Singareni Coal: బెల్లంపల్లి.. బొగ్గు గనులతో కళకళలాడిన ప్రాంతం. ఇప్పుడు అదే బొగ్గుతో కొత్త తరహా ఇంధనం తయారు చేసే ప్రయోగానికి వేదిక కానుంది. సింగరేణి తొలిసారిగా చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్‌కు బెల్లంపల్లి డీప్‌సైడ్ బ్లాక్‌ను ఎంపిక చేసింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే… బొగ్గును పూర్తిగా బయటకు తీసి కాల్చాల్సిన అవసరం లేదు. భూగర్భంలోనే కంట్రోల్డ్ విధానంలో బొగ్గును గ్యాసిఫై చేసి… సింగ్యాస్‌గా మార్చుతారు. ఈ సింగ్యాస్‌ను మిథేన్, అమ్మోనియా సహా వివిధ రసాయనాలు, ఇంధనాల తయారీలో వినియోగించే అవకాశం ఉంటుంది.
భూద గెస్ట్‌హౌస్ పరిసరాల్లో బొగ్గు..
1970లోనే బెల్లంపల్లిలోని భూద గెస్ట్‌హౌస్ పరిసరాల్లో బొగ్గు నిక్షేపాలను గుర్తించారు. కానీ… అవి భూమికి 500 మీటర్లకు పైగా లోతులో ఉండటంతో సాధారణ పద్ధతిలో తవ్వకాలు చేపట్టడం సాధ్యం కాలేదు. ఇప్పుడు అదే బొగ్గు నిల్వలను కొత్త సాంకేతికతతో వినియోగంలోకి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇటీవల సింగరేణి అధికారులు, జియాలజిస్టులు భూద గెస్ట్‌హౌస్ సమీపంలోని పైలట్ బోర్‌హోల్ ప్రాంతాన్ని పరిశీలించారు. డ్రిల్లింగ్‌కు అనుకూల పరిస్థితులపైనా అధ్యయనం చేశారు.
గ్యాప్ ఫండింగ్ పైనా సింగరేణి దృష్టి..
పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా… సుమారు 50 మీటర్ల దూరంలో రెండు బోర్లు వేసి.. వాటిని అండర్‌గ్రౌండ్‌లో లింక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గ్యాస్ మండే స్వభావం, నాణ్యత, లభ్యతను పరీక్షిస్తారు. ఈ ఫలితాలు సానుకూలంగా వస్తే.. సింగరేణి యాజమాన్యం పూర్తిస్థాయిలో కోల్ గ్యాసిఫికేషన్‌లోకి అడుగుపెట్టే అవకాశముంది. ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం అందించే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పైనా సింగరేణి దృష్టి పెట్టింది. సాంకేతిక సహకారం కోసం CSIR శాస్త్రవేత్తల సహకారం తీసుకోనుంది.
Also Read: జర్మనీతో రూ. 70 వేల కోట్ల సబ్‌మెరైన్ ఒప్పందం.. ప్రత్యేకతలు ఇవే!