Big Stories

TDP, Janasena, BJP Alliance: కూటమిలో కంగాళి మారకపోతే నష్టమే..!

TDP, Janasena BJP Alliance

- Advertisement -

TDP, Janasena, BJP Alliance in AP Elections 2024: వైసీపీ సర్కార్‌ను గద్దె దించాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చొద్దు.. ఇదే నినాదం.. లక్ష్యంతో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొడిచింది పొత్తు.. సీట్ల లెక్క తేలింది. కాస్త అటు ఇటుగా అభ్యర్థుల చిట్టా విడుదలైంది. కానీ సమ్‌థింగ్ ఈస్‌ మిస్సింగ్.. ఏదో తేడా కొడుతోంది. ఇంతకీ కూటమిలో ఏం జరుగుతోంది? టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరినప్పటి నుంచి ఏదో సమస్య వెంటాడుతోంది. మూడు విభిన్న సిద్ధాంతాలు గల పార్టీలు అధికారం కోసం ఒక్కచోటికి చేరాయి.

- Advertisement -

సిద్ధాంతాల గురించి మాట్లాడితే.. రాద్ధాంతంలానే ఫీలయ్యే టైమ్‌ ఇది. కానీ మూడు పార్టీల మధ్య అనుకున్నంత సమన్వయం కుదరడం లేదన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వకముందే.. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. అప్పుడు ఇరు పార్టీలు కంబైన్డ్‌గా సమావేశాలు పెట్టుకున్నారు. ఈ సమావేశాల్లోనే ఆల్‌మోస్ట్ కొట్టుకునే పరిస్థితులు వచ్చాయి. అలాంటి కూటమిలోకి ఆ తర్వాత బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో రచ్చ మరింత పెరిగిందనే చెప్పాలి..

టీడీపీకి 144 సీట్లు.. జనసేన 21.. బీజేపీ 10 సీట్లు ఎప్పుడైతే ఖరారయ్యాయో.. అప్పుడు మొదలైంది అసలైన రచ్చ.. జనసేనకు కేవలం 21 సీట్లు దక్కడంపై జనసేన నేతలు అసంతృప్తిలో ఉన్నారు. బీజేపీకి అనుకున్న స్థానాలు దక్కకపోవడంతో ఆ పార్టీ నేతలు అలానే కనిపిస్తున్నారు. ఇక టికెట్ వస్తుందని ఆశించి పొత్తు కారణంగా టికెట్లు కోల్పోయిన నేతలైతే.. ఏకంగా నిరసనలకే దిగుతున్నారు. చంద్రబాబు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టింది టీడీపీ అధిష్టానం.

లెటెస్ట్‌గా అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించడంపై పెద్దరచ్చే మొదలైంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కలేదని కార్యకర్తలు నిరసనకు దిగారు. ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగే చాన్స్ ఉంది. తిరుపతిలో కూడా ఇదే సీన్ కనిపించింది. జనసేనకు టికెట్ దక్కడంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ పంచాయితీ కంటిన్యూ అవుతూనే ఉంది. అరకులోను గతంలోనే దొన్ను దొరను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ బీజేపీ రిలీజ్ చేసిన లిస్ట్‌లో పాంగి రాజారావును అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో అక్కడ అసమ్మతి రాగం వినిపిస్తోంది..

Also Read: పంజాబ్‌పై ఈడీ ఫోకస్.. సీఎంకు చెక్ పెడతారా?

ఎచ్చెర్ల నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళావెంకట్రావు టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఎచ్చెర్ల టికెట్ బీజేపీకి కేటాయించారు. దీంతో కళా వెంకట్రావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ధర్మవరం నుంచి బీజేపీ నేత వరదాపురం సూరి.. టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ టికెట్లు ఆశించారు. కానీ బీజేపీ అనూహ్యంగా ధర్మవరం సీటును వై.సత్యకుమార్‌కు కేటాయించింది. ఇప్పటికే సూరి అనుచరులతో సమావేశమయ్యారు. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..
సూరికి టికెట్ రాకపోవడంతో పరిటాల అనుచరులు సంబరాలు చేసుకున్నారు. విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన పోతిన మహేష్‌కు బీజేపీ లిస్టుతో షాక్ తగిలింది.

విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరిని అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ.. ఇప్పటికే ఆయనకు టికెట్ దక్కాలని పోరాటాలు చేస్తున్నారు. మరిప్పుడు బీజేపీ అభ్యర్థికి ఏమేర సాయం చేస్తారన్నది డౌటే. బద్వేల్‌లోనూ ఆందోళన కొనసాగుతోంది. మూడు రోజులు క్రితం టీడీపీని వదిలి బీజేపీ కండువా కప్పుకున్న..రోషన్‌ను అభ్యర్థిగా ఖరారు చేసింది బీజేపీ..ఈ డెసిషన్‌తో టికెట్ ఎక్స్‌పెక్ట్ చేసిన పనతాల సురేష్‌ వర్గం అస్సలు డైజెస్ట్ చేసుకోవడం లేదు. ఇప్పటికే నిరసన గళమెత్తారు. ఇక పిఠాపురంలో అయితే పరిస్థితి పీక్స్‌కు చేరింది. జనసేనాని పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారని తెలియగానే.. అక్కడి టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారు. అయితే ఆ తర్వాత బుజ్జగింపులతో వివాదం సద్దుమణిగింది. కానీ చాలా చోట్ల లోలోపల టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు మాత్రం రగిలిపోతూనే ఉన్నారు.

ఇప్పటికే జనసేన ఓట్లు టీడీపీకి ఎంత మేర పడతాయో అన్నది ఓ అనుమానంగా ఉంటే.. ఇప్పుడు అసంతృప్తులు ఎంత మేర సాయం చేస్తారన్నది ఇప్పుడు మరో డౌట్.. ఇవన్నీ ఒకవైపు అయితే.. ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీల జెండాలు కనిపించడం లేదు. ఇప్పుడు ఇదో టెన్షన్ పట్టుకుంది కూటమి నేతలకు. నిజానికి పొత్తు కుదిరినప్పటి నుంచి.. అగ్రనేతలు చేతులు కలుపుతున్నా.. రెండో స్థాయి నేతల మధ్య అంత సఖ్యత లేదని తెలుస్తోంది. అధినేతలు ఆరాటపడుతున్నా.. క్షేత్రస్థాయిలో కత్తులు దూసుకుంటున్నారు నేతలు.. క్యాడర్ మనసులు కలవడం లేదు.

Also Read: రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టడం జగన్ బ్రాండ్.. చంద్రబాబు

దీంతో చాలా ప్రాంతాల్లో పొత్తు పొసగడం లేదని తెలుస్తోంది. పొత్తులో భాగంగా సీట్ల పంపకం కూటమికి కొంత తలనొప్పిని తెచ్చిపెట్టింది. సీట్లు దక్కిన వారంతా ఓపెన్‌గానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ప్రత్యేక సమావేశాలు, వర్క్‌షాపులు నిర్వహించినా అంత ఫలితం ఉండటం లేదు. ఉమ్మడిగా ప్రచారానికి వెళ్లడం లేదు. చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తే పచ్చ జెండాలే కనిపిస్తున్నాయి. పవన్‌ ప్రచారానికి వెళితే గ్లాస్ బొమ్మలే దర్శనిమిస్తున్నాయి. అంతేకాని ఉమ్మడి జెండాలు కనిపిస్తున్న సీన్లు తక్కువగానే ఉన్నాయి.

ఇక బీజేపీ పరిస్థితి మరోలా ఉంది. అంతర్గత కుమ్ములాటలతోనే ఆ పార్టీ సతమతమవుతోంది. ఇప్పటికే సీనియర్లు మొఖం చాటేస్తున్నారు. దక్కిన 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్‌ స్థానాల్లో.. ఎన్నింట్లో గెలుస్తారో వాళ్లకే ఓ అంచనా లేని పరిస్థతి. పొత్తులు కుదుర్చుకున్నప్పుడు ఇలాంటి అసంతృప్తులు సహజమే.. ఇది అన్ని పార్టీల పెద్దలు చెబుతున్న మాట.. కాని వాస్తవ పరిస్థితులు మాత్రం కాస్త డిఫరెంట్‌గానే ఉన్నాయి. 21 సీట్లు మాత్రమే దక్కడంపై జనసేన నేతలు.. అసలు టీడీపీతో పొత్తే ఇష్టం లేని కమలనాథులు.. ఇలా రకరకలుగా కూటమి కంగాళిగా కనిపిస్తోంది. మరి ఎన్నికలనాటికి ఏపీ రాజకీయం ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరమని చెప్పాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News