Big Stories

Raghu Rama Krishna Raju: రాజు గారి పంతం..! తగ్గేనా..? నెగ్గేనా..?

Narasapuram MP Raghu Rama Krishna Raju
Narasapuram MP Raghu Rama Krishna Raju

Narasapuram MP Raghu Rama Krishna Raju: రోజుకో ట్విస్ట్ , పూటకో పొలిటికల్ అప్‌డేట్‌తో ఏపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ పార్టీ నుండి ఎవరు పోటీలో ఉంటారో అర్ధం కాని పరిస్థితి. సుదీర్ఘ చరిత్ర ఉన్న పొలిటికల్ పార్టీలు సైతం అభ్యర్థి ఎంపికలో తడబడటం చూస్తుంటే గెలుపు కోసం వాళ్ళు పడే తాపత్రాయం అర్ధమవుతుంది.

- Advertisement -

ఇక పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్‌ సెగ్మెంట్లో కూటమి అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించడం ఇప్పుడు పొలిటికల్ హీట్ మరింత పెంచుతోంది. అసలు ఆర్ఆర్ఆర్ వ్యూహం ఏంటి ? ఆల్రెడీ అక్కడ బీజేపీ అభ్యర్ధిని ప్రకటించినా ఆయన అంత ధీమా ప్రదర్శిస్తుండటం వెనుక లెక్కలేంటి? పార్టీ టికెట్ దక్కకపోతే ఆయన ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతారా?

- Advertisement -

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అంటే ప్రస్తుత రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. ఢిల్లీలో రచ్చబండ పెట్టి జగన్ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పొలిటికల్ ఆర్ఆర్ఆర్‌గా పాపులర్ అయ్యారాయన. వైసీపీ నుంచి గెలిచిన కొంతకాలానికే రెబల్ అవతారమెత్తి డైరెక్ట్‌గా సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ ఆ పార్టీని ముప్ప తిప్పలు పెడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు తిరిగి నర్సాపురం పార్లమెంట్ లోనే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మిత్రపక్షాల అభ్యర్ధిగా తానే బరిలో ఉంటానని తాడేపల్లిగూడెం ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల సమక్షంలోనే ధీమాగా ప్రకటించారాయన.

మరోపక్క సీఎం జగన్ ను అధికారం నుండి దింపాలంటే కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ప్రతి పక్షపార్టీలయిన టీడీపీ , జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని విపక్ష నేతలకంటే ఎక్కువగా ఆర్ఆర్ఆర్ స్టేట్‌మెంట్లిచ్చారు. ఇక కూటమి ఏర్పడ్డాక ఆర్ఆర్ఆర్‌కు సీటు గ్యారెంటీ ఇక ప్రకటన మాత్రమే తరువాయి అనుకుంటున్న సమయంలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ కోటాలోకి వెళ్లడం, అభ్యర్థిగా భీమవరానికి చెందిన శ్రీనివాసవర్మను ప్రకటించడడం చకచకా జరిగిపోయాయి. దాంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న మిత్రపక్షాల అభ్యర్ధులు బీజేపీ నిర్ణయంతో షాక్ తిన్నారంట. ఆర్ఆర్ఆర్‌ తిరిగి పోటీలో ఉంటే తమకు కలిసివస్తుందని భావిస్తున్న సదరు కేండెట్లు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక తమ సన్నిహితుల దాగ్గర తెగ బాధపడిపోతున్నారట. సహజంగా ఆశించిన సీటు దక్కని వారు తెగ ఫీల్ అయిపోతుంటారు. తమ రాజకీయ భవిష్యత్తుపై దిగులు పెట్టుకుని కుంగి పోతుంటారు.

నరసాపురం బీజేపీ అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత మొదటి సారి భీమవరం వచ్చిన ఆయన నియోజకవర్గ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఆ మీటింగ్‌కు హాజరైన వారు రఘురామరాజుకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వకపోతే న్యాయానికి సంకెళ్లు పడినట్లేనని స్టేట్‌మెంట్లిచ్చారు. ఆర్ఆర్ఆర్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు.

Also Read: కారులో కేకే కుదుపు..! కారణాలివేనా..?

