E-Paper
Advertisement

యాదగిరిగుట్ట ఆశీస్సులతో తెలంగాణ ప్రగతి పరుగులు.. సీఎం రేవంత్ రెడ్డి మార్క్ పాలన!

యాదగిరిగుట్ట ఆశీస్సులతో తెలంగాణ ప్రగతి పరుగులు.. సీఎం రేవంత్ రెడ్డి మార్క్ పాలన!
Advertisement

మే 23 యాదగిరిగుట్టకు మహార్దశ

Revanth Updates: పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో.. తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సమక్షంలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు.

Advertisement

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

వేద పాఠశాలతో పాటు టెంపుల్ సిటీ పరిధిలో 99 కోట్ల 55 లక్షలతో చేపట్టనున్న ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. యాదగిరి గుట్ట టెంపుల్ సిటీని.. టీటీడీ తరహాలో ఉన్నతంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. దాదాపు 44 కోట్ల అంచనా వ్యయంతో.. 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న వేద పాఠశాలలో.. సంప్రదాయ ఆశ్రమ గురుకుల పద్ధతిలో 300 మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్యని అందించనున్నారు. ఈ సముదాయంలో హోమాలు, యాగాలు నిర్వహించడానికి ప్రత్యేక శాలలతో పాటు ఓ గోశాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

కొత్త మెట్ల నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన

వేద పాఠశాలకు భూమిపూజతో పాటు 43 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణం, కొండపై స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం భారీ కల్యాణ మండపం, భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణం, రథశాల వైపు ఉన్న మాడవీధులకు అనుసంధానంగా కొత్త మెట్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. యాదగిరిగుట్ట సందర్శనలో భాగంగా.. లక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు.

మే 22 సీఎంతో కీలక భేటీ

ఈ వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో.. లంబాడ ప్రజాప్రతినిధుల బృందం సమావేశమైంది. లంబాడీల ఆధ్యాత్మిక గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ పేరుతో సంత్ సేవాలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎంని కోరారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి ఎస్టీ కమిషన్‌ను వేరు చేసి ప్రత్యేక హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

మే 22 నిమ్స్‌కు మైల్ స్టోన్

కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో అరుదైన మైలురాయిని అందుకున్న హైదరాబాద్‌ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం, 2 వేల కిడ్నీ మార్పిడులు పూర్తి చేసి దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. కిడ్నీ మార్పిడుల్లో దక్షిణ భారత దేశంలో నిమ్స్​మొదటి స్థానంలో నిలిచింది. ఈ మైల్ స్టోన్ సాధించి కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ 2 వేల మందిలో 95 శాతం, అంటే 1,900 మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకోవడం విశేషం.

మే 21 తెలంగాణకు గౌరవం

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో.. కులగణన చేర్చే అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దశ, దిశ, దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జనాభా లెక్కల్లో కులగణన చేర్చడాన్ని సుప్రీంకోర్టు ఆమోదించడం మంచి పరిణామమని తెలిపారు. సుప్రీంకోర్టు సమర్థించిన క్రమంలో.. జనగణనలో తక్షణమే కులగణన చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగణన చేసిందని గుర్తుచేశారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే చేసి సమగ్ర వివరాలను ప్రజల ముందు ఉంచిందని చెప్పారు. బలహీన వర్గాల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తెలంగాణ ప్రభుత్వం తొలగించిందన్నారు. తెలంగాణ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం తెలంగాణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు సీఎం.

మే 21 బ్లూ కాలర్ జాబ్స్‌దే ఫ్యూచర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న పరిస్థితుల్లో.. యువత తమ ఆలోచనల్ని మార్చుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యువత బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. మారిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా యువత వైఖరిలో మార్పు రావాలని చెప్పారు. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు సీఎం. అదే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ బ్లూ కాలర్ ఉద్యోగాలకు ప్రపంచంలో విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. బ్లూ కాలర్ జాబ్స్‌ని ఏఐ రిప్లేస్ చేయలేదని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని.. ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని వివరించారు.

