Regional Politics: భిన్నత్వంలో ఏకత్వం.. భారత విధానం. ఇది కేవలం మనుషుల విషయంలో మాత్రమే కాదు… మన దేశంలో రాజకీయాల విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంస్కృతి.. ఒక్కో భాష.. ఒక్కో జీవనశైలి.. ఒక్కో రకమైన ఆలోచనలు. ఇలాంటి వాటికి తగ్గట్టే.. ఒక్కో రాష్ట్రంలో అనేక ప్రాంతీయ పార్టీలు కూడా ఏర్పాటయ్యాయి. కొన్ని కొంతకాలం ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత కనుమరుగయ్యాయి. కొన్ని జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని.. ఆ తర్వాత ఏకంగా వాటిలోనే విలీనమైపోయాయి. కానీ కొన్ని మాత్రం జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో రీజనల్ పార్టీల పరిస్థితి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కొన్ని పార్టీలు ఒడిదుడుకుడులను ఎదుర్కొంటుండగా మరికొన్ని మాత్రం అధికారం దక్కించుకొని తమ ప్రాభవాన్ని కొనసాగిస్తున్నాయి. ఒకప్పుడు జాతీయ పార్టీల హవాను శాసించిన ప్రాంతీయ శక్తులు, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల నడుమ సరికొత్త సవాళ్లను, అవకాశాలను ఎదుర్కొంటున్నాయనేది మాత్రం వాస్తవం. చాలా పార్టీల గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి తెలుగుదేశం పార్టీపై స్పెషల్ ఫోకస్ చేయాలి. ఎందుకంటే.. 1982లో ఆత్మగౌరవ నినాదంతో నందమూరి తారకరామరావు చేతుల మీదుగా స్థాపితమైన ఈ పార్టీ.. ఈ నాలుగు దశాబ్ధాల్లో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటి.. అనేక సార్లు అధికారాన్ని చేపట్టింది. కానీ ఎప్పటికప్పుడు తన విధానాలకు పదును పెడుతూ.. పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఇప్పుడు కూడా తన ప్రాభవాన్ని కొనసాగిస్తూనే వస్తోంది.
ప్రస్తుతం మాత్రం ఏపీలోని తెలుగుదేశం పార్టీ.. బీహార్‌లోని జేడీఎస్ ఇప్పుడు కింగ్ మేకర్‌లుగా మారి జాతీయ రాజకీయాలను శాసించే పరిస్థితి నెలకొంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏ ఒక్క జాతీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు.. కేంద్ర ప్రభుత్వ మనుగడకు అత్యంత కీలకంగా మారాయి. దీనివల్ల తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే శక్తి వీటికి లభించింది. ఇప్పుడీ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాయి కూడా సమాజ్‌వాదీ పార్టీ, DMK, శివసేన, శరద్‌పవార్ NCP వంటి పార్టీలు జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు తమ ప్రాభవాన్ని కోల్పోతూ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిజు జనతా దళ్, తెలంగాణలో BRS, పశ్చిమ బెంగాల్‌లో జాతీయ పార్టీల దూకుడుతో తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు ఇటీవలి కాలంలో గట్టి ఎదురుదెబ్బలను చూశాయి.
Also read: ఫ్యాన్ తిరుగుతుంది కానీ బిల్లు రాదు.. ఈ లేటెస్ట్ ఫ్యాన్ల ధరలు తెలుసా?