ఆర్ఆర్ఆర్‌కు టికెట్ దక్కలేదని తెగ బాధపడిపోతున్న సదరు ప్రముఖులకు ఆయనే భరోసా ఇచ్చారంట. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా కూటమి తరుపున తానే పోటీ చేస్తున్నానని కూటమిలోని ఏ పార్టీ తరపున పోటీ చేసేది రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందని ప్రకటించారంట.. ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు. ఇప్పటికే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లను ఆకాశానికి ఎత్తేస్తున్న రఘురాముడు వారితోనే తన పయనమని ప్రకటించారు. దాంతో ఏదో స్పష్టమైన హామీ ఉండబట్టే ఆయన నరసాపురం టికెట్‌పై ధీమాగా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఆర్ఆర్ఆర్ ధీమా చూస్తూ ఇప్పుడు నరసాపురం ఎంపీ అభ్యర్ధితో పాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కేండెట్లలలో గుబులు రేగుతోందంట. ఒకవేళ ఈక్వేషన్లు మారి నరసాపురం ఎంపీ సీటు టీడీపీ, జనసేనల్లో ఒక పార్టీకి దక్కితే తన పరిస్థితి ఏంటని శ్రీనివాసవర్మ కంగారపడుతున్నారంట. ఇక ఎంపీ సీటు వదులుకున్న బీజేపీ అక్కడ ఏ అసెంబ్లీ సీటు ఆశిస్తుందో ఎవరి టికెట్ గల్లంతవుతుందో అని అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారంట.

రఘురామకృష్ణంరాజు కోసం నరసాపురం రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రఘురామ టీడీపీ నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా పోటీలో ఉంటారన్న ప్రచారం మొదలైంది. మరోవైపు రఘురామను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలో దించుతారన్న ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రఘురామకు సీటు పక్కా అని కూటమిలోని ముఖ్య నేతలు చెబుతున్నారు. నరసాపురం ఎంపీ సీటు మార్పు జరగని పక్షంలో ఉండి అసెంబ్లీ నుంచి రఘురామ కృష్ణంరాజు బరిలో దించుతారన్న టాక్ వినిపిస్తోంది. అయితే అసెంబ్లీ కాదు పార్లమెంట్‌కే పోటీ చేస్తానని ఆయన బల్లగుద్ది చెపుతుండటం హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read: కూటమిలో కంగాళి మారకపోతే నష్టమే..!

నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించిన భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రచారం చేసుకోవడానికి ర్యాలీగా వస్తే కూటమి నాయకుల నుండి కనీస స్పందన కూడా రాలేదు. దాంతో మిత్రపక్షాల ముఖ్యనేతలు పునరాలోచనలో పడ్డారంట. వర్మ ఆంటే తమకు వ్యతిరేకత లేదని.. అయితే ఈ ఎన్నికల్లో రఘురామ మద్దతు లేకుంటే గెలుపు కోసం మరింత కష్టపడాల్సి వస్తుందని నియోజకవర్గ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆర్ధిక, అంగ బలం ఉన్న రఘురామ అయితే విజయం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదని.. అయితే బీజేపీ లెక్కలేంటో అర్థం కావడం లేదని చర్చించుకుంటున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్‌కు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన ఫాలోయర్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తుండటం, కూటమి నాయకులకు మింగుడు పడటం లేదంట. ఒకవేళ రఘురామ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగితే ఆ ఎఫెక్ట్ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లపై రిఫ్లెక్ట్ అవుతుందని మధన పడుతున్నారంట. రఘురామ మాత్రం కూటమి అధినాయకుల పై తనకు నమ్మకం ఉందని , టికేట్ తనదేనని ప్రకటించడం, భీమవరంను వేదిక గా చేసుకొని పార్లమెంట్ ముఖ్య నేతలతో , కూటమి నాయకులతో సమావేశాలు పెట్టడం చూస్తూ.. రాజుగారు పంతం ఎటు దారితీస్తుందో అన్న ఉత్కంఠ అందరిలో కనిపిస్తుంది.. అదలా ఉంటే అమరావతి సాధన సమితి రైతులు సైతం ఆర్ఆర్ఆర్‌ను కలిసి బహిరంగంగా మద్దతు తెలపడం, ఏ నిర్ణయం తీసుకున్న తాము అండగా ఉంటామని చెప్పడంతో అసలు ఆయన స్కెచ్ ఏంటో ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News