BigTV English

Operation Sindoor: అదిదా స‌ర్‌ప్రైజ్‌.. ట్రాప్ చేసి పాక్‌కి చావు దెబ్బ‌

Operation Sindoor: అదిదా స‌ర్‌ప్రైజ్‌.. ట్రాప్ చేసి పాక్‌కి చావు దెబ్బ‌

Operation Sindoor: భారత్ చేతిలో చావుదెబ్బలు తినడం.. మీడియా ముందు జబ్బలు చరుచుకోవడం.. పక్కకెళ్లి ఆయింట్‌మెంట్లు రుద్దుకోవడం.. పాకిస్తాన్‌కు బాగా అలవాటు. ఆపరేషన్ సిందూర్.. పాక్‌ సైనిక స్థావరాలని ఘోరంగా దెబ్బతీసినా.. దాయాది దేశం మాత్రం అబ్బే.. అలాంటిదేమీ లేదు అని బుకాయిస్తోంది. కానీ.. నిజం నిప్పులాంటిది కదా! ఎక్కువరోజులు దాస్తే.. దహించివేస్తుంది. అలా.. ఒక్కో విషయం పాకిస్తాన్ నుంచే బయటకొస్తోంది. పైగా.. మనల్ని ట్రాప్ చేయబోయి.. వాళ్లే ఇరుక్కుపోయి.. పాకిస్తాన్ దళాలు ఎంతలా నష్టపోయాయో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్.. పాక్‌ని ఏ స్థాయిలో దెబ్బకొట్టిందో తెలిస్తే.. ఆశ్చర్యపోవడం ఖాయం.


ఎరక్కపోయి.. ఇరుక్కుపోయిన పాకిస్తాన్

భారత్ ట్రాప్‌లో చిక్కి.. ఘోరంగా దెబ్బతిన్న పాక్


యుద్ధమంటే.. ఆయుధాలొక్కటే కాదు. బలమైన వ్యూహం కూడా. ఆపరేషన్ సిందూర్‌లో బెడిసికొట్టని వ్యూహంతో భారత్ కొట్టిన దెబ్బకు.. పాక్‌కు ఎకరాలకు ఎకరాలు తడిసిపోయింది. ఇండియాని ట్రాప్ చేద్దామనుకున్న పాక్ బలగాలు.. ఆత్రానికి పోయి.. అడ్డంగా దొరికేసి.. చావు దెబ్బతిన్నాయి. భారత్ వేసిన ఎరకు వెంటనే రెస్పాండ్ అయిన పాక్‌కి.. అంతే వేగంగా ఇప్పట్లో కోలుకోలేని షాక్ తగిలింది. పాక్‌ని ఘోరంగా దెబ్బకొట్టాలనుకున్న భారత దళాలు.. మే 10న ఓ ఎరను దానిపై విసిరింది. అనుకున్నట్లే ఆత్రంగా స్పందించిన పాకిస్తాన్.. భారత్‌కు అడ్డంగా దొరికిపోయి చావు దెబ్బతింది. చైనా ఫైటర్‌జెట్‌లు, టర్కీ డ్రోన్లు అంటూ జబ్బలు చరుకుంటూ ప్రకటనలు చేసిన పాకిస్తాన్.. దెబ్బకు కాళ్లబేరానికొచ్చింది. ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన అత్యంత నాటకీయ పరిణామాలన్నీ ఇప్పుడు బయటకొస్తున్నాయి. అవి.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

పాక్ డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టిన భారత డిఫెన్స్ సిస్టమ్