జాతీయ పార్టీల విస్తరణ ఎప్పుడూ కూడా ప్రాంతీయ పార్టీలకు మైనస్‌గానే మారుతుంది. ఓ వైపు BJP తన భౌగోళిక పరిధిని పెంచుకుంటూ ప్రాంతీయ కోటలను బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా కొన్ని రాష్ట్రాల్లో పుంజుకుంటూ ప్రాంతీయ పార్టీల ఓటు బ్యాంకును ఆకర్షిస్తోంది. ఇది ప్రాంతీయ పార్టీలకు ఒక మైనస్‌గా మారుతోంది. పాత పార్టీలు బలహీనపడుతున్న చోట, కొత్త ప్రాంతీయ ఆకాంక్షలతో సరికొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి. ఉదాహరణకు తమిళనాడు రాజకీయాల్లో సాంప్రదాయ DMK, AIADMK ద్వంద్వ పోరాటానికి భిన్నంగా నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం సరికొత్త ప్రాంతీయ శక్తిగా ఎదిగింది. పార్టీ ప్రారంభించిన రెండేళ్లకే ఏకంగా అధికారంలోకి వచ్చి ఒక రికార్డ్‌ను సృష్టించారు విజయ్.
ఓ వైపు ప్రాంతీయ పార్టీల కథ ముగుస్తుంది అనుకునే టైమ్‌లో విజయ్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు పార్టీ పెట్టాలనుకునే నేతలకు ఓ రోడ్‌మ్యాప్‌లా మారిందనే చెప్పాలి. కానీ అన్ని పార్టీల పరిస్థితి అలా లేదు. జాతీయ పార్టీలను ఎదుర్కొనే క్రమంలో ప్రస్తుతం ఒక్కో ప్రాంతీయ పార్టీ ఒక్కో రకమైన తీవ్రమైన కష్టాలను, అంతర్గత సంక్షోభాలను ఎదుర్కొంటోంది. భారత్ రాష్ట్ర సమితిని చూసుకుంటే.. ప్రస్తుతం అస్తిత్వ పోరాటం చేస్తుందనే చెప్పాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి BRS తీవ్ర సంక్షోభంలో పడింది. పార్టీకి చెందిన కీలక నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లేదా BJP వైపు వెళ్తుండటంతో క్యాడర్‌ను కాపాడుకోవడం కష్టంగా మారింది. దీనికి తోడు బీఆర్ఎస్ నుంచి విడిపోయి కవిత నేతృత్వంలో కొత్తగా తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో మరో పార్టీ ఆవిర్భవించడం వంటి పరిణామాలు పార్టీ అంతర్గత సవాళ్లను పెంచాయి. పదేళ్ల పాటు సీఎంగా ఉన్న కేసీఆర్.. ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్‌కు కొద్దిగా దూరంగా ఉండటం కూడా మైనస్‌గా మారింది.
ఏపీలో వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీది కూడా ఇదే పరిస్థితి. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ ఇంకా కోలుకోలేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి క్షేత్రస్థాయిలో YSRCP ఉనికిని దెబ్బతీసేలా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో, లీడర్లను నిలబెట్టుకోవడం జగన్‌కు పెద్ద టాస్క్‌గా మారింది. మహారాష్ట్ర విషయానికి వస్తే.. శివసేన, NCPలది కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు గుర్తింపు, అస్తిత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. అసలు శివసేన పేరు, గుర్తు ఏకనాథ్ షిండే గ్రూపుకు.. అసలు NCP గుర్తు అజిత్ పవార్ గ్రూపుకు వెళ్లడం మరో మైనస్ అనే చెప్పుకోవాలి. ఇటీవల జరిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అధికార మహాయుతి కూటమి దూకుడు ముందు ఠాక్రే వర్గానికి గట్టి సవాలును విసిరేసింది.
Also Read: ఫ్యాన్ తిరుగుతుంది కానీ బిల్లు రాదు.. ఈ లేటెస్ట్ ఫ్యాన్ల ధరలు తెలుసా?
వెస్ట్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ది కూడా ఇదే పరిస్థితి. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మమతా బెనర్జీని బీజేపీ మట్టికరిపించడంతో.. ఆ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారిందనే చెప్పాలి. మమతా బెనర్జీని ఇప్పుడు అనేక కేసులు చుట్టుముట్టబోతున్నాయి. ఆమె పాలనలో జరిగిన అవినీతి.. అకృత్యాలు.. ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకునేందుకు రెడీగా ఉన్నాయి. ఇక యూపీ విషయానికి వస్తే.. సమాజ్‌వాదీ పార్టీది కూడా అదే పరిస్థితి. యోగి ఆదిత్యనాథ్ బ్రాండ్ రాజకీయంతో యూపీలో అఖిలేష్ యాదవ్ ఎదుర్కోనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకున్నప్పటికీ, రాష్ట్రంలో బీజేపీ బుల్డోజర్ పాలిటిక్స్.. హిందుత్వ కార్డ్‌ను తట్టుకోవడం ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది.