యువతకు స్కిల్స్ నేర్పించాలన్న లక్ష్యం

యువతకు స్కిల్స్ నేర్పించాలన్న లక్ష్యంతోనే.. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించామన్నారు. ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని అందించే ఏటీసీలుగా మార్చామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేని చదువులు చదివి ప్రయోజనం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టెక్నికల్ స్కిల్స్ పెంచుకుంటే.. విదేశాల్లో ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. ప్రపంచ దేశాలకు ప్రత్యామ్యాయంగా తెలంగాణని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

మే 21 కార్మికులకు శుభవార్త

తెలంగాణలోని కోటి 11 లక్షల మంది కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు.
కార్మికుల కనీస వేతనాల పెంపు జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో కార్మికులను అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌ కేటగిరీలుగా విభజించి వేతనాలు పెంచారు. ఈ విభాగాల కార్మికులకు గతంలో అర్బన్, రూరల్‌గా 2 జోన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటిని.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలుగా పరిగణలోకి తీసుకొని.. కనీస వేతనాలను నిర్ణయించారు. అన్‌స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం రూ. 16 వేలకు, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ. 17 వేలకు, స్కిల్డ్ కార్మికులకు 18,500 లకు, హైలీ స్కిల్డ్ కార్మికులకు 20 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

కార్మికుల కనీస వేతనాల పెంపు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. కార్మికుల కనీస వేతనాల పెంపు ఇదే తొలిసారి. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కార్మిక సంఘాలు, సంస్థల యాజమాన్యాలు, ఇతర స్టేక్‌హోల్డర్స్ అందరితో సంప్రదింపులు జరిపి.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే.. వేతన సవరణపై నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం. ద్రవ్యోల్బణం, ఇంటి అద్దె, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల లాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని.. కార్మికుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాష్ట్రంలోని కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. గతంలో ప్రమాదవశాత్తు గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే.. వారి శవాన్ని తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదని, ఈ ప్రభుత్వం వారి అండగా నిలవడమే కాకుండా.. ఆ కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వం కార్మికులకు అన్ని రకాలుగా రక్షణగా ఉంటుందని, తొందర్లోనే మరిన్ని మంచి ప్రతిపాదనలతో ముందుకొస్తుందని చెప్పారు.

మే 20 జీసీసీ పాలసీ

తెలంగాణలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. వాటిని హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాలకు కూడా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ అవతల కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా జీసీసీ పాలసీ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసేలా ఆయా సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. ఐటీ, పరిశ్రమల శాఖపై ఈ వారం ముఖ్యమంత్రి హైలెవెల్ రివ్యూ చేశారు.

ఐటీ, డేటా సెంటర్ల అభివృద్ధికి చర్యలు

ఐటీ సహా ఇతర ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా టైర్ 2, టైర్ 3 నగరాలకు కూడా విస్తరించాలని స్పష్టం చేశారు. కోర్ అర్బన్ రీజియన్ అవతలి ప్రాంతాలను గుర్తించి.. అక్కడ ఐటీ, డేటా సెంటర్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐటీ విస్తరణ లేని చోట్ల డేటా సెంటర్ల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

నెట్-జీరో విధానాలు అమలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు పర్యావరణహిత నెట్-జీరో విధానాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన ఐదు ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాల్లో ఒకటి ఫ్యూచర్ సిటీలో అంతర్భాగమైన హెల్త్ సిటీలో ఏర్పాటయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో స్థాపించే కంపెనీలన్నీ నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను మరింత ప్రోత్సహించే డైనమిక్ ఏజెన్సీగా, ఇన్వెస్టర్లకు ఎండ్-టు-ఎండ్ సేవలు అందించే వ్యవస్థగా ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మరో 3 నెలల్లో.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్ ఇంటర్నెట్ మాత్రమే వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.

