BigTV English

Big Shock To TDP: తంబళ్లపల్లిలో టీడీపీ కథ రివర్స్

Big Shock To TDP: తంబళ్లపల్లిలో టీడీపీ కథ రివర్స్

Big Shock To TDP: మనం అధికార పక్షంలో ఉన్నామా.. లేదంటే ప్రతిపక్షంలో ఉన్నామా..? ఇలా ప్రశ్నిస్తోందట అక్కడి టీడీపీ కేడర్. ఇంకా చెప్పాలంటే పవర్‌లో ఉన్నామన్న సంతోషం కూడా అక్కడి తెలుగు తమ్ముళ్లకు లేకుండా పోయిందట. అసలు ఎందుకీ పరిస్థితి..? పార్టీలో ఏం జరుగుతోంది అని స్థానిక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. టీడీపీకి ఇంత సంక్లిష్ట పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ ఎదురవుతోంది..? దానికి కారణాలేంటి..?


తంబళ్లపల్లిలో ఏం జరుగుతోంది..?

అధికార పార్టీ అంటే ఆ జోషే వేరు. తమ పార్టీ పవర్‌లో ఉందంటే సంబంధిత కేడర్‌లో ఉత్సాహం వెల్లివిరుస్తుంటుంది. ప్రభుత్వం మాది.. మేం చెప్పిన పనులు చేయాల్సిందే అంటూ కార్యాలయాల్లో నేతల హడావిడి కొనసాగుతుంటుంది. ఇది ఎక్కడైనా కన్పించే సర్వ సాధారణమైన పరిస్థితే. కానీ, ఇందుకు విరుద్ధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లిలో జరుగుతోందట. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ రెండు చోట్ల నెగ్గింది. అందులో ఒకటి తంబళ్లపల్లి. వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచి జయచంద్రారెడ్డి పోటీ చేయగా.. వైసీపీ ఇక్కడ గెలిచింది. అయితే..జయచంద్రారెడ్డి సైతం వైసీపీ నుంచి వచ్చిన నేత కావడమే ఇక్కడ కీలక అంశం.


నియోజకవర్గంలో ఓడినా రాష్ట్రంలో పవర్‌లోకి వచ్చిన టీడీపీ

నియోజకవర్గంలో టీడీపీ ఓటమి పాలైనా రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో.. పోనీలే అని కార్యకర్తలు, నాయకులు సంబరపడ్డారు. ఇక తమ పనులు పూర్తైనట్లేనని ఆందోత్సాహాల్లో మునిగి తేలారు. కానీ, వాళ్ల ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. ఇంకా చెప్పాలంటే.. పార్టీ అధికారంలో ఉంది కదా ఇక మన హవానే కొనసాగుతుందని భావించిన తెలుగు తమ్ముళ్లకు నియోజకవర్గంలో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయన్న వాదన విన్పిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం జయచంద్రారెడ్డి వ్యవహారశైలే అన్న మాటలు బహిరంగంగానే విన్పిస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల టైమ్‌లో మాజీ MLA శంకర్ యాదవ్‌తో పాటు యువనేత కట్టా దొరస్వామినాయుడు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు. అయితే అప్పటి పరిస్థితుల్లో జయచంద్రారెడ్డి అభ్యర్థిగా మారారు. కానీ, అయన అభ్యర్థిత్వాన్ని టీడీపీలోని శంకర్ యాదవ్‌తో పాటు మిత్రపక్షం జనసేన కూడా వ్యతిరేకించింది.

టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోని జయచంద్రారెడ్డి

చివరకు.. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన నేతల సహకారంతో జయచంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారన్న విమర్శలూ వెల్లువెత్తాయి. ఒకానొక దశలో టికెట్ ప్రకటించినా బీఫాం ఇవ్వకుండా అపేసిందట టీడీపీ అధిష్టానం. ఫైనల్‌గా అగ్రనాయకత్వమే కాస్త వెనక్కు తగ్గి ఆయన్నే అభ్యర్థిగా కొనసాగించిందట. దీంతో.. ఈ స్థానం టీడీపీ చేయిజారింది. ఇక, ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో పెద్దగా ఈ నియోజకవర్గంపై దృష్టి పెద్దగా పెట్టలేదట అధినాయకత్వం. ఇందుకు కారణం జయచంద్రారెడ్డి వ్యవహార శైలేనని తెలుగు తమ్ముళ్లు ఇప్పటికీ చెబుతుంటారు. కేవలం ఎన్నికలప్పుడే కాదు.. అంతకు ముందు సైతం ఇలాగే ఉందట జయచంద్రారెడ్డి వైఖరి. ప్రాజెక్టుల బాటలో భాగంగా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు అంగళ్లులో పర్యటించారు. అప్పట్లో ఆయనపై దాడి చేయడమే కాకుండా కేసులు పెట్టిన వారిని సైతం పార్టీలో చేర్చుకోవడంలో జయచంద్రారెడ్డే కీలక పాత్ర పోషించారట. అంతేకాదు.. ఇన్‌ఛార్జ్‌గా ఉన్నా పార్టీ కేడర్‌పై దాడులు జరుగుతుంటే ఇప్పటికీ పట్టించుకోవడమే లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

