Sajjala Ramakrishna Reddy: వైసీపీ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టినట్టు కనిపించిన జగన్ మళ్లీ ఆయనను అందలమెక్కిస్తున్నారు. ఇక నుంచి పార్టీకి దిశానిర్దేశం చేసే బాధ్యత సజ్జల భుజాలపై పెట్టారు మాజీ సీఎం. జగన్ తాజాగా నియమించిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్‌గా సజ్జలను నియమించడంతో పార్టీలో ఆయన ప్రాధాన్యతను మరింత పెరిగినట్లైంది. పార్టీలో మళ్లీ సజ్జల పెత్తనమే కొనసాగనుండటంతో కొందరు సీనియర్ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారంట .. మరోవైపు సదరు కమిటీలో ముద్రగడ పద్మనాభంకు స్థానం కల్పించడం, దానికి ఆయన సంబరపడిపోతూ ప్రకటనలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
33 సభ్యులతో వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని నియమించారు. మొత్తం 33 సభ్యులతో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్‌గా ఈ పీఏసీని ప్రకటించారు. ఎంపీలు అవినాశ్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీమంత్రులు రోజా, విడదల రజని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేశ్, నారాయణస్వామి, అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు ముద్రగడ పద్మనాభం, సాకే శైలజానాథ్, నందిగం సురేశ్ తదితరులకు ఈ కమిటీలో స్థానం కల్పించారు. ఈ రాజకీయ సలహాల కమిటీకి ఇప్పటికే పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్ గా నియమించారు. దాదాపు వైసీపీలో కీలక నేతలందరికీ ఈ కమిటీలో స్థానం లభించినట్లైంది.
పార్టీ వ్యవహారాలన్నీ తానే చూసుకున్న సజ్జల
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ సలహాదారుగా అన్నీ తానై జగన్ ప్రభుత్వాన్ని నడిపించారు. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై వైసీపీ నేతలు చెలరేగిపోయేవారు. ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాలో తన ప్రెస్‌మీట్‌లను వైరల్ చేసేవారని పోసాని కృష్ణమురళి స్వయంగా పోలీసు విచారణలో వెల్లడించారు. అంటే ప్రత్యర్ధులపై దాడుల నుంచి పార్టీ వ్యవహారాలన్నీ ఎలా డీల్ చేయాలనే విషయం వరకు అన్నీ సజ్జల రామకృష్ణా రెడ్డే స్వయంగా చూసుకునేవారన్నమాట. వైసీపీని వీడిన కోటంరెడ్డి, విజయసాయిరెడ్డి నుండి మొన్న పోసాని వరకూ అందరూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి వంటివారు శల్య సారథ్య చేస్తూ జగన్ ముంచేస్తున్నారని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతుంటాయి.
జగన్ కోటరీగా టార్గెట్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి
గత ఎన్నికల్లో టికెట్ల పంపిణీ సమయంలో కూడా పలువురు నేతలు జగన్ కోటరీ అంటూ సజ్జలను టార్గెట్ చేశారు. అయితే వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా జగన్ మేల్కోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటమి తర్వాత జగన్ సజ్జలని పక్కన పెట్టినట్లు కనిపించారు. అయితే విజయసాయిరెడ్డివంటి ముఖ్యనేత పార్టీని వీడి వెళ్ళిపోవడం సజ్జలకు బాగా కలిసి వచ్చిందంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్కరికీ రూ. లక్షల చొప్పున ప్రభుత్వ సొమ్ము జీతభత్యాలుగా చెల్లిస్తూ 50 మందికిపైగా సలహాదారులని నియమించుకున్నారు. ఇప్పుడంత సీన్ లేకపోవడంతో 33 మంది సీనియర్ నేతలతో ఓ రాజకీయ సలహా కమిటీని ఏర్పాటు చేసుకున్నారంట. దానికి సజ్జల రామకృష్ణా రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు. అంటే పార్టీలో ఇప్పటికే స్టేట్ కోఆర్డినేటర్‌గా ఉన్న సజ్జల పెత్తనం మొదలైనట్లే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని మెజారిటీ నేతలు భావిస్తున్నారట.
