ఇప్పుడు ఎవరి నోట విన్నా కరువు మాటలే వస్తున్నాయి. కరవు ఆల్రెడీ ఎంట్రీ అయి .. దాని ప్రభావం చూపడం మొదలు పెట్టిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా దీనిపై సమీక్ష కూడా పెట్టారు. రాబోవు కరువు పరిస్థితులు, తీవ్ర ప్రభావ పరిస్థితుల గురించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
దీంతో పాటు వచ్చే యాసంగి సీజన్‌లో వరి సాగు ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దని కూడా ఇప్పట్నుంచే రైతాంగాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. మొన్నటి వానాకాలం సీజన్‌కు ముందు నుంచి కూడా ఇదే విధంగా రైతులను వరిసాగు, కరువు పరిస్థితుల విషయంలో చైతన్యం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
రైతు వరివైపే మొగ్గు చూపాడు. తెలంగాణ మొత్తంగా వానాకాలం సీజన్ కోసం 67 లక్షల ఎకరాల్లో వరిసాగు విస్తీర్ణంలోకి వస్తుంది. కానీ ఈసారి యంత్రాంగం అలర్ట్ చేయడం.. ఒత్తిడి పెంచిన నేపథ్యంలో ఇందులో ఓ పదిలక్షల ఎకరాలు తగ్గింది. కానీ మేజర్ పార్టు వరి సాగు యథావిధిగానే వేశారు.
ఇందులో ఇప్పటికే ఓ 30 శాతం వరికోతలు కూడా పూర్తయ్యాయి. తెలంగాణ లో కొన్ని ఏరియాల్లో ప్రధానంగా సాగనీటి వనరులు పుష్కలంగా ఉన్నచోట్ల, బోరు నీళ్లకు ఇబ్బంది లేకుండా ఉన్న ప్రాంతాల్లో నారుమళ్లు ముందే వేసే అలవాటుంది. ఇప్పుడు ఇవన్నీ కోతల దశకు వచ్చేశాయి. వడ్లను అమ్ముకుంటున్నారు కూడా.
ఈ పచ్చి వడ్లకు భలే డిమాండ్ ఏర్పడింది. పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు తెలంగాణ పచ్చి వడ్లను క్వింటాలుకు రూ. 3500 నుంచి రూ. 3900 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మిల్లర్లు, వ్యాపారులు.. తెలంగాణ వరిసాగుపై గురి పెట్టారు. అక్కడ విస్తీర్ణం సగానికి సగం పడిపోయింది. ఎల్‌నినో వల్లే అక్కడి ప్రభుత్వాలు వరిని బాగా తగ్గించాలని రైతులను ఒప్పించి.. ఆ మేరకు ఆల్టర్నేట్ సాగువైపు మళ్లించడంలో సక్సెసయ్యారు.
కానీ తెలంగాణలో వరే ప్రధాన పంటగా రైతు వేస్తున్నాడు. కరువు ఉంటుందని తెలిసినా రిస్క్ తీసుకున్నాడు. ఇప్పుడిలా కాలం కలిసివచ్చింది. కరువే తెలంగాణ రైతుకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. రాబోయే యాసంగి సీజన్‌లో వరి సాగుకు ఇంకా కష్టకాలమే కావడంతో.. వడ్లు దొరకడం కష్టంగా మారుతుంది. ఇప్పటికే సన్నబియ్యం ధర బహిరంగ మారర్కెట్లో ఆకాశానికంటుతోంది. మున్ముందు ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పట్నుంచే వ్యాపారులు అలర్టయ్యారు.
పచ్చి వడ్లనే బంగారంలా కొనేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర కింద క్వింటాలుకు రూ. 2400 ఇస్తుంది. బోనస్ మరో 500… మొత్తం కలిపి క్వింటాలుకు రూ. 2900 వరకు దొరుకుతుంది. కానీ ఇప్పుడు వ్యాపారులు క్వింటాలుకు రూ. 3900 వరకు కూడా ఇస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడి వెళ్లిపోగా.. లాభాలు వస్తున్నాయంటున్నారు రైతులు.
అయితే ఇంకా దాదాపు 70 శాతం సాగు కోతకు రావాల్సి ఉంది. మరి అప్పటి వరకు నీటి వసతులు లేకపోతే.. దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదు. ఈ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని రానున్న యాసంగిలో రైతులు జాగ్రత్త పడతారా? రిస్క్ తీసుకోవడానికే సిద్దమవుతారా? అనేది కూడా ఆసక్తికకరంగానే మారింది.
అయితే ఇప్పటికన్నా రానున్న రోజుల్లో నీటి వనరుల పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యేలా ఉంది. మరీ రిస్కు తీసుకుంటే మొదటికే ముప్పు రావొచ్చంటున్నారు వ్యవసాయాధికారులు.