మే 20 మార్పు రావాలి

దేశంలో నేరాల స్వరూపం మారుతున్న క్రమంలో.. ఎదురవుతున్న కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు అనుగుణంగా పోలీసు వ్యవస్థలో మార్పులు అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో శాంతి భద్రతలు, ఆధునిక అవసరాలకు తగిన విధంగా పోలీసు వ్యవస్థలో తీసుకురావలసిన మార్పు చేర్పులపై.. సీనియర్ పోలీసు అధికారులు, అగ్నిమాపక, హైడ్రా అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాబోయే పదేళ్ల అవసరాలకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సైబర్ క్రైమ్ నియంత్రణలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. ఇందుకోసం.. డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్ సెలక్షన్ జరగాలన్నారు. అలాగే.. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో పోలీస్ విభాగం కోసం ప్రత్యేక కోర్స్‌ ప్రారంభించాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన ఫోరెన్సిక్ సెంటర్స్, డేటా సెంటర్లను పెంచుకోవాలన్నారు.

డీ- అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు

డ్రగ్స్ బాధితుల కోసం డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు సీఎం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై విజిలెన్స్ ప్రత్యేక దృష్టి పెట్టాల్నారు. హైదరాబాద్ నగరంలో అడ్డగోలుగా వెలుస్తున్న ఫ్లెక్సీల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి వాటిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఆహార కల్తీ నిరోధంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదన్నారు సీఎం. పెట్రోలింగ్‌, విలేజ్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలన్నారు. కాలం చెల్లిన ఆయుధాలను తొలగించాలని సూచించారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో అన్ని వాహనాలు ఈవీకి మారాలన్నారు. పోలీసు శాఖలో అవినీతిని సహించమన్నారు సీఎం. ఎస్‌ఐ నుంచి నాన్ క్యాడర్ ఐపీఎస్ వరకు ప్రమోషన్ తర్వాత రెండేళ్ల పాటు ఇతర విభాగాల్లోనూ పనిచేసే విధంగా చూడాలన్నారు సీఎం.

మే 20 సమ్మర్ అలర్ట్

రాష్ట్రంలో తీవ్రమైన వ‌డ గాలులు, ఎండ తీవ్రత‌పై వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరిక‌లు జారీ చేయడంతో.. ప్రజ‌లంతా అప్రమ‌త్తంగా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అవ‌స‌ర‌మైన జాగ్రత్తలు తీసుకోవాల‌ని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు త‌గిన సంఖ్యలో అందుబాటులో ఉంచాల‌ని, తాగు నీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుప‌త్రుల వ‌ర‌కు వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమ‌త్తంగా ఉండాల‌న్నారు. వ‌డ‌దెబ్బతో ఎవ‌రైనా ఆసుప‌త్రుల్లో చేరితే వెంటనే త‌గిన వైద్యం అందించాలని సూచించారు. ప‌ట్టణ ప్రాంతాల్లో అవసరమైన మేరకు చ‌లివేంద్రాలు ఏర్పాటు చేయాల‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాధ్యమైనంత వ‌ర‌కు మ‌ధ్యాహ్న ప్రయాణాలు చేయ‌కుండా ఉండాల‌ని ప్రజలకు తెలిపారు. జిల్లాల్లో ప‌రిస్థితుల‌ను ఎప్పటిక‌ప్పుడు తెలుసుకుంటూ.. క‌లెక్టర్లకు దిశానిర్దేశం చేయాల‌ని సీఎస్‌ని ఆదేశించారు.

మే 19 ప్రాజెక్టులు ఆగొద్దు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను.. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనితో పాటు జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో ఈవారం సీఎం సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి.. కీలకమైన సూచనలు చేశారు. జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

Also Read: అనకాపల్లిలో గాలివాన బీభత్సం.. ఇద్దరు కూలీల దుర్మరణం!

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×