BigTV English

Nellore Politics: అజ్ఞాతంలోకి నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు..?

Nellore Politics: అజ్ఞాతంలోకి నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు..?

Nellore Politics: ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అంటారు చూడండి.. సరిగ్గా నెల్లూరు జిల్లా వైసీపీలో పలువురు నేతల వ్యవహారాశైలి అలాగే కనిపిస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించి లేనిపోని పెత్తనం చేసిన నాయకులు.. ఓటమి తర్వాత పార్టీ ఏమైపోతే మాకేం అన్నట్లు వ్వవహిరిస్తున్నారు. మొక్కుబడిగా కూడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు.. ఇంతకీ ఎవరా నేతలు? ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు?


నెల్లూరు జిల్లాలో అయిదేళ్లు చక్రం తిప్పిన వైసీపీ నేతలు

ప్రజా నాయకుడు అంటే ఓడినా..గెలిచినా జనంతో ఉండేవారు. ఇది ఒకప్పటి మాట. అయితే ప్రస్తుతం చాలా మంది నేతలు ఎన్నికలు, నోట్లు, ఓట్లు, సీట్లు ఈ లెక్కలే వేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచింది. అప్పుడు జిల్లాలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఐదు సంవత్సరాలు చక్రం తిప్పిన నేతలు ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేకుండా పోతున్నారు. ఒకరు, ఇద్దరు నాయకులు మాత్రమే తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ.. తమ పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.


పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉన్న ఒకరిద్దరు నేతలు

రైతులకు మద్దతు ధర లేక పోవడం, ఉదయగిరిలో జామాయిల్ మాయమైపోవడం, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆలస్యం.. విద్యుత్ ఛార్జీలు పెరగడం..ఇసుక, గ్రావెల్ కొల్ల గొట్టడం.. ఒకటేమిటి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన దందాలన్నీ ఇప్పుడు కూడా సాగుతున్నాయినే విమర్శలు వస్తున్నాయి. అయినా స్పందించనివైసిపి నాయకులు తీరుపై ప్రజల్లో తీవ్ర విమర్శల పాలవుతోంది.

అధికారదర్పం ప్రదర్శిస్తూ పెత్తనం చేసిన నేతలు

ప్రజల పట్ల అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా బాధ్యతగా ఉండాలనేది అందరికి తెలిసిన విషయమే.. రాష్ట్రంలో వైసీపీకి బలమైన జిల్లాల్లో కడప జిల్లా తర్వాత నెల్లూరు జిల్లా రెండోది. 2019 ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీ గెలిచింది. పార్లమెంట్, పంచాయతీ, మున్సిపాలిటీ అన్ని ఎన్నికల్లో అన్ని స్థానాలు ప్రజలు ఆ పార్టీకి కట్టబెట్టారు. అప్పట్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలో బానే చక్రం తిప్పారు. అదే స్థాయిలో అధికార దర్పం ప్రదర్శించారు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా లక్షల మంది కార్యకర్తలు ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు.

ఎవరికి చెప్పుకోవాలో ఆ పార్టీ నేతలకు, ప్రజలకు తెలియడం లేదంట

గతంలో గెలిచినా, ఓడినా జనం కోసం ఆయా నియోజకవర్గాల్లో నాయకులు పనిచేసేవారు. ప్రజాసమస్యలు ఎత్తిచూపుతూ పార్టీ క్యాడర్‌ని కాపాడుకోవడానికి కృషి చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు . ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంతో సంబంధం లేనట్లు కొందరు వ్యవహరిస్తున్నారు. దాంతో తమ ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో ఆ పార్టీ నేతలకు, ప్రజలకు తెలియడం లేదంట. ఎన్నికల సమయంలో వచ్చి డబ్బులు ఖర్చు పెడితే సరిపోతుంది అనే భావనతో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

సమస్యలపై స్పందిస్తున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తన నియోజకవర్గ సమస్యలపై నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ, మీడియా ముందుకొచ్చి గళమెత్తుతున్నారు. నెల్లూరు నగరంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి జనం, ఉపాధ్యాయ సమస్యలపై గట్టిగానే మాట్లాడుతున్నారు. ఇటీవల రాష్ట్ర పార్టీ ఆదేశాలతో విద్యుత్ చార్జీలపై, యువత పోరు వంటి కార్యక్రమాలపై జిల్లా స్థాయిలో ఆందోళనలు నిర్వహించారు. అయితే చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగా నియోజకవర్గానికి వచ్చి కనిపించి వెళ్లిపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నెల తర్వాత వైసీపీ నేతలు స్పందించడంపై విమర్శలు

ప్రతిపక్షాలు ప్రజలు తరపున గళం వినిపించాలి. ఉదయగిరి లో టిడిపి నేతలు జామాయిల్ చెట్లు దోచుకుపోతున్నారని.. అగ్రిగోల్డ్ బాధితులు, వామపక్ష నాయకులు ఆందోళన చేశారు. వారిలో కొందరిపై దాడులు కూడా జరిగాయి. అయితే అక్కడి వైసీపీ నేతలు మేకపాటి రాజగోపాల్ రెడ్డి కాని, మిగిలిన నాయకులు కాని సకాలంలో స్పదించలేదు. చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న సామెతలా.. అక్కడున్న కలప సంపద అంతా దోచుకెళ్లి జేబులు నింపుకున్న నెల తర్వాత వైసిపి నేతలు స్పందించడంపై విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి.

ఆత్మకూరులో కనిపించడమే మానేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి

ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి విక్రమ్ రెడ్డి దాదాపుగా కనిపించడమే మానేశారు. స్థానికంగా ఉన్న సమస్యలపై మాట్లాడటంకాని, కనీసం ఒక మీడియా సమావేశం పెట్టి మాట్లాడటం కాని చేయడం లేదు. ఎన్నికలప్పుడు చూసుకుందాంలే అని ఆయన తన అనుచరులకు చెప్తున్నట్లు జరుగుతున్న ప్రచారంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కావలిలో మాజీ ఎమ్మెల్యేని మర్చిపోతున్న జనం

కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని స్థానిక ప్రజలు మర్చిపోయే పరిస్థితి నెలకొందంట. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి అక్కడ నాయకులే కరువయ్యారంట. ఏదైనా సమస్యలు ఉంటే కనీసం చెప్పుకోవడానికి వైసిపి నేతలు ఒక్కరు కూడా కనిపించడం లేదని జనం వాపోతున్నారు.

శుభకార్యాలకు పరిమితమవుతున్న ఆదాల ప్రభాకరరెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి పరిస్థితి అలానే కనిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చి వివాహాది శుభకార్యాలకు హాజరై వెళ్ళిపోతున్నారట. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ నెల్లూరు సిటీలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారట. ఆ పార్టీ నేతలకు అందుబాటులో ఉండడం లేదట. సూళ్లూరుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు సైలెంట్ అయిపోయారంట. గూడూరు ఇంచార్జ్ మేరిగ మురళి, వెంకటగిరి ఇంచార్జ్ నేదరమల్లి రామ్‌కుమార్‌రెడ్డిలు సైతం పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకున్నట్లు అందరికీ దూరంగా ఉంటున్నారంట.

Also Read: ఏపీలో ఉగ్రవాదులు ఉపయోగించే డ్రగ్స్.. అధికారులు షాక్

పార్టీకి భవిష్యత్తు ఉండదని వాపోతున్న క్యాడర్

జనం బాధలు చెప్పుకోవడానికి వైసిపి నాయకులు ఆచూకీ కనిపించడం లేదని.. ఇలాగే కొనసాగితే ఇక పార్టీకి భవిష్యత్తు ఏం ఉంటుందని క్యాడర్ వాపోతోంది. రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని, విద్యుత్ ఛార్జీలు మోత, కూటమీ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కావడం లేదన్న విమర్శలు వస్తున్నా స్పందించకుండా .. కొందరు మొద్దు నిద్రలో ఉన్నారని, వైసీపీతో తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారని వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు విమర్శలు మూటకట్టుకుంటున్నారట.

పార్టీ పిలుపు ఇస్తే వచ్చి వెళ్లిపోతున్న మిగిలిన మాజీలు

అధికార టిడిపి అంటే వైసీపీ నేతలు కొందరు హడలి పోతున్నారట. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన కొందరు నేతలు తాము ఎక్కడ ఇబ్బందులు పడతామో అని నోరు తెరవడానికి వెనకాడుతున్నారంట. అప్పట్లో ఇసుక, గ్రావిల్, అక్రమ లేఔట్, మైనింగ్‌లకు సంబంధించి జరిగిన అవినీతిలో వైసిపి నేతల పాత్ర పై అనేక అరోపణలు వచ్చాయి . ఇప్పుడు టిడిపి నేతలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ దెబ్బతింటామో? అనవసర తలనొప్పులు ఎందుకని మాజీలు సైలెంట్ అయ్యారంట. ఆ క్రమంలో ఐదేళ్లు జనానికి కనిపించకపోయినా ఎన్నికల సమయంలో వచ్చి.. హామీలు ఇచ్చి, డబ్బులు ఖర్చు చేస్తే సరిపోతుందని మరి కొందరు నేతలు తమ అనుచరుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారంట. మరి వైసీపీ నాయకుల లెక్కలేంటో? వారి ధీమా ఏంటో వారికే తెలియాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×