Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీలో సీనియర్‌మోస్ట్ నాయకుడు. ఎవరికీ ఇవ్వనన్ని ఛాన్సులు ఆయనకు పార్టీ ఇచ్చింది. కానీ రిజల్ట్ మాత్రం నిల్. అయినా పెద్దోడని పార్టీలో ప్రియారిటీ ఇస్తూనే ఉన్నారు. ఓడిపోయినా పదవులు కట్టబెట్టారు. అయితే ప్రస్తుతం ఈక్వేషన్లు కుదరక రాజకీయంగా ఎలాంటి ఉపాధి లేకుండా మిగిలిపోయారు. దాంతో కుంటిసాకులు చెప్పి పక్క పార్టీకి వెళ్లడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా సీనియర్ నేత.. పార్టీ పై ఎందుకంత కోపం..? కాంగ్రెస్ పార్టీ అతని విషయంలో ఏం చేయబోతోంది..?
6 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మంత్రిగా పనిచేసిన జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై మూడుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన జీవన్‌రెడ్డి పార్టీని వీడెందుకు సిద్ధమవుతున్నారా? అన్న చర్చ మొదలైంది. ఆయన ఇటీవల కాలంలో పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్స్ వెనక వ్యూహం ఏంటి? మరో జాతీయ పార్టీ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారనే అంశాలు కరీంనగర్ జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తికాగానే జీవన్ రెడ్డి నెగిటివ్ వాయిస్ వినిపిస్తుండటంతో.. కాంగ్రెస్‌ని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్
ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల టికెట్, పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది. రెండు ఎన్నికల్లోనూ ఆయన ఘోరంగా ఓడిపోయారు. అటు వయస్సు కూడా మీద పడడంతో ఎమ్మెల్సీగా మరోసారి ఛాన్స్ ఇవ్వలేదంటున్నారు. దాంతో తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ పార్టీపైనే విమర్శలు మొదలుపెట్టారు జీవన్‌రెడ్డి. ఇక తనకు ఎలాంటి పదవులు దక్కవని తేలిపోవడంతో.. జీవన్‌రెడ్డి తన అసంతృప్తిని బహిర్గతం చేస్తూ పార్టీని ఇబ్బందుల్లో పడేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
జీవన్‌రెడ్డితో సంప్రదింపులు మొదలుపెట్టిన బీఆర్ఎస్ నేతలు
ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డిని తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. జీవన్ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా.. కాంగ్రెస్ సీనియర్లు తమవైపు చూస్తున్నారని చెప్పుకోవాలన్నది బీఆర్‌ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలు జీవన్‌రెడ్డితో సంప్రందింపులు జరుపుతున్నారని .. ఆయన డిమాండ్స్‌ను నేరవేర్చేందుకు కూడా సిద్దపడినట్లు జిల్లా నేతలు చెవులు కరుక్కుంటున్నారు. భవిష్యత్‌లో పదవులతో పాటు పార్టీలో కీలక బాధ్యతలు కూడా ఇస్తామనే సంకేతాలు పంపినట్లు చర్చ నడుస్తోంది.
ధర్మపురి నేతతో జీవన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ధర్మపురికి చెందిన ఓ నేతతో జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్‌లో రచ్చ రాజేస్తున్నాయి. తానే అటు రావాలనుకుంటే నువ్వెందుకు ఇటు వచ్చావంటూ జీవన్‌రెడ్డి ఆయనతో అన్నారంటున్నారు. ఈ వ్యాఖ్యలను టీ పీసీసీ సీరియస్‌గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారబోతున్నానన్న సంకేతాలను ఆయన అలా ఇవ్వడంతో కాంగ్రెస్ పెద్దలు ఆయన సేవలు ఇక చాల్లే అనుకుంటున్నారంట . బీఆర్‌ఎస్ నేతలతోనూ జీవన్‌రెడ్డి టచ్‌లో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఇకపై ఈ విషయంలో సీరియస్‌గానే ఉండాలని టీపీపీసీ అనుకుంటోందట.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు కాంగ్రెస్‌నే అంటిపెట్టుకుని ఉంటుంటే
ఎవరికీ ఇవ్వనట్లుగా అసెంబ్లీ టికెట్, పార్లమెంట్ టికెట్ ఇచ్చినా గెలవలేకపోయిన జీవన్‌రెడ్డి, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటం సరికాదన్న భావన పార్టీలో వ్యక్తమవుతోంది. ఓ వైపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అసెంబ్లీ సీట్లు పెరిగి తమకు అవకాశం వస్తుందని సీనియర్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు కాంగ్రెస్‌నే అంటిపెట్టుకుని ఉంటుంటే.. జీవన్‌రెడ్డి లాంటి వాళ్లు వ్యతిరేకంగా అడుగులు వేయడంపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. ఇలా న్యూసెన్స్ చేసే వాళ్లు పార్టీలో ఉండడం కన్నా వెళ్లిపోతేనే బెటరన్న ఆలోచనకు నాయకత్వం వచ్చినట్లు సమాచారం.
చర్యలు తీసుకోకుండా వెయిట్ చేయాలని నిర్ణయం
అయితే, జీవన్‌రెడ్డి చాలా సీనియర్ నేత కావడంతో ఆయనపై చర్యలు తీసుకుని డైరెక్ట్‌గా బయటకు పంపకుండా, ఆయనే వెళ్లిపోయే వరకూ వెయిట్ చేస్తే మంచిదని కాంగ్రెస్ ముఖ్యలు భావిస్తున్నారంట. అలా టికెట్లు ఇచ్చినా గెలవని వాళ్లు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లినా పెద్దగా ప్రభావం ఉండదని, ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లో చేరడమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని పార్టీలో డిస్కషన్ నడుస్తోందట. ఇప్పటికైనా తీరు మార్చుకుని ఎన్నో అవకాశాలిచ్చిన పార్టీని మరింత బలోపేతం చేయడానికి జీవన్‌రెడ్డి ప్రయత్నిస్తారా? లేక స్వప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ వైపు అడుగులు వేస్తారా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది.