Srikakulam: పేరులోనే కులం ఇముడ్చుకున్న శ్రీకాకు‘కుళం’ జిల్లాలో ఆ కులాలే రాజకీయాల్ని శాసిస్తుంటాయి. ఎన్నికల సమయంలో ఆయా సందర్భాలు, పరిస్థితులు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా కళింగ, కాపు, వెలమ సామాజికవర్గాల నేతలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటారు. టీడీపీ ఆవిర్భావానికి ముందు నుంచి ఈ పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక వెలమల ఆధిపత్యం పెరుగుతోందని కాళింగులు విమర్శిస్తున్నారు. అదే కాపు సామాజికవర్గం నాయకులకు కూడా అన్యాయం జరుగుతోందని ఆ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అసలు జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఈ కుల సమరానికి దారి తీస్తున్న పరిస్థితులు ఏంటి?
శ్రీకాకుళం పేరులోనే ఉన్నట్టు ఆ జిల్లా కుల రాజకీయాలకు పెట్టింది పేరు. అప్పటి పరిస్థితులు, పొలిటికల్ వేవ్‌ను బట్టి ప్రతిసారి ఎన్నికల్లోఒక్కో సామాజిక వర్గం జిల్లా రాజకీయాల్లో ప్రభావం చూపిస్తూ వస్తుంది. టీడీపీ ఆవిర్భావానికి ముందు బొడ్డేపల్లి రాజగోపాల్ లాంటివారి ఆధ్వర్యంలో కళింగులు తమ మార్కు రాజకీయం చేశారు. 1952లో శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా మొదటి సారి గెలిచినన బొడ్డేపల్లి, తర్వాత ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లో చేరి అయిదు సార్లు ఎంపీ అయ్యారు. కళింగులను రిజర్వేషన్ల కేటగిరీలో చేర్పించేందుకు తనవంత కృషి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుకు “బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్టు”గా నామకరణం చేశారంటే ఆ దివంగత నేత గొప్పతనం అర్థమవుతుంది.
టిడిపి ఆవిర్భావం తర్వాత సుమారు 20 ఏళ్లు కళా వెంకట్రావు ప్రభావంతో కాపులు ఉన్నత స్థానాల్లో ఉండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతానికి వెలమ సామాజిక వర్గం శ్రీకాకుళంలో రాజకీయంగా ముందుంది. వెలమ వర్గానికి చెందిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్రమంత్రిగా, కింజారపు అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. వైసీపీలో వెలమ వర్గానికే చెందిన ధర్మాన, టీడీపీలో కింజరాపు ఫ్యామిలీలు ఒక అవగాహనతో రాజకీయం చేస్తున్నాయన్న విమర్శలు ఇతర సామాజికవర్గాల నుంచి వినిపిస్తుంటాయి. గత కొంతకాలంగా వెలమల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కళింగులు వాయిస్ రైజ్ చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో కాపులకు కూడా అన్యాయం జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి.
నిజానికి టీడీపీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను కను సైగలతో శాసించిన కళా వెంకట్రావు గత ఎన్నికల నాటికి జిల్లాలో లేకుండా పోయారు. ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లికి షిఫ్ట్ అయి బొత్స సత్యనారాయణపై విజయం సాధించారు. కిమిడి కళావెంకట్రావుని ఉద్దేశపూర్వకంగానే ఇతర వర్గాల నేతలు జిల్లాలో లేకుండా చేశారని కాపు వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో శ్రీకాకుళంలో కాపులకు ప్రాధాన్యత లేకుండా పోయిందని పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట.
జిల్లా మొత్తం మీద ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న కాపులకు గడిచిన ఎన్నికల్లో కేవలం టీడీపీ ఒక్కటంటే ఒకే సీటు కేటాయించింది. పాతపట్నం నుంచి తూర్పుకాపు వర్గానికి చెందిన మామిడి గోవింద్‌రావు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎచ్చెర్ల నుంచి తూర్పు కాపు వర్గీయుడు నడుకుడితి ఈశ్వరరావు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత నామినేటెడ్ పదవుల్లో కూడా వారికి పెద్దగా చోటు లభించలేదు. డీసీసీబీ చైర్మన్ పదవి ఒక్కటే అసామాజిక వర్గానికి దక్కింది. ఇక సుడా చైర్మన్ పదవి జనసేన కాపు నేత కొరికాన రవికుమార్‌ను వరించింది. అయితే ఆయనకి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి అని అటు జనసేన నేతలు, ఇటు కాపు నేతలు ఆరోపిస్తున్నారు.
శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ .. సుడా నిధులతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కొరికాన రవికుమార్ కు ఆహ్వానించడం లేదని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల శ్రీకాకుళంలో రెండు కోట్ల రూపాయల సుడా నిధులతో కార్గిల్ పార్కు అభివృద్ధి జరిగింది. అయితే అక్కడ శిలాఫలకంపై కొరికాన పేరు లేకపోవడం జనసేన శ్రేణులను విష్మయానికి గురిచేసింది. అంతేకాదు పార్కు ప్రారంభోత్సవానికి ఆయనకు ఆహ్వానం కూడా అందలేదంట. అది జనసైనికులతో పాటు తూర్పుకాపుల ఆగ్రహానికి కారణమవుతోంది.
జనసేన శ్రేణులు సహా తూర్పుకాపుల్లో ఈ గాయాలు పచ్చిగా ఉండగానే, మరో ఘటన శ్రీకాకుళంలో కుల రాజకీయ వివాదానికి కేంద్రబిందువైంది. రీసెంట్ గా శ్రీకాకుళంలోని కొత్త రోడ్డు జంక్షన్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి సహా జిల్లాలను మెజారిటీ ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ సుడా నిధులతో ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణకు కొరికాన రవికుమార్ కు మాత్రం ఆహ్వానం లేదంట. దీంతో తూర్పు కాపు సహా జనసేన శ్రేణులకు పుండు మీద కారం జల్లినట్లు అయింది.
ఈ ఘటనతో డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ ప్రయత్నించారు. సాంకేతిక లోపం వలన కోరికన రవికుమార్ కు ఆహ్వానం అందలేదని వివరణ ఇచ్చారు. కూటమిలో అన్ని పార్టీలు ఒకే తాటిమీద ఉన్నాయని.. ఇక్కడ కుల రాజకీయాలకు అవకాశం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వరుసగా రెండు ఘటనలతో ఇవి కావాలని చేస్తున్న కుట్రలు అని తూర్పు కాపులు మండిపడుతున్నారు. ఈ ప్రచారాల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ రెండు ఘటనలతో కాపులు వాయిస్ పెంచుతున్నారు. అటు జనసేన కూడా తమకు అన్యాయం జరుగుతుందని బహిరంగ విమర్శలకు దిగుతోంది. అధిష్టానం స్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య పూర్తిస్థాయిలో సమన్వయం కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఇలాంటి ఘటనలు ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
Also Read:నెల్లూరు క్లీన్ స్వీప్.. రెండేళ్లకే రివర్స్ సీన్? బాబు క్లాస్‌తో తమ్ముళ్లలో వణుకు!