Dead Wife Alive| ఒక నిర్దోషిని.. హంతకుడిగా ముద్ర వేసి పోలీసులు జైలుకు పంపారు. అయితే అనుకోకుండా 17 నెలల తరువాత అసలు హత్య జరగలేదనే అనుమానాలు కలగడంతో అతడిని బెయిల్ పై విడుదల చేశారు. జైలు నుంచి బయటికి వచ్చాక.. ఆ వ్యక్తిని అందరూ హంతకుడిగా చూశారు. సమాజం ఒకరకంగా అతడిని వెలివేసింది. చివరికి అతని పిల్లలు కూడా అతడిని అసహ్యంగా చూశారు. ఈ బాధలన్నీ అతను గత నాలుగేళ్లుగా అనుభవిస్తున్నాడు. కానీ అనూహ్యంగా చనిపోయిన వ్యక్తి బతికే ఉన్నాడని నిరూపితం కావడంతో ఇప్పుడు పోలీసులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో ఇటీవల ఒక కేసు సంచలన సృష్టించింది. దీంతో పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా కేసు విచారణ చేస్తున్నారో వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా బసవన హళ్లి గ్రామానికి చెందిన 35 ఏళ్ల కురుబారా సురేష్ ఒక ఆదివాసీ సమాజానికి చెందిన వాడు. కుటంబంలో అందరూ కూలిపని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. 18 ఏళ్ల క్రితం అతనికి మల్లిగే అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు.
అయితే అక్టోబర్ 2020లో సురేష్ భార్య మల్లిగె అనూహ్యంగా మాయమైంది. ఆమె ఎక్కడికెళ్లిందో తెలియలేదు. ఆమె కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రెండు రోజుల తరువాత ఊరి చివర ఆమె చెప్పులు, బట్టలు కనిపించాయి. పక్కనే కాలిన బూడిన ఎముకలు కనిపించాయి. ఇదంతా చూసి పోలీసులు మల్లిగె హత్య కు గురైందని భావించారు. ఆ చెప్పులు, బట్టలు మల్లిగెకు చెందినవేనని ఆమె సోదరుడు, తల్లి గుర్తించారు. మల్లిగెను ఆమె భర్త సురేష్ హత్య చేశాడని గొడవ చేశారు. దీంతో పోలీసులు సరేష్ ను అదుపులోకి తీసుకొని కస్టడీలో చితకబాదారు. తనకు ఏమీ తెలియదని.. ఆమె చనిపోలేదని.. ఎక్కడికో పారిపోయిందని ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు.
కానీ పోలీసులు మాత్రం కోర్టులో సురేష్ తన భార్యను హత్య చేశాడని నిరూపించి అతడికి జైలు శిక్ష పడేట్లు చేశారు. అయితే ఈ కేసులో అనూహ్య మలుపు వచ్చింది. సెప్టెంబర్ 2023లో ఈ కేసు పునర్విచారణలో అప్లై చేసి లభించని మానవ ఎముకల డిఎన్ఏ పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో ఆ ఎముకలు మల్లిగెకు సంబంధించినవి కాదు అని తేలింది. దీంతో మల్లిగె హత్య కేసు కాస్త మల్లిగె మిస్సింగ్ కేసుగా మారింది. హత్య జరిగినట్లు నిరూపితం కాలేదు కాబట్టి సురేష్ కు 2023లో బెయిల్ లభించింది. కానీ జైలు నుంచి బయటికొచ్చాక..సురేష్ జీవితం మునుపటిలా లేదు. అందరూ అతడిని హంతకుడిగానే చూశారు. అతడి టీనేజ్ పిల్లలు కూడా తమ తల్లిని హత్య చేశాడని తండ్రితో అసహ్యంగా చూసేవారు. అతనితో మాట్లాడేవారు కాదు.
Also Read: డ్రైనేజీలో మహిళ శవం.. ముక్కు పుడక ఆధారంగా హంతకుడిని పట్టుకున్న పోలీసులు
అయితే ఏప్రిల్ 1, 2025లో మల్లిగె అనుకోకుండా కనిపించింది. ఆమె తన ప్రేమికుడు గణేశ్ తో కలిసి ఒక రెస్టారెంట్ లో భోజనం చేస్తుండగా.. సురేష్ బంధువులు కొందరు కళ్లారా చూసి షాకయ్యారు. ఆమెను రహస్యంగా వీడియో తీసి.. ఆ తరువాత మల్లిగె, ఆమె లవర్ గణేశ్ ని బంధించారు. పోలీస్ స్టేషన్ లో ఆమెను హాజరుపరిచారు. ఇప్పుడు ఈ అనూహ్య మలుపుతో మల్లిగె కేసులో సురేష్ నిర్దోషి అని నిరూపితమైంది. దీంతో సురేష్ ను వేధించిన పోలీసులపై కోర్టు సీరియస్ అయింది. జిల్లా కోర్టు మైసూరు ఎస్ పి ఎన్ విష్ణువర్ధన్ కు నోటీసులు జారీ చేసింది. సురేష్ పై తప్పుడు కేసు ఫైల్ చేసి అతడికి అన్యాయం చేసిన బెట్టాదురా పోలీస్ స్టేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది.
మరోవైపు సురేష్ కూడా న్యాయ పోరాటం చేసేందుకు నడుం బిగించాడు. అతని లాయర్ పాండు పూజారి మాట్లాడుతూ.. సురేష్ ని కస్టడీలో తీవ్రంగా కొట్టి అతని చేత తన భార్యను తనే హత్య చేసినట్లు నేరం అంగీకరించేట్లు చేశారని.. ఐపిసి సెక్షన్ 211 ప్రకారం.. సురేష్ పై తప్పుడు కేసు బనాయించినందుకు సంబంధిత పోలీసులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో సురేష్ తండ్రి గాంధీ మాట్లాడుతూ.. తాము పేదవాళ్లమని ప్రతిరోజు కూలి చేస్తే గానీ భోజనం లభించదని .. అలాంటిది తమకు అన్యాయం జరుగుతోంది, మల్లిగె బతికే ఉంది. ఆమెను వెతికిపెట్టండి అని పోలీసులక చెబితే తమ వద్ద లంచం తీసుకున్నారని చెప్పారు. సామాన్యులు, పేదవారిని వేధించే ఇలాంటి పోలీసులపై కఠినంగా శిక్షించాలని కోరారు.
ఈ కేసులో సురేష్ మాట్లాడుతూ.. “నా జీవితం నాశనం చేశారు. నా పిల్లలు నన్ను అసహ్యించుకుంటున్నారు. నా మీద హంతకుడిగా ముద్రవేసి జైలుకు పంపారు. తప్పుచేసిన పోలీసులను, మల్లిగె, ఆమె ప్రియుడు గణేశ్ ను వదిలిపెట్టేది లేదు. నాకు న్యాయం కావాలి.” అని చెప్పాడు.