Shamshabad: హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ పరిధిలో మరో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. సరిగ్గా దేశాన్నంతటినీ కచిపివేసిన ‘దిశ’ హత్యాచారం జరిగిన ప్రాంతంలోనే ఒక మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగికదాడికి తెగబడ్డాడు. ఆలస్యంగా బయటపడిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి..
నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన ఒక మహిళ పనిమీద శంషాబాద్ వెళ్లేందుకు క్యాబ్ ఎక్కింది. ప్రయాణం సాగుతుండగా.. తుండుపల్లి టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే డ్రైవర్ అకస్మాత్తుగా వాహనం రూట్ మార్చాడు. కొత్వాల్‌గూడ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించాడు.
నగదుతో డ్రైవర్ పరార్
డ్రైవర్ చర్యతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ మహిళ ధైర్యం చేసి క్యాబ్ నుంచి కిందకు దిగి గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలతో కంగారుపడిన డ్రైవర్, బాధితురాలి వద్ద ఉన్న రూ.60 వేల నగదు ఉన్న బ్యాగును బలవంతంగా లాక్కొని అక్కడి నుండి పరారయ్యాడు.
పోలీసుల గాలింపు
కోలుకున్న బాధితురాలు వెంటనే శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న ఆ క్యాబ్ డ్రైవర్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి తీవ్రంగా గాలిస్తున్నారు.
2019 నవంబర్ 27న తుండుపల్లి వద్ద నలుగురు యువకులు ‘దిశ’పై అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘోరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్లీ అదే స్థలంలో అలాంటి యత్నమే జరగడం ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.
Also Read: శ్రీకాకుళంలో తీవ్ర విషాదం.. పురుగుల మందు కొట్టిన ఆకులు తిని 35 మూగజీవులు మృతి!