Revanth Vision: సామాన్యులపై భారం మోపేలా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ఇంధన ధరల పెంపు నిర్ణయం అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని, నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని చెప్పారు. మోడీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆత్మ నిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప.. ఫలితాలు తెచ్చిన పాలసీ కాదన్నది తేలిపోయిందన్నారు సీఎం.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని, యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి దాపురించిందని విమర్శించారు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలిపోయిందన్నారు. పదేళ్లుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తూ.. ఇప్పుడది పరాకాష్ఠకు చేరిందన్నారు సీఎం. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమేనని రేవంత్ రెడ్డి.
ప్రపంచంలో భారత్‌ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ఘనంగా ప్రకటించుకుంటున్న మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. 5 అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు గడవకముందే.. పెట్రోల్, డీజిల్‌పై 3 రూపాయలకు పైగా ధరలు పెంచడం.. ప్రజల్ని మోసం చేయడమేన్నారు. కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసమే.. మోడీ అబద్ధాలు చెబుతారనే విషయం జనం ఎప్పుడో గ్రహించారన్నారు. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే క్రమంలో ఏవైనా, ఎక్కడైనా పొరపాట్లు దొర్లితే వాటిని సవరించుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిబద్ధతతో పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో అనేక అంశాలు, సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియగా, అభివృద్ధి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని అన్నారు.
ప్రజాప్రతినిధిగా ఆలోచనల్లో తనకు స్పష్టత ఉందన్నారు సీఎం. ప్రపంచంలోనే తెలంగాణని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మేధావులు, కార్పొరేట్ దిగ్గజాలు, ప్రజల అభిప్రాయాలను సేకరించి, 8 నెలలు శ్రమించి.. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. దాదాపు 108 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించి.. గ్లోబల్ సమ్మిట్ వేదికగా విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించామని గుర్తుచేశారు.
హైదరాబాద్ నగరంలో నదులు, చెరువులు కుంటలు, నాలాలు, పబ్లిక్ పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారని, మొత్తంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. మూసీ పునరుజ్జీవం చేసి తీరతామన్నారు. రాజకీయాల్లో 51 శాతం మార్కులొస్తే మిగిలిన 49 శాతం విలువ సున్నా అవుతుందన్నారు సీఎం. ఇక్కడ తేడా రెండు శాతమేనన్నారు. 51 శాతం మంది ప్రజలను మెప్పించాలని పరిపాలన సాగిస్తే.. అది 60 నుంచి 70 శాతానికి చేరొచ్చు. ప్రభుత్వం నిర్ణయాలను 60 నుంచి 75 శాతం ప్రజలు ఆమోదిస్తే అది విజయంగా మారుతుందన్నారు.
తెలంగాణలో క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటి కారణాలను విశ్లేషించడానికి క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ ఉపయోగకరంగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధిపై ప్రభుత్వ సలహాదారు, వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి పరిశీలించారు. క్యాన్సర్ వ్యాధిపై సమగ్ర నివేదికను రూపొందించిన నోరి దత్తాత్రేయుడిని ముఖ్యమంత్రి అభినందించారు. క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటి కారణాలను విశ్లేషించడానికి ఈ నివేదిక ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇందులోని డేటా ఆధారంగా క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని సీఎం గారు చెప్పారు. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, క్యాన్సర్ బాధితులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. క్యాన్సర్ చికిత్సకు ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో మరింత మెగురైన చికిత్సలను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి మెగా గ్రోత్ కారిడార్‌ల్లో ఒకే విధమైన అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లు అభివృద్ధి చేసే గ్రోత్ కారిడార్.. భవిష్యత్ తెలంగాణకు అత్యంత కీలకమని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆ మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లను నిర్మించాలన్నారు. మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సీఎం రివ్యూ చేశారు. తెలంగాణలోని ప్రతిపాదిత మెగా గ్రోత్ కారిడార్ల అభివృద్ధి ప్రణాళికలపై అధికారులకు సూచనలు చేశారు.
మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లను కలుపుతూ గ్రోత్ కారిడార్ ఏర్పాటు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ కలిపి గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు కావాలన్నారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అలంపూర్ జోగులాంబ ఆలయ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను యూనిట్‌గా అభివృద్ధి చేయాలని, సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలన్నారు ముఖ్యమంత్రి.
తెలంగాణలో రాబోయే ఎయిర్‌పోర్ట్‌లని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు, పనులు చేపట్టాలన్నారు సీఎం. వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుతో ఆ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారతాయని, ఆ విమానాశ్రయానికి కావలసిన నీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతుంది. గ్రోత్ కారిడార్స్‌లో వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా ప్రతిదీ డిజైన్ చేయాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ పోల్స్, రోడ్లు, ఎస్టీపీలు, రెన్యువబుల్ ఎనర్జీ, ఈవీ లాంటి అంశాలపైన అన్ని చోట్లా ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని.. అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉబర్ సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఈ వారం ఉబర్ సీఈవో నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎంతో భేటీ అయింది. హైదరాబాద్‌లో ఉన్న ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విస్తరిస్తున్నట్లు తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తి కనబర్చారు. భవిష్యత్తులో మరింత విస్తరణ చేపడతామన్నారు. తగిన పార్కింగ్ సౌకర్యాలు లేక మెట్రో స్టేషన్ల లాంటి ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీఎం అన్నారు. ఈవీ ఛార్జింగ్ సెంటర్లతో పాటు పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. సీఎం సూచనలపై అధ్యయనం చేస్తామని ఉబర్ బృందం తెలిపింది.
మిషన్ మోడ్‌లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించాలన్నారు.
ధాన్యం లోడింగ్ విషయంలో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలన్నారు. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలా చేయడం వల్ల తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చన్నారు సీఎం. గోడౌన్స్ సమస్య ఉన్న ప్రాంతాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రాంతాల వారీగా సమస్య తీవ్రతను గుర్తించి కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అధికారి జవాబుదారితనంతో వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులు, కలెక్టర్లపై చర్యలకు ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో విద్యా శాఖలో తీసుకుంటున్న నిర్ణయాల్లో వెనుకడుగు వేయకుండా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాఠశాలలు దేశ భవిష్యత్తు నిర్మాణ వేదికలని, వాటిని పునరుద్ధరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలను తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తతో చూసుకుంటారో.. అదే రీతిలో చూసుకోవాలన్నదే తమ సంకల్పమని స్పష్టం చేశారు. ఈ వారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో విద్యా వారోత్సవాలు నిర్వహించారు.
కోర్ అర్బన్ ఏరియాలో వెయ్యి కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సీఎం శంకుస్థాపన చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. గత విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో సీఎం మాట్లాడారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో విద్యార్థులను పలకరించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందించే బ్రేక్‌ఫాస్ట్ టిఫిన్స్‌ను మంత్రులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహక చెక్కును ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించారు.
Also Read: దమ్ముంటే చర్చకు రండి.. శ్రీవాణి టికెట్ల అక్రమాలపై కూటమి సర్కార్‌కు భూమన సవాల్!
ప్రపంచ వ్యాప్తంగా విద్యా రంగంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, సిలబస్ మారుతోందని. ఏఐ వచ్చిందని సీఎం అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా మారిందన్నారు. తెలంగాణలో నూతన విద్యా విధానం అమలు చేయాలని, అదికూడా దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలన్న ఆలోచనల మేరకు నర్సరీ నుంచి 12 వ తరగతి వరకుండే విద్యా విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. పాఠశాలల్లో నిరుపేద కుటుంబాల పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా బలవర్ధకమైన ఆహారం అందించాలని నిర్ణయించామన్నారు. విద్యార్థుల కోసం పెట్టే ఖర్చు భవిష్యత్తరాలకు పెట్టుబడిగా భావిస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. భావి తరాలు ప్రభుత్వ పాఠశాలల్లోనే తయారు కావాలని, ప్రభుత్వ బడుల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని చెప్పారు.
పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే జూన్ 12న.. పొగాకు, మద్యం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు తెలియజేశారు. ఈ వారం లోక్‌భవన్‌లో.. గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు వివిధ వస్తువులతో కూడిన కిట్లను అందజేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం, కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి గవర్నర్‌ని ఆహ్వానించారు సీఎం.
ఈ కిట్లలో యూనిఫాంలు, పుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్, స్పోర్ట్స్ డ్రెస్, విద్యార్థులకు అవసరమైన ఇతర సామగ్రి ఉంటాయని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు డ్రగ్స్, ఇతర వ్యసనాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండేలా, వారిలో చైతన్యం కల్పించేలా యాజమాన్యాలు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తాయని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ, పోలీసు శాఖ, ఈగల్ సంయుక్త ఆధ్వర్యంలో సామూహిక ప్రతిజ్ఞ, ఇతర కార్యక్రమాలు చేపట్టనున్నారు. విద్యా సంస్థలను సురక్షితంగా, డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యాజమాన్యాల సమష్టి బాధ్యతపై అవగాహన కల్పించనున్నారు.
వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన వివిధ ప్రాజెక్టుల ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి దేశంలో గ్రోత్ ఇంజన్లుగా ఉన్న 6 ప్రధాన మహానగరాలకు సంబంధించి జాతీయ ప్రాధాన్యత కలిగిన అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సత్వర అనుమతులు లభించేలా పీఎం ఆఫీసులో ప్రత్యేకంగా సింగిల్ విండో టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేయాలని కోరారు.
Also Read: కూలర్ కావాలా? ఈ ఛాన్స్ అస్సలు వదలకండి.. అమెజాన్‌లో బిగ్గెస్ట్ డిస్కౌంట్స్!
తెలంగాణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం ఈ వారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు తెలంగాణ కూడా తనవంతు భాగస్వామ్యం అందిస్తుందని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలోనూ తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు వెళ్తోందని వివరించారు. తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ టు మచిలీపట్నం 12 వరుసల రహదారికి సంబంధించి.. కేంద్రం ముందు పెట్టిన ప్రతిపాదనలని గుర్తుచేశారు.
ప్రధాని మోడీతో కలిసి.. వరంగల్‌లో నెలకొల్పిన పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే, జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, మహబూబ్‌నగర్ నుంచి గూడబెల్లూరు నేషనల్ హైవేకు, కాజిపేట నుంచి విజయవాడ వరకు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మల్కాపూర్‌లో ఇండియన్ ఆయిల్ గ్రీన్‌ఫీల్డ్ టెర్మినల్‌ను జాతికి అంకితమిచ్చారు.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలు యథావిధిగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అడ్మిషన్లకు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు.. సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి CBSE తరహాలో 11, 12 తరగతులు నిర్వహించాలని, ఫలితంగా డ్రాపౌట్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
మెజారిటీ రాష్ట్రాలు సీబీఎస్ఈతో పాటు 11, 12 తరగతుల విధానాన్ని అనుసరిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో అత్యధికులు ఆ తర్వాత ఇంటర్మీడియట్‌కు వేరుగా ఉన్న కళాశాలల్లో చేరకుండా విద్యను నిలిపివేస్తున్నారు. ఈ క్రమంలో.. ఇంటర్మీడియట్ వేరుగా కాకుండా, 11, 12 తరగతులుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అధికారులకు సూచించారు. ఇదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది.
ఇటీవల ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విలీనంతో ముడిపడిన సాంకేతిక సమస్యలను అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి తన నివేదిక సమర్పించాలని సూచించారు. నివేదికపై శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Also Read: కేవలం 7 రోజుల్లో కొలెస్ట్రాల్ తగ్గించుకోండి..ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
Story by: Anup, Big Tv