మే 9, 10 తేదీ రాత్రివేళల్లో.. భారత్‌లోని జనావాసాలు, సైనిక స్థావరాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్లు, ఇతర ఆయుధాలతో దాడులకు తెగబడింది. అయితే.. వాటన్నింటిని భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీని తర్వాత.. పాక్‌ని కోలుకోలేని దెబ్బకొట్టాలని డిసైడ్ అయింది భారత్. పాక్ కీలక స్థావరాలను ధ్వంసం చేసి.. చావుదెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాయి మన దళాలు. అయితే.. పాక్ దగ్గరున్న హెచ్‌క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డంకిగా మారిందని గుర్తించారు. దాంతో.. వెంటనే డికాయ్ వ్యూహాన్ని తెరమీదికి తెచ్చింది మన సైన్యం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్లని తలపించేలా సిగ్నల్స్ పంపే కొన్ని రకాల డ్రోన్లను.. పాక్ గగనతలంలోకి వదిలింది. ఇంకేముంది.. భారత ఫైటర్ జెట్లు దొరికాయనుకొని.. పాకిస్తాన్ హెచ్‌క్యూ-9 సహా ఇతర రాడార్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని యాక్టివేట్ చేసింది.

పాక్ 11 ఎయిర్ బేస్‌‌లను దెబ్బతీసిన బారత్

దాంతో.. ఈ రక్షణ వ్యవస్థలు మోహరించిన ప్రదేశాలను గుర్తించిన భారత్.. సూసైడ్ డ్రోన్లను ప్రయోగించి పాక్ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఆ తర్వాత.. ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు.. బ్రహ్మోస్, స్కాల్ప్, క్రిస్టల్ మేజ్, ర్యాపేజ్ లాంటి ఆయుధాలను ప్రయోగించింది. ఈ ఎపిసోడ్ పాక్‌కు అర్థమయ్యేలోపే.. మన మిసైళ్లు.. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ స్థావరాలపైకి దూసుకెళ్లాయి. వీటిలో.. బలమైన షెల్టర్లు, రన్‌వేలు, కమాండ్ సెంటర్లను దెబ్బతీసే పనిని బ్రహ్మోస్ చూసుకుందని.. ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయ్. ఈ సర్‌ప్రైజ్ ఎటాక్ తర్వాత.. పాక్ తమ యుద్ధ విమానాలను.. సరిహద్దులకు దూరంగా ఉన్న ఎయిర్‌బేస్‌లకు మార్చేసింది. ఈ దాడులకు.. సుమారు 15 బ్రహ్మోస్ మిసైళ్లను వాడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద.. పాకిస్తాన్‌కు ఉన్న 12 అత్యంత కీలక ఎయిర్‌బేస్‌ల్లో.. 11 ఎయిర్‌బేస్‌లను.. భారత్ దెబ్బతీసింది.

పాక్ కంటే ముందు ఎటాక్ సర్‌ప్రైజ్ చేసిన ఇండియా

ముందుగా.. ఈ తరహా సర్‌ప్రైజ్ ఎటాక్‌కు పాక్ కూడా ప్లాన్ చేసింది. కానీ.. పాక్ బలగాల కంటే ముందే ఇండియా అదే తరహాలో ఎటాక్ చేసి పాకిస్తాన్‌ని సర్‌ప్రైజ్ చేసింది. పాక్ వ్యూహమేమిటంటే.. నాగోర్నో-కారోబాఖ్ యుద్ధ సమయంలో.. అజర్‌బైజన్ కూడా సోవియట్ కాలం నాటి ఏఎన్-2 యుద్ధ విమానాలను డ్రోన్లుగా మార్చింది. ఆ తర్వాత.. అర్మేనియాపై ప్రయోగించింది. దాని.. ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్‌లు.. వాటిని కూల్చాయ్. ఈ సమయంలో.. అజర్‌బైజన్ దళాలు.. ఆ గగనతల రక్షణ వ్యవస్థ స్థావరాలు గుర్తించి.. వాటిపై దాడి చేశాయి. దాంతో.. అర్మేనియాకు ఎయిర్ డిఫెన్స్ లేకుండాపోయింది. దాంతో.. అజర్ బైజన్ విస్తృతమైన డ్రోన్ దాడులతో విరుచుకుపడింది.