ప్రాంతీయ పార్టీలకు కేరాఫ్‌గా ఉండే తమిళనాడులో మాత్రం ఏ మార్పు లేదనే చెప్పాలి. కానీ ఇక్కడ ఇప్పుడు DMK, AIADMK కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయనే చెప్పాలి. ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నది మాత్రం AIADMK అనే చెప్పాలి. జయలలిత మరణం తర్వాత AIADMK ముక్కలై బలహీనపడింది. పళనిస్వామి నాయకత్వం వహిస్తున్నా అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఓ వైపు DMK, TVK మరోవైపు BJP దూకుడు వల్ల AIADMK ఓటు బ్యాంకు ప్రమాదంలో పడిందనే చెప్పాలి. ఒడిశాలో బీజూ జనతాదల్ ఏకఛత్రాధిపత్యం వహించేది. కానీ 2024 ఎన్నికల్లో ఓడిపోయే వరకు నవీన్ పట్నాయక్ 24 ఏళ్లు తిరుగులేని ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన వయసు పైబడటం, ఆయన తర్వాత BJD ని నడిపించే సమర్థుడైన వారసుడు ఎవరూ లేకపోవడంతో పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడింది.
తెలుగుదేశం పార్టీ.. ప్రస్తుతం మహానాడును నిర్వహిస్తున్న ఈ పార్టీ.. ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టడమే కాదు.. కేంద్రంలో కింగ్‌మేకర్‌గా ఉంది. ఈ పార్టీ ఏర్పాటు ఒక సంచలనం.. ఏపీ రాజకీయాల్లో మాత్రమే కాదు.. భారతదేశ రాజకీయాల్లోనే ఒక రికార్డ్‌ను క్రియేట్ చేసింది. 1982లో మొదలైన ఈ పార్టీ ప్రస్థానం.. నేటికి కూడా నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నటుడిగా ప్రజల గుండెల్లో కొలువై ఉన్న నందమూరి తారక రామారావు.. 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. దీనికి ఆనాడు ఆయన ఎంచుకున్న నినాదం.. తెలుగువారి ఆత్మగౌరవం.
Also read: వీటితో తక్కువ బడ్జెట్‌లో.. మీ ఇంటికి 24 గంటల సేఫ్టీ
అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలను ఎదుర్కొంది టీడీపీ. 1984 నాదెండ్ల భాస్కరరావు ఇష్యూ.. ఆ తర్వాత వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్.. రాష్ట్ర విభజన సమయంలో పార్టీ స్టాండ్.. ఇలా అనేక సమస్యలను ఎదుర్కోన్నది పార్టీ. నిజానికి రెండు కళ్ల సిద్ధాంతం పుణ్యమా అని తెలంగాణలో పార్టీ దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో TDP కేవలం 23 సీట్లకే పరిమితం కావడంతో దాదాపుగా అంతా పార్టీ పనైపోయింది అనుకున్నారు. కానీ గోడకు కొట్టిన బంతిలా మళ్లీ పార్టీ ఎదిగింది.
ఇక జనసేన విషయానికి వస్తే.. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో కీ రోల్ ప్లే చేస్తోంది. 2014లో కేవలం ఒక మద్దతుదారుగా, 2019లో ఒకే ఒక్క సీటుతో ఓటమితో కుంగిపోకుండా నిలబడిన పవన్ కళ్యాణ్… 2024 ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించి ఏపీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. అంతేకాదు పార్ట్‌టైమ్ పొలిటిషయన్ అనే ముద్రను చెరిపేసుకున్నారు. పవన్ కల్యాణ్ వ్యూహం అయితే కేవలం మిత్రపక్షంగా ఉండటం మాత్రమే కాదు. అయితే చంద్రబాబు తర్వాత ప్రత్యామ్నాయ లీడర్‌గా ఎదగడమే పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ విషయంలో ఆయన ఎంత సక్సెస్ అయితే.. జనసేన భవిష్యత్తు అంత ఆశాజనకంగా ఉంటుంది.
