E-Paper
Advertisement

అధికారాలను దూరం చేసిన చిన్న లోపాలు, పొరపాట్లు! మరి ఓటు హక్కుపై దాడి చేస్తున్నపెద్ద తప్పిదానికి మూల్యం చెల్లించక తప్పదు సర్..!

అధికారాలను దూరం చేసిన చిన్న లోపాలు, పొరపాట్లు! మరి ఓటు హక్కుపై దాడి చేస్తున్నపెద్ద తప్పిదానికి మూల్యం చెల్లించక తప్పదు సర్..!
Advertisement

దేశంలోని పలు రాజకీయ సంఘటనలు అధికారాలను దూరం చేసిన వైనం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. అవి కొన్ని తెలిసి చేసినవి. కొన్ని ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి. ఇంకొన్ని అవినీతి, నిర్లక్ష్యం తోడైనవి. మరికొన్ని అధికారాన్ని పదిలం చేసుకునేందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకూ వెనుకాడని తప్పిదాలు.

ఇవి ఎలాంటివైనా.. వాటివల్ల కష్టపడి తెచ్చుకున్న అధికారాన్ని చేజేతులా దూరం చేసుకుంటున్న ఆ తరుణం వారికెలా ఉంటుంది..? ఇలాంటి ఘటనలు వారికే కాదు.. ఇతరులకు కూడా ఓ గుణపాఠాలుగా నిలుస్తాయి. అప్పటి వరకు మాకు తిరుగేలేదనుకున్న పార్టీలు కూడా మట్టికరిచిన చరిత్ర దేశ రాజకీయాల్లో మనం చూశాం.

Advertisement

ఏం చేసినా చెల్లుబాటవుతుంది… జనాలు ఆమోదించి తీరుతారు.. అనే అతివిశ్వాసం కూడా చివరకు చేదు అనుభవాలనే మిగుల్చుతాయనేది గతంలో చాలా సార్లు తేటతెల్లమయ్యింది. ఓసారి దేశ రాజకీయ చరిత్రలో జరిగిన రాజకీయ ఉద్దండుల తప్పిదాలు.. వాటి వల్ల అధికారాలు కూడా కోల్పోయిన తీరు తెన్నులను చూద్దాం.

ఒక చిన్న సంఘటన.. ఒక ఆరోపణ, తప్పుడు విధానం వల్ల అధికారాన్నే చేజార్చే విధంగా ప్రజా వ్యతిరేకత తెచ్చిపెట్టిన సంఘటనలు.. భారత దేశంలో చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదనే కోర్టు తీర్పు ఉదంతం గురించి చెప్పుకోవాలి. 1971 ఎన్నికల్లో ఇందిరా గాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని తన ప్రచారం కోసం వాడుకున్నారని అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. 1975 జూన్ 12న కోర్టు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది.

Advertisement

ఇది ఒక చిన్న టెక్నికల్ తప్పు అయినప్పటికీ, అధికారాన్ని కాపాడుకోవడానికి ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర స్థితి) విధించడం సంచలనం సృష్టించింది. ప్రజాస్వామ్య హక్కుల హరణం, ప్రతిపక్షాల అరెస్టుల వల్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఫలితంగా 1977 ఎన్నికలలో కాంగ్రెస్ దేశంలోనే మొదటిసారి అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

1987లో బోఫోర్స్ కుంభకోణం కూడా ఇదే తరహాలో ప్రభుత్వాన్ని పడగొట్టింది. స్వీడన్ దేశానికి చెందిన బోఫోర్స్ కంపెనీ నుండి ఆర్టిలరీ గన్ల కొనుగోలులో రూ. 64 కోట్ల మేర రాజీవ్ గాంధీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు చేతులు మారాయనే వార్త ఒక స్వీడిష్ రేడియోలో వచ్చింది. అప్పటి రక్షణ మంత్రి వి.పి. సింగ్ దీనిపై తిరుగుబాటు చేసి ప్రభుత్వం నుండి బయటకు వచ్చారు.

