PM Modi Master Sketch: ద్రవిడ రాజకీయాల్లో హిందూత్వ.. ప్రభావం చూపుతుందా..? తమిళనాడు నేలపై ఈసారి ఎలాగైనా జెండా పాతేందుకే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను బీజేపీ.. ట్రంప్‌కార్డుగా ప్రయోగిస్తోందా..? కమలం అగ్రనాయకత్వం గీసిన స్కెచ్ ఏ మేరకు వర్కవువుటవుతుంది..? ప్రస్తుతం దీనిపైనే పొలిటికల్ వర్గాల్లో చర్చ.
ఆపరేషన్ తమిళనాడు..! గత కొన్నేళ్లుగా బీజేపీ టార్గెట్ ఇదేనని చెప్పాలి.
దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు పాలిటిక్సే వేరు. జాతీయ పార్టీలకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవానే ఎక్కువ. అందుకే.. కేంద్రంలో ఏ నేషనల్ పార్టీ పవర్‌లో ఉన్నా.. తమిళనాట మాత్రం అయితే డీఎంకే, లేదంటే అన్నాడీఎంకే అన్నట్లుగానే ఇప్పటివరకు రాజకీయం సాగింది. అలాంటి చోట ఈసారి పాగా వేయాలని భావిస్తున్నారు కమలనాథులు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలను హీటెక్కిస్తున్నారు కాషాయ పార్టీ నేతలు. ఇందులో భాగంగానే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దింపారన్న మాట ఆఫ్‌లైన్లో విన్పిస్తోంది. కమలం అధినాయకత్వం ప్లాన్‌లో భాగంగానే పవన్ మధురైలో పర్యటించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పేరుకు మురుగన్ భక్తుల మహానాడులో పవన్ పాల్గొన్నా ఆయన చేసిన హిందూత్వ ప్రసంగమే ఇందుకు నిదర్శనమన్న కామెంట్లు విన్పిస్తున్నాయి.
హిందూత్వను బలంగా వినిపిస్తున్న జనసేనాని
అంతా ఊహించినట్లుగానే సభా వేదికపై నుంచే హిందూత్వ వాదాన్ని మరోసారి బలంగా విన్పించారు పవన్ కల్యాణ్. పదహారేళ్ల వయసులోనే తాను శబరిమల వెళ్లినట్లుగా తెలిపారు పవన్. ఇంట్లో విభూతి పెట్టుకొని మరీ బడికి వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని.. అలాగే హిందువు అయినందుకు ఎంతో గర్వపడతానంటూ లక్షలాదిగా వచ్చిన భక్తుల మధ్య ప్రకటించారు పవన్. మార్పు రావాలంటే ధైర్యం ఉండాలంటూ ఇదే వేదికపై నుంచి గర్జించారు పవన్. అసలు మురుగనే తొలి విప్లవనాయకుడని, ఆయనకు బేధభావం లేదన్నారు. అందరూ సమానమేనన్నారు పవన్. ఎలుకల సంఖ్య ఎంత ఉన్నా నాగుపాము గట్టిగా శబ్దం చేస్తే వాటంతటవే పరుగు తీస్తాయన్నారు. ఈ నమ్మకంతోనే మార్పు వస్తుందని కచ్చితంగా తాను నమ్ముతానన్నారు పవన్. మురుగన్ భక్తుల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన ఈ కామెంట్ల పైనే డీఎంకే భగ్గుమంటోంది. ఏ ప్రయోజనాలు ఆశించి తమిళనాడులో నిర్వహించిన కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించారని బీజేపీకి ప్రశ్నలు సంధిస్తోంది డీఎంకే.
