వరి వద్దు వద్దన్న కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌లో వందల ఎకరాల్లో వరిని ఎలా సాగుచేస్తున్నారో చూశారా అని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ఆందోళన చేసిన రోజులు గుర్తున్నాయా? సీఎంగా కూడా రేవంత్ ఈ మాటలను పదే పదే గుర్తు చేశారు. వరిని వేయొద్దని మేం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఆంక్షలు విధించబోమని తేల్చి చెబుతున్నారు.
కానీ పరిస్థితులు రోజు రోజుకు ప్రతికూలంగా మారుతూ వస్తున్నాయి. ఈ వానాకాలం సీజన్‌లోనే వరి సాగును కంట్రోల్ చేయాలని ఎంత ప్రయత్నించినా రైతులు వినలేదు. సాధారణ విస్తీర్ణం 66 లక్షల ఎకరాలకు దాదాపు 56 లక్షల ఎకరాలను సాగు చేశారు. ఇక ఇప్పుడు ఎల్‌నినో ప్రభావంతో పాటు, భూగర్భ జలాలు అడుగంటడం, ప్రాజెక్టులు నిండకపోవడం, ఎండిపోవడం… కరెంటు వినియోగం విపరీతంగా పెరగడంతో .. ఇక రానున్న రోజుల్లో వరి సాగు చాలా కష్టం అనే అభిప్రాయానికి సర్కార్ వచ్చింది.
దీంతో ఇప్పట్నుంచే రైతులకు .. యాసంగి సీజన్‌లో వరి వేసుకోవద్దని మానసికంగా రెడీ చేసేందుకు సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఓ దశలో వరికి ఇచ్చే బోనస్ 500 రూపాయలను ఇవ్వడం లేదని ముందే ప్రకటించేసేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. అయితే బోనస్ ను సర్కార్ ఏమి సక్రమంగా ఇవ్వడం లేదు. దీనిపై మొదట్లో ఉన్నంతగా రైతాంగం భారీ ఆశలు పెట్టుకున్నట్టు కూడా లేదు.
ఇప్పుడు యాసంగికి వరి వేసుకుంటే బోనస్ ఇవ్వబోమని సర్కార్ తెగేసి చెప్పినా.. వరి వేయకుండా ఉండలేరు రైతులు. కొంత మేర సాగు విస్తీర్ణం తగ్గించగలుగుతారేమో గానీ, సగం వరి సాగును కూడా ఆపలేరు. దీంతో సమస్య మరింత జఠిలమవుతోంది. ఇప్పటికే బీఆరెస్ ఇది ఎల్‌నినో తెచ్చిన కరువు కాదని, సర్కార్ ఏరి కోరి తెచ్చుకున్న కరువు అని ప్రచారం చేస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకోకపోవడం కూడా ప్రధాన సమస్యగా చూపుతున్నారు. కృష్ణా నీటి వాటాలో ఏపీకి సహకరించి, తెలంగాణ రైతుల పొలాలు ఎండబెడుతున్నదంటు జూరాల ప్రాజెక్టు అంశంలో ఆందోళనకు దిగుతున్నది. వరికి బదులుగా మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పువ్వు, పప్పు దినుసులు పండించుకోవాలని సర్కార్ చెబుతోంది. ఆరుతడి పంటల కింద నువ్వులు, పెసర్లు, మినుములు సాగు చేసుకోవాలని సూచిస్తోంది.
అయినా వరికే అలవాటు పడ్డ రైతు.. దీన్ని వదిలి ఉండలేకపోతున్నాడు. వరి సాగు రాజకీయ క్రీడలో ఓ భాగంగా కూడా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరిసాగును వద్దన్న పాలకులపై తిరబడ్డ నేతలు.. ఇప్పుడు వారే అధికారంలోకి వచ్చిన తరువాత అసలైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వరి వద్దు.. వద్దే వద్దు… అనే నినాదాన్ని ఎత్తుకోవాల్సి వస్తోంది. రాజకీయంగా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
అయినా రైతులు వినే పరిస్థితి కనిపించడం లేదు. ఇది రాజకీయ అస్త్రంగా మారనుంది. వరి సాగు చేయడం ద్వారా సరిపడ సాగునీరు అందకపోవడంతో రైతులు నష్టపోవడం ప్రధాన సమస్యైతే… దీని ప్రభావం అంతిమంగా సర్కార్ మీదే పడనుంది. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడం కూడా సర్కార్‌కు మరో పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారనుంది.