SIR Voter: దేశం మొత్తం ఢిల్లీ వైపు చూస్తోంది. రెండు మూడు రోజులుగా ఢిల్లీ వీధులు ఆందోళనలతో దద్దరిల్లుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. ఇండీ కూటమిలోని పార్టీలన్నీ.. రాష్ట్రాలవారీగా ఆందోళనలు చేస్తున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయి. అంతటా ఇదే ఆందోళన వాతావరణం ఉంటే.. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
తెలంగాణ విషయానికొస్తే.. ఎస్‌ఐఆర్ పై అప్పుడప్పుడూ అలా స్పందించి వదిలేస్తున్నట్టుగానే బీఆర్‌ఎస్ పార్టీ వ్యవహారం ఉంటోంది. సర్ ప్రక్రియపై పార్టీపరంగా సమావేశాలు జరిపి, కార్యకర్తలను అప్రమత్తం చేసి జనాన్ని చైతన్యం చేశామని మొదట్లో చెప్పుకున్నారు. అసలు కథ ఇప్పుడే కదా మొదలైంది. ఎస్‌ఐఆర్‌లో ఎంత అవకతవకలు జరుగుతున్నాయో.. సాక్షాత్తు ప్రధాన ఎన్నికల వ్యవస్థ నుంచి బాహాటంగా వ్యతిరేక గళాలు వినిపిస్తున్న వేళ బీఆరెస్ మాత్రం సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.
Also Read: ప్రధాని మోదీతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం.. ఏపీ అభివృద్ధిపై చర్చ
ఎప్పటికైనా బీఆరెస్, బీజేపీ ఒక్కటే ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి.. అని జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తున్నట్టుగానే.. కేటీఆర్ దీనిపై పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు. అప్పుడు నీట్ పరీక్ష పేపర్ లీక్ పై.. జెన్‌జీకి సపోర్టుగా నిలుస్తాను.. ఢిల్లీ మాత్రం రాలేను.. అంటూ ఇక్కడ ధర్నా చౌక్‌లో దీక్షకు కూర్చున్న కేటీఆర్.. కీలకమైన సర్ విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకు ఉంటున్నారు? అనేది చర్చకు తెరలేపుతున్నది. తనకు వైరల్ ఫీవర్‌గా ఉందని, విశ్రాంతి తీసుకుంటున్నందున కొన్ని రోజుల పాటు బయటకు రాలేనని ట్వీట్ చేశారు. కేంద్రం వైఖరి, ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలపై.. అదే ట్వీట్‌లో తన అభిప్రాయాన్ని,ఖండనను, వినిపించొచ్చు కదా? అనే ప్రశ్నకూ సైలెన్సే సమాధానమవుతున్నది.
ఇటీవల సీఎం రేవంత్‌ను విమర్శించే ఉద్దేశ్యంలో భాగంగా రాహుల్ ఓట్ చోరీ అంటూ ఢిల్లీలో గాయి గత్తర లేపుతున్నారు.. మరి ఇక్కడ మీ సీఎం మాపై అక్రమ కేసులు పెడుతున్నారు జర ఇటు చూడు. అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు కేటీఆర్. అంటే ఈ ఓట్ చోరీ అంశం.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇష్యూగానే బీఆర్‌ఎస్ చూస్తున్నదా? లేదా మోడీకి తమ సపోర్టును ఇలా చెప్పకనే చెబుతున్నారా? అనే ప్రశ్నలు కలుగుతున్నాయి. ఇక ఏపీ రాజకీయాలను తీసుకుంటే ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న కూటమి సర్కార్ మోడీని మోసేస్తుంది. మరి అక్కడ ప్రతిపక్షమైనా సర్ ఆందోళనలపై స్పందిస్తున్నదా? అంటే అదీ లేదు. జగన్ ఈ విషయంలో మొదటి నుంచి సైలెంట్‌గానే ఉంటూ వస్తున్నారు. జెన్‌జీ ఉద్యమాన్ని ఆదిలో కీర్తించారాయన. తాము కూడా కాక్రోచులమై అధికార పార్టీపై విరుచుకు పడతామని కూడా కామెంట్ చేశారు. సర్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు తమ పార్టీకి చెందిన ఓట్లే ప్రధానంగా కొల్లగొడతారని, జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఆ తరువాత సేమ్ బీఆర్‌ఎస్ మాదిరిగానే జగన్ కూడా గప్ చుప్ అయిపోయారు. తాజాగా ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో కూడా ఆ పార్టీ చడీ లేదు.. చప్పుడూ లేదు.
Also read: AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?