New Twist In Kolikapudi Srinivasa Rao Controversy: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. గత కొద్దిరోజులుగా నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ యాంటీ కొలికపూడిగా పరిస్థితి మారింది. ఎమ్మెల్యే ఒక సర్పంచ్‌ను వేధించారని చెప్తూ మొదలైన వివాదం. మహిళలను వేధిస్తున్నారన్న ఆరోపణలతో మరింత ముదిరింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకగా తిరువూరుకు చెందిన ఒక వర్గం టీడీపీ నేతలు ధర్నాలు చేసి అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే అదంతా తనపై జరుగుతున్న కుట్రని కొలికపూడి ఆరోపిస్తున్నారు. ఆయన త్వరలో పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరుకానుండటంతో వివాదం ఏ మలుపు తిరుగుతుందో? అనేది ఉత్కంఠ రేపుతోంది.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆగడాలు నియోజకవర్గంలో మితిమీరిపోయాయని టిడీపీలోని ఒక వర్గం ఆరోపిస్తుంది. టీవల చిట్టేల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మనస్థాపానికి గురైన ఆయన భార్య ఆత్మహత్యా యత్నం చేసి ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారంటున్నారు. ఇటీవల మహిళలు సమస్యలు చెబుదామని ఎమ్మెల్యే కొలికపూడి దగ్గరకు వెళితే వారిని లైంగికంగా వేధిస్తున్నట్లు ఆ వర్గం ఆరోపిస్తుంది. ఆ క్రమంలో పలువురు రోడ్డెక్కి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
ఎమ్మెల్యే కొలికపూడిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కొలికపూడిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరిపించాలని.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడలో ధర్నా నిర్వహించి. తర్వాత మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీసుకు వెళ్లి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడులను కలిసి ఫిర్యాదు చేశారు .. పార్టీకి నష్టం కలిగించడంతో పాటు కేడర్‌ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ పన్ను ఉండదు!
ఆ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి వివాదం టీడీపీ హైకమాండ్ వద్దకు చేరినట్లు తెలిసింది. పార్టీ క్రమశిక్షణ సంఘం ఈ వ్యవహారంపై విచారణకు సిద్దమైందంట. ప్రస్తుతం క్రమిశిక్షణ సంఘం చైర్మన్ వర్ల రామయ్య అందుబాటులో లేరని.. ఒకటిరెండు రోజుల్లో ఆయన రాగానే కొలికపూడి ఆయన ముందు హాజరై వివరణ ఇచ్చుకుంటారని చెప్తున్నారు. ఆ క్రమంలో వివాదం మొదలైనప్పటి నుంచి కనిపించకుండా పోయిన కొలికపూడి నియోజకవర్గంలో ప్రజల ముందుకు వచ్చారు.
తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిజమైతే తనను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే అంటున్నారు. అబద్ధం అయితే సర్పంచ్, సర్పంచ్ భార్యను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్షకు దిగారు. అయితే పార్టీ అధిష్టానం ఆదేశాలతో సోమవారం రాత్రి ఆయన తన దీక్షను విరమించారు. తనపై పథకం ప్రకారం చేస్తున్న అసత్య ప్రచారాన్ని నియోజకవర్గ ప్రజలు నమ్మరని కొలికపూడి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యను కాలవనున్నట్టు స్పష్టం చేశారు.
తానేంటో నియోజకవర్గ వాసులందరికీ తెలుసని కొలికపూడి అంటున్నారు. ఎన్నికల ఫలితాలు రాకముందే రైతులు కోసం లక్షలు ఖర్చు పెట్టి కాల్వలు బాగుచేయించిన విషయాలను గుర్తు చేస్తున్నారు. వారి కోసం అంత చేస్తే.. తనపై తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు ఒక్కరు కూడా అండగా నిలబడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగానే ఐఏఎస్‌లకు కోచింగ్ ఇచ్చే కొలికపూడిపై వస్తున్న ఆరోపణలు ఆయన గురించి తెలిసిన వారందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి .. మరి క్షమశిక్షణ సంఘం విచారణ తర్వాత ఈ వ్యవహారం ఏ మలపు తిరగుతుందో చూడాలి.