Telangana BJP: కావాల్సినంత క్యాడర్ ఉంది.. అవసరమైనంత లీడర్‌షిప్ ఉంది.. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉంది.. అధిష్టానం నుంచి సరిపోను సపోర్ట్ ఉంది. అయినా సరే.. తెలంగాణలో మాత్రం బీజేపీ.. ముందునుంచీ ఎక్కడుందో.. ఇప్పుడు అక్కడే ఉంది. ఇది.. పార్టీలో ఉన్న కార్యకర్తల అభిప్రాయం మాత్రమే కాదు.. ఢిల్లీలో ఉన్న ప్రధాని మోడీ ఫీలింగ్ కూడా అదే. కొద్దిరోజుల క్రితమే.. తెలంగాణ బీజేపీ ఎంపీలతో సమావేశమైన మోడీ.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. అక్షింతలు వేశారు. ఈ న్యూస్ బయటకు లీకైన తర్వాత.. బీజేపీ పరిస్థితిపై హాట్ డిబేట్ మొదలైంది. తెలంగాణ బీజేపీ నాయకత్వంలో ఇప్పుడైనా మార్పు వస్తుందా?
సమయం.. అందరి సరదా తీర్చేస్తుందంటారు. కాకపోతే.. దానికి కూడా ఓ సమయం రావాలి. తెలంగాణ బీజేపీలో ఆ టైమ్ వచ్చేసింది. అందుకే.. ప్రధాని మోడీ నుంచి పిలుపొచ్చింది. బీజేపీ ఎంపీలకు గట్టి క్లాస్ పడింది. ఢిల్లీలో ప్రధాని మోడీ.. బీజేపీ ఎంపీలతో జరిపిన సమావేశం.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై మోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేయడం, ఎంపీలకు గట్టిగా క్లాస్ తీసుకోవడం, ఆ వెంటనే.. మీటింగ్‌లో ఏం జరిగిందో మీడియాకు లీక్ కావడం కమలదళంలో కలకలం రేపుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా.. పట్టించుకోకుండా మీరేం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్తలు వచ్చాయ్. బలమైన స్థితిలో ఉన్న పార్టీని.. ఎందుకు కిందకు లాగేశారు? అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఊపుని.. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎందుకు కొనసాగించలేకపోతున్నారని.. మోడీ నిలదీసినట్లు తెలుస్తోంది. కనీసం.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండటం లేదని.. మీకన్నా అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియా బెటర్ అన్నట్లుగానూ ప్రచారం జరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచాక కూడా.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టకుండా, కేవలం గాలివాటంగా.. గెలుస్తామనుకుంటే పొరపాటని హెచ్చరించినట్లు సమాచారం. ముఖ్యంగా.. బీఆర్ఎస్ బలహీనపడిన వేళ, ఆ స్థానాన్ని ఆక్రమించడంలో బీజేపీ విఫలమైందన్నది ప్రధాని మోడీ ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. అసలు ఈ లీక్ వెనుక ఉన్నది ఎవరనేది పక్కన పెడితే.. ఈ ఘటన తెలంగాణ బీజేపీలో నెలకొన్న తీవ్రమైన అనైక్యతకు అద్దం పడుతోంది. పార్టీలో.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహారం నడుస్తోందనే విమర్శలకు ఇది బలం చేకూర్చింది.
బీజేపీలో నాయకుల మధ్య సమన్వయం లేదనేది.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలిసిన విషయమే. దీనికి బోనస్‌గా గ్రూపులు కొన్ని. ఒక వర్గంపై మరో వర్గం అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడం అలవాటుగా మారింది. ఈ గ్రూప్ పాలిటిక్స్ వల్లే.. కింది స్థాయిలో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా.. బీజేపీ గ్రాఫ్ పడిపోతుందనడానికి నిదర్శనంగా నిలిచాయ్. క్షేత్ర స్థాయిలో పార్టీని అభిమానించే వాళ్లు బలంగా ఉన్నప్పటికీ.. నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను కానీ, బీఆర్ఎస్ పతనాన్ని కానీ తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ పదే పదే విఫలమవుతూ వస్తోంది. ఈ పరిణామాలన్నింటిని గమనించే.. ప్రధాని మోడీ గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం అటుంచితే.. సిట్టింగ్ సీట్లను కాపాడుకోవడం కూడా కష్టమే అనిపిస్తోంది. అందువల్ల.. తెలంగాణ బీజేపీ ఎంపీలు, నాయకులు మరింత యాక్టివ్‌గా ఉండాలని, ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలని.. సూచించారు మోడీ. ప్రజల్లో పార్టీకి ఆదరణ ఉన్నా.. నాయకులు పనిచేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రూపు తగాదాలు వీడి.. ఐకమత్యంతో పని చేయాలన్నారు. రాష్ట్రంలో పార్టీ బలపడేలా దూకుడుగా పని చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని.. నిత్యం ప్రజలతో టచ్‌లో ఉండాలని హితబోధ చేశారు.
తెలంగాణలో కొంతకాలంగా.. ఎన్నికల సమయంలో బీజేపీలో ఉన్న ఫైర్ క్రమంగా చల్లబడుతూ వస్తోంది. కొన్నేళ్ల కిందట జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో.. బీజేపీ మేయర్ సీటుని కైవసం చేసుకునేంత చేరువగా వచ్చింది. రాష్ట్రంలో ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలున్నా.. బీజేపీ ఉండాల్సినంత దూకుడుగా లేదు. ఆ పార్టీకి రావాల్సినంత క్రేజ్ రాలేదు. అయితే.. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ బలహీనపడుతున్న విషయాన్ని.. బీజేపీ కేంద్ర నాయకత్వం గుర్తించలేకపోయింది. ఇదే సమయంలో.. బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ సిద్ధపడిందని, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎప్పుడైనా కుదరవచ్చొన్న ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ ప్రచారం వల్ల లబ్ధి పొందాల్సిన బీజేపీ.. ఆ దిశగా కృషి చేయలేదు. మరోవైపు కాంగ్రెస్‌కు తామే ఆల్టర్నేట్ అని ప్రజలను నమ్మించే దిశగా బీఆర్ఎస్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కానీ.. బీజేపీలో ఎన్నికలప్పుడు కనిపించే జోష్.. ఆ తర్వాత కనిపించడం లేదనేది వాస్తవం. ఇప్పటికైనా.. ప్రధాని మోడీ హెచ్చరికలను సీరియస్‌గా తీసుకొని.. లీకుల రాజకీయాలకు స్వస్తి పలికి.. సమిష్టిగా పనిచేయకపోతే.. తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందనే చర్చ విస్తృతంగా సాగుతోంది.
అవకాశం అన్నిసార్లు తలుపు తట్టదు.. వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి.. అద్భుతం చేసి చూపించాలి. తెలంగాణలో రాజకీయంగా ఎదిగేందుకు ఎంతో స్కోప్ ఉన్నా.. బీజేపీ ప్రతిసారీ ఫ్లాప్ అవుతూనే ఉంది. మరి.. ప్రధాని మోడీ తీసుకున్న క్లాస్‌తోనైనా.. తెలంగాణ బీజేపీ నేతల్లో మార్పు వస్తుందా? అంతా కలిసి.. బీజేపీ గ్రూప్‌గా పనిచేసే పరిస్థితి ఉందా? బలమైన ప్రతిపక్షంగా నిలబడగలుగుతుందా? అసలు.. టీబీజేపీలో ప్రాబ్లమ్ ఎక్కడొస్తోంది?
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎప్పుడూ.. ఓ అడుగు ముందుకు.. పది అడుగు వెనక్కి అన్నట్లుగానే సాగుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వచ్చిన జోరు చూసి.. ఇక తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీయేనని అంతా భావించారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ఓట్లు వచ్చినా.. పెద్దగా సీట్లు రాలేదు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలిచినా.. ఆ తర్వాత బీజేపీ అదే జోరుని కంటిన్యూ చేయలేకపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా బీజేపీలో పెద్దగా మార్పేమీ లేదు. బలమైన ప్రతిపక్షంగా నిలబడలేకపోయింది. ప్రధాని మోడీ క్లాస్ కూడా దీని గురించేనన్న చర్చ ఉంది. స్టేట్‌లో బీజేపీ బలపడకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయ్. అందులో.. మొట్టమొదటిది నాయకుల మధ్య సమన్వయం లేకపోవడమే! పార్టీలో పాత తరం నేతలకు, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలకు.. మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంది. కీలక నేతలంతా ఒకరినొకరు కిందకు లాగే ప్రయత్నం చేయడం పార్టీని దెబ్బతీస్తోంది. కీలక సమయాల్లో నాయకత్వ మార్పులు పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించాయ్. బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉందనే ముద్ర పడటం కూడా పార్టీని దెబ్బతీసింది. పైగా.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ లాంటి వాళ్లంతా.. సెపరేట్‌గా గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఇలా.. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోవడం వల్లే.. పార్టీ పడిపోతోందనే చర్చ జోరుగా సాగుతోంది.
