Sangameswara Temple: నీళ్లలో ఉండే ఆలయం.. నీళ్లు తగ్గితేనే కనిపించే దైవం.. ఇదీ శ్రీశైలం బ్యాక్‌వాటర్స్‌లోని సంగమేశ్వరుడి ప్రత్యేకత. జలాశయంలో నీటిమట్టం పెరిగితే ఆలయం నీటిలో మునిగిపోతుంది.. నీళ్లు తగ్గితే మళ్లీ బయటపడుతుంది. సాధారణంగా ఎండాకాలంలో కనిపించే ఈ ఆలయం.. ఈసారి మాత్రం అక్టోబర్‌లోనే దర్శనమిచ్చింది. పాతికేళ్ల తర్వాత ఇంత ముందుగా కనిపిస్తోందని స్థానికులు, అర్చకులు చెబుతున్నారు. దీంతో సంగమేశ్వరుడి దర్శనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
శ్రీశైలం బ్యాక్‌వాటర్స్‌పై బిగ్ డిస్కషన్!
భక్తులకు స్వామివారి దర్శనం ఓ అరుదైన అవకాశం.. కానీ జలాశయాల నీటిమట్టాలు తగ్గడం ఆలోచించాల్సిన విషయమే. అలర్ట్ కావాల్సిందే. వానలు పడితే వాగులు పరుగులు పెడతాయి.. వరదొస్తే జలాశయాలు కళకళలాడతాయి. కానీ వర్షాలు తగ్గితే.. నీటి లెక్కలే మారిపోతాయి. సాగు నీటికి కటకట ఏర్పడుతుంది. కరవు పరిస్థితులు వస్తాయి. దీని ప్రభావం కేవలం అన్నదాతలపై మాత్రమే కాదు సాధారణ ప్రజలపై కూడా ఉంటుంది. కూరగాయలు, నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోతాయి. అందుకే ఇప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ పై బిగ్ డిస్కర్షన్ జరుగుతోంది.
ఎల్‌నినో ఎఫెక్ట్ ఉంటుందా?
ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే ఎల్‌నినో.. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడంతో ఏర్పడుతుంది. ఇది భారత రుతుపవనాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఎల్‌నినో ఉందంటే వర్షాభావం తప్పదని కాదు.. ఇతర వాతావరణ పరిస్థితులూ కీలకమే.
కారణమేంటి?
ఇక కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో వర్షాల లోటు, శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద ప్రవాహాలు, నీటి వినియోగం.. ఇవన్నీ నీటిమట్టాన్ని ప్రభావితం చేస్తాయి. నీరు తగ్గడంతోనే జలగర్భంలో ఉన్న సంగమేశ్వర ఆలయం బయటపడిందనే చర్చ నడుస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు ఇదో వార్నింగ్ అని అంటున్నారు వాతావరణ నిపుణులు.
Also Read: ఎల్‌నినో ఎఫెక్ట్.. రాష్ట్రంలో కరువు ఛాయలు.. ఈనెల 12న మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర భేటీ!