బీజేపీ సౌత్‌లో గట్టి పట్టున్నది కర్ణాటకలోనే
కేవలం ఇప్పుడే కాదు.. కొన్ని రోజుల క్రితం సైతం పవన్ కల్యాణ్ తమిళనాడులో పర్యటించారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కార్యక్రమంలో భాగంగా తమిళనాడులో పర్యటించిన ఆయన.. డీఎంకేను ఉద్దేశిస్తూ ఘాటైన వ్యాఖ్యలే చేశారు. జమిలీ ఎన్నికలను డీఎంకే అధినేత కరుణానిధి కోరుకున్నారని..కానీ, ఇప్పుడు అవే ఎన్నికలను ఆయన కుమారుడు స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారంటూ ఫైరయ్యారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కారణంగా ప్రాంతీయ పార్టీలకు దెబ్బ తగులుతుంది అన్న విమర్శలను ఈ సందర్భంగా కొట్టిపారేశారు పవన్ కల్యాణ్. దక్షిణాదిలోని తమిళనాట పాగా వేయాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు కాషాయ పార్టీ నేతలు. కానీ, వాళ్ల ప్లాన్లు మాత్రం పెద్దగా వర్కవుట్ కావడం లేదనే చెప్పాలి. నిజానికి… సౌత్‌లో బీజేపీకి బాగా పట్టున్నది ఒక్క కర్ణాటకలోనే. ఇప్పటికే పలుమార్లు అక్కడ సొంతంగానూ, మిత్ర పక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. పైగా యడ్యూరప్ప లాంటి దిగ్గజ నేతలు ఆ పార్టీలో ఉండి రాష్ట్ర రాజకీయాలను కొన్నేళ్ల పాటు శాసించారు.
ఏపీలో అధికార భాగస్వామిగా ఉన్న కమలం పార్టీ
ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కట్టుగా 2024 ఎన్నికల్లో పోటీ చేసి బంపర్ విక్టరీ కొట్టాయి. దీంతో.. ఏపీలోనూ కమలం పార్టీ అధికారంలో ఉన్నట్లుగానే భావించాలి. తెలంగాణలో మాత్రం కమలం పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలోనే సంఖ్యా బలముంది. ప్రధానంగా ఆ పార్టీ తరఫున 8 మంది ఎంపీలున్నారు. అసెంబ్లీలోనూ 8 మంది ఎమ్మెల్యేలున్నారు. 2018 ఎన్నికలతో పోలిస్తే 2023లో బీజేపీ చాలా బలపడింది. కానీ, అధికారం అంటారా ఇప్పుడప్పుడే కష్టమనే అభిప్రాయం ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతోంది. మరో దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కమలనాథుల ప్రభావం అంతంత మాత్రమే. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేరళ నుంచి కేవలం ఒకే ఒక్క ఎంపీ స్థానం గెలిచింది బీజేపీ. ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపి త్రిస్సూర్ నుంచి విజయం సాధించి కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించారు.
ద్రవిడ గడ్డపై పట్టుకోసం కమలనాథుల ఆరాటం
ఇలా దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో తనదైన ప్రభావం చూపిస్తున్న బీజేపీకి ద్రవిడ గడ్డపై మాత్రం పట్టు చిక్కడం లేదు. వాస్తవానికి 2014 ఎన్నికల వేళ… నాటి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్రమోడీ స్వయంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ప్రధానిగా మోడీ అయిన తర్వాత కూడా ఇరువురి మధ్యా మంచి స్నేహమే నెలకొంది. కానీ, రజనీకాంత్ మాత్రం కమలనానికి మద్దతు ఇవ్వలేదు. దీంతో.. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని చేసింది. దీంతో.. ఆయనా దూకుడుగా వ్యవహరించారు. కానీ, ఫలితం మాత్రం పెద్దగా రాలేదు.
Also Read: తంబళ్లపల్లిలో టీడీపీ కథ రివర్స్
ఇలాంటి వేళ 2026 ఎన్నికల నాటికి తమిళనాడు అసెంబ్లీలో చెప్పుకోదగిన స్థాయిలో సీట్లను సాధించాలంటే హిందూత్వ అజెండాను మరింత ఉధృతంగా విన్పించే నాయకులైతేనే బెటర్ అన్నట్లుగా కాషాయ పార్టీ నేతలు ఆలోచించినట్లు సమాచారం. అన్ని రకాలుగా ఆలోచించి చివరకు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా సనాతన ధర్మం గురించి గట్టిగా తన వాయిస్ విన్పిస్తున్న పవన్‌ను ట్రంప్ కార్డుగా ఉపయోగించి మురుగన్ భక్తులను ఆకట్టుకోగలిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మైలేజ్‌తోపాటు సీట్లు వస్తాయన్నది కమలనాథుల ఆలోచనగా తెలుస్తోంది. చూడాలి మరి.. బీజేపీ ప్లాన్ ఎంతవరకు వర్కవుటవుతుందో.
Story By rajashekar, Bigtv