కూడా దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. జాతర అంటే మేడారానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అని అందరికీ తెలుసు. కానీ దీనికి ఓ పద్ధతి ఉంటుందని.. ఆ క్రమ పద్ధతిలోనే మేడారానికి వెళ్లాలని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
నమ్మి తృప్తిగా బెల్లాన్ని సమర్పిస్తే.. ఆ వన దేవతలు చల్లగా చూస్తారనేది భక్తుల నమ్మకం. ఆ నమ్మకమే ఎక్కడెక్కడి నుంచో కోట్లాది మందిని మేడారం రప్పిస్తుంది. ప్రతి రెండేళ్లకోసారి జాతరకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుందే తప్ప.. పెరగడం లేదు. భక్తులు వస్తున్నారు.. దర్శనాలు చేసుకుంటున్నారు. కానీ అమ్మవారిని దర్శించుకోవడానికి ముందు చేయాల్సినవేంటో తెలుసా? అసలు మేడారంలో ఏయే రోజు ఏమేం జరుగుతుందో ఐడియా ఉందా?
మేడారం జాతర అనుకుంటే మనం కేవలం నాలుగు రోజుల తెలంగాణ కుంభమేళా అని మాత్రమే అనుకుంటాం. కానీ మహా జాతరకు సరిగ్గా రెండు వారాల ముందుగానే అంటే జనవరి 14న గుడిమెలిగే పండుగను నిర్వహించారు. దేవతలకు ధూపదీపాలతో పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించారు. జనవరి 21న మండమెలిగే పండుగ నిర్వహించారు. దీని అర్థం జాతరను విజయవంతంగా నిర్వహించే శక్తిని ప్రసాదించాలంటూ పూజారులు దేవతలను ప్రార్థిస్తారు. ఈ రెండు పండుగలతో ఉత్సవాలు మొదలయ్యాయి. మహా జాతర ప్రారంభమైన సరిగ్గా వారానికి అంటే ఫిబ్రవరి 4న నిర్వహించే తిరుగువారం పండుగతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇది పూర్తిగా పూజారుల పండుగ అని చాలా మందికి తెలియదు.
మొదట మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి పయనమవుతాడు. అదే రోజు తాడ్వాయి మండలం కన్నెపల్లి నుంచి జంపన్న బయలుదేరుతారు. ఇక బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత, ఏటూరు నాగాగరం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా నుంచి బయలుదేరిన పగిడిద్దరాజులు గద్దెకు చేరుకుంటారు. ఇక గురువారం రోజు జాతరలో అతి కీలకఘట్టమైన సమ్మక్క దేవత చిలుకలగుట్ట నుంచి బయలుదేరి గద్దెపైకి చేరుకుంటారు. శుక్రవారం రోజు అందరూ గద్దెలపై కొలువుదీరుతారు. భక్తుల ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. శనివారం వన దేవతలంతా తిరిగి వన ప్రవేశం చేస్తారు.
మహా జాతర ఆదివాసీల ఉత్సవమే కాదని తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే.. ప్రతి ఏటా ఈ జాతరకు వచ్చే వారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ.. ఎప్పుడూ తగ్గలేదు. ఇప్పటికే ఈ జాతరకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఆ ప్రాంతమంతా కోలాహాలంగా కనిపిస్తోంది. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మేడారానికి వచ్చే భక్తులకు తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యం, వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు TGSRTC ఆధ్వర్యంలో అదనపు బస్సుల కేటాయింపు ఇలా చాలా వసతులను ఏర్పాటు చేశారు.
అడవి తల్లుల దర్శనానికి వచ్చే వారంతా నేరుగా మేడారానికి రారు. భక్తులు తొలిమొక్కులు మార్గ మధ్యలో ఉండే గట్టమ్మ తల్లి ఆలయానికి చేరుకుంటారు. మొదట అక్కడ దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం మేడారం చేరుకొని జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేస్తారు. ఆ తర్వాతే అమ్మవారి దర్శనాలు ప్రారంభమవుతాయి. సమ్మక్క, సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు ఆలయాలలో భక్తులు మొక్కులు చెల్లించుకొంటారు. భక్తులంతా వనదేవతలకు చీర, గాజులు, పసుపు, కుంకుమతో పాటు బంగారంగా పిలిచే బెల్లాన్ని కానుకలుగా ఇచ్చి మొక్కులు చెల్లించుంకుంటారు. ప్రజలందరూ గతంలో వారి కోరికలు నేరివేరినట్లైతే… నిలువెత్తు బంగారాన్ని సమ్మక్క, సారక్కలకు సమర్పించుకొంటారు.
అలాగే అమ్మవార్ల దర్శన అనంతరం కోడి, మేకలను మొక్కులుగా అప్పగిస్తూ మేడారం సమ్మక్క, సారక్క ఆలయ పరిసరాల్లో ఓ వేడుకను చేసుకుంటారు. ఈ టైమ్‌లో అమ్మవార్ల గద్దెలకు ఎదురుగా నిలబడి కోళ్లను గాలిలోకి ఎగరవేస్తారు భక్తులు. ఈ పద్ధతిని ఎదురుకోళ్ళు అంటారు. ఎదురుకోళ్లకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే.. మదిలో ఉన్నటువంటి కోరికలను అమ్మవారికి నివేదించుకొని గాలిలో ఎగురవేస్తారు. వారు కోరిన కోరికలు తీరిన వెంటనే వచ్చి పొట్టేలు, కోడిని సమర్పిస్తామని మొక్కుకుంటారు. కాకతీయులతో వీరోచితంగా పోరాడినటువంటి సమ్మక్క సారక్కలకు గిరిజన భక్తులు వారి పోరాట పరాక్రమానికి గుర్తుగా ఈ కోళ్లను ఎగరవేయడం ఆనవాయితిగా ఇక్కడ వస్తోంది.
నిజానికి జాతర రెండేళ్లకు ఒకసారి జాతర జరిగినా.. మధ్య ఏడాదిలో మినీ మేడారం జాతర నిర్వహిస్తారు. మినీ మేడారం జాతరకు ములుగు జిల్లాతో సమీప జిల్లాలకు చెందిన భక్తులు మేడారంకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ మహాజాతరలో ఆదివాసి తెగలకు చెందిన ప్రజలు మేడారంలో రోజుల తరబడి ఉండి జాతర ఏర్పాట్లలోను వాలంటరీగా పాల్గొంటారు.
ఈ తెలంగాణ కుంభమేళాకు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారు. మేడారం చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వరంగల్, ములుగు మీదుగా కొందరు వస్తే.. ఖమ్మం జిల్లా నుండి వచ్చే భక్తులు మణుగూరు, ఏటూరు నాగారం మీదుగా వస్తారు. అంతేకాకుండా భూపాలపల్లి మార్గం నుండి భక్తులు అధిక సంఖ్యలో మేడారానికి చేరుకుంటారు.
ఇప్పటికే మేడారంలో దర్శనాలు చేసుకుంటున్న భక్తుల సంఖ్య లక్షల్లో ఉంది. జనవరి 16న ఒక్కరోజే 10 లక్షల మంది భక్తులు మేడారానికి వచ్చారని అధికారులు చెబుతున్నారు. రాబోయే ఈ నాలుగు రోజుల్లో ఈ సంఖ్య కోట్లలో ఉండనుంది.
Story by: Anup, Big Tv
ALSO READ: మేయర్ సీట్ కోసం.. ఎంపీ అరవింద్ కొత్త అస్త్రం