E-Paper
Advertisement

Nellore Politics: కూటమి నేతల మధ్య భగ్గుమంటున్న విభేదాల వార్.. పని మాది క్రెడిట్ వారిదా అంటూ..?

Nellore Politics: కూటమి నేతల మధ్య భగ్గుమంటున్న విభేదాల వార్.. పని మాది క్రెడిట్ వారిదా అంటూ..?
Advertisement

Nellore Politics: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చినా క్షేత్రస్థాయిలో స్థితిగతులు పుర్వ ప్రభుత్వం నాటికి ఇప్పటికీ ఏ మాత్రం మారలేదని బీజేపీ నేతలు బాహటంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారని, పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని.. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై కమలనాథుల కస్సుబుస్సులాడుతున్నారు. గ్రావెల్. ఇసుక, రేషన్ మాఫియాలను ప్రోత్సహిస్తున్న కొందరు ప్రజాప్రతినిధుల తీరుతో తమకు కూడా చెడ్డపేరొస్తోందని కాషాయశ్రేణులు మండిపడుతున్నాయి.

కూటమి ఎమ్మెల్యేల పై సంచలన వ్యాఖ్యలు

బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉమ్మడి కృషితో అధికారంలోకి వచ్చినప్పటికీ.. క్షేత్రస్థాయిలో బీజేపీ నేతలకు సరైన గుర్తింపు దక్కడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దాంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా కావలిలో జరిగిన ‘జనవారధి’ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్ సొంత కూటమి ఎమ్మెల్యేల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుచ్చిపట్టణంలోని కట్టుబడిపాలెంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వద్ద స్థానిక నాయకత్వం కేంద్ర నిధులను వినియోగిస్తూ, క్రెడిడ్‌ను మాత్రం తమ వారికి దక్కనీయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ నేతల తీవ్ర ఆరోపణలు

Advertisement

కేంద్ర నిధులు వినియోగించే పథకాలకు సంబంధించి ప్రధాని ఫొటో పెట్టేందుకు అభ్యంతరమెందుకని టీడీపీ నేతలను భరత్‌కుమార్ నిలదీస్తున్నారు. ఇటువంటి ఘటనలు జిల్లాలో కూటమి నేతల మధ్య గ్యాప్‌ను స్పష్టం చేస్తోంది. కూటమి పాలనలో కొందరు అధికారులు, ఎమ్మెల్యేలు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతల తీవ్ర ఆరోపణలు చేయడం.. కొందరు ఇష్టానుసారం గా వ్యవహరిస్తూ కూటమి భాగస్వాములను అవమానిస్తున్నారని విమర్శలు గుప్పిస్తుండటం, బీజేపీ కార్యకర్తలకు గౌరవమివ్వకపోతే అధికారులను నిలదీస్తామని హెచ్చరించడం వంటివి కూటమి శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి.

Also Read; Brain Health: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఉదయాన్నే ఈ 5 పనులు చేసేయండి!

అప్పుడు ఇప్పుడు వారే..?

Advertisement

కావలి నియోజకవర్గంలో అనుమతులు లేకుండా గ్రావెల్ దోపిడీ జరుగుతోందని, స్థిరాస్తి వ్యాపారంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని భరత్ కుమార్ ఆరోపించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. ​అయితే, ఈ సందర్భంగా భరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూటమిలో చిచ్చురేపుతున్నాయి. జిల్లాలో ఇసుక, గ్రావెల్, రేషన్ మాఫియాల అక్రమాలు ఎక్కడా తగ్గలేదని ఆయన ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరు అక్రమ వ్యాపారాలు చేశారో.. ఇప్పుడు కూడా వారే ఆ పనులు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. జగన్ అవినీతిని ప్రశ్నించి అధికారంలోకి వచ్చిన మనం ఇప్పుడు అదే తప్పులు చేస్తే ప్రజలకు ఏమని సమాధానం చెబుతామని నిలదీశారు.

ఏదో నామ్ కే వాస్త్‌గా..

​ముఖ్యంగా కావలిలో గత ప్రభుత్వ హయాంలో 125 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు దోచుకున్నారని, దానిని వెలికితీయాలని స్థానిక ఎమ్మెల్యే అధికారులను ఆదేశించినా.. యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని భరత్ కుమార్ ప్రశ్నించారు. దాంతో అధికారుల నిర్లక్ష్యమా? లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ​మరోవైపు పొత్తు ధర్మాన్ని పాటించడంలోనూ ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఏదో నామ్ కే వాస్తగా పిలవడం తప్ప… బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని భరత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆందోళన చేపడతాం..

కూటమి ఒప్పందం ప్రకారం… బీజేపీకి నామినేటెడ్ పదవులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా పద్ధతిలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.​ మంచి పనులను ప్రోత్సహిస్తూనే, అక్రమాలను అరికట్టేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, అప్పుడే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోగలమని హితవు పలికారు. అంతేకాకుండా బుచ్చిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వద్ద ప్రధాని ఫొటో లేకపోవడంపై , అధికార యంత్రాంగం స్పందించకపోతే కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపడతామని కూడా హెచ్చరించారు.

Also Read: BRS Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ పార్టీ ధీమా..!

అంతా ఎమ్మెల్యేల దయపైనే..

మొత్తంమీద భరత్ కుమార్ వ్యాఖ్యలు, ప్రధాని ఫోటో పెట్టకపోవడం, స్థానిక టీడీపీ నేతలను ప్రశ్నించడం జిల్లాలో కూటమి ఐక్యతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారంటూ కమలనాథులు లోలోన రగిలిపోతున్నారట. ఎమ్మెల్యేల దయపైనే ఆధారపడాల్సిన పరిస్థితుల్లో తాము అధికార కూటమిలో ఉన్నామా..? లేక కేవలం జెండాలు మోసే వారిమా..? అని బీజేపీ శ్రేణులు మదనపడుతున్నాయి.

ఎ విధంగా స్పందిస్తారో..

వైసీపీ ప్రభుత్వ హయాంలలో భాగస్వాములు కాకపోయినా, బీజేపీ నేతలకు ఎక్కడా ఇలాంటి గౌరవ భంగం కలగలేదంటూ గుర్తు చేసుకుంటున్నారట. అయితే ఈ వరుస సంఘటనలపై బిజెపి ప్రధాన నాయకులు గాని జిల్లా అధ్యక్షులు కానీ ఇంతవరకు స్పందించలేదు. మరి బీజేపీ అసంతృప్తి రాగాలపై కూటమి నేతలు ఎ విధంగా స్పందిస్తారో అనేది ఇప్పుడ మనందరం వేచి చూడాలి.
Story by: Apparao, Big Tv

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×