గత ఏడాది సెప్టెంబరు 9న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత అక్రమ కేసులు బనాయించిన జగన్ ప్రభుత్వం ఆయన్ని జైలు పాలు చేసింది. ఆయన్ని అరెస్ట్ చేయడం.. అరెస్ట్ చేసిన తీరు ఏడాది క్రితం పెద్ద కలకలమే రేపాయి. స్కాంల పేరుతో వరుసగా బనాయించిన కేసులతో ఆయన 54 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ ఘటనతో తెలుగుదేశం శ్రేణులే కాదు తెలుగు ప్రజలంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.
నిజంగా అవినీతి జరిగుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కారు ఆయన్ని అరెస్ట్ చేయవచ్చు . కాని నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో ప్రజల్లో ఒక రకంగా తిరుగుబాటు తీసుకువచ్చిందనే చెప్పాలి. దానికి తగ్గట్టే ఆయన అరెస్ట్ సమయంలో లండన్‌లో ఉన్న జగన్.. చంద్రబాబును ఎత్తేసారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తిరిగొచ్చిన తర్వాత నిడదవోలు సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై వేసిన సెటైర్లు తెలుగు తమ్ముళ్ల ఆగ్రహాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళ్లాయి.
సరిగ్గా చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు. జనసేనాని పవన్‌కళ్యాణ్ జైలుకెళ్లి ఆయన్ని పరామర్శించారు. జైలు ముందే పొత్తు ప్రకటన చేశారు. సీబీఎన్ అరెస్ట్‌తో తెలుగు తమ్ముళ్లలో పెరిగిన కసి, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, జనసేన, బీజేపీలతో పొత్తు అన్నీ కలిసి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పక్కన పెట్టేసాయి. దాంతో సెప్టెంబర్ 9ని తలచుకుంటే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టే పరిస్థితి నెలకొంది.
లండన్‌లో ఉండగా చంద్రబాబును ఎత్తేసారంటూ వెటకారమాడిన నాటి ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు లండన్ వెళ్లడానికి పాస్‌పోర్ట్ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అది దేవుడు రాసిన స్క్రీఫ్ట్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై వ్యంగ్యంగా మాట్లాడిన జగన్‌కు ప్రజలు అదేస్థాయిలో బుద్ది చెప్పారు. గత ఎడాది సెప్టెంబర్ 9న ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ఫంక్షన్ హాలులో చంద్రబాబును అరెస్టు చేసేందుకు సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి పోలీసులు హైడ్రామా నడిపించారు. 54 రోజులపాటు రాజమండ్రి జైల్లో పెట్టి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు పడుకున్న బస్సు డోర్‌ను కొట్టి అరెస్టు చేసిన తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
10వ తేదీ తెల్లవారుజామున చంద్రబాబును కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చడం.. ఆ తర్వాత ఆయన రిమాండ్‌పై జరిగిన వాదనల సమయంలో చంద్రబాబు కోర్టు కారిడర్లో కూర్చోని ఆలోచిస్తున్న దృశ్యం.. ప్రజల్లో చర్చకు కూడా దారితీసింది… ఇప్పుడు మంత్రి లోకేష్ అదే ఫోటోను ట్యాగ్ చేసి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: ఇదంతా సైకో జగన్ పన్నిన కుట్ర: మంత్రి లోకేశ్
జైల్లో చంద్రబాబుకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆయన గదిలో ఏసీ పెట్టించడానికి కూడా టీడీపీ నేతలు పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. ఆరోగ్య కారణాలకు తోడు ఈ కేసులో బలమైన సాక్ష్యాలు చూపలేకపోయారన్న అభిప్రాయంతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో జైలుజీవితం గడపటం అదే మొదటిసారి. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా గతంలోని ఆయన ప్రత్యర్థి ప్రభుత్వాలు అరెస్టు చేసే సాహసం చేయలేకపోయాయి.
మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ ఆయన్ని అరెస్ట్ చేయించి తన గొయ్యి తానే తవ్వుకున్నారు. వైసీపీ 11 సీట్లకే పరిమితమై.. జగన్‌కు అసెంబ్లీలో విపక్ష నేత హోదా కూడా దక్కలేదు. లోకేశ్ యువగళం పాదయాత్ర, చంద్రబాబు ప్రాజెక్టుల యాత్ర వంటి కార్యక్రమాలతో అప్పట్లో టీడీపీ దూకుడు మీదుంది. ఈ దూకుడును తగ్గించడానికి చంద్రబాబును అరెస్టు ఉపకరిస్తుందని జగన్ భావించారంటారు.. అయితే అదే ఆయనకు బూమరాంగ్ అయింది.
ఆ అరెస్టు సామాన్యుల్లో సైతం చంద్రబాబు పట్ల సానుభూతి పెల్లుబికేలా చేసింది. ఆయన జైలు నుంచి విడుదలైన రోజు రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తుండగా, స్వాగతం పలకడానికి దారి పొడవునా ప్రజలు వేల సంఖ్యలో ఎదురుచూశారు. విజయవాడ నగరంలో తెల్లవారుజామున చలిలో కూడా మహిళలు, యువత ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. ఆయన అరెస్టుకు తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో కూడా భారీగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు స్థిరపడ్డ అన్ని దేశాల్లో కూడా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి. ఏభైకి పైగా దేశాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం సోషల్ మీడియాలో పేర్కొంది.
చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి జైల్లో చంద్రబాబు పరామర్శకు వెళ్లి.. తాము, టీడీపీ కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ పార్టీలతో చేతులు కలపడంతో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఏర్పడింది. బీజేపీ తటస్థంగా ఉంటుందని ఆశించిన వైసీపీకి ఆశాభంగం మిగిలింది.
అరెస్టు జరిగిన ఏడాది తర్వాత ఇప్పుడు. చంద్రబాబు జనంలో ఉన్నారు. విజయవాడను వరదలు ముంచెత్తడంతో చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అక్కడే గడుపుతున్నారు. ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ నిత్యం జనంలో ఉంటున్నారు. విదేశాలకు వెళ్లాలని అనుకొన్న జగన్‌కు కోర్టు నుంచి అనుమతులు రాకపోవడంతో, ఆ ప్రయత్నాల్లో నానా పాట్లు పడ్డారు. ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాది వాలిడిటీతో పాస్‌పోర్టు మంజూరుకు అనుమతిస్తే.. కాదు అయిదేళ్లకు కావాలని పైకోర్టుల్లో పిటీషన్లు వేస్తూ బెంగళూరు ప్యాలెస్‌లో ఎదురుచూపులు చూస్తున్నారు. ఏడాది క్రితం సీఎంగా రాజసం చెలాయించిన ఆయన సీన్ అలా రివర్స్ అయిందిప్పుడు