సిరిసిల్లలో సీఎం సభ నేపథ్యం.. రాజకీయాలను అటువైపు తిప్పాయి. అందరి నోటా ఇదే మాట. సీఎం ప్రత్యేకించి దీన్ని అనౌన్స్ చేసి మరీ పెడుతున్న సభ కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఇప్పటికే కేటీఆర్‌పై సిరిసిల్ల కేంద్రంగా 8 వేల ఎకరాల భూ అక్రమాలు జరిగాయని సీఎం అసెంబ్లీలో ప్రకటించడం కలకలం రేపింది. ఇప్పుడు ఏకంగా అదే వేదికగా ఆయన మొత్తం కేటీఆర్‌ను టార్గెట్ చేసి ప్రసంగించనున్నారు. సభ మొత్తం కేటీఆర్.. ఆ తరువాత కొంత భాగం కేసీఆర్.. మరికొంత హరీశ్‌కు కేటాయించనున్నారు. అంటే మొత్తం ఆ సభ ఈ ముగ్గురి ప్రస్తావన కేంద్రంగా సాగుతుందన్నమాట.
ఇది ముందే ఊహించాడు కేటీఆర్. అందుకే సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశాడు. తనపై చేసిన భూ ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. ప్రధానంగా అన్ని అంశాల కంటే ఇదే విషయంలో అందరికీ ఆసక్తి ఏర్పడింది. మళ్లీ సీఎం ఈ భూముల అంశంలో ఏం మాట్లాడుతారోనని.
ఇక అభివృద్ధి అంశంతో పాటు అక్కడ మెజారిటీగా ఉన్న పద్మశాలీల కోసం ఈ సర్కార్ ఏర్పడిన తరువాత చేపట్టిన సంక్షేమం ఏంటో వివరించాలని కూడా కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. వీటిపైనా రేవంత్ కచ్చితంగా మాట్లాడాల్సే వస్తుంది. నియోజకవర్గంపై వరాల జల్లుతో పాటు ప్రత్యేకించి పద్మశాలీల సంక్షేమంపైనా సర్కార్ మార్కు ప్రకటనలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే సీఎం సభ నేపథ్యమే కేటీఆర్‌ను రాజకీయంగా దెబ్బ తీసేందుకని అందరికీ తెలుసు. దీన్ని కేటీఆర్ కూడా గ్రహించాడు. అయితే దీనికి ఎలాంటి విరుగుడు అమలు చేయాలి..? తనపట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేకత కలగకుండా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై తీవ్రంగా చర్చించినట్టు తెలిసింది.
కేసీఆర్ ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోకపోయినా.. తనకు జరిగిన అవమానానికి నష్ట నివారణకు ఏదో చేయాలనే గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఆలోచించిన కేటీఆర్… ఆయన సన్నిహిత టీమ్ మొత్తానికి ఓ నిర్ణయానికి వచ్చారని తెలిసింది. రేవంత్ మాస్టర్ స్ట్రోక్‌కు.. తన మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తే.. తనపై జరిగే డ్యామేజీని తగ్గించుకోవచ్చనే భావనలో ఈ నిర్ణయానికి ఫిక్సయిపోయాడట కేటీఆర్. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా?
కేసీఆర్ కిట్‌ను సిరిసిల్లలో అమలు చేయడం. అవును.. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో కంటి వెలుగును.. తన పార్టీ నిధుల నుంచే అమలు చేశాడు కేటీఆర్. త్వరలో దీన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తానని కూడా అదే వేదికగా మాట ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ కిట్‌ను అమలు చేయడం వల్ల మహిళల్లో మంచి పేరు వస్తుందనే భావనలో ఉన్నాడట.
రేవంత్ సర్కార్ కేసీఆర్ కిట్లను ఆపేసింది. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో కేసీఆర్ కిట్‌లకు బదులుగా ఎంసీహెచ్ కిట్‌లుగా పేరు మార్చి ఇచ్చే ప్రయత్నం చేసినా ఇది ఆదిలోనే ఆగి పోయింది. అయితే, ఈ పథకంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైన మహిళలకు 12వేల ఆర్థిక సాయంతో పాటు పుట్టిన బిడ్డ ఆరోగ్యానికి ఉపయోగపడేలా 16 వస్తువులతో కూడిన కిట్‌ను అందిస్తారు. ఆడబిడ్డ పుడితే 13వేలుగా ఇచ్చారు. ఈ ఆర్థిక సాయాన్ని నాలుగు దఫాలుగా ఈ మహిళ అకౌంట్లో పడేలా చూశారు. అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు వీరి వివరాలను సేకరించి ప్రభుత్వంతో అనుసంధానం చేయడం ద్వారా ఇది అమలు జరిగేది.
మరి కేటీఆర్ .. కేవలం కిట్లకే పరిమితమవుతాడా? ఆర్థికసాయం కూడా అందజేస్తాడా? అనేది క్లారిటీ లేదు. తన బీఆర్‌ఎస్ టీంతో ఈ పథకం అమలుతీరుపై సమగ్రంగా రిపోర్టును నివేదించేలా.. కేసీఆర్ పేరును ఈ పథకం అమలు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సజీవంగా ఉంచడంతో పాటు రేవంత్ ఈ పథకాన్ని ఆపేశాడనే వ్యూహం కూడా దీని వెనుక ఉందంటున్నారు బీఆర్‌ఎస్ శ్రేణులు.