సజ్జల శాఖల మంత్రి పాత్ర పోషించిన సజ్జల
ఇదివరకు వైనాట్ 175 నినాదం.. 50 మందికి పైగా పెయిడ్ సలహాదారులు .. వందలకోట్లు ఖర్చు పెట్టి ఐప్యాక్ టీమ్.. చుట్టూ కోటరీ .. ఇలాంటి సలహాలన్నీ సజ్జలే ఇచ్చారని.. జగన్ ఏం చేసినా కరెక్టే అని భజన చేశారని సజ్జలపై సొంత పార్టీలోనే విమర్శలున్నాయి.. పైగా సకల శాఖల మంత్రి పాత్ర పోషిస్తూ సజ్జలే చాలా సందర్భాల్లో సీఎంలా వ్యవహరించరన్నటాక్ ఉంది.. విజయసాయిరెడ్డి కూడా పదేపదే కోటరీ అని విమర్శలు చేయడానికి అదే కారణమంటారు. ఓడిపోయిన తర్వాత సజ్జలను, కోటరీని పక్కన పెట్టినట్లు కనిపించిన జగన్ మళ్లీ ఆయనకు ప్రధాన బాధ్యతలు అప్పగించడం వైసీపీ సీనియర్లకు మింగుడుపడటం లేదంట.
సజ్జలకు మళ్లీ బాధ్యతలు కట్టబెట్టడంపై సీనియర్లలో అసంతృప్తి
జగన్ తాజా నిర్ణయంతో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందంట. జగన్ లో మార్పు వచ్చింది కోటరీని దూరం పెడుతున్నారని భావించే లోపే … మళ్లీ పాత బ్యాచ్ అందరికీ పగ్గాలు అప్పగిస్తుండడంతో నిలకడలేని నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ పార్టీలో ఉండడం కంటే ఆపార్టీని వీడడమే మేలని మెజార్టీ నేతలు భావిస్తున్నారంట. పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారిందిప్పుడు. ఆ 33 మంది కమిటీలో ముద్రగడ పద్మనాభానికి కూడా చోటు దక్కింది. ఇంతకీ ఈ వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ పనేమిటి? అంటే.. రాష్ట్ర రాజకీయపరిస్థితులపై చర్చించి.. జగన్ కు అవసరమైన సలహాలు ఇవ్వడం.
జగన్ కు కృతజ్ణతలు చెబుతూ ప్రెస్ నోట్
ఆ 33 మంది సభ్యుల కమిటీలో తనను ఒకరిగా చేర్చినందుకు ముద్రగడ తన జన్మధన్యమై పోయినట్లు ఆనందపడిపోతున్నారు. వాస్తవానికి వైసీపీలో నిర్ణయాలన్నీ జగనే తీసుకుంటారని, కోటరీ చెప్పే సలహాలు కూడా నచ్చితేనే స్వీకరిస్తారన్న సంగతి పెద్ద రహస్యమేమీ కాదు. అందుకే ఇప్పుడు ప్రకటించిన పీఏసీ పాత్ర నామ్ కే వాస్తే అన్న విషయం ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అటువంటి నామ్ కే వాస్తే కమిటీలో ఓ సభ్యుడిగా తనను చేర్చినందుకే బ్రహ్మానందపడిపోతున్నారు ముద్రగడ. తనకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించినందుకు జగన్ కు కృతజ్ణతలు చెబుతూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.
జగన్ మళ్లీ సీఎం అవుతారని ముద్రగడ ఆశాభావం
జగన్ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని, జగన్ సీఎం కావడానికి తన శక్తి మేరకు తాను పోరాడతాననీ, పదికాలాల పాటు జగనే రాష్ట్రాన్ని పాలించాలని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక ముద్రగడ పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించడమే తన లక్ష్యమన్నట్లు ముద్రగడ హడావుడి చేశారు. అయితే 70 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి విజయం సాధించారు. అంటే పిఠాపురంలో నిర్ణయాత్మకంగా ఉన్న కాపు సామాజిక వర్గం ముద్రగడను నమ్మడం లేదనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు.
పిఠాపురంలో పవన్ ను ఓడిస్తానని ముద్రగడ ప్రగల్భాలు
గత ఎన్నికల్లో ముద్రగడ సొంత నియోజకవర్గం జగ్గంపేటలో తెలుగుదేశం అభ్యర్థి జ్యోతుల నెహ్రూ 52 వేల పైచిలుకు ఆధిక్యతతో భారీ విజయం సాధించారు. 1999 తర్వాత ముద్రగడ ఒక్కటంటే ఒక్క ఎన్నికలో కూడా విజయం సాధించలేదు. ముద్రగడ చివరి సారిగా 2014 ఎన్నికలలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా రాకుండా పరాజయం పాలయ్యారు. ఇప్పుడు జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి పోరాడుతానంటూ గంభీరమైన ప్రకటనలు చేస్తూ.. తన ప్రతిష్టను తానే మరింత దిగజార్చుకుంటూ నవ్వుల పాలవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.