పాక్ వ్యూహాన్ని చిత్తు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు

విజయం సాధించింది. అచ్చం ఇలాంటి ఎటాక్‌కే.. టర్కీ వ్యూహరచన చేసింది. పాకిస్తాన్ కూడా అదేవిధంగా భారత్‌పై ఎటాక్ చేద్దామని చూసింది. మే 6-7 తేదీల్లో భారత్‌పైకి వందలకొద్దీ టర్కీ డ్రోన్లను పంపి.. భారత్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను గుర్తించేందుకు ప్రయత్నించింది. కానీ.. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు వాటిని కుప్పకూల్చి.. పాక్ వ్యూహాన్ని చిత్తు చేశాయి. వెంటనే భారత్.. అదే వ్యూహాన్ని కాస్త మార్చి.. మే 10న పాక్‌పైకి డ్రోన్లను పంపి.. ఆ దేశం గగనతల రక్షణ వ్యవస్థను కూల్చేసింది. దాంతో.. పాక్ చావు దెబ్బతింది.

ఇజ్రాయెల్‌కు చెందిన క్రిస్టల్ మేజ్, ర్యాపేజ్ మిస్సైళ్ల విధ్వంసం

పాక్‌కు షాక్ ఇచ్చిన ఆయుధాల్లో.. బ్రహ్మోస్, స్కాల్ప్ మిసైళ్లు మాత్రమే కాదు.. ఇజ్రాయెల్‌‌కు చెందిన క్రిస్టల్ మేజ్, ర్యాపేజ్ కూడా పాక్ స్థావరాల్లో విధ్వంసం సృష్టించాయి. ఇవి.. ఎయిర్ టు సర్ఫేస్ టార్గెట్లను ఛేదించే మిసైళ్లు. ప్రస్తుతానికి భారత్ క్రిస్టల్ మేజ్-1 రాప్టర్, క్రిస్టల్ మేజ్-2 రాక్స్ వేరియంట్లని వినియోగిస్తోంది. అయితే.. ఆపరేషన్ సిందూర్‌లో కచ్చితంగా వేటిని వాడారన్న దానిపై సమాచారం లేదు. కానీ.. వీటి రేంజ్ మాత్రం 100 నుంచి 250 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. వెయ్యి కిలోల బరువు ఉండే ఈ మిసైళ్లు.. 80 కిలోల పేలుడు పదార్థాలను తీసుకెళ్లగలదు.

గతేడాదే ర్యాంపేజ్ మిస్సైళ్లని కొన్న భారత రక్షణశాఖ

సుఖోయ్ లాంటి ఫైటర్ జెట్లు.. ఈ మిసైళ్లని ఫైర్ చేయగలవు. కదిలే టార్గెట్లను కూడా ఇవి చాలా కచ్చితత్వంతో ధ్వంసం చేయగలవు. ఇక.. ర్యాంపేజ్‌ని ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ తయారుచేసింది. ఇది.. సూపర్ సోనిక్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్. హైవాల్యూ టార్గెట్లను ధ్వంసం చేయడం కోసం దీనిని తయారుచేశారు. సుఖోయ్, మిగ్-29 యుద్ధ విమానాలు వీటిని ప్రయోగించగలవు. భారత రక్షణశాఖ వీటిని గతేడాదే కొనుగోలు చేసింది. ఇవి.. స్పైస్ 2000 బాంబుల కంటే ఎక్కువ రేంజ్‌ని కలిగి ఉన్నాయి. వీటిని.. మన దేశంలోనే తయారుచేయాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భావిస్తోంది.

