వైసీపీకి గత ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. 151 స్థానాలతో అధికారంలోకి వచ్చి వై నాట్ 175 అని చెలరేగిపోయిన ఆ పార్టీ నేతలకు ఓటర్లు పెద్ద స్ట్రోక్ ఇచ్చారు. ఐదేళ్ల పాలన తర్వాత 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమి విజయ డంకా మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 11 సీట్లకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయింది. 2019 ఎన్నికల్లో కడప జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
అలాంటి నెల్లూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీని అడ్రస్ లేకుండా చేసింది. ఆ క్రమంలో వైసీపీ మళ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను నియమిస్తూ ప్రతిపక్ష హోదాలో పోరాటానికి సిద్ధమవుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఓటమి పాలవడంతో ఆ స్థానం రూరల్ ఇన్చార్జిగా ఆనం విజయకుమార్ రెడ్డిని జగన్ నియమించారు. అయితే ఆనం విజయకుమార్ రెడ్డి వైసీపీలో క్రియాశీలకంగా లేరన్న విమర్శలు ఉన్నాయి. దాంతో వైసీపీ అధ్యక్షుడు ఆయనను మార్చే ఆలోచనలో పడి, ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషిస్తున్నారంట.
గతంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. తర్వాత మళ్లీ మార్చడంతో ఆదాల ప్రభాకర్ రెడ్డికి, ఆనం విజయకుమార్ రెడ్డికి మధ్య బాగా గ్యాప్ పెరిగిందట. అనేక అంశాల్లో వారిద్దరూ మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీ క్యాడర్ తలలు పట్టుకుంటుందని ప్రచారం జరుగుతుంది. గతంలో ఆదాల వెంటనే నిలిచిన రూరల్ వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఆనం విజయకుమార్ రెడ్డి వెంట నడవడం లేదనిఆ పార్టీలో చర్చ జరుగుతుంది. ఆనంకు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో పార్టీ క్యాడర్ లో తీవ్ర నిరుత్సాహం నెలనెలకొందంట. ఈ పరిస్థితిని చక్కదిద్దే పనిలో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చూస్తుందంట. రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా మరో నేతను ఎంపిక చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులు కూడా బలమైన నాయకుడ్ని ఇన్చార్జిగా కోరుకుంటున్నారంట.
Also Read: రివేంజ్ కోసమే రాజకీయాలకు గుడ్ బై.. విజయసాయి రెడ్డి ప్లాన్ ఇదే..?
నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ బాధ్యతలను ఇప్పుడు ఎవరికి అప్పగిస్తారు అన్న చర్చ జోరుగా సాగుతోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇన్చార్జిగా వస్తే పార్టీ క్యాడర్లో ఉత్సాహం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయంట. పైపెచ్చు రూరల్ నియోజకవర్గంలో యాదవ్ వర్గం ఎక్కువగా ఉంది. దాంతో పార్టీ పరంగా కేడర్ బలంగా తయారయ్యే అవకాశం కూడా ఉంటుందని.. అందుకే అనిల్ కుమార్ యాదవ్‌కు సమన్వయ బాధ్యతలు అప్పప్పాలని కేడర్ కోరుతోందంట.
అయితే 2014,19 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి గెలిచిన అనిల్‌యాదవ్ మంత్రిగా కూడా పని చేశారు. అయితే జగన్ అనూహ్యంగా ఆయన్ని నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించారు. అనిల్ యాదవ్ అయిష్టంగానే జిల్లా మారి వెళ్లి పోటీ చేశారంటారు. అయితే జగన్‌కి నమ్మినబంటుగా పేరున్న ఆయన జగన్ తనకు ప్రమోషన్ ఇచ్చారని చెప్పుకుంటూ ప్రచారంలో చాలా హడావుడి చేశారు.
175 సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన అనిల్ నరసరావుపేట ఎంపీగా లక్ష 60 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మరోవైపు వైసీపీ కూడా కోలుకోలేని విధంగా దెబ్బతింది. దాంతో ఓటమి తర్వాత ఆ మాజీ మంత్రి నెల్లూరు సిటీలో కూడా పెద్దగా కనిపించడం లేదు. అలాంటిదిప్పుడు ఆయన నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జ్‌గా వస్తారన్న వార్తాలు చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరి రూరల్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, ఆయన సోదరుడికి అక్కడ బలమైన పట్టుంది. మరి కోటంరెడ్డిబ్రదర్స్ సెగ్మెంట్ మారి వచ్చే అనిల్ యాదవ్ ఎంత వరకు తట్టుకుంటారన్నది సింహపురి పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది