Telangana Politics: అదిలాబాద్ జిల్లాలో రాజకీయం బిజెపి వర్సెస్ బిఆర్ఎస్ అన్న విధంగా మారింది.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే పత్తి కొనుగోళ్ల విషయంలో పరస్పర ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు తారా స్థాయికి చేరాయట.. పత్తి కొనుగోళ్ల విషయంలో దాదాపు కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ అందరిలో గందరగోళానికి కారణమవుతున్నారంట
ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పై జోగురామన్న ఆరోపణలు
మాజీ మంత్రి, అదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న ఇటీవల మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ, తాజా ఎమ్మెల్యేలు పరస్పరం ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా ఆరోపణలు చేసుకునే స్థాయికి పరిస్థితి వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగా పత్తి రైతులు నిలువునా మోసపోయారని, స్థానిక ఎమ్మెల్యే ప్రైవేటు డీలర్లతో ఒప్పందం కుదుర్చుకుని రైతులకు కుచ్చుటోపీ పెట్టారని ఇటీవల అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ పై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న.ప్రభుత్వ విధానాలు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
పాయల్ శంకర్ కాంగ్రెస్ నేతలకు సహకరించారని ఆరోపణ
రాష్ట్రంలో మొత్తం 25 లక్షల మంది పత్తి రైతులు సాగు చేసిన పత్తితో 49 లక్షల బేళ్లు ఉత్పత్తి అయ్యాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని, ఇందులో 41 లక్షల బేళ్లు సీసీఐ ద్వారా ఖరీదు చేసినట్లు చెబుతున్నారని, మరో ఎనిమిది లక్షల బేళ్లను ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు లెక్కలు చెపుతున్నారని విమర్శించారు. అయితే సీసీఐ కేవలం 6 లక్షల 50 వేల మంది రైతుల నుంచే పత్తి కొనుగోలు చేసినట్లు ఉందన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు, ప్రైవేటు వ్యాపారస్తులతో సమావేశమై రైతులను నిలువునా మోసం చేసే యత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. తాను గతంలోనే హెచ్చరించిన విధంగా స్థానిక ఎమ్మెల్యే అందుకు సహకరించారని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్‌పై ఆరోపణలు గుప్పించారు. తప్పుల తడకగా ఉన్న లెక్కలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు .
Also Read: రాప్తాడులో రామగిరి టెన్షన్..
పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై విచారణకు పాయల్ శంకర్ డిమాండ్
మాజీ మంత్రి జోగు రామన్న వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతి స్పందించారు ఎమ్మెల్యే పాయల శంకర్. జోగు రామన్న చేసినవి నిరాధార ఆరోపణలు అని ఖండించారు. పత్తి కొనుగోళ్ల లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరిందే తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. మాజీ మంత్రి జోగు రామన్న తన ప్రతిష్ఠను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పత్తి కొనుగోళ్ల వ్యవహారంలో తన పాత్ర ఉందని మాజీ మంత్రి ఆరోపించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రిగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఏనాడూ అసెంబ్లీలో జిల్లా సమస్యలు ప్రస్తావించని జోగురామన్న … తాను అన్ని విషయాలపై గళమెత్తడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని యద్దేవా చేశారు. తన పై ఆరోపణలు చేసే ముందు ఒక్కసారి ఆయన జిల్లా ప్రజలకు ఏం చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు
నిజంగానే కోట్ల రూపాయల స్కాం జరిగిందా?
మొత్తానికి ఈ తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య నడుస్తున్న వార్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన ప్రజా ప్రతినిధులు, నాయకులే రైతులకు జరిగిన నష్టం పై పరస్పర ఆరోపణలకు దిగడం, పత్తి కొనుగోళ్ల విషయంలో కోట్ల రూపాయల స్కాం జరిగిందని అంటుండటంతో.. పత్తి కొనుగోళ్ల విషయంలో నిజంగానే కోట్ల రూపాయల స్కాం జరిగిందా..? అని రైతన్నలు ఆశ్చర్యపోతున్నారట.