పాక్‌కు గిఫ్ట్‌గా వచ్చిన అవాక్స్‌ని.. భారత్ ఘోరంగా దెబ్బతీసింది

ఆపరేషన్ సిందూర్.. పాక్ గుండెల్లో దడ పుట్టించడమే కాదు.. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని కూడా ఘోరంగా దెబ్బతీసింది. భారత్ జరిపిన దాడుల్లో.. పాక్ కోల్పోయిన మరో కీలక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. అవాక్స్. ఎస్.. పాక్‌కు గిఫ్ట్‌గా వచ్చిన అవాక్స్‌ని.. భారత్ ఘోరంగా దెబ్బతీసింది. అవాక్స్ విమానాన్ని.. మన బలగాలు ఎలా దెబ్బకొట్టాయో తెలిస్తే.. మీరంతా అవాక్కవడం ఖాయం. పాక్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ కూడా దీని గురించి చెప్పారంటే.. ఇండియా కొట్టిన హిట్.. పాక్‌లో ఏ రేంజ్‌లో రీసౌండ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

వార్ అంటే అఫెన్స్ ఒక్కటే కాదు.. డిఫెన్స్ కూడా!

వార్ అంటే అఫెన్స్ ఒక్కటే కాదు.. డిఫెన్స్ కూడా అని పాకిస్తాన్‌కు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్ సిస్టమ్స్‌ని.. భారత్ తెలివిగా ధ్వంసం చేశాక.. పాక్‌కు తాము కోల్పోయిందేమిటో బాగా తెలిసొస్తోంది. భోలారి‌లోని పాక్ ఎయిర్‌బేస్‌పై భారత్ జరిపిన దాడుల్లో.. పాకిస్తాన్ గిఫ్ట్‌గా పొందిన అవాక్స్ విమానాన్ని కోల్పోయింది. మే 9, 10వ తేదీ మధ్య రాత్రి 11 సైనిక స్థావరాలపై చేసిన మిసైల్ స్ట్రైక్స్‌లో.. పాక్ తన ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌ ఘోరంగా దెబ్బతింది.

కరాచీకి దగ్గర్లో ఉన్న భోలారి వైమానిక స్థావరంపై దాడి

ఇది చెప్పిందెవరో కాదు.. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌లో.. ఎయిర్ మార్షల్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన మసూద్ అక్తర్. ఓ ఇంటర్వ్యూలో.. పాక్ అవాక్స్ విమానాన్ని భారత్ ఎలా డ్యామేజ్ చేసిందో చెప్పాక.. అంతా అవాక్కయ్యారు. కరాచీకి దగ్గర్లో ఉన్న భోలారి వైమానిక స్థావరంపై భారత్ దాడి చేసిందని.. దాంతో తీవ్ర నష్టం సంభవించిందని.. భారత అధికారులు, మాక్సర్ టెక్నాలజీస్ రిలీజ్ చేసిన శాటిలైట్ ఫోటోలు నిరూపించాయి. ఇప్పుడు.. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ చేసిన వ్యాఖ్యలు కూడా వీటికి మరింత బలం చేకూరుస్తున్నాయి.

పీఏఎఫ్ నిఘా విమానం అవాక్స్‌ని పేల్చిన భారత్

ఆపరేషన్ సిందూర్‌లో పీఏఎఫ్ నిఘా విమానం అవాక్స్‌ని.. భారత్ కూల్చేసిందని పాకిస్తాన్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ మసూద్ అక్తర్.. ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. భోలారి ఎయిర్‌బేస్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నాలుగు బ్రహ్మోస్ మిసైళ్లను ప్రయోగించిందని.. అందులో ఒకటి అవాక్స్ విమానం పార్క్ చేసిన హ్యంగర్‌ని ఢీకొట్టిందని చెప్పారు. దాంతో.. అవాక్స్ ప్లేన్ డ్యామేజ్ అవడమే కాదు.. పాక్ సైనికులు కూడా మృతి చెందారన్నారు మసూద్ అక్తర్.