ఒక్క రక్షణ ఒప్పందంపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణ రాజీవ్ గాంధీ ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసింది. 1984లో 400 కంటే ఎక్కువ సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్, 1989 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

1996లో వెలుగు చూసిన లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణానిది మరో కథ. పశువుల మేత, మందుల కొనుగోలు పేరిట నకిలీ బిల్లులతో నిధులు డ్రా చేశారనే ఒక పరిపాలనాపరమైన అవినీతి వెలుగుచూడటంతో.. అప్పటి వరకు బీహార్‌లో తిరుగులేని మాస్ లీడర్‌గా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగిన లాలూ ఇమేజ్ గడ్డి కుంభకోణంలో మొత్తం మట్టికొట్టుకు పోయింది. ఆర్జేడీ క్రమంగా బలహీనపడి, నితీష్ కుమార్-బీజేపీ కూటమి బీహార్‌లో అధికారంలోకి రావడానికి ఇది పునాది వేసినట్టైంది.

2010-2012 కాలంలో కాగ్ (CAG) నివేదికల వల్ల వెలుగులోకి వచ్చిన 2G స్పెక్ట్రమ్ కేటాయింపులు, బొగ్గు గనుల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలు.. ప్రభుత్వ విధానపరమైన లోపాలు, పారదర్శకత లేకపోవడం వల్ల లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందనే ప్రచారం జరిగింది. ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ అనే ఉద్యమం దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున లేచింది. పదేళ్ల మన్మోహన్ సింగ్ పాలనకు ముగింపు పాడుతూ, 2014లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి ఈ ఆరోపణలే ప్రధాన కారణంగా నిలిచాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు చంద్రబాబు సర్కార్‌ను పడిపోయేలా చేసింది. బషీర్‌బాగ్‌ విద్యుత్‌ ఛార్జీల నిరసనల్లో కాల్పులు జరగడం వంటి ఒకే ఒక్క తప్పుడు విధానంతో రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత తెచ్చింది. ఇది 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రావడానికి బలమైన కారణమైంది.

2007లో పశ్చిమబెంగాల్ లో పరిశ్రమల  కోసం రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలనే నిర్ణయం సీపీఎం సర్కార్‌కు చావుదెబ్బ కొట్టింది. 34 ఏళ్ల పాటు బెంగాల్‌ను పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ కోట కుప్పకూలి, మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు జరుగుతున్న సర్‌ విధానం పూర్తిగా ఓట్లను తొలగించే ప్రక్రియగా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి మేలు చేసేలా, బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగించేందుకే ఈ విధానం అనేలా కేంద్రం ఎన్నికల సంఘం తీరు బయటపడుతోంది. చీఫ్‌ కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌ రాజీనామాకు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యం.. భవిష్యత్‌లో ఎన్డీయేకు ఎలాంటి ప్రతికూల ఫలితాలను తెచ్చిపెడతాయోననే ప్రచారం ఇప్పట్నుంచే జరుగుతోంది.

Tags

Related News

కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ వీడకపోవడంపై మాట మార్చిన కేటీఆర్‌.. మీకు అవకాశం ఇవ్వడం కోసమే ఆయన రావడం లేదని యూటర్న్‌..!

ఇండియా షైనింగ్‌- బంగారు తెలంగాణ…! ఒక్క నినాదం.. కొంపలు ముంచిన వైనం! ఆత్మవిశ్వాసం కాదది అతి విశ్వాసంగా తేల్చిన జనం..

Gen-Z యూత్‌ కోసం.. నెల్లూరు రూరల్ పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్!

కృష్ణా జిల్లాలో ఆర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. దంచికొడుతున్న వర్షాలు!

పోక్సో కేసులో కోర్టు కీలక తీర్పు.. ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన అరెస్ట్ చెల్లదు

అక్టోబర్ 2న నో యూపీఐ డే.. దేశవ్యాప్తంగా వ్యాపారుల వినూత్న నిరసన!

నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్‌లో లంచాల దందా కలకలం

Big Stories

Advertisement
×