Sharmila: వైఎస్ వివేకా హత్య, వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తుల వివాదానికి సంబంధించి వైసీపీ, షర్మలల మధ్య పెద్ద వార్ నడుస్తోంది. తాను వివేకా హత్య గురించి మాట్లాడుతుంటే వైసీపీ సైతాన్‌లు, కుక్కలు ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడతున్నాయని పీసీసీ ప్రెసిడెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తుల కోసమే అయితే తాను కోర్టుకు వెళ్లేదాన్నని షర్మిల అంటుంటే.. వైసీపీ నేతలు మాత్రం క్యూ కట్టి మీడియా ముందుకొస్తూ.. వైఎస్ ఆస్తులకు సంబంధించి మాట్లాడుతుండటం వివాదాస్పదం అవుతోంది. ఆస్తుల గురించే అయితే విజయమ్మ రాసిన లెటర్‌పై జగన్ నేరుగా ఎందుకు స్పందించడం లేదు? వైఎస్ ఇంటి వ్యవహారాలు దగ్గరుండి చూసినట్లు జగన్ పార్టీ నేతలే ఎందుకు రెచ్చిపోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.
దివంగత వైఎస్ఆర్ కుటుంబ వ్వహహారంపై జరుగుతున్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను వివేకా హత్య గురించి నిలదీస్తుంటే, వైసీపీ కావాలనే ఆస్తుల అంశాన్ని ముందుకు తెస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపిస్తున్నారు. తాను మాట్లాడింది వివేకా హత్యపైనే తప్ప ఆస్తుల గురించి కాదని ఆమె స్పష్టం చేశారు. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించింది అవినాష్ రెడ్డేనని, ఆ నిజాన్ని ప్రశ్నించినందుకే తనపై, సునీతపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
తనకు ఆస్తులే ముఖ్యం అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదని, ఆస్తుల కోసం కోర్టుకు వెళ్ళింది కూడా తాను కాదని జగనే తనతో పాటు తల్లిపై కూడా కోర్టుకెక్కారని షర్మిల గుర్తు చేశారు. జగన్ లాగా తనకు స్వార్థ రాజకీయాలు తెలియవని, వేరే వాళ్ల ఆస్తులు అనుభవించాల్సిన దుస్థితి తనకు పట్టలేద ఆమె ఎద్దేవా చేశారు. తన పోరాటంలో ఆస్తుల అంశం అసలు ఎజెండానే కాదని, తాను కేవలం వైఎస్సార్ ఆశయాల కోసం నడుస్తున్న వ్యక్తిని మాత్రమేనని ఆమె కుండబద్దలు కొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో తాను చేతులు కలిపానని వస్తున్న ఆరోపణలను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు.
ముఖ్యంగా తన తల్లి వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై జరుగుతున్న వివాదంపై షర్మిల తీవ్రంగా స్పందించారు. విజయమ్మ కేవలం వైఎస్సార్ భార్య మాత్రమే కాదు, ఆయనలో సగం. ఆ తల్లి తన ఆవేదనను లేఖ ద్వారా వ్యక్తం చేస్తూ, మనుమలందరికీ ఆస్తి పంపిణీ సమానంగా జరగాలని కోరారన్నారు. ఇది వైఎస్సార్ ఆదేశం కూడా అని ఆమె తెలిపారు. ఈ లేఖపై సమాధానం చెప్పే దమ్ము జగన్‌కు లేక, వైసీపీ నేతలతో తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లేఖను విమర్శిస్తున్న వారిని సైతాన్లు , మొరిగే కుక్కలు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
విజయమ్మ లేఖ అబద్ధమైతే, జగన్ తన మీడియా రిపోర్టర్‌ను పంపి అమ్మ బైట్ తీసుకోవచ్చు కదా? లేదా నేరుగా ఆమెను అడగొచ్చు కదా అని షర్మిల సవాల్ విసిరారు. అలా చేయకపోవడమే ఆ లేఖ నిజమనడానికి నిదర్శనమన్నారు. వివేకా హత్య వెనుక ఉన్న నిజాలను బయటపెట్టడంలో జగన్ , భారతి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె నిలదీశారు. ఉదయం 7 గంటల నుంచే సాక్షిలో వివేకాది గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయం కోసం ఎవరికీ దత్తపుత్రులుగా మారాల్సిన అవసరం తనకు లేదని, బాధితుల పక్షాన తన పోరాటం కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేస్తున్నారు.