గతంలోనే కాదు.. ఇప్పుడూ అదే పరిస్థితి అంటున్న టీడీపీ కేడర్

ఎక్కడిదాకో ఎందుకు.. ఇటీవలె హార్స్‌లీ హిల్స్‌లో జరిగిన తంబళ్లపల్లి రివ్యూ సమావేశానికి హాజరయ్యారు ఇన్‌ఛార్జ్ మంత్రి జనార్థన్ రెడ్డి. అయితే.. ఈ మీటింగ్‌కు టీడీపీలోని పాత వర్గాన్ని హాజరవ్వకుండా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొత్త నేతలతో దాడి చేయించారట జయచంద్రారెడ్డి. మంత్రి లోకేశ్ జన్మదిన వేడుకలకు ప్రత్యర్థి గ్రూప్ కేక్‌ తీసుకొస్తే తన అనుచరులతో దాడి చేయించారని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం సాగింది. ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా జయచంద్రారెడ్డిలో ఎలాంటి మార్పు లేదనే మాట నియోజకవర్గం అంతటా విన్పిస్తోందట. అంతేకాదు.. నియోజకవర్గంలో ఉన్న వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఆయన సహకారం అందిస్తున్నారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. దీంతో.. అసలు జయచంద్రారెడ్డి టీడీపీ నేతా లేదంటే వైసీపీ నాయకుడా అన్న అనుమానం సైతం తెలుగు దేశం కేడర్‌లో విన్పిస్తోందట. లేటెస్ట్‌గా మల్లికార్జున్ నాయుడు వ్యవహారం సైతం పార్టీకి తలనొప్పిగా మారిందట. పార్టీ ప్రయోజనాల కంటే తన సొంత లాభం కోసం మల్లికార్జున నాయుడు, జయచంద్రారెడ్డి కలసి పార్టీని నాశనం చేస్తున్నారని టీడీపీ క్యాడర్ ఆరోపిస్తోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగానికి గతంలో జిల్లా ఇన్‌ఛార్జ్ గా ఉన్న మల్లికార్జున నాయుడు 2009 ఎన్నికల తర్వాత తంబళ్లపల్లి కన్వీనర్‌ అయ్యారు. ప్రవీణ్‌ రెడ్డి వైసీపీలో చేరడంతో అందివచ్చిన అవకాశంతో ఎదిగారాయన.

ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో సత్సంబంధాలు..!

రాయచోటి నియోజకవర్గానికి చెందిన మల్లికార్జున నాయుడు మదనపల్లిలో ఉంటూ తంబళ్లపల్లిలో రాజకీయం నడిపారు. 2019 ఎన్నికల్లో మదనపల్లిలో దొమ్మలపాటి రమేశ్‌కు పార్టీ అధిష్టానం సీటు ఇవ్వడంతో వ్యతిరేకించిన మల్లికార్జున జనసేనలో చేరారు. తర్వాత 2019-24 మద్య కాలంలో వైసిపిలో కొనసాగారు. ఇదే సమయంలో 2024లో జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడంతో తంబల్లపల్లి రాజకీయాలలో యాక్టివ్ అయ్యారాయన. అప్పటికే శంకర్ యాదవ్‌తో కలసి పనిచేసిన వీరికి విభేదాలు ఉన్నాయట. దీంతో.. తాజాగా మారిన పరిణామాల్లో మల్లికార్జున్ నాయుడు, కురబల కోట మండల కన్వీనర్ వైజి సురేంద్ర.. జయచంద్రారెడ్డితో కలసి పార్టీ క్యాడర్‌ను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. దీనికి తోడు స్థానికంగా భూముల దందా పెద్ద ఎత్తున చేస్తున్నారని అరోపణలు ఉన్నాయి. వీరికి సిట్టింగ్ ఎంఎల్ ఎ అయిన ద్వారక నాథ్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన మీద ఈగ కూడా వాలకుండా చూస్తున్నారని టీడీపీ కేడర్ చెబుతోంది.

తెలుగు తమ్ముళ్ల ప్రతిపాదనపై ఫోకస్ చేసిన అధిష్టానం

రానున్న ఎన్నికల నాటికి తంబళ్లపల్లి నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా మారే అవకాశముందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేస్తున్న జయచంద్రారెడ్డిని ఇన్‌ఛార్జ్‌ పదవి నుంచి తొలగించి త్రిమ్యాన్ కమిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే కోరారు. దీంతో.. పార్టీ అధినాయకత్వం సైతం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. మాజీ ఎంఎల్ఎ శంకర్ యాదవ్ తో పాటు తెలుగు యువత నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు, మదనపల్లి మాజీ ఎంఎల్ఎ దోమ్మాలపాటి రమేశ్‌తో కలసి త్రీమెన్ కమిటి ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: శ్రీకాళహస్తి BC బాలుర హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత

ఓవైపు ఇదంతా జరుగుతుంటే.. టీడీపీలోని మరో గ్రూపు జయచంద్రారెడ్డిని కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మొత్తంగా పార్టీ గెలవాల్సిన చోట చతికలపడడానికి కారణమైన జయచంద్రారెడ్డిని తొలగించి పార్టీని కాపాడాలని కోరుతున్నారు తెలుగు తమ్ముళ్లు. లేదంటే రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

Story By Rajashekar, Bigtv

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×