Revanth Governance: హైదరాబాద్ స్కైరూట్ ఏరోస్పేస్ వేదికగా ఈ దేశపు తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయాణం మొదలు కాబోతోంది. ఇందులో భాగంగా మ్యాక్స్-క్యూ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. శ్రీహరికోటకు పంపనున్న రాకెట్ విక్రమ్-1ని.. సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ప్రీ ఫ్లైట్ పరీక్షలన్నింటినీ పూర్తి చేసుకొని తదుపరి ప్రయోగం కోసం.. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌కు ఇది చేరుకోనుంది. రాకెట్‌ను పూర్తిగా హైదరాబాద్‌లోనే రూపొందించి, అభివృద్ధి చేయడం ఎంతో గర్వకారణమన్నారు. ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్న తెలంగాణ లక్ష్య సాధనలో ఇది కీలక మైల్‌స్టోన్‌గా నిలుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఏరోస్పేస్ రంగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, బోయింగ్, ఎయిర్‌బస్, సాఫ్రాన్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్నాయని సీఎం గుర్తుచేశారు. ఏరోస్పేస్‌ను కీలక వృద్ధి రంగంగా పరిగణిస్తూ, 2047 నాటికి ఈ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవడమే తెలంగాణ లక్ష్యమని చెప్పారు. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు, పారిశ్రామిక దిగ్గజాల భాగస్వామ్యాలతో.. ఏరోస్పేస్ రంగం కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంపై.. ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలోని మంత్రుల ఉప కమిటీతో ఆర్టీసీ కార్మికులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో.. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 3 రోజుల్లోనే ముగిసిపోయింది. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో.. సమ్మెకు తెరపడింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు లభించడంతో జేఏసీ నేతలు సమ్మె విరమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కమిటీ 11 శాతం పీఆర్‌సీ, ప్రభుత్వంలో సంస్థ విలీనంపై విధివిధానాల కమిటీ ఏర్పాటు, గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకరించింది. ప్రభుత్వ సానుకూల నిర్ణయంతో కార్మికులు సమ్మె విరమించి.. శనివారం ఉదయం నుంచే విధుల్లో చేరారు. ఆర్టీసీ ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమేనని, కార్మికుల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మంత్రుల ఉప కమిటీ తెలిపింది. ఖాళీల భర్తీ, ఇతర ఆర్థికపరమైన డిమాండ్లపై రాతతపూర్వక హామీ లభించడంతో కార్మికులు వారి నిరసనను విరమించారు. ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్‌గౌడ్‌కి నివాళి అర్పించారు. డ్రైవర్ శంకర్‌గౌడ్ కుటుంబానికి 10 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.
Also Read: తెలంగాణ పేరుతో రాష్ట్రంలో 13 వ పార్టీగా కవిత TRS.. గతంలో వచ్చిన పార్టీలివే..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ వారం భేటీ అయిన తెలంగాణ కేబినెట్.. కీలక నిర్ణయాలు తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రివర్గం చర్చించింది. జ్యుడీషియల్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు తప్పుబట్టలేదని.. కోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ అందించే అంశంపైనా కేబినెట్ చర్చించింది. రెగ్యులర్ ఉద్యోగులకు 6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన 8 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, నిధులు సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం తగ్గించి.. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సర్దుబాటు చేయడం లాంటి చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనకు.. మంత్రులంతా ఉదారంగా ముందుకొచ్చి తమ ఆమోదం తెలిపారు.
వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చలు జరపాలని, ఆర్థిక వనరుల సమీకరణతో పాటు వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు. ఇక, హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్టేడియానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో.. 64 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో 21 రకాల క్రీడా సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించారు. మంథని నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్ తీర్మానించింది. అలాగే, మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలోని.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలు, సంస్థలు వాటి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా సంస్థల కార్యకలాపాల పురోగతిపై రివ్యూ చేసిన సీఎం.. వాటికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించి.. ప్రముఖ సంస్థలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రాధాన్యతల వారీగా కేటాయించాల్సిన భూ వివరాలను అధికారులు తెలిపారు. కంపెనీలకు పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటి కోసం ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఫ్యూచర్ సిటీలో ఆఫీస్ పనులు త్వరగా పూర్తి చేసి, అక్కడే ఎంవోయూల అమలు, వాటి పురోగతిపై మానిటర్ చేయాలని ఆదేశించారు సీఎం. పెట్టుబడులకు సంబంధించి పూర్తి స్థాయి మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. పరిశ్రమలు, ఐటీ రంగాలకు సంబంధించి జైకా నిధులతో చేపట్టనున్న పనులపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వారం సమీక్షించారు.
Also Read: గుడ్ న్యూస్.. నర్సాపూర్ మున్సిపాలిటీ నగర అభివృద్ధికి రూ.15 కోట్లు..!
రైతులకు పెట్టుబడి సాయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40 లక్షల రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లిలో రైతు ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. రైతులతో కలిసి రైతు ఉత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. సభ వేదికపై నుంచి బటన్ నొక్కి 2,200 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద 5,700 కోట్లు విడుదల చేసినట్టు సీఎం చెప్పారు. వచ్చే నెలలో మరో 3,300 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. అదేవిధంగా.. 203 కోట్లతో ఆరెంద-దామెరకుంట గ్రామాల మధ్య మానేరు నదిపై.. హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రైతులను ఆదుకొని వారిని నిటారుగా నిలబెట్టే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుందని సీఎం తెలిపారు. రైతు సంక్షేమం తమ విధానమని, వ్యవసాయం పండుగ కావాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. అందుకోసమే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని పరిశీలించారు. బ్యారేజీ కుంగిన ప్రాంతంలో పునరుద్ధరణ కోసం జరుగుతున్న జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను ఆయన పరిశీలించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులు, వివిధ అంశాలపై.. ఇరిగేషన్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించి కీలక సూచనలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో లోపాలను సరిచేసి, పునరుద్ధరణకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై స్పష్టత వచ్చిందన్నారు. NDSA మార్గదర్శకాలకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసే పరిస్థితి లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వదిలేస్తే ఒక భారం. పునర్నిర్మిస్తే మరొక భారమని చెప్పారు. అన్నీ చర్చించిన తర్వాత.. ప్రాజెక్టును పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగంలోకి తేవాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం.
బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీతీరం వెంట ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయాలని సర్కార్ సంకల్పించింది. ఇందులో భాగంగా.. సీఎం రేవంత్ రెడ్డి ఈ వారం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పునరాభివృద్ధికి భూమి పూజ నిర్వహించారు. గోదావరి పుష్కరాల నాటికి శాశ్వత ప్రాతిపదికన ఆలయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యం మేరకు 198 కోట్లతో చేపట్టిన పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కాళేశ్వరం బస్ స్టేషన్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.
Also Read: Money: తరుచుగా రోడ్డు మీద డబ్బులు దొరకడం దేనికి సంకేతమో తెలుసా
నార్వే రాయబారి మే-ఎలిన్ స్టెనర్ ఈ వారం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను తన బృందంతో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను, ఇక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు.
రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విద్యా రంగానికి సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే జూన్ 12న ఎల్బీ స్టేడియంలో గవర్నర్ గారి ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపైనా.. సీఎం చర్చించారు. ప్రధానంగా విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించాలని గవర్నర్ సూచించారు. విద్యార్థులతో ప్రమాణం చేయించేలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. స్కూళ్లు, కాలేజీల్లో.. అడ్మిషన్ల సమయంలోనే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకోవాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. ఇందుకు సంబంధించి.. అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Storey By Appa Rao Big Tv