వరుసగా బ్రహ్మోస్ మిస్సైల్స్ ని ప్రయోగించిన భారత్

భారత్ వరుసగా బ్రహ్మోస్ మిసైల్స్‌ని ప్రయోగిస్తుంటే.. పాక్ పైలట్లు తమ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన విమానాలను సేఫ్‌గా ఉంచేందుకు పరుగులు తీశారు. కానీ.. బ్రహ్మోస్ మిసైల్స్.. ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి. అలా.. నాలుగో మిసైల్.. అవాక్స్ విమానాన్ని నిలిపి ఉంచిన హ్యాంగర్‌ని నేరుగా ఢీకొట్టింది. దాంతో.. అది ధ్వంసమైందని చెబుతున్నారు. కానీ.. పాక్ ప్రభుత్వం మాత్రం దీని ఊసే ఎత్తలేదు. ఇప్పుడిప్పుడే.. భారత దాడుల్లో పాకిస్తాన్ ఏమేం కోల్పోయిందో ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మరోవైపు.. భోలారి ఎయిర్‌బేస్.. పాకిస్తాన్‌లో సరికొత్తది. దీనిని.. 2017లోనే ప్రారంభఇంచారు.

అవాక్స్ ధ్వంసం పాక్‌కు పెద్ద దెబ్బ అంటున్న నిపుణులు

పాక్‌లో ఉన్న కీలక స్థావరాల్లో ఇదీ ఒకటి. ఇక్కడే.. 2020లో చైనాతో కలిసి.. షాహీన్ 9 అనే వైమానిక విన్యాసాలను కూడా పాక్ నిర్వహించింది. అలాంటి ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ధ్వంసం చేశాయి మన బలగాలు. ఇందులోనే.. రాడార్ సిస్టమ్ ఉన్న అవాక్స్ విమానంతో పాటు జేఎఫ్-17 థండర్, ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్ యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌లో గగనతల రక్షణ నెట్‌వర్క్‌లో కీలకంగా ఉన్న అవాక్స్ విమానం ధ్వంసం కావడమనేది.. పాక్‌కు చాలా పెద్ద దెబ్బ అని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ విషయం బయటకు రావడం కూడా పాక్‌ని ఇబ్బందిపెట్టే అంశంగా చూస్తున్నారు.

అవాక్స్.. ముబైల్, లాంగ్ రేంజ్ రాడార్ కమాండ్ సెంటర్

అవాక్స్.. ఓ మొబైల్, లాంగ్ రేంజ్ రాడార్ కమాండ్ సెంటర్. ఇది.. ఆకాశంలో నిఘా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇందులోని రాడార్ సిస్టమ్.. గాలిలోని విమానాలు, డ్రోన్లు, మిసైళ్లు, ఇతర వస్తువులను గుర్తిస్తుంది. ఇది.. శత్రు విమానాలతో పాటు మిత్ర విమానాలను కూడా వేరు చేసి చూపగలదు. ఇది.. దాడులను సమన్వయం చేసేలా.. సైనిక దళాలకు రియల్ టైమ్ సమాచారాన్ని అందిస్తుంది. గందరగోళాన్ని నివారిస్తుంది. అవాక్స్ రాడార్.. వందల కిలోమీటర్ల పరిధిలో ఆకాశం, భూమిపై ఉన్న టార్గెట్లను గుర్తిస్తుంది.

మే 10న పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు

ఇది.. సైనిక ఆపరేషన్లకు ముందుగానే హెచ్చరికలను పంపుతుంది. అలా.. ఎయిర్ డిఫెన్స్‌లో కీలకంగా ఉండే పాక్ అవాక్స్ విమానాన్ని భారత దళాలు ధ్వంసం చేశాయి. మే 10న పాక్ వైమానిక స్థావరాలతో సహా సైనిక స్థావరాలపైనా భారత్ దాడులు చేసింది. షాబాజ్ ఎయిర్‌బేస్, భోలారి ఎయిర్‌బేస్‌లపై దాడికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు.. విధ్వంసాన్ని అందరి కళ్లకు కడుతున్నాయి. పాక్‌ని ట్రాప్ చేసి లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని ధ్వంసం చేయడం ద్వారా.. పాక్ ఎయిర్‌ఫోర్స్‌ని వ్యూహాత్మకంగా దెబ్బతీసింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×