తమిళనాడులో DMK, పశ్చిమ బెంగాల్‌లో TMC, గతంలో ఉమ్మడి ఏపీలో TDP ఈ ప్రాంతీయ ఆత్మగౌరవ నినాదంతోనే జాతీయ పార్టీలను కంట్రోల్ చేశాయి. తమిళనాడులో ఇప్పటికీ కూడా ఏ జాతీయ పార్టీ తమ ఉనికిని బలంగా చాటుకోలేకపోయాయి. దీనికి కారణం.. జాతీయ పార్టీలను బలంగా వ్యతిరేకించడమే. జాతీయ పార్టీలు అంతర్జాతీయ విధానాలు, దేశ భద్రత, ఆర్థిక వృద్ధి వంటి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడుతాయి. ఇదీ చాలా మంది ప్రజలకు రుచించదు. ప్రాంతీయ పార్టీలు ప్రజల నిత్యజీవిత సమస్యలపై ఫోకస్ పెడతాయి. రోజూవారీ సమస్యలు.. తమ ప్రాంత అభివృద్ధిపైనే ఫోకస్ చేస్తాయి. ఇది ప్రాంతీయ పార్టీలకు కలిసి వచ్చే అంశం.
Also read: మారని హెచ్‌సీఏ తీరు.. క్రికెట్ బోర్డులో మళ్లీ మొదలైన కాసుల వేట..!
ఇక ప్రాంతీయ పార్టీలకు మరో అడ్వాంటేజ్ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు. భారతదేశంలో కులం, సామాజిక వర్గాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రంలోని నిర్దిష్ట కుల సమీకరణాలను జాతీయ పార్టీల కంటే చాలా బాగా అర్థం చేసుకుంటాయి. ప్రాంతీయ పార్టీల సిద్దాంతాలు కూడా దీనికి అనుకూలంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బిహార్‌లో RJD, JDU వంటి పార్టీలు కొన్ని బలమైన సామాజిక వర్గాలను, వెనుకబడిన తరగతులను తమ వైపు తిప్పుకొని జాతీయ పార్టీలకు చెక్ పెడుతూ వస్తున్నాయి.
మరో కీలకమైన విషయం ఏంటంటే.. నేడు దేశవ్యాప్తంగా అమలవుతున్న ఉచిత పథకాలు లేదా వినూత్న సంక్షేమ పథకాలను డిజైన్ చేసింది ప్రాంతీయ పార్టీలే. ఈ పథకాలు ప్రజల ఇళ్లల్లోకి నేరుగా వెళ్తుండటంతో, ఓటర్లు ఆయా ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతారు. వీటి ప్రభావం ఎంతలా ఉందంటే.. జాతీయ పార్టీలు కూడా ఇప్పుడు వీటిని కాపీ కొట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.
సింపుల్‌గా చెప్పాలంటే జాతీయ పార్టీలు గ్లోబల్‌గా ఆలోచిస్తే, ప్రాంతీయ పార్టీలు లోకల్‌గా పనిచేస్తాయి. భారతదేశం లాంటి భిన్నత్వం ఉన్న దేశంలో ఎప్పుడూ లోకల్ సెంటిమెంట్‌దే పైచేయి అవుతుంది. అందుకే జాతీయ పార్టీలు ఎంత డిజిటల్ క్యాంపెయిన్లు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రాంతీయ శక్తులను పూర్తిగా అణచి వేయలేకపోతున్నాయి.
Also read: మారని హెచ్‌సీఏ తీరు.. క్రికెట్ బోర్డులో మళ్లీ మొదలైన కాసుల వేట..!