బీజేపీకి.. క్షేత్రస్థాయిలో హిందుత్వ ఓటు బ్యాంకు, మోడీ చరిష్మా పనిచేస్తున్నా.. రాష్ట్ర స్థాయిలో క్యాడర్‌ని సరైన రీతిలో ముందుకు నడిపించే కమాండర్ లేరనే అభిప్రాయాలున్నాయ్. ప్రస్తుతం.. కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ డీలా పడింది. ఈ స్పేస్‌ని వాడుకునేందుకు.. బీజేపీకి ఇదొక మంచి అవకాశం. కానీ.. ప్రజా సమస్యలపై మీద పోరాడటంలో బీజేపీ వెనుకబడుతోంది. కేవలం.. భావోద్వేగ అంశాలు మాత్రమే కాకుండా.. జనం పడే ఇబ్బందులపైనా.. బీజేపీ స్టాండ్ తీసుకొని గట్టిగా నిలబడాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్‌కు కాకుండా.. తమకు వచ్చేలా చేసుకోవడమే.. బీజేపీ ముందున్న పెద్ద సవాల్. కానీ.. నివురుగప్పిన నిప్పులా పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు పార్టీని దెబ్బతీస్తున్నాయ్. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ బలంగా ఉండేది. ఏ ఎన్నికలు జరిగినా గట్టి పోటీ కనిపించేది. కానీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఏకంగా డిపాజిట్ కోల్పోయారు. దాంతో.. కేంద్ర నాయకత్వానికి తత్వం బోధపడినట్లు కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ని వెనక్కి నెట్టి.. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కమలదళం.. ఇలా ఎందుకూ కాకుండా పోవడమేంటని తలంటేశారు.
మరోవైపు.. బీజేపీ కల్చర్‌ని అర్థం చేసుకోలేక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అయోమయానికి గురవుతున్నారు. క్షేత్ర స్థాయిలో బలం లేకపోయినా.. ఆర్ఎస్ఎస్ మూలాలున్న వారి మాటే పార్టీలో చెల్లుబాటు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే కేంద్ర నాయకులు కూడా.. స్థానిక పరిస్థితులను అర్థం చేసుకోవడంలో ఫెయిలయ్యారు. నార్త్ స్టేట్స్‌లో అమలు చేసిన ఫార్ములానే.. తెలంగాణలోనూ అమలు చేశారు. దాంతో.. ప్రజా బలం ఉన్న నేతలు పార్టీలో చేరినా సైలెంట్ అయిపోయారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ.. బీజేపీ తన పట్టును ప్రదర్శించలేక పోయింది. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ.. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ పార్టీ పనితీరు పేలవంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
దీంతో బీజేపీ బలపడుతోంది అనేది.. అంతా ఒట్టి మాటలేననే అభిప్రాయం బలపడింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత.. పార్టీని బలోపేతం చేసేందుకు పెద్దగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు కూడా లేవు. నిజానికి.. తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. దీనిని.. హైకమాండ్ పసిగట్టింది. అందుకే.. ప్రధాని మోడీ వెంటనే.. బీజేపీ ఎంపీలకు సీరియస్ క్లాస్ తీసుకున్నారు. బీఆర్ఎస్‌ని ఇరుకునపెట్టి.. బలమైన ప్రతిపక్షంగా ఎదగడానికి బీజేపీకి ఇదొక సూపర్ ఛాన్స్. అందుకోసమే.. గ్రూప్ పాలిటిక్స్ పక్కన పెట్టి.. ప్రజల్లోకి వెళ్లాలని ఎంపీలకు సూచించారు ప్రధాని మోడీ.
బీజేపీ నేతలంతా.. భిన్నమైన ప్రకటనలు ఇవ్వకుండా.. ఒకే స్టాండ్ తీసుకోవాలి. సీనియర్లకు జిల్లాల బాధ్యతలు ఇచ్చి.. పార్టీని బలోపేతం చేయాలి. ఇతర పార్టీల నుంచి అసంతృప్త నేతలను చేర్చుకోవడంలో వేగం పెంచాలి. తెలంగాణలో బీజేపీకి ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్.. ప్రధాని మోడీ ఇమేజ్. కానీ.. అన్నిసార్లు ఆయన ఛరిష్మా మీదే ఎన్నికల్లో నెట్టుకురావడం కష్టం. అందువల్ల.. బీజేపీ నేతలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి.. ప్రజలతో మమేకం కాకపోతే.. మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ లాంటి అగ్రనేతలు ఎన్ని క్లాసులు తీసుకున్నా రిజల్ట్ జీరోనే. 2029 ఎన్నికలే లక్ష్యంగా.. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టకపోతే.. తెలంగాణలో బీజేపీ ఇప్పుడు ఎక్కడ ఉందో.. అప్పటికి కూడా అక్కడే ఉంటుందనేది మాత్రం క్లియర్.
Story By Anup, Big Tv