అస్తుల వివాదంపై దమ్ముంటే జగన్ మాట్లాడాలని షర్మిల సవాల్ చేస్తుంటే.. వైసీపీ నేతలు ఒకరొకరుగా షర్మిలను టార్గెట్ చేస్తుండటం అన్నాచెల్లెల్ల వివాదానికి మరింత ఆజ్యం పోస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైఎస్ఆర్ కుటుంబ వ్యవహారాలపై ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు.శివప్రసాదరెడ్డి మాట్లాడితే మీడియా ముందుకొచ్చేసి షర్మిలను తప్పుపడుతున్నారు. గత మూడు, నాలుగేళ్లుగా వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు షర్మిల, సునీతలు ప్రయత్నిస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా అయిన రాచమల్లు మండిపడుతున్నారు.
షర్మిల అవసరం అయిన మాటలు మాట్లాడటం లేదని, అస్తికి సంబంధించి ఏమి మాట్లాడలేదని వ్యాఖ్యానించిన రాచమల్లు.. విజయమ్మ లేఖపై తాము అనని మాటలు అన్నట్లు చెపుతున్నారని విమర్శించారు. తమను కుక్కలతో షర్మిల పోల్చారని.. తాము జాతి కుక్కలమని, విశ్వాసం ఎక్కువ ఉంటుందని, జగన్ ఇంట్లో దొంగలు పడ్డపుడే ఈ కుక్కలు మొరుగుతాయని, మొరుగుతూనే ఉంటాయని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.
ఇప్పటి వరకు రాచమల్లులో పాటు ఆ పార్టీ నేతలు సజ్జల, కొడాలి నాని, రోజా, పేర్ని నాని వంటి వైసీపీ సీనియర్లు మాత్రమే ఆస్తుల గురించి ప్రస్తావన తెచ్చారు. దివంగత వైఎస్సార్ కుటుంబవ్యవహారాలన్నీ తమ కనుసన్నల్లోనే జరిగినట్లు, ఆస్తుల పంపకాల వ్యవహారం తమ కళ్ల ముందే జరిగినట్లు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు షర్మిల అంటున్న సైతాన్‌ల లిస్టులోకి మరో నేత ఎంట్రీ ఇచ్చారు. తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయనపై షర్మిల, సునీతలు దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తుతున్నారు.
ఇదంతా మీరు చంద్రబాబు డైరక్షన్‌లోనే చేస్తున్నారని,. సొంత అన్నని దెబ్బ తీయడానికి ఎదుటి పార్టీతో చేతులు కలుపుతారా? అని కళ్యాణి మండిపడుతున్నారు. జగన్‌ను కోట్లాది మంది ఆడబిడ్డలు అన్నగా భావిస్తారని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా ఉన్నారన్నారు. కానీ మీరు మాత్రం వైఎస్ జగన్‌పై అభాండాలు వేస్తూనే ఉన్నారని షర్మిల, సునీతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎంత సహనంగా ఉన్నా అభాండాలు వేస్తూనే ఉన్నారని, మీపై ప్రేమతో జగన్ రూ. 236 కోట్లు ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
అంతటితో ఆగకుండా చంద్రబాబు సంపాదించిన ఆస్తులను తన అక్కా చెల్లెళ్లకు ఇచ్చారా? అంటూ వరుదు కళ్యాణి నారా వారి కుటుంబ విషయాలు తెలుసున్నట్లు టీడీపీ అధినేతను నిలదీస్తున్నారు. వైఎస్సార్ వీలునామా అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విజయమ్మ రాసిన లెటర్‌ను కూడా ఆ వైసీపీ ఎమ్మెల్సీ పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. వైఎస్సార్ పేరు మీద నడుస్తున్న పార్టీ నేతలను పట్టుకుని కుక్కలని అంటారా అని తెగ ఫీలైపోయారు.
ఈ వ్యవహారం అంతా చూస్తూ.. అసలు షర్మిల చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు జగన్ సమాధానం ఇస్తే .. వివేకా హత్య, ఆస్తుల వివాదంపై క్లారిటీ ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. కాని జగన్ ఆస్తుల గురించి మాట్లాడకుండా, పార్టీ నేతలనే ముందుకు తెస్తుండటం లేనిపోని సందేహాలకు తావిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక వివేకా హత్య సంగతికి వస్తే.. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చినట్లు మాట్లాడిన జగన్… ఆ హత్య చేసిందెవరో వివేకాకి.. ఆ దేవుడికే తెలుసని ఎవరికీ అర్థం కాని క్లారిటీ ఇచ్చేశారు. మొత్తానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ వివాదం.. ఆయన తనయుడి వీర విధేయుల కారణంగా అలా రచ్చకెక్కుతోందిప్పుడు.
Also Read: జీవన్ రెడ్డి రాజీనామాకు అసలు కారణం ఇదేనా? నెక్ట్స్ ఏమిటీ?
Story by: Apparao, Big Tv